పుష్పదంతునికి పరమేశ్వరుని శాపం 

2 Dec, 2018 01:30 IST|Sakshi

పురానీతి

పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి ఈ లోకాలకి దూరంగా కొంతకాలం పాటు ఏకాంతంగా ఉందామనిపించింది. వారు అందుకు అనువైన ప్రదేశం కోసం వెదుకుతూ అమరనాథ గుహకు వచ్చారు. అక్కడ కూర్చుని వారు ప్రాపంచిక బాధలు లేకుండా హాయిగా కథాకాలక్షేపం చేయసాగారు. తాముండే ఆ గుహ వద్దకు ఎవ్వరినీ రానివ్వకుండా నందిని కాపలాగా ఉంచి  పరమేశ్వరుడు పార్వతీదేవికి రోజూ ఒక కథ అత్యంత రమణీయంగా కన్నులకు కట్టినట్లు చెప్పేవాడు. పార్వతీదేవి ఎంతో ఆసక్తితో ఆ కథలు వినేది. అయితే ఆ గుహలో పుష్పదంతుడనే యక్షుడు పావురం రూపంలో ఒక మూలన రహస్యంగా దాగి ఉండి ఆ కథలను వింటూ ఉండేవాడు. అతను అంతటితో ఆగక ఆ కథలను ఇంటికి వెళ్లి తన భార్యకు చెప్పేవాడు. ఆమె ఎంతో శ్రద్ధగా వినేది ఆ కథలను. పార్వతీపరమేశ్వరుల ఏకాంతవాసం అయిపోయింది. వారు తిరిగి కైలాసానికి వెళ్లి, యథావిధిగా లోకాలను పాలిస్తున్నారు. 

పుష్పదంతుని భార్య పార్వతీదేవికి భక్తురాలు. అనుంగు చెలికత్తె కూడా కావడంతో కైలాసానికి వెళ్లి పార్వతీదేవిని కలుసుకుంది. వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె పార్వతీదేవికి తాను భర్త ద్వారా విన్న కథలను చెప్పింది. పార్వతీదేవి ఆ కథలు విని నిర్ఘాంతపోయింది. ప్రపంచంలో ఎక్కడా వినని కథలు చెప్పమంటే అందరికీ తెలిసిన కథలు చెప్పాడేంటి అనుకుని పరమేశ్వరుడిని నిలదీసింది. పరమేశ్వరుడు దివ్యదృష్టితో చూసి జరిగిందేమిటో గ్రహించాడు. ఏకాంతంలో ఉన్న తమ రహస్యాలను బహిర్గతం చేసినందుకు కోపించి, పుష్పదంతుని పిలిచి, బేతాళుడిగా అంటే శవంలా పడుండమని శపించాడు. పుష్పదంతుడు తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి పరమేశ్వరుడి పాదాల మీదపడి తనను క్షమించి, శాపాంతం చెప్పమని వేడుకున్నాడు. భక్త వత్సలుడైన బోళాశంకరుడు కరుణించి ‘‘భూలోకంలో ఒక చెట్టుమీద శవంలా పడున్న నిన్ను విక్రమార్కుడనే రాజు దించి భుజానేసుకుని ఒక మాయా సన్యాసి వద్దకు మౌనంగా తీసుకు వెళుతుంటాడు. ఆ సమయంలో నువ్వు ఈ కథలు అసంపూర్తిగా చెప్పి, వాటి గురించి ప్రశ్నలు వేసి, ‘తెలిసి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావో, నీ తల వెయ్యి వక్కలవుతుంది’ అని బెదిరించి మౌనభంగం చేస్తుండు. ఏ ప్రశ్నకైతే అతను సమాధానం చెప్పలేక  మౌన ంగా ఉంటాడో, అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పాడు. 

ఆ తర్వాతి కథ అందరూ చిన్నప్పటినుంచి చందమామ కథల్లో చెప్పుకున్నదే, అందరికీ తెలిసిందే. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, ఎవరైనా సరే, రహస్యమంటూ చెబితే, దానిని పదిమందికీ చెప్పి బట్టబయలు చేయడం, ఇతరుల ఏకాంతాన్ని భంగపరచడం, చాటుగా దంపతుల మాటలు విని, వాటిని ఇతరులకు చేరవేయడం వంటివి పరమ నీచమైన పనులు. వాటిని ఎవ్వరూ అలవాటు చేసుకోకూడదు. అలా అలవాటు చేసుకుంటే, పర్యవసానాలు తీవ్రంగా వుండొచ్చు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

మరిన్ని వార్తలు