అత్తమ్మ

12 May, 2019 05:56 IST|Sakshi

ప్రమీల ఇంటికొచ్చింది ఆమె తల్లి పార్వతమ్మ. తల్లిని చూసి ఎంతో సంబరపడింది ప్రమీల.తల్లికి ఇష్టమైనవి వండి పెడుతూ,  తను కొనుక్కున్న నగలు, చీరలను చూపెడుతూ, ఊళ్ళో ఉన్న తన అత్తగారు, ఆడబిడ్డలని ఆడిపోసుకోవడంతోనే నాలుగు రోజులు గడిచిపోయాయి.అలా అని కూతురు చెప్పిందానికల్లా తల ఊపేసి భుజంతట్టే రకం కాదు పార్వతమ్మ.తన కూతురైనా సరే అకారణంగా ఇతరులను ద్వేషించడం ఆమెకు నచ్చేది కాదు.‘‘అలా తిట్టొద్దు తల్లీ’’ అని ఎన్నోసార్లు చెప్పి చూసినా  వినేది కాదు ప్రమీల.పైగా...‘‘అమ్మా,  వాళ్ల గురించి నీకు తెలియదు’’ అని దబాయించేది.కూతురి మొండి వైఖరి తెలిసిన పార్వతమ్మ దీనికి బుద్ధెప్పుడు వస్తుందో అని అనుకునేది. ప్రమీల భర్త ప్రసాదరావు చాలా మంచివాడు. భార్య తన తల్లికి, చెల్లెళ్ళకు మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళు రావటం ఆమెకు ఇష్టం  లేకపోయినా, వాళ్ళు వచ్చినప్పుడు ఆమె పెద్దగా  నోరు పారేసుకున్నా సహించి  ఊరుకొనేవాడు తప్పితే తిరిగి ఆమెను ఏమనేవాడు కాదు.భార్య నోటికి జడిసి  సంపాదించే యంత్రంలా  మారి ఆమెను సుఖపెడుతున్నాడే గానీ ఊళ్ళో ఒంటరిగా ఉన్న తన తల్లిని తన దగ్గరికి తెచ్చిపెట్టుకోవటానికి ఏ మాత్రం సాహసించలేదు.

ఎప్పుడైనా తల్లి కొడుకు ఇంటికి  నాల్గురోజులుండి పోదామని వస్తే రెండో రోజే వెళ్ళిపోయేదావిడ ప్రమీల ఈసడింపు మాటలను భరించలేక.అందుకని ఊళ్ళోనే ఉంటూ అప్పుడప్పుడు కొడుకునే వచ్చి చూసిపోమనేది. ఇంటి చుట్టు పక్కల దగ్గర బంధువులుండటం వలన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మనసులోనే బాధ పడేవాడు ప్రసాదరావు.పొద్దున పదిగంటలకు ఆఫీసుకెళ్ళబోతున్న అల్లుడితో...‘‘అల్లుడు గారు, నేనొచ్చి అప్పుడే వారం రోజులైంది. ఈ రోజు సాయంత్రం అమ్మాయి బసెక్కిస్తుంది నన్ను’’ అని చెప్పింది పార్వతమ్మ. ‘‘ఇంకో నాల్రోజులుండి వెళ్ళొచ్చుగా అత్తయగారూ...’’ అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా. అతనికి పెద్దలంటే గౌరవం. తన తల్లిని భార్య నిర్లక్ష్యం చేసినా తను మాత్రం ఆమె తల్లిని గౌరవిస్తూ ఏలోటూ రానీయకుండా చూసేవాడు. తన తల్లి వస్తే ప్రమీల చాలా సంతోషంగా ఉంటుంది..మరి తనతల్లి వస్తే ఎందుకు మొహం చిట్లించుకుంటుందో అని అతని బాధ.‘‘లేదయ్యా...ప్రమీల నాన్నగారు రమ్మనమని ఫోన్‌ చేశారు...అందుకే ..’’  అన్నది పార్వతమ్మ.‘‘సరే మీ ఇష్టం.. జాగ్రత్తండీ’’ అని ఆఫీసుకెళ్ళి పోయాడు ప్రసాదరావు.పన్నెండున్నరకి చెమటలు కక్కుతూ  ఆదరాబాదరాగా ఇంటికొచ్చిన ప్రసాదరావుని చూసి ఆశ్చర్యపోయారు తల్లీ కూతుళ్ళిద్దరూ.

