ఆరోగ్యం కోసం ప్లానింగ్ తప్పదు మరి!

31 May, 2014 23:43 IST|Sakshi
ఆరోగ్యం కోసం ప్లానింగ్ తప్పదు మరి!

ఉద్యోగం పురుష లక్షణం అన్న మాటను ఎప్పుడో చెరిపేశారు మహిళలు. ప్రతి రంగంలోనూ పురుషులతో పోటీపడి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎంత సమర్థంగా పనిచేసినా మహిళలకు ప్రకృతి పరంగా ఏర్పడిన శారీరక బలహీనతలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమయానుకూలంగా పని చేయక తప్పదు.
 
 టార్గెట్లు అందుకోకా తప్పదు. అలాగని ఈ టెన్షన్లో పడి టైముకు తినకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం తగదు. చాలామంది అంటుంటారు... ఇంత టెన్షన్లో తిండి గురించి ఎక్కడ ఆలోచిస్తాం అని. అది నిజం కావచ్చేమో కానీ సరి మాత్రం కాదు. పనులు ఎన్ని ఉన్నా, అందుకు తగ్గట్టుగానే భోజన వేళలను అడ్జస్ట్ చేసుకోవాలి. రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
      
 మరునాడు ఏయే పనులున్నాయో ఈ రోజు రాత్రి డైరీలో రాసుకోండి. దాన్ని బట్టి తినడానికి ఎప్పుడు టైమ్ దొరుకుతుందో అర్థమవుతుంది. బయట ఏదో ఒకటి తినేద్దాంలే అన్న నిర్లక్ష్యం వద్దు. ఆ అలవాటు ఆరోగ్యాన్ని ఎంత దెబ్బ తీస్తుందో తెలియంది కాదు. అందుకే ఇంట్లో వండి తీసుకెళ్లడమే మంచిది. కాకపోతే మీ సమయాన్ని బట్టి తేలికగా తయారయ్యే వంటకాలను ప్లాన్ చేసుకోండి.
      
 తినడానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారా? అయితే ఓ పని చేయవచ్చు. తేలికగా తినేయగల, ఇంకా చెప్పాలంటే పని చేసుకుంటూనే ఆరగించగల ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. బిస్కట్లు, పండ్లముక్కలు, బ్రెడ్, ఉడికించిన/మొలకెత్తిన గింజలు లాంటివి. వీటిని చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసుకుని తీసుకుపోండి. అప్పుడప్పుడూ కాస్త కాస్త తింటూ ఉంటే సరిపోతుంది.
     
 తినడం అసాధ్యం అనుకున్నప్పుడు తాగడానికి ప్రాధాన్యతనివ్వండి. జ్యూసులు, రాగి/జొన్న/చోడి/సగ్గు జావల్లాంటివి చేసుకుని మూత ఉండే చిన్న చిన్న గ్లాసుల్లో వేసు కుని తీసుకెళ్లండి. ఎంత పనిలో ఉన్నా, ఎంతమంది మధ్య ఉన్నా వాటిని సేవించడం చాలా తేలిక. కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ కూడా తీసుకెళ్లవచ్చు.బిజీగా ఉన్నప్పుడు తినడానికి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా, ఎక్కువ శక్తినిస్తాయి.
 
 నిజానికి ఇవన్నీ ఆప్షన్స్ మాత్రమే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... ఏది ఎప్పుడు చేయాలో అప్పడు చేసి తీరాలి. లేదంటే గ్యాస్ట్రిక్, పేగు సంబంధిత సమస్యలు, ఊబకాయం వంటికి వెతుక్కుంటూ వస్తాయి. కష్టపడి పని చేసేది, సంపాదించేది ఆనందంగా జీవించడానికే కదా! ఆరోగ్యం లేనప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది! అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆహారాన్నీ నిర్లక్ష్యం చేయకండి!

మరిన్ని వార్తలు