అరే సీనుగా.. పెళ్లిబువ్వరా.!

28 Jul, 2019 08:20 IST|Sakshi

కొత్త కథలోళ్లు

పాతికేళ్ళ కితం...ఒంటిమీద ఓ జత, దండెం మీద ఓ జత, ట్రంకుపెట్టెలో మరో జత ఉన్న రోజులు.
ప్రకాశం జిల్లా అంటేనే నీరు నిప్పులు లేకుండా పేదరికంతో అలమటించే జిల్లాల్లో ఒకటి. జిల్లాలో యాడ కూడా నీటివసతి ఉన్న ప్రాంతాలు పెద్దగాలేవు. పచ్చదనమనేది యాడ కనపడేది కాదు.ఇక పసుపుగల్లు గురుంచి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాగా కరువు ప్రాంతం. ఊరు మొత్తం కూడా రెక్కడితేగాని డొక్కాడిని ఇదం.
ఊళ్ళో మునుసూబుగారి లాంటి కుటుంబాలు జనాలకి పని కల్పించడం కోసమే అన్నట్లుగా యవసాయం జేసేవి ఆరోజుల్లో.. ఆళ్ల పొలాల్లోకి పనులకు పోయి పదో పరికో తెచ్చుకుని కలోగంజో తాగే వొళ్ళు. ఓ కుటుంబం అనేంల్యా.. ఊళ్ళో ఉన్నోళ్లలో నూటికి తొంభై మంది ఆ బొటోళ్లే.

ఊళ్ళో జనాలందరూ కూడా సరైన కూడుకూర లేక సన్నగోలుగా ఉండేవోళ్లు. ఎవుడు ఒంటి మీద కూడా యాపగింజంత కొవ్వు ఉండేకాదు. ఇక మాబోటి పిలకాయలకైతే సరైన తిండితిని ఎన్నో దినాలు అయినట్టు ఉండేది. ఇంట్లో తినడానికి కనీసం పేలపిండి కూడా దొరికేది కాదు. ఎప్పుడు  జూడు అల్లా పచ్చడి మెతుకులు, మజ్జిక్కి బదులు పున్నీళ్ళు..రోజు ఇవే కూట్లోకి.. ఒక్కో రోజు గొంతు దిగేయ్యి కాదు. అలాంటి దుర్భర పరిస్తితిలు ఉండేవి..మా సెవలకి ఏదన్నా హాయిగా అనిపిచ్చె మాట ఏదన్నా ఉందంటే ‘ఊళ్ళో ఇయ్యాల ఎవురుదో పెళ్ళంటా’  అనే మాట.
కొత్తూరులో ఎవురో చింతమోళ్ళంట!
ఇందాక వచ్చి రేపు వాల్ల ఇంట్లో పెళ్ళంటా చెప్పి పోయారు అనేమాట మానాన్నకు మమ్మ చెప్తా ఉంటే ఇన్నా. అబ్బా! అది ఆనందం కాదు. కొత్తూరు అంటే మా ఊరే. కాకా పోతే అది మాఊళ్ళో ఇంకో భాగం. పెళ్లని తెలిసిన కాడనుండి రేపు తినబోయే కారప్పూసలు, లడ్డుముద్దలు గుర్తొచ్చి ఒకటే మాయన నోరురాత ఉండింది. ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా అని రెత్రంతా నిదరబడితే ఒట్టు దినెమ్మ బడవ.. నేనే కాదు మా తోటి పిలకాయల అందరికి అట్నే ఉండేది.

