పి.కె. 2015

4 Jul, 2015 23:42 IST|Sakshi
పి.కె. 2015

కామెడీ కథ
‘నీ మిత్రుడు పోలకంటి కనకాంబరం ఉరఫ్ పి.కె.ని ప్రభుత్వ ఆసుపత్రిలో పడేశాం. నీవు రాగలవు’ కమల నాకు పంపిన మెసేజది. కమల పి.కె. చెల్లెలు. ఎందుకు చెప్మా అని ఫోన్ పట్టుకొని కొంచెంసేపు ఆలోచించాను. స్పాట్ వాల్యుయేషన్ జరుగుతున్నాది. సెలవివ్వరు. మరీ అర్జంటనీ.. ప్రాణాల మీదకొచ్చిందని చెప్పి బయలుదేరాలి. ఒకరోజులో రావాలి. వాడుండేది విశాఖలో. నేను విజయవాడలో. ఫర్వాలేదు సమయం సరిపోతుంది. ‘‘రాత్రికి బయలుదేరుతున్నానని’’ నేను తిరుగు సందేశం ఫోన్‌లో పంపాను.
 
పి.కె.తో నా స్నేహానికి మూడు పదుల వయసు. మా ఇద్దరి చిన్నతనం విజయనగరం ఐకోనేరు గట్టు సత్యన్నారాయణ స్వామి కోవెల  న్యూపూర్ణ జంక్షన్ దగ్గరే గడిచిపోయింది.  ఆంధ్ర  విశ్వవిద్యాలయంలో పీజీకి వచ్చాక వాడు టీచర్ పోస్టులకు, నేను గ్రూప్స్, బ్యాంకులకు ప్రిపేర్ అయ్యేవాళ్లం. అనుకొన్న విధంగానే వాడు టీచర్‌గా సెలక్టు అయ్యాడు. నేను ఎస్‌బీఐ పీఓగా విజయవాడ రీజియల్‌గా వెళ్లిపోయాను. అయినా మా మధ్య స్నేహం చెడిపోలేదు. ఇప్పుడు వాడికి నాలుగు పదులు మీద మరో రెండు సంవత్సరాలు అదనంగా ఉన్నాయి.

ఎందుకో పెళ్లిమీదకు మనసు పోవటం లేదనేవాడు. విశాఖలోని ఎండాడ దగ్గర ఓ ఫ్లాట్ కొనుక్కున్నాడు. భీమిలిలో ఉద్యోగం. రేపో మాపో ఎం.ఇ.ఓ. ప్రమోషన్ వస్తుందన్నాడు. అలాంటిది ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? కళ్లు తెరిచేసరికి... తెల్లవారుజాము నాలుగయింది. మరో నలభై నిమిషాల్లో విశాఖ వచ్చేస్తుంది. మరి నిద్రరాలేదు. విశాఖ చేరగానే రూమ్ తీసుకుని ఎనిమిది కల్లా ఎన్.ఆర్.ఐ. ఆసుపత్రికి వెళ్లాను. ముందు కె.జి.హెచ్. అనుకున్నారుట. అతడిని మరింత డిప్రెషన్‌లోకి నెట్టడం ఇష్టంలేక, కమల... వాళ్లాయన, వాళ్లమ్మ (పి.కె. తల్లి అన్నమాట) ఎన్.ఆర్.ఐ.లోకి మార్చారట. బ్రతికించారు.
 
వార్డులోకి వెళ్లి కెవ్వుమని అరచి, దబ్బుమని పడిపోయాను. కమల, నర్సు నీళ్లుకొట్టారు. వారికి ఇది చాలా సహజ ప్రక్రియగా మారిపోయింది. అనగా... పి.కె.ను చూడటానికి వచ్చినవారంతా నాలాగే కెవ్వుకేకలు ప్లస్ దబ్బుమన్న శబ్దాలను చేశారన్నమాట. ‘ఓ మై గాడ్! మంచం మీదున్నది... మా పి.కె.నా?’ ఒక్కమాటలో చెప్పాలంటే అంగారక గ్రహవాసిలా ఉన్నాడు. కోతి మూతి, సన్నని కొబ్బరిచిప్ప లాంటి ముఖం, చిప్పమీద నిలిచిన సన్నని చెత్తలా జుత్తు... సారీ వెంట్రుకలు,...  ఏంటో తల తిరుగుతున్నట్టుగా ఉంది. మళ్లీ పడబోయాను. నర్సు చెయ్యిచ్చింది. థాంక్యూ అన్నాను. వెల్‌కమ్... నాజూకుగా అని వెళ్లిపోయింది.
 
‘‘అవునే. వీడెందుకిలా తయారయ్యాడు’’ అన్నాను కమలతో.
 ‘‘నాకూ తెలియదన్నయ్యా. ఈ మధ్య ఎంతోమంది అమ్మాయిలను చూడటానికి వెళ్లాడట. వారంతా మూకుమ్మడిగా వీడిని తిరస్కరించారట’’
 ‘‘అయితే, దానికీ దీనికీ ఏమిటి సంబంధం?’’ అన్నాను ఆశ్చర్యంగా. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే... వాడి చేతికున్న పదివేళ్లకు పది ఉంగరాలున్నాయి. వాడి మెడలో హనుమాన్ రక్షణ కవచం, హయగ్రీవ, మన్మథ, యమ తదితర లాకెట్లు మూర్ఛ బిళ్లల్లా ఉన్నాయి.
 
