‘గ్రీజు’వీరులు

30 Aug, 2014 23:52 IST|Sakshi
‘గ్రీజు’వీరులు

మన దగ్గర ఉట్టికొట్టి బహుమతులు పట్టినట్టుగానే, ఇండోనేషియాలోనైతే స్తంభాన్ని ఎగబాకి వాటిని ఎగరేసుకెళ్లాలి. పంజట్ పినాంగ్‌గా పిలిచే ఈ వేడుకలో పాల్గొంటున్న స్థానికుల్ని ఫొటోలో చూస్తున్నారు కదా! గ్రీజు పూసిన స్తంభాలను పైదాకా ఎగబాకితే ఏమేం పొందవచ్చో తెలుస్తోంది కదా! సైకిలుతోపాటు కుక్కరు, గిన్నెల్లాంటి కొంత సామగ్రి! ఫలితం దక్కినట్టే!
 
 సప్లయర్ ‘చిట్టి’
 ‘రోబో’ చిట్టి ఇట్టే ఎన్నోరకాల వంటలు సిద్ధంచేస్తాడు! అది సినిమా అనుకున్నాంగానీ, వర్తమానం కూడా అని ఈ ఫొటో చెబుతోంది. చైనాలోని కున్‌షాన్‌లోని ఒక రెస్టారెంటు యజమాని నిజంగానే రోబోలను వినియోగిస్తున్నాడు. డజనుకు పైగావున్న ఈ రోబోలు వంటలోనూ, సరఫరాలోనూ సాయపడుతున్నాయి. కస్టమర్లను ‘మర్యాద’గా పలకరిస్తున్నాయి. ఇవి నలభై దాకా రోజువారీ మాటల్ని అర్థం చేసుకోగలవట! ఈ కొత్తదనానికి ఇటు వినియోగదారులు సంతోషంగావుంటే, సెలవనీ అనారోగ్యమనీ నోరెత్తని రోబోలతో యజమానీ ఆనందంగా వున్నాడు.
 
 బీచ్ బాత్రూమ్
 ముఖానికి సబ్బు నురగ పూసుకున్న ఈ జపనీయుల్ని చూస్తుంటే, వీళ్లంతా మూకుమ్మడిగా స్నానం చేస్తున్నట్టు లేదూ! వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం నిర్వహించిన ఓ సరదా కార్యక్రమం ఇది. టోక్యోలోని టొయోసు మేజిక్ బీచ్‌లో ఇది జరిగింది.

మరిన్ని వార్తలు