కాలిపోయిన వెన్నెల

27 Jul, 2014 00:20 IST|Sakshi
కాలిపోయిన వెన్నెల

నిజాలు దేవుడికెరుక
 
జూన్ 1, 2013... ముంబై హాస్పిటల్...
అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎమర్జెన్సీ రూమ్ బయట ఉన్న బెంచీ మీద ఓ యాభయ్యేళ్ల వ్యక్తి, నలభయ్యేళ్లు దాటిన మహిళ ఉన్నారు. ఆమె కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తుంటే ఆ శబ్దం బయటకు రాకూడదని చీర చెంగును నోటిలో కుక్కుకుంటోంది. ఆమె పక్కనే కూచున్న వ్యక్తి చూపులు శూన్యాన్ని కొలుస్తున్నాయి. బాధను దిగమింగుతున్నట్టుగా గొంతు దగ్గర నరాల కదలిక చెబుతోంది.
అంతలో ఎమర్జెన్సీ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. నర్స్ బయటకు వచ్చింది. వాళ్లవైపు చూసి, ‘‘లోపలికి రండి’’ అనేసి లోనికి వెళ్లిపోయింది. వణుకుతోన్న కాళ్లను అతి కష్టమ్మీద నేలకు అదిమి పెడుతూ ఇద్దరూ లోనికి నడిచారు.

మంచమ్మీద ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి ఉంది. ఒళ్లంతా తెల్లని దుప్పటి కప్పేశారు. ముఖం మాత్రమే కనిపిస్తోంది. చూడలేనంత దారుణంగా ఉందా ముఖం. చర్మం కాలిపోయింది. కండరాలు ఉడికి పోయి, రక్తం ఉబికి వచ్చి దయనీయంగా ఉంది. ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఆమెను పరీక్షిస్తున్నారు. గబగబా వారి దగ్గరకు వెళ్లారు ఆ భార్యాభర్తలిద్దరూ. ‘‘ఏం జరిగింది’’ అనడిగారు కంగారుగా. ‘‘తను మీతో మాట్లాడాలనుకుంటోంది’’ అనేసి వెళ్లిపోయాడు డాక్టర్. నర్సులు దూరంగా జరిగి నిలబడ్డారు.

 ఆ మహిళ మంచం దగ్గరగా నడిచి, వంగి ఆ అమ్మాయి ముఖంలోకి చూసింది. సగం తెరిచిన కళ్లు... ఆ కళ్ల నుంచి జాలువారుతోన్న కన్నీళ్లు... కన్నబిడ్డను ఆ స్థితిలో చూడలేక ఆ తల్లి ఘొల్లుమంది. తండ్రి గుండె చిక్కబట్టుకున్నాడు.
 ‘‘ఏదో మాట్లాడాలన్నావంట, ఏమైనా కావాలా తల్లీ?’’ అడిగిందామె.
 ఆ అమ్మాయి బలవంతాన మాట కూడదీసుకుంది. పలుకులు మూటగట్టుకుంది. గొంతు పెగల్చుకుని చిన్నగా అంది... ‘‘ఎందుకిలా జరిగిందమ్మా? నేనేం పాపం చేశాను?’’
 అంతే... మరుక్షణం ఆ మాట మూగబోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ‘ప్రీతీ’ అన్న కేకతో ఆ ఆసుపత్రి దద్దరిల్లింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి వైద్యులు, నర్సుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి.
 అసలు ఎవరీ ప్రీతి? తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో నిస్సహాయంగా ఎందుకు మరణించింది?
 
మార్చ్ 28, 2013. బీబీఎంబీ కాలనీ (ఢిల్లీ)...
రోషిణి వంట గదిలో ఉంది. ఆమె భర్త అమర్‌సింగ్ రాఠీ హాల్లో కూచుని ఏదో పత్రిక చదువుతున్నాడు. హితేష్ (21), తనూ (19) టీవీలో ఏ చానెల్ చూడాలా అని కొట్లాడుకుంటున్నారు. అప్పుడే బయటి నుంచి సుడిగాలిలా వచ్చింది ప్రీతి. చేతిలో ఉన్న కవర్‌ని చూపుతూ గంతులేయడం మొదలెట్టింది.
‘‘ఏంటక్కా అది’’... ఆతృతగా అడిగింది తనూ. ‘‘చెప్పనుగా. ముందు నాన్నకే చూపిస్తాను’’ అంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తి ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది. చేస్తున్న పని ఆపి కూతురివైపు మురిపెంగా చూశాడు అమర్‌సింగ్.
 ‘‘ఏంట్రా అది’’ అన్నాడు కవర్‌ని అందుకుంటూ. దాన్ని తెరచి చూసిన అతడి కళ్లు ఆనందంతో, ఆశ్చర్యంతో అరమోడ్పులయ్యాయి. కూతురి ముఖంలోకి నమ్మలేనట్టుగా చూశాడు. ప్రీతి నవ్వింది.
 ‘‘నాకు మిలిటరీలో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది నాన్నా. ఇంకో నెల రోజుల్లో ముంబై వెళ్లి జాయినవ్వాలి’’
 ఆ మాట వింటూనే హితేష్, తనూలు అక్క దగ్గరకు వచ్చేశారు. ‘‘వావ్ అక్కా... కంగ్రాట్స్’’ అన్నాడు హితేష్ ప్రీతిని పట్టి ఊపేస్తూ. ‘‘మరి నా పార్టీ సంగతేంటి’’ అంది తనూ చేతులు రెండూ నడుముకు ఆన్చి, డిమాండ్ చేస్తున్నట్టుగా.
 ‘‘ఇస్తాలేవే’’ అంటూ చెల్లెలి నెత్తిమీద మొట్టింది ప్రీతి. ఈ సందడికి వంటింట్లోంచి వచ్చిన రోషిణి కూతురి ప్రయోజకత్వాన్ని చూసి పొంగిపోయింది. ‘‘నాకు తెలుసురా నువ్వు అనుకున్నది సాధిస్తావని’’ అంది కళ్లొత్తుకుంటూ.
 ‘‘అమ్మో... అమ్మ మళ్లీ ట్యాప్ తిప్పింది’’ అన్నాడు హితేష్ భయం నటిస్తూ. అందరూ ఫక్కుమన్నారు. ఆ రోజంతా ఆ ఇంట నవ్వుల పువ్వులు విరబూశాయి.
 