కాసిని మంచినీళ్ళు తాగి ‘‘నేను అర్జెంటుగా ఊరెళుతున్నాను. అమ్మకి  సుస్తీగా ఉంది. రెండు రోజుల్లో వస్తాను. నే వచ్చేవరకు మీరు ప్రమీలకి తోడుగా ఉండండి’’ అని చెప్పి మరోమాట లేకుండా వెళ్ళిపోయాడు.రెండు రోజుల తరువాత నీరసంగా  ఉన్న తల్లిని నడిపించుకుంటూ తీసుకొస్తున్న భర్తని చూడగానే మొహం మాడ్చుకుంది ప్రమీల. కనీసం పలకరించలేదు. ఆమెను చూడగానే గబగబా ఎదురెళ్ళి ‘‘ఆరోగ్యం ఎలా ఉంది?’’ అని  అడిగి తాను చెయ్యి పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది పార్వతమ్మ.వేడి వేడి కాఫీ కలిపి అల్లుడికిచ్చి ఆమె చేత మెల్లగా తాగించింది. కొంచెం స్థిమిత పడ్డాక ఏమైందని  అల్లుడిని అడిగింది.‘‘అమ్మకు గత కొంత కాలంగా గుండెల్లో నొప్పి వస్తోంది. మొన్న ఊళ్ళో హాస్పిటల్లో చూపెడితేసిటీకి వెళ్ళి వైద్యం చేయించుకోండి అని చెప్పారు. బంధువులు నాకు ఫోను చేసి చెబితే అమ్మను తీసుకొచ్చాను..’’ చెప్పాడు  ప్రసాదరావు.విసుక్కుంటూనే అందరికి వంట చేయడం మొదలుపెట్టింది ప్రమీల. ఆమర్నాడు తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించాడు ప్రసాదరావు. ‘‘వీలైనంత తొందర్లో బైపాస్‌ సర్జెరీ చేస్తే మంచిది’’ అని  డాక్టర్‌ చెప్పాడు.

 ‘‘ఎన్ని రోజుల్లో చేయించాలి?’’ అడిగాడు  ప్రసాదరావు.‘‘నాలుగైదు రోజుల్లో  చేయిస్తే మంచిది. కొన్ని మెడిసిన్స్‌ ఇస్తాం...ఏం ఫరవాలేదు ఈ లోపల మీరు డబ్బు రెడీ చేసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్‌.ఇంటికొచ్చిన ప్రసాదరావు తనకు కావలసిన డబ్బు డ్రా చేసుకొచ్చాడు.‘‘నేను ఆఫీసుకు సెలవు పెట్టాను. రేపో, ఎల్లుండో అమ్మకు ఆపరేషన్‌ జరగొచ్చు’’ అని భార్యకు అత్తగారికి చెప్పాడు.తలనొప్పిగా ఉండటంతో ప్రమీలని కాస్త కాఫీ చేసిమ్మన్నాడు..కళ్ళు మూసుకోని సోఫాలో కూర్చున్నాడు.ఇంతలో కెవ్వున కేక వినబడింది. అటు వంటింట్లోంచి ప్రమీల, ఇటు ప్రసాదరావు గాబరాగా పరుగెత్తుకెళ్ళారు.మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన పార్వతమ్మ బట్టలు తీసుకుని వస్తూ పై మెట్టు నుండీ జారి దొర్లుకుంటూ కింద పడి ఉంది. తలకు దెబ్బతగిలిందేమో విపరీతమైన రక్తస్రావం. నుదుటి మీదకి కారుతోంది. తల్లిని అలాంటి స్థితిలో చూసిన ప్రమీల భోరున ఏడ్చేస్తోంది. ప్రసాదరావు ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని హాల్లోకి తెచ్చి అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి కారిన రక్తాన్ని తుడిచి తలకు కట్టుకట్టాడు.