ఇప్పుడు అంటే పెళ్లిళ్లు బో క్లాస్గా చెత్తన్నారు గాని, అప్పట్లో పెళ్లి అంటే నైట్‌ రెండుకు మైకు పెట్టి ఘంటసాల పాడిన ‘హే కృష్ణా.. ముకుంద’ అనే పాటతో పాటు రకరకాల పాటలు మొదలుపెట్టేవాళ్లు.  మాకు ఆ పాటలు పొద్దులచ్చం ఇన్నా ఇసుగొచ్చేది కాదు.
ఆడాడనే తిరగతా ఆడుకుంటా ఉండేవాళ్ళం. పెళ్లికి బల్లలు కుర్సీలు కూడా ఏసేవోళ్లు కాదు. నేలమీదనే ఇస్తార బరిసి కూసోబెట్టేవొళ్ళు. అప్పట్లో ఉన్న కరువు దెబ్బకి  అందరికి బువ్వ పెట్టలేక పాపం ఊరందర్ని కూడా బువ్వకి పిలిచేది ల్యా.. ఏదో ఐనోళ్ళకి పోయినోళ్ళకి అన్నట్టు బాగా కాలసినోళ్ళకి మాత్రమే పిలుపులు బోయేయి. యట్టనో మమ్ముల్ని పిలిచారు లేకుంటే మా నాయన బోపట్టింపుగల్లా మనిషి పిలవనోటుకి అస్సలు బోనియ్యాడు. 
మొత్తానికి తెల్లారింది.
 పెళ్లింట్లో మైకు సెట్టు పాటలు సెవలకి ఇంపార ఇనబడతా ఉండాయి. నాకేమో మధ్యాహ్నం తినబోయే పెళ్లి బువ్వే ఒకటే మాయన గుర్తొస్తా ఉండాది. అప్పటికి అయినట్టుగా పోయినట్టుగా పొళ్లుతోమి మాయమ్మ బెట్టిన సద్ది బువ్వ తింటా ఈ పూటకి యట్టోగట్టా దీన్ని మింగితే మధ్యాహ్నం పెళ్లి బువ్వని అదర నూకొచ్చు అనుకున్న. అట్ట అనుకుంట గంజి కూడును కుక్క గతికినట్లు గతికి చెయ్యి కడిగా.... 
టైం పన్నెండు గావస్తా ఉంది.

నేను, మా సీనుగోడు, ఆచారి, యంకట్రామిరెడ్డి, మా సిన్నక్క అందరం చింతమొళ్ల ఇంటికి బొయాం. ఎల్లే పాటికి ఆడంత జనాలతో సందడిసందడిగా ఉంది. పిలకాయల సంగతి అయితే చెప్పనలవి గావడంలా. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అంటే అదే కాబోలు అట్టున్నరు పిల్లనాయాళ్ళు అందరూ.
సరే మొత్తానికి బంతిలో కుసునే దానికి మా వొంతు వచ్చింది. అందరం వరసగబోయి గోడమొత్తన జేరి ఇస్తర్లు కోసం ఎదురు సుస్తా ఉన్నాం. ఇంతలో మా సాకలి సుబ్బయ్య మామ ఇస్తారుకుల కట్టని నెత్తినబెట్టుకు వస్తా ఉండాడు. ఆ టయాన ఆయన్ని సుత్తంటే బ్రమ్మోచ్ఛవాలకి పట్టుబట్టలు తెస్తున్న ముఖ్యమంత్రిలా కనిపించాడు. వచ్చి రావడంతోనే అందరికి నేలమీద ఇస్తర్లు పరుసుకుంటా పోయాడు.  అప్పట్లో కనీసం కింద పేపరుకూడా ఉండేది కాదు. అట్టనే ఇస్తర్లు ఏసేవొళ్ళు. తరువాత ఒకడు స్టీలు గాసులు పెట్టుకుంటే పోయాడు ఇంకొకడు నీళ్లు పోసుకుంటా పోయాడు.

