పాలియస్టర్ ప్రిన్స్

12 Jun, 2016 01:09 IST|Sakshi
పాలియస్టర్ ప్రిన్స్

మన దిగ్గజాలు
దేశం కాని దేశంలో పెట్రోల్ బంకులో కార్మికుడిగా పనిచేశాడు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే సరికి ఆయన వద్దనున్నవి ఐదువందల రూపాయలు మాత్రమే. అదే ఆయన పెట్టుబడి. కేవలం ఆ చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టేసి సరిపెట్టుకుంటే, ఇంత చరిత్ర ఉండేదే కాదు. పెట్టుబడికి పట్టుదల తోడైంది. ఆ పట్టుదలే ధీరూభాయ్ అంబానీని పారిశ్రామిక రంగంలో ‘పాలియస్టర్ ప్రిన్స్’గా  నిలిపింది. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా పట్టం కట్టింది.
 
బడిపంతులు కొడుకు...
ధీరూభాయ్ అసలు పేరు ధీరజ్‌లాల్ హీరాచాంద్ అంబానీ. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా చోర్వాడ్ పట్టణంలో 1932 డిసెంబర్ 28న పుట్టారు. తండ్రి బడిపంతులు. ఆయన సంతానంలో మూడోవాడు ధీరూభాయ్. తండ్రి బడిపంతులే అయినా, ధీరూభాయ్‌కి పెద్దగా చదువు అబ్బలేదు. ఎలాగోలా హైస్కూల్ వరకు పూర్తి చేశాక, తర్వాత చదువు మానేశారు. సంపాదన కోసం చిన్నా చితకా పనులు చేస్తూ వచ్చారు.

ఈలోగా అవకాశం కలిసి రావడంతో యెమెన్‌లో పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్లారు. ఎంత కష్టపడి పనిచేసినా, పెద్దగా మిగిలేదేమీ ఉండేది కాదు. ఇలా లాభం లేదనుకుని 1957లో ముంబైకి వచ్చేశారు. ముంబై చేరుకునే నాటికి ఆయన చేతిలో ఉన్నవి ఐదువందల రూపాయలు మాత్రమే. ఆ స్వల్ప మొత్తమే పెట్టుబడిగా దగ్గరి బంధువైన చంపక్‌లాల్ దామానీతో కలిసి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించారు.

విదేశాల నుంచి పాలియస్టర్ దారం దిగుమతి, విదేశాలకు సుగంధద్రవ్యాల ఎగుమతి చేసేవారు. ముంబైలోని మస్జిద్ బందర్ ప్రాంతంలో చిన్న గదిలో కార్యాలయం పెట్టుకున్నారు. కార్యాలయంలో మూడు కుర్చీలు, ఒక టేబుల్, ఒక టెలిఫోన్ మాత్రమే ఉండేవి. మొదట్లో ఇద్దరు అసిస్టెంట్లను నియమించుకున్నారు. వ్యాపారం త్వరగానే వేగం పుంజుకుంది. సొంతంగానే ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్న అంబానీ 1965లో దామానీతో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేశారు.
 
ఓన్లీ విమల్...
రిస్కు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడని నైజం అంబానీది. దామానీతో భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా పాలియస్టర్ దారం దిగుమతులను కొనసాగిస్తూ, 1966లో రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. గుజరాత్‌లోని నరోదాలో సింథటిక్ వస్త్రాల మిల్లును నెలకొల్పారు. 1975లో ‘విమల్’ చీరలు, సూటింగ్స్, షర్టింగ్స్ ఉత్పత్తి ప్రారంభించారు. ‘ఓన్లీ విమల్’ నినాదంతో సాగించిన ప్రచారం దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ ఊపుతో 1977లో పబ్లిక్ ఇష్యూకి వెళితే భారీ స్పందన వచ్చింది. రిలయన్స్ విజయానికి ఇది తొలిమెట్టు.
 
వడి వడిగా విస్తరణ...
‘విమల్’బ్రాండ్ విజయంతో ధీరూభాయ్ విస్తరణ వైపు దృష్టి సారించారు. ‘రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ను 1985లో ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’గా మార్చారు. ఐదేళ్లు గడిచే సరికి పెట్రోలియం రంగంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లకే టెలికం రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘రిలయన్స్ గ్యాస్’ ప్రారంభించారు.

అదేకాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇంటిగ్రేటెడ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు రెండూ 2001 నాటికి భారత్‌లోనే అగ్రగామి కంపెనీలుగా నిలదొక్కుకున్నాయి. ‘రిలయన్స్’ విస్తరణ వేగం పుంజుకుంటున్న దశలోనే 1986లో ధీరూభాయ్ తొలిసారిగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దాంతో చాలావరకు బాధ్యతలను కొడుకులు ముకేశ్, అనిల్‌లకు అప్పగించారు.

‘రిలయన్స్’ ఘన విజయాలు సాధిస్తున్న దశలోనే 2002లో ధీరూభాయ్ మరోసారి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2002 జూలై 6న తుదిశ్వాస విడిచారు. ధీరూభాయ్ మరణం తర్వాత ముకేశ్, అనిల్‌ల మధ్య పొరపొచ్చాలు తలెత్తడంతో ‘రిలయన్స్’ సామ్రాజ్యం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ ముకేశ్ అంబానీ అధీనంలోను, ‘రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ (ఏడీఏ) గ్రూప్’ అనిల్ అంబానీ నేతృత్వంలోను నడుస్తున్నాయి.

మరిన్ని వార్తలు