పార్వతమ్మ అపస్మారక స్థితిలోనే ఉంది. అంబులెన్స్‌ రాగానే హాస్పిటల్‌ కి తీసుకెళ్ళారు.డాక్టర్లు ఆమెను చూసి వెంటనే ఐసీయూలో జాయిన్‌ చేశారు. కాసేపటికి డాక్టర్‌ వచ్చి–‘‘తలకు బలమైన దెబ్బ తగిలింది. బ్రెయిన్లో బ్లడ్‌  క్లాటయ్యింది. వెంటనే ఆపరేషన్‌ చేయాలి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఛాన్సెస్‌ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ’’ అని చెప్పాడు. ప్రమీల బావురుమంది. అన్నయకు ఫోను చేయమంది. ప్రసాదరావు ఏ మాత్రం ఆలోచించకుండా  ‘‘ఓకే డాక్టర్‌ మీరు ఆపరేషన్‌ చేయండి. ఎంత డబ్బైనా పరవాలేదు..’’ అన్నాడు.ప్రసాదరావు డబ్బులు కట్టడంతో వెంటనే ఆపరేషన్‌ చేసి ‘‘నో ప్రాబ్లమ్‌. షి విల్‌ బి ఆల్‌ రైట్‌’’ అని చెప్పాడు డాక్టర్‌.తల్లికి గండం తప్పినందుకు సంతోషించిన ప్రమీలకి జ్ఞానోదయమైంది. తన తల్లి ప్రాణాప్రాయ స్థితిలో ఉంటే మానవత్వంతో డబ్బులన్నీ ఖర్చుచేసి ఆమె ప్రాణం నిలవాలని తపించాడు తన భర్త. తన తల్లికి ఆపరేషన్‌ కోసం పెట్టుకున్న డబ్బుని ఏ మాత్రం ముందూ వెనుకా ఆలోచించకుండా తన తల్లి ఆపరేషన్‌ కి ఇచ్చేశాడు.‘

‘నా భర్త దేవుడు. నేను మాత్రం అతని తల్లిని ఈసడించుకుంచు, ఆడిపోసుకుంటూ ఎంతో బాధ పెట్టాను. నా  ప్రవర్తనతో  ఆయన మనసెంత క్షోభించిందో’’ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ప్రమీల.కన్నీళ్ళతో తన పాదాలను పట్టుకుని క్షమించమని అడుగుతున్న ప్రమీలని రెండుచేతులతో లేవనెత్తి కళ్ళు తుడిచాడు ప్రసాదరావు. అత్తగారి ఆపరేషన్‌కై తన నగలమ్మి డబ్బు తెమ్మన్న భార్యని చూసి ఆశ్చర్యపోయాడు. తన తల్లితో పాటు అత్తగారిని కూడా కంటి రెప్పలా చూసుకుంటూ సేవలు చేసింది ప్రమీల. ‘‘మీ  మనసు నొప్పించినందుకు క్షమించండి’’ అని  అత్తగారి దగ్గర భోరుమని విలపించింది. ఇక అత్తగారు ఉళ్ళో ఉండవలసిన అవసరం లేదని తమ దగ్గరే ఉండమని వేడుకుంది. అత్తను కూడా అమ్మలా ప్రేమగా చూసుకుంటున్న ప్రమీలను చూసి మనసారా ఆనందించాడు ప్రసాదరావు.
 

మరిన్ని వార్తలు