ఇస్తర తడపదాం అని గలాసు పట్టుకున్న.. అబ్బ అది జిడ్డు కాదురా నాయనా. దాన్ని కూటికి అలమటిస్తున్న కుక్కగాని నాకితే దానికి ఓ వారానికి సరిపడా కడుపునిండుద్ది . దానికన్నా మా ఇంట్లో దొడ్డికి బోయే ఇత్తడి చెంబె చాన శుద్ధంగా ఉండేట్లు ఉంది. దాన్ని మాయమ్మ బూడిదలో కొబ్బిరి పీసు ఏసీ లెస్స దోమెది. అంత అయ్యాక జుస్తే ఇత్తడి సెంబు అయినా బంగారు మాదిరి మెరస్తా ఉండేది. అరె దొడ్డికి పోయే సెంబె అంత శుద్ధంగా ఉంటే కూటికాడ బెట్టే గలాసు ఇంకెంత శుద్ధంగా ఉండాలా అనుకున్నా. పక్కనే ఈ గాసులు కడిగే తొట్టి కనిపిస్తానే ఉంది. ఎప్పుడు మార్శినారో నీళ్ళు, ఈ గాసులన్ని నూక్కపోయి అందులో నూకెది. అట్టట్టా జాడిచ్చేది మళ్ళీ అవే తీసుకొచ్చి ఇస్తర్లు ముందుబెట్టేది. ఇది వరస.

పాపం ఆళ్ళు మాత్రం ఏంజేస్తారు? గొంతు తడుపుకునేదానికే గుక్కెడు నీళ్లు లేక జనాలు జస్తా ఉంటే ఇంకా గాసుగాసుకి కొత్త నీళ్లు అంటే సాగర్ని ఎత్తక పోయి దర్శిలో కట్టాలా.  అప్పటికే జనాలు నీటి కరువు దెబ్బకి రోజు మార్చి రోజు నీళ్లు పోసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో గాసుకడిగే దానికన్నా గ్లాసులో నీళ్లు పొయ్యాడమే చాలా గొప్ప అనుకుని, ఇస్తార తడుపుకునే దానికి గాసు చేతికొలి తీసుకున్న. అది జిడ్డు దెబ్బకి సర్రన కిందకి జారింది.
 ఈసారి ఒడుపుగా పట్టుకుని రోన్ని నీళ్లు ఇస్తార మీద కొట్టి ఆకంతా తడిపి, ఇస్తట్లో మిగిలిన నీళ్ళని ఆకుకింద పోసి, గాసు మీద హైరర్సోడు వేసిన ఎర్రరంగు సుక్కని సూత్తా రాబోయే లడ్డు కారాసు కోసం ఆశగా చూస్తా ఉండా.
లడ్డు కారాసు బాధ్యత ఎప్పుడు కూడా ఇంటోడు తీసుకుంటాడు. బయటోడు అయితే వాడికి కావాల్సినోడికి ఎక్కువ ఏసుకుంటాడాని లేకుంటే జేబుల్లో ఏసుకుని ఇంటుకి జేరుస్తారని ఆళ్ల భయం. మొత్తానికి ఒకడు స్టీలు బొచ్చలో లడ్డులు ఎత్తుగా పేర్సుకుని దేవుడు మాదిరి వస్తా ఉండాడు. ఆడికి కిరీటం ఒక్కటే తక్కువ. మిగతాది అంత అచ్చుగుద్దినట్టు దేవుడు మాదిరి కనపడతా ఉండాడు. కాదు కాదు లడ్డులు వాడ్ని అట్ట కనిపిచ్చెలా చెత్తన్నాయ్‌. అవి చూడగానే మా పిలకాయలకి అది సంబరం కాదు.

ఇంతలో ఆడికన్న ఒకడు  ముందు దేవుడు కూడు డేగిసాలో తీసుకుని అందరి ఇస్తళ్ళలో తలో గెంటి ఏసుకుంటా పోయాడు. దాన్ని అలా ఉడుకుడుగ్గా కాళ్తుండగానే నోట్లో ఏసుకుంటే ఆకలి మీదున్న మాకు ఎట్టేట్టనో లోపలికి బోయింది. అబ్బ ఏమి రుసిరా నాయన అనుకుని ఆ లడ్డులు తెస్తున్న నీటకపు కొడుక్కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆడు మాత్రం రావడం లా. ఇంతలో ఇంకొకడు కారాసు తీసుకుని పావురాళ్లకి గింజలు జల్లినట్లు అందరికి తలానాలుగు గింజలు జల్లుకుంటా పోయాడు. ఆ నాకొడుకుని సుత్తే కడుపు మండిపోయింది.
 ‘నీయమ్మ మొగుడు సొమ్మేమన్న ఇస్తర్లో ఎస్తున్నావంటరా? ఇంకో నాలుగు గుప్పెళ్ళు కారాసు పోస్తే నీ ఆస్తులేమన్న కరగతాయ?’  మనసులో అనుకుని ఆడేసిన నాలుగు గింజలు గమ్మున నోట్లో ఏసుకుని గేదె నెమరు ఎస్తున్నట్లు నమల్తా ఉన్నాం.

