ప్లాట్ నం.201

19 Jul, 2015 01:01 IST|Sakshi
ప్లాట్ నం.201

నిజాలు దేవుడికెరుక
ప్రతి మనిషీ తన ఇంటిని స్వర్గంలా అనుకుంటాడు.
కానీ ఆ ఇల్లు నరకంలా మారితే?
నిలువునా వణికిస్తే? ఏం చేయాలి?
ఎలా భరించాలి?
ఎలా బటయపడాలి?
అది తెలియకే అల్లాడారు వాళ్లు. ఆదుకునే హస్తం కోసం ఆశగా చూశారు.
ఇంతకీ ఎవరు వాళ్లు? వాళ్ల పట్ల ఏం జరిగింది?


అక్టోబర్, 2009... ముంబై.
ఓ ప్రైవేటు ఆస్పత్రి జనంతో కిటకిటలాడుతోంది. డాక్టర్ల పిలుపుకోసం ఎదురు చూస్తోన్న రోగులు, రోగులకు సేవలు అందించేందుకు చకచకా తిరుగుతోన్న సిబ్బందితో అంతా హడావుడిగా ఉంది. వాళ్లందరినీ దాటుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ, బిత్తర చూపులు చూస్తూ నడుస్తున్నాడో వ్యక్తి.
 
అతని వయసు అరవై వరకూ ఉంటుంది. చెదిరిన పల్చని జుత్తు, అంతగా ఖరీదు చేయని బట్టలు, ఎవరికీ అర్థం కాని హావభావాలు... కాస్త విచిత్రంగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్న క్యారీ బాగుల్లో యాపిల్స్, బిస్కట్స్, కేక్స్ కనిపిస్తున్నాయి. వాటిని బట్టి ఆస్పత్రిలో ఉన్న తమ వారినెవరినో చూడటానికి వచ్చాడని అర్థమవుతోంది.
 
‘బి’ వార్డులో ఉన్న ఓ గది దగ్గరకు వెళ్లి ఆగాడా వ్యక్తి. లోపలకు వెళ్లాలను కున్నాడు కానీ, గుమ్మం దగ్గర ఉన్న వార్డ్‌బాయ్ అడ్డుకున్నాడు. ‘‘ఎక్కడికి సొంత ఇంట్లోకి వెళ్లినట్టు వెళ్లిపోతున్నావ్? నడు బయటికి’’ అన్నాడు కళ్లెర్రజేసి.
 
ఆ వ్యక్తి కంగారు పడలేదు. ‘‘నా భార్యని, పిల్లల్ని చూడాలి’’ అన్నాడు ఎంతో సౌమ్యంగా. కానీ వార్డ్‌బాయ్ కనికరించలేదు. ‘‘అవన్నీ కుదరవ్. మాట్లాడకుండా దయచెయ్’’ అంటూ చెయ్యి పట్టుకుని బలంగా బయటకు లాక్కొచ్చాడు. మెయిన్ డోరు దగ్గర వదిలిపెట్టి ఇక వెళ్లు అన్నట్టు సైగ చేశాడు. విధి లేక వెనుదిరిగాడా వ్యక్తి.
 
‘‘ఎంత అన్యాయం? నా భార్యని, పిల్లల్ని నేను చూడకూడదా? ఎందుకని? నేనేం చేశానని?’’... తనలో తనే గొణుక్కుంటున్నాడు. ఆస్పత్రి సిబ్బందిని తిట్టుకుంటున్నాడు. తడబడుతోన్న అడుగులతో సాగిపోతున్నాడు.
 ఇంతకీ ఎవరా వ్యక్తి? కుటుంబాన్ని కలిసే అవకాశం కూడా అతడికి ఎందుకు దొరకడం లేదు? అతడు నిజంగానే ఏదైనా చేశాడా? లేక అతడికే ఏదైనా అన్యాయం జరుగుతోందా?
   
సెప్టెంబర్, 2009... ముంబై నీలాంబ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్.ఎస్సై ముఖం సీరియస్‌గా ఉంది. తనకి ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తోన్న విషయాలు శ్రద్ధగా వింటున్నాడు.
 ‘‘ఇప్పుడు అర్థమైంది కద సర్ విషయం. ఎలాగైనా మీరే ఈ విషయంలో సాయం చేయాలి. మనం త్వరపడకుంటే చాలా దారుణం జరిగిపోతుంది.’’
 
సరే అన్నట్టు తల పంకించాడు ఎస్సై. ‘‘పదండి వెళ్దాం’’ అంటూ సీట్లోంచి లేచాడు. కానిస్టేబుల్స్‌ని, ఆ వ్యక్తిని తీసుకుని నీలాంబ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి బయలుదేరాడు.
 పది నిమిషాల్లో వాళ్ల జీపు ఓ మూడంతస్తుల బిల్డింగ్ దగ్గర ఆగింది. అది ఓ మామూలు బిల్డింగ్. చూడ్డానికి రిచ్‌గానూ లేదు. అలా అని మరీ పాతగానూ లేదు. ‘‘ఇదే కదా?’’ అన్నాడు ఎస్సై దాన్ని చూస్తూనే.
 
