నా ఫిజిక్‌కి ఆ పాత్రలే సూటవుతాయి!

7 Dec, 2014 01:59 IST|Sakshi
నా ఫిజిక్‌కి ఆ పాత్రలే సూటవుతాయి!

సంభాషణం
ఆయన చాలా సినిమాల్లో ఉంటారు. చాలా పాత్రల్లో కనిపిస్తారు. కానీ ఆయన గురించి అందరికీ తెలిసింది తక్కువ. తెలుసుకునే ప్రయత్నం చేస్తే...  కమెడియన్‌గామాత్రమే మనకు పరిచయమైన ఆయనలో... మరెన్నో గొప్ప ప్రతిభలు దాగివున్నాయని తెలుస్తుంది. తన గురించి మనకు తెలియని ఆ విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు జెన్నీ...

 
మీ అసలు పేరు జెన్నీయేనా?

కాదు... పోలాప్రగడ జనార్దనరావు. షార్‌‌టకట్‌లో జెన్నీ అయ్యింది.
     
మీ మూలాల గురించి చెప్పండి..?

నేను తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో పుట్టాను. బీకాం వరకూ రాజమండ్రిలో చదివాను. తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం పూర్తి చేశాను. ఈసీఐఎల్‌లో అకౌంట్స్ మేనేజర్‌గా పని చేసి రిటైరయ్యాను.
     
నటన వైపు అడుగులెలా పడ్డాయి?
నా పదో యేటనే నేను నాటకాల్లో నటించడం మొదలుపెట్టాను. యువనటుడిగా ఎదిగిన తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది. అప్పట్లో పెద్ద పెద్ద దర్శకులంతా నాటకాలకు ముఖ్య అతిథులుగా వస్తుండేవారు. ఓసారి అలా వచ్చిన జంధ్యాలగారు నా నటన చూసి ఇష్టపడి ‘అహనా పెళ్లంట’లో అవకాశం ఇచ్చారు. సరిగ్గా అప్పుడే పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చింది. దాంతో జూనియర్ ఆర్టిస్టులను మద్రాసు నుంచి తీసుకొస్తే బోలెడు ఖర్చవుతుందని హైదరాబాద్‌లో ఉన్నవాళ్లనే ఎంచుకునేవారు. దాంతో నాకు వరుస అవకాశాలొచ్చాయి.
     
ఒకేలాంటి పాత్రలు ఎక్కువ చేస్తారెందుకు?

కావాలనేం చేయను. ‘యమలీల’లో ఎడిటర్ పాత్ర చూసి వరుసగా అలాంటివే ఇచ్చారు చాలామంది. ‘హలోబ్రదర్’ హిట్టయ్యాక ఇరవై ముప్ఫై సినిమాల్లో మార్వాడీగానే చేశాను. చేసిన నాలుగొందల సినిమాల్లో ఓ వంద సినిమాల్లో  చర్చి ఫాదర్‌గా చేసుంటాను. ఒక్కసారి ఒక పాత్రలో క్లిక్ అయ్యామంటే వరుసగా అవే వస్తాయి. అన్ని చాన్సులు రావడం అదృష్టమే అయినా... వరుసగా అవే చేయాల్సి రావడం మాత్రం దురదృష్టమే.
     
హాస్యాన్నే ఎంచుకోవడానికి కారణం?
ఏ రాజకుమారుడిగానో చేస్తే నన్నెవరూ చూడలేరు. సీరియస్ పాత్రలూ, సిక్స్ ప్యాకులూ మనకి సెట్ కావు. నా ఫిజిక్‌కి అచ్చంగా సూటయ్యేది కామెడీనే. కాబట్టి దర్శకులు నన్ను కమెడియన్‌గానే ప్రమోట్ చేశారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అందుకే హాస్య పాత్రల్ని ఆనందంగా స్వీకరించాను. అలాగే కొనసాగాను.
     
మీలోని నటుడు తృప్తి చెందినట్టేనా?
నిజానికి ఉద్యోగం వల్ల నేను నటనమీద చాలాకాలం పూర్తి దృష్టి పెట్టలేకపోయాను. 2000వ సంవత్సరంలో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక ఇక నటనకే అంకితమైపోయాను. అదృష్టంకొద్దీ నాటకాలు నాకు మంచి రహదారి వేశాయి. దానికితోడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డెరైక్టర్స్‌గా ఉన్న శ్రీను వైట్ల, వీవీ వినాయక్ లాంటి వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుని ఇప్పటికీ చాన్సులిస్తున్నారు. మా అమ్మ అనేది... ‘గోదావరికి చెంబు పుచ్చుకువెళ్తే చెంబుడునీళ్లు దక్కుతాయి, బిందె పట్టుకుని వెళ్తే బిందెడు నీళ్లు దక్కుతాయి, అది మన ప్రాప్తం, అలాగని పెద్ద గంగాళం తీసుకెళ్తే మోయలేక నడుం విరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ అత్యాశకు పోవద్దు’ అని. అందుకే నేను వచ్చినదానితో సంతృప్తి చెందుతాను.
     
నాటకాలు వదిలేశారా?
లేదు. శంకరమంచి పార్థసారథి అనే మంచి రచయిత, తల్లావజ్జల సుందరం అనే మంచి దర్శకుడు ఉన్నారు. వీరు సంవత్సరానికి ఒక్క గొప్ప నాటకాన్నైనా సృష్టిస్తుంటారు. మేమంతా కలసి శ్రీమురళీకళానిలయం సంస్థ ద్వారా ఇప్పటికీ నాటకాలు వేస్తూనే ఉన్నాం.
     
తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
నాకసలు తీరికే లేదు. ఓ పక్క సినిమాలు, నాటకాలు. మరోపక్క మూకాభినయం. వెయ్యికి పైగా మైమ్ ప్రదర్శినలిచ్చిన ఏకైక భారతీయుణ్ని నేను. చాలామందికి నేర్పిస్తున్నాను కూడా. మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోను, నిజాం కాలేజీలోనూ థియేటర్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా కూడా చేస్తున్నాను. ఇవి కాక రచనా వ్యాసంగం. యాభై కథల వరకూ రాశాను. ఓ పదిహేను కథలు బహుమతులు కూడా గెల్చుకున్నాయి.
     
మీ తర్వాత మీ కుటుంబం నుంచి ఎవరైనా ఇండస్ట్రీకొచ్చారా?
లేదు. మా అబ్బాయికిగానీ, అమ్మాయికిగానీ ఆ ఆసక్తి ఏర్పడలేదు. బాబు బాగా చదవుకుని బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డాడు. అమ్మాయికి పెళ్లైపోయింది.
     
భవిష్యత్ ప్రణాళికలేంటి?
ప్రణాళికలు వేసుకోను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతాను. ఉన్నంతకాలం నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ గడిపేస్తే చాలు.

మరిన్ని వార్తలు