ఇంతలో లడ్డుల నాకొడుకు మా బంతిలో చివర్న ఉన్నోడికి ఇస్తట్లో లడ్డేశాడు. అంతే మా పిలకాయలందర్లో యాడలేని సంతోసం తన్నకొచ్చింది. వాళ్ళందర్ని దాటుకుని మాకాడకి వచ్చేసరికి బొచ్చిలో లడ్డులు అయిపోయాయి. బొచ్చిలో లడ్డులు నింపుకునే దానికి ఆడు లోనికి బొచ్చెత్తుకుని పోయాడు. మాకు కడుపు సలసల కాగిపోయింది.
ఆ పెత్తరి నాకొడుకు బొచ్చబట్టుకుని లోనికిపోయి ఎంతకీ రావడంలా. ఇస్తరలో ఏసిన నాలుగు కారాసు గింజలు ఎప్పుడో అయిపోయి. పక్కనే ఉన్న సీనుగాడి ఇస్తర్లో ఉన్న శివరి ఎరుశనగా గింజను కూడా ఆడికి తెలియకుండా నోట్లో వేసుకుని మింగితే యాడ ఐపోద్దో అని అట్టనే నమళ్తా కుసున్నా.
ఇంతలో కూరలు ఏసేవాళ్ళు ఉరుకులు పరుగులమీద వస్తా ఉండారు. మొదటగా పప్పేశారు. పడిపడగానే చూపుడు వేలును బజ్జి వెయ్యడానికి మిరగాయను పిండిలో ముంచినట్లు పప్పులో ముంచి అట్టా ఆ వేలుని నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉందో. యనకాల బంగాళదుంప కూరేసుకుని ఇంకొకడు సరసరా వస్తా ఉండాడు. అదంటే నాకు సచ్చేఅంత ఇష్టం. వాడొచ్చే లోపు పప్పుని నాకల్సిన కాడికి నాకి ఇస్తర్ని ఖాళీగా పెట్టా.

ఇంతలో బంగాళా దుంప కూరోడు నేను ఇంత ఆశగా ఎదురు చూస్తుంటే దాన్నేమ్‌ పట్టించుకోకుండా రెండంటే రెండు ముక్కలు ఏసి ముందుకు పోయాడు. ఇస్తరులో పడ్డ కూరజూసి బోబాదేసి ముదనష్టపు నాకొడక ఇంక రోన్ని ముక్కలు ఎస్తే నీ రవ్వల నక్కిలీసు ఏమన్నా తాకట్టుకు పొద్దంట్రా? పంది నాయల... అని మనసులో అనుకుని అన్నొ ఇంక రొంత కూరేసి పొన్నా అన్నా. ఆమాట కనీసం ఆడి సెవికి ఎక్కల. సరే పడ్డ రెండు ముక్కల్లో ఓ ముక్కని ఆత్రంగా నోట్లో పెట్టుకుంటే..దానెమ్మ రుసి ఏమి రుసిరా నాయన అనుకుంటా రెండు మోకాళ్లు పైకిలేపి రెండు చేతుల్ని మోకాళ్ళు చుట్టూ ఏసుకుని నడుమూపుకుంటా రాబోయే లడ్డుముద్ద కోసం కాసుకుని కుసున్నాం..ఇంతలో మా దేవుడు మళ్ళీ లడ్డులు నిండిన బొచ్చెతో వడివడిగా వస్తా ఉండాడు. 
లెక్క ప్రకారం మా సీనుగాడి నుండి రావాలా ఆడి తరువాత నేనే. వాడు మా బంతిని వదిలి ఎదురు బంతిలో వంగాడు.

ఇందుకు కందంట్రా పందినాకొడక నిన్ను తిట్టేది? లడ్డు ఎయ్యాల్సిన బంతిని వదిలేసి ఎదురు బంతిలో వంగాతా పొయ్యి? ఒంగినోడ్ని అట్టనే ఎగిసి ఒక్క తన్నుతన్నాలి అనిపించి పిల్లనాయళ్ళాం అనుకోవడం తప్ప ఏం చేయలేంలే అనుకుని మిగతా జనాలని లెక్కేసుకుంటా కుసున్నా. ఇంకా మొత్తం పదిహేను మంది ఉన్నారు. బొచ్చిలో ఇంకా దండిగా లడ్డులు ఉన్నాయ్‌ కాబట్టి ఈసారి తప్పకుండా మాక్కూడా వేస్తాడనే గట్టి నమ్మకంతో గుటకలు మింగతా ఎదురుగా తింటున్నవాళ్ళని అసూయతో తిట్టుకుంటా ‘నాకొడకల్లారా ముందు మాకు బడాల్సిన లడ్డుల్ని మీరు మెక్కతా ఉండారు గదరా సోంబేరి నా కొడకల్లారా. అయినా  పిల్ల నాకొడుకుల్ని మాకు ముందు బెట్టకుండ మీరు మెయ్యడం ఏందిరా’ అనుకుని పైకి నవ్వుకుంటా సుత్తా ఉన్న.

ఇంతలో లడ్డులు రానే వచ్చాయి. బొచ్చిలోనుండి ఓ లడ్డుని తీసుకుని సుతారంగా విస్తట్లోకి జారవిడిచాడు. అబ్బ ఏమి అందంరా లడ్డుది. ఎంత ముద్దుగా ఉందిరా నాయన.. ఏమి సోకురా బాబా దీనిది..అనుకుని దాన్ని అలివిగాని ప్రేమతో చేతిలోకి తీసుకుని రవ్వంత కొరికితిని గదా....అబ్బాబ్బా అది రుసిగాదు. ఉదయం నుండి ఎదురుచూసిన ఎదురుసూపులకి న్యాయం జరిగింది.
ఒక్కరవ్వంటే ఒక్కర్వ కోరుక్కుని మిగతాది భద్రంగా జేబులో పెట్టుకున్న. అమ్మో అప్పుడే అయిపోతే యట్టా?
ఇంతలో పక్కనే ఉన్న సీనుగొడు కొద్దిగా లడ్డు కొరికి పైకి సుత్తా తింటా ఉండాడు.  నాయలు నోట్లోకి తిండిబోతే యంటనే ఆడి సూపు పైకి పోద్ది, కింద ఏం జరుగుతున్న వాడికి తెలియదు. మెల్లిగా చెయ్యి ఆడు ఇస్తర్లోకి పెట్టి ఆడి లడ్డుని రొంత తుంచి నోట్లో వేసుకున్న నాదనికన్న ఆడిది ఇంకా బెమ్మణడంగా ఉంది. మళ్ళీ పెట్టబోయేసరికి తలకాయ కిందకి దించాడు. 
ఆరిడెమ్మ పట్టేసాడ్రా అనుకుని ఏమి యరగనోడి మాదిరి మొఖం బెట్టా. పాపం పిచ్చి నాయలు ముక్క నూకిన సంగతి పట్టించుకోలా.