‘‘అవును సర్’’ అన్నాడా వ్యక్తి. అందరూ కలిసి ముందుకు కదిలారు. ఫ్లాట్ నంబర్ 201కి చేరుకున్నారు.
 ‘‘తాళం వేసి ఉంది కద సర్’’ అన్నాడు కానిస్టేబుల్, తలుపునకు వేళ్లాడుతోన్న తాళం కప్పని చూసి. ‘‘పగలగొట్టండి’’ అన్నాడు ఎస్సై. క్షణాల్లో తాళం బద్దలయ్యింది. తలుపులు తెరుచుకున్నాయి.
 లోపల అడుగు పెడుతూనే అందరూ తుళ్లిపడ్డారు. అది ఇల్లులా లేదు. గోడౌన్‌లా ఉంది. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ లేదు. అన్నీ చిందర వందరగా పడివున్నాయి.

గోడల నిండా బూజులు. ఎక్కడ చూసినా దట్టంగా పేరుకున్న దుమ్ము. దానికి తోడు ముక్కు పుటాలను అదరగొట్టే దుర్వాసన.  ‘‘ముంబైలాంటి మహా నగరంలో... ఓ మంచి హౌసింగ్ సొసైటీ మధ్యలో... ఇంత పెద్ద అపార్ట్‌మెంట్లో... ఇలాంటి ఫ్లాటా? అసలేం జరుగుతోందిక్కడ?’’... విస్తుపోతూ అన్నాడు ఎస్సై. గబగబా అందరూ ఇల్లంతా తిరిగారు. ఏ గదిలోనూ ఏమీ లేదు. కానీ ఒక గదికి మాత్రం తాళం పెట్టి ఉంది. ఆ గదిలోంచి భయంకరమైన వాసన వస్తోంది. దాన్ని తెరవమని సైగ చేశాడు ఎస్సై. కానిస్టేబుల్స్ తాళం పగులగొట్టి తలుపు తెరిచారు. అంతే... లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయారంతా.
 
అది గదిలా లేదు... చెత్తకుప్పలా ఉంది. మలమూత్రాలు కలిసిన వాసన పేగుల్ని మెలిపెడుతోంది. కిటికీలన్నీ మూసివున్నాయి. తెరవడానికి వీల్లేకుండా చెక్కలు అడ్డుగా పెట్టి, మేకులు కొట్టేసి ఉన్నాయి. ఒక్క లైటు కూడా లేక చీకటి గుహలా ఉంది. ఆ చీకట్లోంచి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయి. బాధగా... ఆర్తిగా... ఆవేదనగా...
 
‘‘కానిస్టేబుల్... టార్చ్ తీసుకురా. క్విక్’’... అరిచినట్టే అన్నాడు ఎస్సై. కానిస్టేబుల్ పరుగెత్తుకెళ్లి టార్చ్ తెచ్చాడు. దాని వెలుగులో కనిపించిన రూపాలు బహుశా ఆ పోలీసులు ఎప్పటికీ మర్చిపోలేరేమో.
 ఒక తల్లి... ఇద్దరు కూతుళ్లు. ప్రాణాలతో ఉన్నారు అంతే. ఒంట్లో గుప్పెడు మాంసమైనా లేదు. చర్మం ఎముకలకు అతుక్కుపోయింది. కళ్లు పీక్కుపోయాయి. ఒకే భంగిమలో ఎక్కువ కాలం ఉండిపోవడంతో శరీరాలు వంగిపోయాయి. ఊపిరి సైతం కష్టంగా తీసుకుంటున్నారు. మృత్యువు వస్తే కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
 
వాళ్ల స్థితి చూసి ఖాకీల హృదయాలు సైతం కదిలిపోయాయి. వెంటనే అంబులెన్సును పిలిచారు. అందులోకి ఎక్కిస్తుంటే ఒక అమ్మాయి అతి కష్టమ్మీద గొంతు పెగల్చుకుని అంది... ‘‘మమ్మల్ని దూరంగా తీసుకెళ్లిపోండి సర్. మమ్మల్ని కాపాడండి సర్. లేదంటే మా నాన్న మమ్మల్ని చంపేస్తాడు.’’
 విషయం అర్థమైంది ఎస్సైకి. వాళ్లని ఆస్పత్రికి పంపించి, తర్వాత చేయాల్సిన పనిలో మునిగిపోయాడు.
   
‘‘మీరు నన్ను అపార్థం చేసుకుంటు న్నారు సర్. నేను సైకోని కాదు. వాళ్ల తండ్రిని. వాళ్లు నా సొంత పిల్లలు. వాళ్లంటే నాకు ప్రాణం. వాళ్లని నేనెందుకు చంపుతాను?’’... అమాయకంగా ముఖం పెట్టి చెబుతోన్న ఫ్రాన్సిస్ గోమెజ్ చెంప ఛెళ్లుమనిపించాడు ఎస్సై.
 ‘‘నువ్వు తండ్రివా? తిండి కూడా పెట్టకుండా వాళ్లని చీకటి గదిలో బంధించావ్. చిత్రహింసలకు గురి చేశావ్. ఇంతకంటే చావే నయం అనుకునే స్థితికి తెచ్చావ్. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా?’’ అరిచాడు.
 
