మన జాతీయాలు

17 Oct, 2015 22:12 IST|Sakshi

లొట్టాభట్టీయం
మనుషుల్లో చేతల మనుషులు, మాటల మనుషులు అని రెండు రకాలు. చేతల మనుషులు... తాము చేయదలిచిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా చేసేస్తారు. మాట మీద నిలబడతారు. అతిగా మాట్లాడరు. గొప్పలకు పోరు. అసాధ్యమైన పనిని సైతం ‘నేను చేస్తాను చూడు’ అని డంబాలు పలుకరు. ఇక మాటల మనుషుల తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు మాటలకు తప్ప చేతలకు ప్రాధాన్యత ఇవ్వరు. పని విషయంలో సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించడం కూడా కనిపించదు.

ఏ పని అయినా సరే- ‘‘అదొక లెక్కా... నేను చేసేస్తాను’’ అంటారు. తీరా పనిచేయాల్సి వచ్చేసరికి  సాకులు వెదుక్కొని తప్పించుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మనకు నిత్యజీవితంలోనూ తారస పడుతుంటారు. ఈ కోవకు చెందిన వాడే లొట్టాభట్టు.
 
ఈ భట్టుగారు నోరి విప్పితే చాలు... కోతలే కోతలు. ‘ఆకాశంలో చుక్కలు కావాలి’ అని అడిగితే - ‘అదెంత పని’ అనేవాడట వినేవాళ్లు నమ్మేలా. దేనినీ చాతకాదు అనడం ఈయనకు చాత కాదు. ఏదైనా చేసేస్తాను అనడమే ఈయనగారికి వచ్చు. నిజంగా వచ్చా అంటే సమాధానం శూన్యం. అందుకే కోతలు కోయడం, గొప్పలు చెప్పుకోడం లాంటి వాటికి లొట్టాభట్టు పేరు పర్యాయపదం అయిపోయింది. అందుకే ఎవరైనా సాధ్యం కాని పనులను సాధ్యం చేస్తామని చెప్పినా, కోతలు కోసినా - ‘‘ఆయన చెప్పింది నమ్మేవు సుమీ... అదొక లొట్టాభట్టీయం’ అంటుంటారు.
 
దింపుడు కళ్లం ఆశ
మనిషిని బతికించేది ఆశ అంటారు. చనిపోయిన మనిషి మళ్లీ బతుకుతాడు అనుకోవడం కూడా ఆశే. కాకపోతే అది తీరే ఆశ కాదు. అయినా కూడా తీరుతుందేమో నని ఆచరించేదే దింపుడు కళ్లం.
 చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్తూ, మధ్యలో ఒకచోట శవాన్ని కిందికి దింపి, చెవిలో మూడుసార్లు పేరు పెట్టి పిలుస్తారు. ప్రాణం మిగిలుంటే లేస్తారని ఆ ప్రయత్నం. దీన్ని దింపుడు కళ్లం ఆశ అంటారు. కళ్లం అంటే ప్రదేశం అని అర్థం.

గతంలో ఎప్పుడో, చనిపోయాడని నిర్ధారించుకున్న ఓ వ్యక్తి, నిప్పు పెట్టే ముందు చితిమీది నుంచి లేచి కూర్చు న్నాడట. అదెంతవరకూ నిజమో తెలి యదు కానీ, ఆచార వ్యవహారాల ప్రకారం దింపుడు కళ్లం ఆశకు ఎలాంటి అర్థం ఉన్నా, ఒక చిట్టచివరి ఆశ అన్న భావన వచ్చింది. ఒక పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ దని తెలిసినా, మనసులో ఏదో మూల చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు.
 
చుట్టమై వచ్చి దెయ్యమై పట్టి!
పనులు చక్కబెట్టుకోవడానికి లేదా తమ పబ్బం గడుపుకోవడానికి  కొంతమంది  ఆత్మీయత, స్నేహం, బంధుత్వం అనే ఆయుధాలను వాడుతుంటారు. ఒక పని నెరవేర్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి ద్వారా ఎలాంటి లాభాలు పొందవచ్చు అని కనుక్కొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. వారితో వ్యూహాత్మకంగా స్నేహమో, బంధుత్వమో కొని తెచ్చుకుంటారు.
 
వీరి నట ఆత్మీయతను చూసి అవతలి వాళ్లు సులభంగా బుట్టలో పడి పోతారు. కాల క్రమంలో ఈ ఆత్మీయులు కాస్తా గుదిబండల్లా తయారవుతారు.  దాంతో వీరిని వదిలించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి వారి విషయంలో వాడే జాతీయం ఇది.
‘‘అలాంటివాడిని ఎందుకు నమ్మావు?’’ అని అడిగితే-
‘‘ఏం చేస్తాం మరి... చుట్టమై వచ్చి దెయ్యమై పట్టాడు’’ అంటారు.
 
ఈగెంతా పేగెంతా!
కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. వియ్యం సంగతి సరే, కయ్యంలో మాత్రం తరచుగా వినిపించే మాట ఇది. సంపద, జ్ఞానం, వయసు మొదలైన విషయాల్లో పోల్చి చూసే సందర్భాల్లో వాడే జాతీయం ఇది. ‘‘నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ మాటలను నేను లెక్కలోకి తీసుకోను. ఈగెంతా పేగెంతా’ అంటుంటారు.
 
ఈగ అంటేనే చిన్న జీవి. ఇక దాని పేగు ఎంత ఉంటుంది! మరీ చిన్నగా ఉండదూ!
 తక్కువలో తక్కువ, అల్పంలో అల్పం అని చెప్పడానికి ‘ఈగ’ను ప్రతీకగా వాడుకొని ఇలా చెబుతుంటారన్నమాట.

మరిన్ని వార్తలు