మాఊళ్ళో అందరికి ఇష్టమైన దోసకాయ పచ్చడి వేసుకుంటూ ఒకడు పోయాడు. అంత పచ్చడికూడా ఆడంగులు అందరూ కలిసి రోట్లో వేసి చేస్తారనుకుంటా! ఆ రుచి దెబ్బకి ముక్కు సీత్తా కూడా మూడు మానికలు కుడు తినొచ్చు. అంత ఇదిగా ఉండిద్ధి ఆ పచ్చడి..ఇంకొకడు వంకాయ కూర వేసుకుంటా బోయాడు. 
ఇలాంటి కూరలు అన్ని మన ఇంట్లో చేయించుకోవాలి అంటే ఎప్పటికో గాని అవదు ఏమైనా పెతి కూరను కుతితీరా తినాలి అనుకుని ఏడి బువ్వకోసం ఎదురు జుస్తా ఉండామ్‌.
ఈ నాకొడుకులు బువ్వేసేసరికి ఏసిన కూరలన్ని నాకినాకి అవనూకేలా ఉన్నాం అందరం. ఇంతలో జేబులో ఉన్న లడ్డు ముద్దను ఇంకో ముక్క తీసుకుని నోట్లో ఏసుకున్న అబ్బా... మల్లి ఏమి రుసిరా నాయన..అది నోట్లో వేసుకున్న ప్రతి సారు నాలుక రంకెలు యాస్తుంది, ఇంకా రొంత నోట్లో వెయ్యొచ్చు కదా అని.
మజ్జానం పెళ్లిబువ్వ తినాలి అనే ఆత్రంతో పొద్దున అమ్మ బెట్టిన గంజిబువ్వ సరిగా గతకల. ఇస్తర్లో బువ్వ చూసాక నోట్లో సొంగ పంటకాల్వలో నీళ్లు పరిగెత్తుతున్నట్లు పరిగెత్తతా ఉంది. పక్కన ఉన్న దోసకాయ పచ్చడిని బువ్వలో ఏసుకుని ఏడి బువ్వను నోటితో ఊపుకుంటా గబగబా కలిపి చేతిలో పెద్దపెద్ద ముద్దల్ని చేసుకుని రెండు గవదల్లో కుక్కి నింపాదిగా నమలతా ఉంటే నాకు  మా ఇంటి చింత చెట్టుమీద ఉండే కోతే గుర్తుకు వచ్చింది. 

అదికూడా ఇంతే యాడన్న తిండి దొరికినప్పుడు యనకాముందు సుడకుండా గబగబా బొక్కి తరువాత నింపాదిగా తింటా కుసునిద్ది.. అట్టా ఉంది నా పరిస్థితి.
ఉడుకుమడుకు మీద గబగబా నాలుగు ముద్దలు తిని, ఎదురుగా ఉన్న గాసులో నీళ్లు గొంతులో పోసుకుంటే పూర్వం దేవతలు రాచ్చసులు సముద్రంలో సిలికి తీసిన అమురుతం ఇదేనేమో అనిపిచ్చె అంత రుచిగా తగిలాయి ఆ నీళ్లు. గాసుని పక్కన బెట్టి నాకంగా మిగిలిన పప్పుని ఏళ్ళతో జమిరితే ఒక్క ముద్దకి వచ్చింది. ఆ ముద్దను నోట్లో పెట్టుకుని మిగిలిన బంగాళదుంప కూరతో ఇంకో ముద్ద కలువుకుని తినేలేకి ఇస్తట్లో బువ్వయిపోయింది. కడుపునిండా తిందాం అనుకున్న కూరలు నాకుడుకే సరిపోలేదు ఇదేం బువ్వబట్టడం రా నా బట్ట? మిరుబెట్టే బెట్టుడుకి పిలకాయల కడుపుకుడా సదరంగా నింపకపోయే కదరా అని మనసులో తిట్టుకుని వడ్డించే వాళ్ళ వైపు సుత్తా ఉన్నాం.
మళ్ళీ బువ్వకోసం ఎదురు చూపులు. ఈసారి యంటనే లేటు లేకుండా బువ్వ బొచ్చితో గౌళ్ల సుబ్బులు వచ్చి బుడ్డోడ్ని అని గాకుండా రొంత ఎక్కువే పెట్టిపోయాడు ఏమైనా బో మంచోడు మా సుబ్బులు.
ఈసారి సాంబారు పొగలు కక్కతా వస్తాఉంది. అసలు అన్నిటికన్నా అదంటేనే నాకు శాన ఇష్టం. 
 బువ్వతో ఇస్తట్లోనే చుట్టూ కోటకట్టి  కోటనిండా పోయించుకున్న.

