నా కూతురి మనసు మార్చేదెలా?

16 Apr, 2016 22:37 IST|Sakshi
నా కూతురి మనసు మార్చేదెలా?

జీవన గమనం
నేను ఓ స్కూల్లో రిసెప్షనిస్టుగా పని చేస్తున్నాను. మా స్కూల్లో పనిచేసే ఓ మాస్టారు నన్ను పెళ్లి చేసు కోవాలనుందని అన్నారు. ఈ విషయం నేను నాతో స్నేహంగా ఉండే మరో టీచర్‌తో చెబితే... అతనికి ఆల్రెడీ పెళ్లైపోయిందని ఆవిడ చెప్పారు. కోపం వచ్చి అడిగేశాను. పెళ్లయ్యింది కానీ భార్య మంచిది కాదని, తనని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెబు తున్నారు. మాది పేద కుటుంబం. నా సంపాదనే మా కుటుంబానికి ఆధారం. నాకు పెళ్లి చేసే స్తోమత కూడా అమ్మా నాన్నలకు లేదు. కాబట్టి అతను చెప్పేది నిజమైతే నేనతణ్ని పెళ్లి చేసుకోవచ్చా? తన మాటలు నమ్మొచ్చా?
 - ఓ సోదరి, గుంటూరు

 
ఇందులో నమ్మకాలు, అపనమ్మకాల ప్రసక్తి ఏముంది? చీకట్లో ఉన్నప్పుడు అక్కడే ఉండి పోవడం కన్నా కనబడుతున్న వైపునకు మళ్లడం అభిలషణీయం కాదా? కానీ అది వెలుగా మిణుగురు పురుగా అనేది ముందు తెలుసు కోవాలి. వెళ్తున్న దారిలో ముళ్లపొదలు, సుడి గుండాలు ఉన్నాయేమో గమనించి జాగ్రత్త పడాలి. వివాహం గురించి అతడు ప్రపోజల్ పెట్టినప్పుడు తన మొదటి భార్య సంగతి ఎందుకు చెప్పలేదో ముందు మీరు కన్విన్స్ అవ్వండి. అతడు చెప్పిన కారణం నిజమనిపిస్తే, మీ తండ్రిగారిని వెళ్లి ఆ మాస్టారితో మాట్లాడమని చెప్పండి. మొదటి భార్యతో విడాకులు ఎంతవరకూ వచ్చాయో కనుక్కోండి.

ఆమెతో ఆయనకు సంతానం ఉందో లేదో, విడాకులిస్తున్న సమయంలో కోర్టు ఏ రకమైన ఆంక్షలు పెడుతుందో, ఆయన ఆస్తిలో ఎవరికి ఎంత వాటా చెందుతుందో మొదలైన వివరాలన్నీ సేకరించిన తర్వాతే ఓ నిర్ణయానికి రండి. ముఖ్యంగా... మీ వివాహం జరిగిన తర్వాత కూడా మీరు ఉద్యోగం చేస్తానని, ఆ జీతం మీ బీద తల్లిదండ్రులకే చెందుతుందనీ ఆయన్ని ఒప్పించండి. మగాళ్లు మొగుళ్లయ్యాక పెళ్లికి ముందున్నంత దయాగుణంతో ఉండరు. ఆ విషయం గుర్తు పెట్టుకుని, పక్కాగా పెద్దల సమక్షంలో ఏర్పాట్లు చేసుకోండి.
 
మేం బ్రాహ్మణులం. మాకంటూ ఓ గుర్తింపు, గౌరవం ఉన్నాయి. కానీ నా కూతురు ఒక తక్కువ కులం కుర్రాడిని ప్రేమించింది. తననే పెళ్లి చేసు కుంటాను అంటోంది. అబ్బాయి మంచివాడు, బాగా చూసుకుంటాడు అని కచ్చితంగా చెప్పేస్తోంది. కానీ ఈ పెళ్లి వల్ల మా బంధువులు, స్నేహితుల మధ్య మా గౌరవం పోతుంది. అలాగే ఆ అబ్బాయి కుటుంబం, మా కుటుంబం ఎప్పటికీ కలవలేవు. రకరకాల స్పర్థలు వస్తాయి. తారతమ్యాలు కనిపిస్తాయి. కాబట్టి జీవితాంతం ఇబ్బందే. అందుకే వద్దంటున్నాను. కానీ నా కూతురు వినడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను అనుకున్నదే చేయాలా లేక తన జీవితం తన ఇష్టం అని పెళ్లికి ఒప్పుకోవాలా?
 - శర్మ

 
మీ ప్రశ్న తాలుకు చివరి వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ‘‘ నేను చేసుకోవద్దంటు న్నాను. కానీ నా కూతురు వినటం లేదు. నేననుకున్నదే చేయాలా? లేక పెళ్లికి ఒప్పు కోవాలా?’’ అని రాశారు. మీరు ఏమనుకుంటు న్నారు? ‘పెళ్లి జరగడానికి వీల్లేదు’ అనుకుంటు న్నారు. అవునా? కానీ మీ కూతురు వినటం లేదు. మరేం చేస్తుంది? ఇంట్లోంచి వెళ్లిపోయి ఆ అబ్బాయిని వివాహం చేసుకుంటుందా? ఎలాగూ మీ మాట విననన్నప్పుడు ఇక మీకు వేరే పరిష్కార మార్గం ఏముంది? లేదూ, మీరు ఎమోషనల్‌గా బలవంతం చేస్తే, మీ అమ్మాయి ఆ కుర్రవాడిని మరచిపోయి మీరు చెప్పిన వివాహం చేసుకుంటుందనుకుందాం! ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిది? గతం గత: అనుకుని భర్తతో సుఖంగా కాపురం చేయగలు గుతుందా, లేక డిప్రెషన్‌కు గురై ఒక కుర్రవాడి (భర్త) జీవితం నాశనం చేసే మనస్తత్వమా? తండ్రిగా మీరే దాన్ని బాగా గుర్తించగలరు. మీరు ప్రశ్నలో మరికొన్ని వివరాలు ఇవ్వలేదు.

అతడు ఉద్యోగం చేస్తున్నాడా? ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఈ పెళ్లికి సుముఖంగా ఉన్నారా? లేదా పెద్దల నుంచి దూరంగా వెళ్లిపోయి విడిగా సంసారం పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడా? మీ అమ్మాయి ఆ అబ్బాయి గురించి, ‘‘ చాలా మంచివాడు. బాగా చూసుకుంటాడు అంటోంది’’ అన్నారు. ప్రేమించిన కొత్తలో ప్రతివాళ్లూ అలాగే అనుకుంటారు. కౌన్సిలింగ్‌కి వచ్చే కేసుల్లో సగం పైగా ప్రేమ వివాహాలే! ఇవన్నీ మీ అమ్మాయికి చెప్పి చూడండి. దానికన్నా ముందు ఆ అబ్బాయిని కలుసుకుని మాట్లాడండి. అతడి ఆర్థిక స్థాయి గురించిన వివరాలు సేకరించండి. అన్నీ మీ అమ్మాయికి చెప్పి, తర్వాత నిర్ణయం ఆమెకే వదిలిపెట్టండి. మీ కుటుంబం, ఆ అబ్బాయి కుటుంబం ఎప్పటికీ కలవక పోవచ్చు.

వాళ్లిద్దరూ పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయి సామరస్యంగా సంసారం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్లేనా? నిజంగా వాళ్లకు అలా సంసారం చేసుకునే స్థైర్యం, నిబద్ధత, సామర్థ్యం ఉంటే, మీరు మీ కుటుంబ గౌరవం గురించి గానీ, మీ స్నేహితుల గురించి గానీ, ఏ మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కులాంతర వివాహాల గురించి ఎవరూ ఎక్కువ పట్టించుకోవడం లేదు. అలా కాకుండా, మీ కుటుంబంలో మిగతా వారి వివాహాలకు మీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అడ్డొస్తుంది అనుకుంటే... మీ నుంచి విడిపోవలసి వస్తుంది అని అమ్మాయిని హెచ్చరించండి. చివరగా ఒక మాట! మీ కులం కాని వారందరిదీ ‘తక్కువ కులం’ అనే అభిప్రాయం మార్చుకోండి.
- యండమూరి వీరేంద్రనాథ్

మరిన్ని వార్తలు