ఇంతలో ఇద్దరు డాక్టర్స్ గబగబా వచ్చి, గంభీరంగా రిపోర్ట్స్ చూసి, వాడి ముఖాన్ని అటూ ఇటూ తిప్పి, కాళ్లెత్తి (పేషెంట్‌వి) చూసి, వేగంగా వెళ్లిపోయారు. నర్సు ఎందుకైనా మంచిదని ఏదో ఇంజక్షన్ పొడిచి వెళ్లిపోయింది. ‘‘వీడో ప్రయోగశాలన్నమాట. ఏటీయం కార్డు కూడా.’’ ఇంతలో వాడు కదలి, కళ్లతో చేతులతో ఏదో చూపించాడు. మేము అటు చూశాం. టీవీలో ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ వస్తున్నది. వాడి కళ్లలో మెరుపు. వెంటనే మరో యాడ్. ఫలానా సాఫ్ట్ డ్రింక్ తాగితే ఉత్సాహం మీ వెంట ఉంటుందని ఫలానా హీరో తాగాడని మీరు కూడా తాగాలని.

ఆ తర్వాత లో దుస్తుల యాడ్. తమ కంపెనీవే  ధరించమని, అవి వేసుకొంటే ఆడవాళ్లు ఇంట్లో వంట చేస్తున్నా, పడక గదిలో ఉన్నా, ఎక్కడి పనులు అక్కడే వదిలేసి మీ వెంటబడతారని చెబుతున్నది. మరో మూడు బనియన్లవారు అలాగే చెప్పారు.  ‘ఎంత నాన్సెన్స్’ అని టీవీ కట్టేశాను. కానీ పి.కె. ఊరుకోలేదు. వేయమన్నాడు. వేశాను. యాడ్స్‌ను తీక్షణంగా చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు డాక్టర్స్ వచ్చారు. ఈసారి వారి వెంట ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు.

ఆ నలుగురు వాడి చుట్టూ చేరి, రకరకాలుగా పరీక్షించి, నవ్వుకొంటూ ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. నాకర్థమైంది. ‘‘కమలా... ఇక్కడ మనం ఎన్నాళ్లున్నా వీడికి నయం కాదు. అయినా వీడికి కావలసింది డెర్మటాలజిస్టులు, జనరల్ సర్జన్స్ కాదు. సైకియాట్రిస్టు’’
‘‘వాట్... వీడికి పిచ్చా’’ అంది గాబరాగా కమల. ‘‘అబ్బా కమలా!  సైకియాట్రిస్టు అనగానే పిచ్చి తప్ప మరేమీ ఉండదా? అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రతి వేయిమందికి ఒక సైకాలజిస్టు, సైకియాట్రిస్టు ఉంటారు తెలుసా? డిప్రషన్, ఈరోజు మనదేశంలో దీపికా పదుకొనే వంటివారు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆమె దాని నుంచి బయటపడింది కూడా.’’ ఏభైవేలు చెల్లించి బయటపడ్డాం.
   
‘‘రెండు రోజులు నా అబ్జర్వేషన్‌లో ఉంచండి. అంత కాంప్లికేటెడ్ కాదని నా ఉద్దేశ్యం. ఏదో మానసికమైన ఆరాటమే. భయపడవలసిన పనిలేదు.’’ డా. నరేంద్ర అమెరికాలో చదువుకొని, పది సంవత్సరాలు ప్రాక్టీసు చేసి, ఇండియాలో స్థిరపడిన సైకియాట్రిస్టు. నగరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న వ్యక్తి. ద్వారకా నగర్ ప్రాంతంలో మంచి క్లినిక్ కమ్ ఇల్లు కట్టాడు. నాకు విజయవాడలో పరిచయమయ్యాడు. కమలను పి.కె.తో ఉంచి, నరేంద్రకు నా స్పాట్ విషయాన్ని చెప్పి, విజయవాడ బస్సెక్కాను. నాలుగు రోజులు గడిచాయి. నా పని కూడా ముగింపు దశకు వచ్చింది. పి.కె. ఎలాగున్నాడో అని ఆలోచిస్తుంటే కమల ఫోన్ చేసింది... డా. నరేంద్ర రమ్మన్నాడని. నేను విశాఖ వచ్చి నరేంద్రను కలిశాను.
 
‘సైకాలజీలో ప్రేరణ స్వభావమని ఒక అంశముంది. అది ఉత్సుకతతో ప్రారంభమవుతుంది. ఏ మనిషైనా ప్రేరణ కలిగించిన ఉత్సుకతతో తనకు కావలసిన గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాడు. అనుకూలమైన గమ్యం అయితే ముందుకు సాగుతాడు. ప్రతికూలమైన గమ్యమైతే వదిలివేస్తాడు. కాని కొందరు ప్రతికూల గమ్యాన్ని కూడా వదలకుండా దానిని చేరాలనుకుంటే ప్రమాదకరమైన లేదా దుఃఖదాయకమైన పరిస్థితులు సంభవిస్తాయి. మీ వాడి కేసులో అదే జరిగింది. అతని గమ్యం లైంగిక సంతృప్తి. ప్రేమ, సాహచర్యము అనేవి అందుకు మార్గాలు.

ఆ మార్గాల్లో దానిని పొందటానికి  ప్రయత్నించాడు. కానీ విఫలత అతనిలో కసిని పెంచింది. తను అందంగా మారితే గమ్యం సులువవుతుందనే ఆశ అతను ఉన్మాది కాకుండా రక్షించింది. మీవాడు అదృష్టవంతుడు. శారీరకంగా కొంత తిప్పలు పడ్డాడు. మానసికంగా పూర్తిగా నష్టపోలేదు. అతడి చేష్టలు మనకు నవ్వు తెప్పించాయి కాని ఎవర్నీ బాధ పెట్టలేదు’... డాక్టర్ ద్వారా తెలిసిన పి.కె. సమస్య ఇది. పి.కె. పెళ్లి సంబంధం కోసం వెళ్లాడు. పిల్ల అతనిని చూసి నవ్వింది. నల్లగా ఉన్నావని, ముఖంపైనే చెప్పింది.
 
ఓరోజు టీవీలో ఫేస్ క్రీములు ప్రకటన వస్తున్నాది. అవి రాసుకుంటే కేవలం వారం రోజుల్లో తెల్లగా, రాయంచలా మారిపోతారని, వాడకపోతే జీవితం నాశనమవుతుందని ఉంది. ఆనాటి నుంచి దాదాపు ఇరవై రకాల క్రీములను రోజుకు నాలుగుసార్లు రాయటం ప్రారంభించాడు. వంటికి అదేదో సెంటు రాసుకొని, ఓ పబ్‌కు వెళ్లాడు పి.కె. సెంటు వాసనకు పబ్‌లో అమ్మాయిలంతా బల్లుల్లా అతన్ని అతుక్కుపోతారని ప్రకటనలో చూశాడట. ఆ సెంటు రాసుకున్నాడు.

ఆడపిల్లలు కాదు కదా, కనీసం గోడమీద బల్లి కూడా తనమీద పడకపోవటంతో చిరాకేసిందతనికి. కోపం కూడా వచ్చి, విపరీతంగా తాగి, నానా భీభత్సం చేస్తే పబ్‌వాళ్లు బయటకు గెంటారు... జేబులో పర్సు లాగేసుకొని! హీరో హోండా కొంటే అమ్మాయిలు పడతారని ఒక ప్రకటనలో చెబితే అది కూడా కొన్నాడు. ‘‘బాగున్నాడా... మావాడు’’ అన్నాను. ‘‘ఫర్వాలేదు నయం చేశాను. రేపు తీసుకువెళ్లండి. కొన్నాళ్లు టీవీకి దూరంగా, ఏ హిల్ స్టేషన్‌కో తీసుకువెళ్లండి.

రిలాక్స్ అవుతాడు. పెళ్లి చేయండి. అవసరం కూడా. శారీరకంగా కాదు, మానసికంగా కూడా అతనికో తోడు అవసరం.’’ అన్నాడు. ‘‘వీటిని అరికట్టలేమా?’’ అన్నాను.
‘‘కష్టం. వ్యాపారస్తులకు తమ ప్రోడక్టులు అమ్ముకోవడం కావాలి. అదెలాగ అనేది అనవసరం. వ్యాపారం అంతే. విచక్షణ అనేది కొనుగోలుదారునికి ఉండాలి’’
 డాక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పబోతుంటే... ‘‘నేను ఈ ట్రీట్‌మెంట్‌కు పి.కె. 2015 అని పేరు పెట్టుకున్నాను. అందుకు గాను బిల్‌లో ట్వంటీ పర్సంట్ రాయితీ ఇస్తున్నా’’ అనే నరేంద్ర మాటలకు నేను, కమల నవ్వుకున్నాం.

పి.కె.ను మెల్లగా నడిపించుకుంటూ ఆటోను చేరుకున్నాం.
 పి.కె.ను చూస్తుంటే మా అక్క గుర్తుకు వచ్చింది. టీవీ లేకుండా క్షణం ఉండలేదు. కుటుంబమంతా ఒక్క గదిలోనే సర్దుకుంటారు. మిగిలిన ఆరు గదులలో టీవీలో వచ్చే ప్రకటనలలోని వస్తువులు, సౌందర్య సామగ్రి, దైవాల యొక్క తాయత్తులతో నిండిపోయాయి.
 నేను ఆటో ఎక్కుతుండగా, ‘మామయ్యా! అమ్మ తిక్కతిక్కగా మాట్లాడుతూ పడిపోయింది. రావా’’ ఫోన్ చేసింది విమల. అది నా అక్క కూతురు.
అక్కా... నీక్కూడా పి.కె. 2015 తప్పదా?...
 - భమిడిపాటి గౌరీశంకర్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా