అట్టును అచ్చొత్తేస్తుంది...

9 Oct, 2016 01:48 IST|Sakshi
అట్టును అచ్చొత్తేస్తుంది...

అట్టును అచ్చొత్తడమేంటనుకుంటున్నారా..? నిజంగా ఇది నిజం. ఇదిగో ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చిత్ర విచిత్ర విలక్షణ వంటింటి పరికరం అట్టునే కాదు, రొట్టెను కూడా అచ్చంగా అచ్చొత్తేస్తుంది. మనం కోరుకునే అట్టుకైనా, రొట్టెకైనా పిండిని మాత్రం మనమే మకూర్చుకోవాలనుకోండి. ఎంతైనా ‘పిండి కొద్దీ రొట్టె’ అనే సామెత ఉండనే ఉంది కదా! ఈ పరికరం పైభాగాన ఉన్న గొట్టంలో సమపాళ్లలో కలుపుకున్న పిండిని దట్టించాలి. ఆ తర్వాత దీనికి పని చెప్పాలి. అదెలాగంటారా? ఇది కంప్యూటర్‌కు అనుసంధానమై పనిచేస్తుంది.

మనం కోరుకున్న చిత్రాన్ని కంప్యూటర్‌లో ఎంచుకుని, ఆ సమాచారాన్ని దీనికి చేరవేస్తే చాలు. నిమిషాల్లోనే మనం కోరుకున్న చిత్రం ఆకారంతో అట్టును అచ్చొత్తేస్తుంది. ఈఫిల్ టవర్ ఆకారంలో అచ్చొత్తుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఎంపిక చేసుకున్న ఫొటోలే కాదు, మనం గీసిన బొమ్మలను స్కాన్‌చేసి, కంప్యూటర్‌లోకి ఎక్కించి, వాటి ఆకారాలతో కూడా ఈ పరికరం సాయంతో రొట్టె, అట్టాదులను అచ్చొత్తేసుకుని ఇంచక్కా ఆరగించవచ్చు. దీనిపేరు ‘పాన్‌కేక్‌బో’. త్రీడీ ప్రింటింగ్ రోబోటిక్స్ పరిజ్ఞానంతో పనిచేస్తుంది ఇది. కోరుకున్న పాన్‌కేక్‌లకు రంగులు అద్దాలనుకునే వారు ఇందులో పిండితో పాటు ఫుడ్ కలర్స్‌ను కూడా చేర్చుకుంటే సరిపోతుంది.

మరిన్ని వార్తలు