మన జాతీయాలు

27 Dec, 2015 01:17 IST|Sakshi

ఐదు పది అవుతుంది!
యుద్ధంలో గెలవాలంటే యుద్ధం చేయాలనే ఉత్సాహం ఉండగానే సరిపోదు. తమ శక్తి సామర్థ్యాల మీద తగిన అవగాహన ఉండాలి. లేకపోతే పలాయనం చిత్తగించాల్సి ఉంటుంది! రెండు చేతులూ ఒకచోట జోడించి సమస్కరిస్తూ  ఓటమిని ఒప్పుకోవడం అనేది చాలాసార్లు చూస్తూ ఉంటాం. దీన్నించి పుట్టిందే ఈ జాతీయం.
 ప్రతి చేతికీ ఐదేసి వేళ్లు ఉంటాయి.

రెండు చేతులూ దగ్గరకు వచ్చినప్పుడు అయిదూ అయిదూ కలిసి పది వేళ్లవుతాయి. ఓటమిని అంగీకరిస్తూ నమస్కరించినప్పుడు ఐదు వేళ్లు పది అవుతాయి కాబట్టి ఈ మాట పుట్టింది. అందుకే ఎవరితోనైనా పోరాడితే ఓడిపోతావ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ‘వాడితో పెట్టుకోకు... అయిదు పది అవుతుంది’ అని అంటూ ఉంటారన్న మాట!
 
శ్రీరంగం రోకలి!
‘ఆ పని నెత్తి మీద వేసుకున్నావా? ఇక నీ పని శ్రీరంగం రోకలే!’
 ‘అతని దగ్గరికి వెళ్లకయ్యా బాబూ... అతనసలే శ్రీరంగం రోకలి!’
 వివిధ సందర్భాల్లో వినిపించే మాటలివి. శ్రీరంగం అంటే
 తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అంత మందికి ప్రసాదం అందించడం ఆషామాషీ విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అందుకే కొందరు భక్తులు స్వచ్ఛందంగా ఈ శ్రమలో పాలుపంచుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో...
 ఒక వ్యక్తి రోకలి వేస్తున్నాడనుకోండి... అలిసిపోయాను అని ఉన్నపళంగా  ఆ పని నుంచి తప్పుకోవడానికి లేదు. అలా చేస్తే పాపం. అందుకే వేరే భక్తుడు వచ్చి ఆ రోకలిని చేతిలో తీసుకునేవరకు దంచుతూ ఉండాలి. వేరే భక్తుడు వస్తే అదృష్టం. రాకపోతే మాత్రం శ్రమ పడక తప్పదు. దీని నుంచి పుట్టిందే ‘శ్రీరంగం రోకలి’ జాతీయం.
 దురదృష్టవశాత్తూ ఒక పని ఎంతకీ తరగకుండా ఉన్నప్పుడు గానీ, ఎవరైనా విసిగిస్తూ ఒక పట్టాన వదలనప్పుడు గానీ ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.
 
చిటికెల పందిరి!
కొందరు మాటలతో కోటలు కడతారు. కోతలతో రాజ్యాలు నిర్మిస్తారు. అలాంటి వారి విషయంలో ఉపయోగించే జాతీయం ఇది.
 పందిరి వేయడం అంటే ఇల్లు కట్టడానికి పడేంత కష్టం ఉండక పోవచ్చు గానీ... అస్సలు కష్టపడకుండా అయిపోయే పని మాత్రం కాదది. గుంజల కోసం గుంటలు తీయాలి, వాసాలు కట్టాలి. ఇంకా ఇలాంటి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది.
 
అయితే కొందరు చిటికెల పందిరి వేస్తుంటారు. అంటే పందిరి వేసేవాడు ఎలా ఉన్నా, వీళ్లు పక్కన ఉండి అలా వేసేస్తా, ఇలా వేసేస్తా అంటూ చిటికెలు వేసి మరీ చిటికెలో చేస్తానని గొప్పలు పోతుంటారు. అందుకే ఇలా పని చేయకుండా కబుర్లు మాత్రం చెప్పే వాళ్ల మీద ‘చిటికెల పందిరి’ వేసేస్తాడు అంటూ సెటైర్లు వేస్తుంటారు.
 
తద్దినం పెట్టేవాడి తమ్ముడు!
‘నీకేమయ్యా... తద్దినం పెట్టేవాడి తమ్ముడిలా కూల్‌గా ఉంటావు. సమస్యంతా మాకే’ అన్న మాట ఎప్పుడైనా విన్నారా?  పురోహితుడు తద్దిన మంత్రాలు చదువుతున్నప్పుడు అన్నదమ్ములందరూ ఒకచోట కూర్చుంటారు. అయితే వారిలో పెద్దవాడు మాత్రమే పురోహితుడు చెప్పిన పనులు చేస్తుంటాడు.

తమ్ముళ్లు మాత్రం ఇవేమీ చేయకుండా జంధ్యాన్ని ఎడమ భుజం నుంచి కుడికి మార్చుకోవడం మాత్రం చేస్తారు. అంటే ముఖ్యమైన పనంతా చేసేది పెద్దవాడేనన్నమాట. ఈ కార్యం నుంచి పుట్టిందే ‘తద్దినం పెట్టే వాడి తమ్ముడు’ జాతీయం. ఇతరులతో పోల్చితే ఎవరైనా చాలా తక్కువ శ్రమ చేస్తున్నప్పుడు, బాధ్యతలు తక్కువగా ఉన్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

మరిన్ని వార్తలు