‘‘అలా అంటారేంటి సర్? నా పిల్లలను నేను కాపాడుకోవాలనుకోవడం తప్పా? రోజులు బాలేదు కద సర్. బయటికెళ్లినప్పుడు వాళ్లనెవరైనా రేప్ చేస్తే? అందుకే జాగ్రత్తగా దాచిపెట్టాను.’’
 ఎస్సైకి బుర్ర గిర్రున తిరిగింది. అతగాడి ఆలోచనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అతడికే కాదు, ఫ్రాన్సిస్ మాటలు వింటే ఎవరికైనా అలానే అని పిస్తుంది. నిజానికి ఒకప్పుడు అతడు అలా మాట్లాడేవాడు కాదు. ఎంతో హుందాగా ఉండేవాడు.

అందంగా మాట్లాడేవాడు. తన భార్య థెరెసా... కూతుళ్లు జెనెవీవ్, ఎలిజబెత్, బార్బరాల కోసం ప్రాణమివ్వడానికైనా సిద్ధంగా ఉండేవాడు. కానీ ఓరోజు టీవీలో చూసిన ఒక వార్త అతడిని పూర్తిగా మార్చేసింది. ఆ మార్పు వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది.
 ఓ అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారంటూ టీవీలో ఒక వార్త చూసిన ఫ్రాన్సిస్, తన కూతుళ్లకు ఏ ప్రమాదం వస్తుందో ఏమోనని భయపడటం మొదలుపెట్టాడు.

ఆ భయం మితిమీరి శాడిజంలా మారింది. సంరక్షణ పేరుతో సంకెళ్లు వేయడం మొదలెట్టాడు. పిల్లల్ని గడప దాటనిచ్చేవాడు కాదు. టీవీ కూడా చూడనిచ్చేవాడు కాదు. ఓసారి అతడు లేనప్పుడు ఓ కూతురు బయటకు వెళ్లి వచ్చింది. మరో కూతురు టీవీ చూసింది. ఆ సంగతి తెలియగానే టీవీ పగుల గొట్టేశాడు. ముగ్గుర్నీ గదిలో పడేశాడు. వాళ్లని సపోర్ట్ చేసిందని భార్యనీ వాళ్లతో పాటే బంధించాడు. తిండి పెట్టేవాడు కాదు.

ఆకలి తాళలేక వాళ్లు న్యూస్ పేపర్లు తినేవారు. నీళ్లు లేక గొంతు పిడచకట్టుకు పోతుంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని విలవిల్లాడిపోయేవారు. ఆహారం లేక  పిల్లల ఎదుగుదల ఆగిపోయింది. కొన్నాళ్లకు ఒంట్లో సత్తువ కూడా ఆవిరై పోయింది. కదల్లేని స్థితికి చేరుకున్నారు. దాంతో ఒకటికీ, రెంటికీ కూడా అక్కడే.

వాళ్లనలా చూసి కూడా ఫ్రాన్సిస్ మనసు కరిగేది కాదు. ఇదంతా మీ మంచి కోసమే అనేవాడు. తన మానాన తను ఆఫీసుకు పోయి వచ్చేవాడు. ఎవరైనా కుటుంబ సభ్యుల గురించి అడిగితే ఊరు వెళ్లారనేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు... ఏడేళ్లు సమాజం ముందు నటించాడు. తన వాళ్లని, తననే నమ్ముకున్నవాళ్లని నరకయాతన పెట్టాడు. చివరికి ఓ రోజు ఎలాగో జెనెవీవ్ కిటికీ పగులగొట్టి తప్పించుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ చెంతకు చేరి, వారికి విషయం వివరించింది. వాళ్లు పోలీసుల సాయంతో మిగతా వారిని కూడా రక్షించగలిగారు.
 
ఈ కేసు ముంబైనే కాదు... యావత్ దేశాన్నీ వణికించింది. ఆ తల్లీకూతుళ్ల దయనీయ స్థితి అందరితో కన్నీళ్లు పెట్టించింది. ఫ్రాన్సిస్ లాంటి సైకో తండ్రికి బతికే హక్కు లేదు చంపేయ మంటూ ప్రజానీకం గళమెత్తింది. చట్టం ఫ్రాన్సిస్‌ని అదపులోనికి తీసుకుంది. అయితే ఒక స్నేహితురాలు బెయిల్ ఇవ్వడంతో త్వరగానే బయటకు వచ్చేశాడు. కుటుంబాన్ని కలవాలను కున్నాడు. కానీ అవకాశం కలగలేదు. వాళ్లు అతని ముఖం చూడటానికి కూడా ఇష్టపడ లేదు. దాంతో ఎక్కడో మారుమూల ఓ చిన్న ఇంట్లో దిక్కుమాలినవాడిలా బతికాడు. కేసు పూర్తికాక ముందే కన్నుమూసి, కుళ్లిపోయిన స్థితిలో పోలీసులకు శవమై దొరికాడు.
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు