సర్జరీ చేస్తే... బరువు పెరుగుతారా?

8 May, 2016 19:40 IST|Sakshi
సర్జరీ చేస్తే... బరువు పెరుగుతారా?

నా వయసు 37. పెళ్లయ్యింది. ఓ పాప కూడా ఉంది. రెండేళ్ల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. పీరియడ్స్ సమస్యలు కూడా తలెత్తడంతో డాక్టర్‌ను సంప్రదించాను. గర్భసంచిలో పెద్ద కణితి ఉందని అన్నారు. ప్రమాదకర పరిస్థితి అని చెప్పి గర్భసంచిని తొలగించారు. ఆ తర్వాత నాకు ఆరోగ్య సమస్యలైతే పెద్దగా ఏమీ లేవు. కానీ బాగా లావైపోతున్నాను. 67 కిలోలు ఉండేదాన్ని, ఇప్పుడు 79 కిలోలకు చేరుకున్నాను. డైట్ కంట్రోల్ చేసినా పెద్దగా తగ్గడం లేదు. ఆపరేషన్ చేస్తే అలాగే లావవుతారు అంటున్నారు మావాళ్లు. నిజమేనా? ఇలా బరువు పెరగడం ప్రమాదకరం కాదా? ఇప్పుడు నేనేం చేయాలి?
 - వి.పూర్ణిమ, కరీంనగర్
 
 గర్భాశయం తొలగించడం వల్లనే బరువు పెరగడం ఉండదు. పెద్ద ఆపరేషన్ అయ్యిందని చాలామంది చాన్నాళ్లపాటు పని చెయ్యకుండా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, బలహీనపడకుండా ఉండాలని ఆహారం ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయడం వల్ల లావు పెరగ వచ్చు. లేదా మీ విషయంలో థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నాయేమో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి మందులు వాడి చూడొచ్చు. కేవలం డైటింగ్ చేయడం వల్ల లావు తగ్గరు. మూడు పూటలా పరిమితమైన ఆహారం... అంటే ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ, అన్నం, చపాతీలు తక్కువగా తీసుకోవడం, నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం అన్నమాట. మొత్తంగా తిండి బాగా తగ్గించేసి కూర్చుంటే నీరసం తప్పితే, లావు తగ్గడం కష్టం. ఎక్కువగా నడక, యోగా, వ్యాయామాలు చెయ్యడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గుతారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, బీపీ, షుగర్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు.
 
నా వయసు 23. పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టిన తర్వాత కాపర్-టి వేయించుకున్నాను. మొదట బానేవుంది. కానీ తర్వాత ఏదో అసౌకర్యంగా అనిపించసాగింది. ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటోంది. డాక్టర్‌కు చూపిస్తే చెకప్ చేసి అంతా బాగానే ఉందన్నారు. కానీ ఇప్పటికీ అదే ఇబ్బంది. ఎప్పుడూ అలా ఉండటం లేదు కానీ ఒక్కోసారి ఉన్నట్టుండి అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి? ఇది తీయించేసుకుంటే కుటుంబ నియంత్రణకు మరో మంచి మార్గమేదైనా ఉందా?
 - సావిత్రి, యానాం
 
 కాపర్-టి లేదా లూప్... టీ ఆకారంలో ఉండే సన్నని ప్లాస్టిక్ ముక్క మీద కాపర్ తీగలు చుట్టబడి ఉండే ఒక కుటుంబ నియంత్రణ సాధనం. దానికి చివర్లో తోకలాగా సన్నటి వెంట్రుక పోగు వంటి దారాలు వేళాడుతుంటాయి. దీన్ని గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. దానికి వేళాడే సన్నటి దారాలను కొద్దిగా ఉంచి కత్తిరించడం జరుగుతుంది. ఆ దారాలు గర్భాశయ ముఖద్వారం నుంచి యోని లోపల భాగంలోకి వేళాడుతుంటాయి. వీటి ద్వారా కాపర్-టి వేసిన తర్వాత, చెకప్‌లతో కాపర్-టి గర్భాశయంలో ఉందా లేదా అనేది పరీక్షించి నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు... లోపల ఏదో ఉందనే భావన లేదా గుచ్చుకోవడం ఉండదు. బాగా లోపలికి వేళ్లు పెడితే, ఆ దారాలు కొద్దిగా చేతికి తగులుతాయి తప్ప, ఇంక వేరే ఫీలింగ్ ఏమీ ఉండదు. అలా నెలకొకసారి సొంతంగా చూసుకోవడం వల్ల కూడా కాపర్-టి లోపల ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

కలయికలో కూడా  గుచ్చుకోవడం వంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కొన్నిసార్లు కాపర్-టి కిందికి జరిగినప్పుడు ఆ దారాలు కూడా జారి కలయిక సమయంలో యోని లోపల గుచ్చుకున్నట్లు అనిపించవచ్చు. మీకు చెకప్‌లో అంతా సరిగానే ఉందని చెప్పారు కాబట్టి, ఇబ్బంది కూడా ఎప్పుడో ఒకసారి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కాపర్-టి కాకుండా తాత్కాలికంగా పిల్లలు పుట్టకుండా ఉండటం కోసం, నెలనెలా కుటుంబ నియంత్రణ మాత్రలు (oral contraceptive pills) ఉంటాయి. పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల పాటు రోజుకొకటి చొప్పున, మర్చిపోకుండా రాత్రిపూట... అదే సమయంలో వేసుకోవాలి.

లేదా మీవారు కండోమ్స్ వాడొచ్చు. ఇవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. లేదా మూడు నెలలకోసారి మెడ్రాక్సి ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్ (medroxyprogesterone injection) తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ డోసులు తీసుకుంటే, చాలామందిలో బ్లీడింగ్ క్రమం తప్పడం, మధ్యమధ్యలో స్పాటింగ్ కనిపించడం, తర్వాత కాలంలో పీరియడ్స్ చాలాకాలం రాకుండా ఆగిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఏ పద్ధతి అయినా... వారి వారి శరీరతత్వాన్ని బట్టి వాటి పనితీరు ఉంటుంది.
 

మరిన్ని వార్తలు