నా అదృష్టం కొద్దీ దండిగా మునక్కాయలు కూడా పడ్డాయ్‌. ఆటిని సప్పరించి, సీకి,నమిలి ఆటి దుంపదేంచి పక్కనబెట్టి, సాంబారు కూడుని కడుపులో ఏసుకోవడం మొదలు బెట్టా. ఏమైనా పెళ్లి బువ్వ పెళ్లి బువ్వేరా అనుకుని.. ఏళ్ళు సిక్కుంటున్న టైమ్లో ‘మజ్జిగ’  అని అరుసుకుంటా ఒక్కడొచ్చాడు.. ఒసేబో..  పోసినవ్‌ లేరబ్బా మజ్జిగా...రోజు ఆటితో తిని సావలేకుండా ఉన్న.. ఆటిని అటు నూక్క పోరా నాయన అన్నట్లు ఆడేంక చూశా.. ఆడు నాసూపు లెక్క చేయకుండా యార ఒద్దా? అన్నాడు.
 నేను యాడలేని ఇనయంతో ఒద్దన్న అన్న. మిగతా అన్నాన్ని మళ్ళీ కోటకట్టా. ఇప్పుడు అసలు మూకుర్తామ్‌.. మా పిలకాయలందరికి ప్రాణం అయిన జొరన్నం(పరమాన్నం, పాయసం)వస్తా ఉంది. మా సీనుగొడు నేను  కట్టిన కోటలు జొరన్నం పొసే నాయలు, జూసి కిసక్కన నవ్వి, మీరు పూర్వం రాజులై పుట్టుంటార్ర? లేకుంటే ఈ మాదిరి కోటలు ఇస్తట్లో కట్టడం కష్టం అని మాతో శాల్తీ పడి, ఒక్కొక్కడకి రెండు జగ్గులు పోసి పోయాడు. 
ఇంతలో మా సీనుగాడి అన్నంకోట తెగి జొరన్నం బాగా జోరుగా నా ఇస్తటి కిందకి వస్తా ఉంది. చెయ్యి అడ్డం పెడితే తోలు ఊడొచ్చేలా ఉంది వేడి. ఎట్టనో మళ్ళీ రొంత బువ్వ అడ్డం నూకి ప్రవాహాన్ని ఆపాడు. పొగలు కక్కతున్న జొరన్నాన్ని నోటితో ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుకుంటా రొంత అన్నాన్ని రొంత జొరన్నాన్ని కలిపి తాగతా ఉంటే ఏమని చెప్పమంటావు ఆ ఆనందాన్ని!  
ఇంతలో మా సీనుగొడు ఇస్తరికి సిల్లుబడి, కింద ఉన్న మట్టి ఆ బొక్కలో నుండి పైకొచ్చి, అన్నంలో కలిసి పోయి నల్లంగా ఐపోయింది. పాపం ఆడేంక చూసి జాలేసి.. రేయ్‌ సీనుగా రా నాదాన్లో తిందువు గాని..అని చెప్పి ఇద్దరం కలిసి ఒకే ఇస్తట్లో కడుపారా తిని ఇస్తరను మడిచి శుద్ధంగా సెయ్యి కడుక్కుని బయటకి వచ్చామ్‌.
జేబులో ఉన్న లడ్డుముద్దని బయటకి తీసి రేయ్‌ సీనుగా సెయ్యిబట్టరా అని ఆడిచేతిలో ఓ ముక్క బెట్టి నా చేతిని ఆడి భుజం మీద వేసి నింపాదిగా ఇంటిబాట పట్టాం.
- సవీంద్రరెడ్డి కుంచల

మరిన్ని వార్తలు