మన జాతీయాలు

10 Oct, 2015 22:12 IST|Sakshi

చేతి చమురు భాగవతం!
పూర్వపు రోజుల్లో వీధుల్లో భాగవతం ఆడేవారు. అందులోని వివిధ ఘట్టాలు ప్రేక్షకులను కట్టిపడేసేవి. పోను పోను ఏ నాటకం ఆడినా ‘వీధి భాగవతం ఆడుతున్నారు’ అనడం పరిపాటయింది. ఈ సంగతి ఎలా ఉన్నా... ఆ కాలంలో ఇప్పటిలా సౌకర్యాలేం లేవు కాబట్టి, స్టేజీ వేయడం నుంచి పెద్ద పెద్ద దీపాలు వెలిగించడం వరకు చాలానే కష్టపడాల్సి వచ్చేది. నాటకం జరుగున్నంత సేపూ దీపాలు వెలిగించడానికి అయ్యే చమురు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండేది.
 
అయితే నాటకానికి మంచి స్పందన వచ్చినప్పుడు... నటులకు చదివింపులు ఘనంగా ఉండేవి. నటులను సంతోష పెట్టడానికి ఊరివాళ్లు పోటీ పడి రకరకాల కానుకలు సమర్పించే వాళ్లు. అలా అని అన్ని సందర్భాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది కాదు. కొన్నిసార్లు నాటకం ప్రేక్షకులకు నచ్చేది కాదు. ఒకవేళ నచ్చినా ఆ  నచ్చడం అనేది ప్రశంసలకు మాత్రమే పరిమితమయ్యేది. మరికొన్నిసార్లు భారీ వర్షం వచ్చి నాటకం మధ్యలోనే ఆగిపోవడం లాంటివి జరిగేవి.
 
దీంతో నిర్వాహకులు, నటులు ‘చమురుకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు’ అని నిరాశ పడేవారు. పెట్టిన ఖర్చును చూసి బాధపడేవారు. అప్పటి నుంచి... వృథా ఖర్చు చేసి నష్టపోయిన సందర్భాల్లో ‘చేతి చమురు భాగవతం’ అనడం మామూలు అయిపోయింది.
 
నిమ్మకాయ వాటం!
అర చేతిలో గుమ్మడికాయ పడుతుందా? పట్టదు గాక పట్టదు. మరి నిమ్మకాయ? చాలా ఈజీగా పట్టేస్తుంది. పనుల్లో కూడా చేయదగినవి, చేయలేనివి, కష్టమైనవి, సులువైనవి ఉంటాయి. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ‘‘వాడికా పని కష్టమేం కాదు... నిమ్మకాయ వాటం’’ అంటారు. అంటే నిమ్మకాయ చేతిలో పట్టినంత తేలిగ్గా అతడు ఆ పని చేసి పారేస్తాడు అని. అలాగే ఆత్మవిశ్వాసం గురించి చెప్పేటప్పుడు... ‘‘చేయలేను అనడం వాడికి చేతకాదు. వాడిదంతా నిమ్మకాయ వాటం’’ అంటుంటారు.
 
ఉమ్మాయ్ జగ్గాయ్!
‘‘వారి ప్రాణస్నేహాన్ని చూస్తే చూడముచ్చటగా ఉందనుకో’’ అంటాడో వ్యక్తి.
 ‘‘ప్రాణస్నేహమా పాడా! వాళ్లది ఉమ్మాయ్ జగ్గాయ్ స్నేహం’’ అంటాడు రెండో వ్యక్తి. అంటే అర్థం ఏమిటి? స్నేహం అంటే కలకాలం కలిసి ఉండడం, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడడం. కొన్ని స్నేహాలు అలాగే కనిపిస్తాయి. తీరా లోతుల్లోకి వెళితే... అది ‘కాలపరిమితి’తో కూడిన స్నేహం అని అర్థమవుతుంది.
 
కొందరు ఏదైనా నిర్దిష్టమైన పని కోసం స్నేహితులవుతారు. ఆ సమయంలో వారిని చూస్తే- ‘ఆహా! ఎంత బాగా కలిసిపోయారో!’ అనిపిస్తుంది.  కానీ వాళ్లు పని పూర్తయ్యాక ఎవరి దారి వారు చూసుకుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి వాడేదే ఈ జాతీయం!
  ఉమామహేశ్వరుడు, జగన్నాథుడు పేర్ల నుంచి ‘ఉమ్మాయ్’, ‘జగ్గాయ్’ పుట్టుకొచ్చాయి. పురాణాల్లో శివుడు, విష్ణువు... రాక్షసుల పని పట్టడానికి ఏకమవుతారు. పని పూర్తయ్యాక ఎవరి పనిలో వారి పడిపోతారు. అందుకే వారి పేర్ల నుంచి ఈ జాతీయం పుట్టిందంటారు.
 
ఇప్ప పూల వాసన!

కొన్ని విషయాలు రహస్యంగా ఉండిపోవు. పైగా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ప్రతిభ కూడా అంతే. దాచాలని ప్రయత్నించినా, అడ్డుకోవాలనుకున్నా అది ఆగదు. పూల వాసన దాస్తే దాగేది కాదు. ఇప్ప పూల వాసననైతే అస్సలు ఆపలేం. ఆ పూల నుంచి ఘాటైన, మత్తయిన వాసన వస్తుంది. అది చాలా మేరకు విస్తరిస్తుంది. దానినెలాగైతే ఆపలేమో... ఒక వ్యక్తిలో ఉన్న ప్రతిభను కూడా వెలికి రాకుండా ఆపలేం అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం. కేవలం ప్రతిభ అనే కాదు... దాగని రహస్యం విషయంలోనూ ఈ ‘ఇప్ప పూల వాసన’ జాతీయాన్ని వాడుతుంటారు. ‘ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేం, అది ఇప్ప పూల వాసనలాంటిది’ అంటారు.

మరిన్ని వార్తలు