మే 2, 2013... ముంబై రైల్వేస్టేషన్.
గరీబ్థ్ ్రవచ్చి ప్లాట్‌ఫామ్ మీద ఆగింది. ఎస్ 2 బోగీలోంచి ప్రీతి జింక పిల్లలా చెంగున దిగింది. ఆ వెనుకే ఆమె తల్లిదండ్రులు, బాబాయ్ వినోద్, పిన్ని సునీత దిగారు. అందరూ కలిసి ‘ఎగ్జిట్’వైపు నడవడం మొదలు పెట్టారు. కబుర్లు చెబుతూ హుషారుగా అడుగులు వేస్తోన్న ప్రీతి... తన భుజాన్ని ఎవరో తట్టినట్టు అనిపించడంతో ఆగి వెనక్కి చూసింది.

ఎవరో వ్యక్తి. ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతడెవరో పోల్చుకుందామని ప్రయత్నిస్తుండగానే అతడి చేయి పైకి లేచింది. ప్రీతి శరీరం భగ్గుమంది. ‘అమ్మా’ అంటూ ప్రీతి అరిచిన అరుపు కొన్ని కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. నేలకూలింది ప్రీతి. ఒళ్లంతా మైనంలా కరిగిపోతోంది. రక్తం ఉబికి వస్తోంది. ఒళ్లు కాలిన వాసన గుప్పుమంటోంది.
 ‘‘ఎవరో యాసిడ్ పోశారు’’ అరిచాడో వ్యక్తి. అమర్‌సింగ్, రోషిణిల గుండెలు అదిరిపోయాయి. ‘ప్రీతీ’ అంటూ కూతురి దగ్గరకు పరుగులు తీశారు. ఒళ్లంతా మంటలు పుడుతోంటే తాళలేక హృదయ విదారకంగా ఏడుస్తోంది ప్రీతి. ‘‘నా బిడ్డని కాపాడండి’’... కేకలు పెట్టింది రోషిణి.అంతలో రైల్వే పోలీసులు వచ్చారు. ప్రీతిని బ్లాంకెట్‌లో చుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
    
‘‘మీ అమ్మాయికి ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’’... ఆ ప్రశ్న వింటూనే ఇబ్బందిగా కదిలాడు అమర్‌సింగ్. రోషిణి మాత్రం... ‘‘మా అమ్మాయి అలాంటిది కాదు సర్’’ అంది ఆవేశంగా.
‘‘ప్రేమించడం తప్పేమీ కాదమ్మా. సాధారణంగా యాసిడ్ దాడులకు పాల్పడేవాళ్లు ప్రేమికులో, ప్రేమిస్తున్నామని వెంటబడే రోమియోలో అయివుంటారు. పోనీ మీ అమ్మాయిని  ఎవరైనా వేధిస్తున్నారా?’’
‘‘లేదు సర్. అలాంటిదేమైనా ఉంటే తను మాకు చెప్పేది.’’
 తల పంకించాడు ఇన్‌స్పెక్టర్. ‘‘సరే... మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం’’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతడి దృష్టి మొత్తం ప్రీతికెవరైనా బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా అన్నదాని మీదే ఉంది. ఆ దిశగానే ఎంక్వయిరీ మొదలు పెట్టాడు.
 
విచారణలో ప్రీతికి ముగ్గురు అబ్బాయిలతో స్నేహం ఉందని తెలిసింది. కానీ ఆ ముగ్గురూ ఆమెకి మంచి స్నేహితులని నిరూపణ కూడా అయ్యింది. పైగా సంఘటన జరిగినప్పుడు వారిలో ఎవ్వరూ ముంబైలో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేరు. దాంతో వారిని తన లిస్టు లోంచి తీసేశాడు. పలు కోణాల్లో పరిశోధించాడు కానీ ఫలితం లేకపోయింది. అంతలో ప్రీతి పరిస్థితి విషమించింది. ఒక కన్ను పోయింది. ముఖం, చెవులు, మెడ, మిగతా శరీరమంతా బాగా కాలిపో యింది. లోపలి అవయవాలు సైతం బాగా దెబ్బతినడంతో నెల రోజుల తర్వాత కన్నుమూసింది. చనిపోయే వరకూ ఆమె ఒక్కటే ప్రశ్న అడిగింది... ‘నాకెందుకిలా జరిగింది, నేనేం పాపం చేశాను’?

ఆ ప్రశ్నకు సమాధానం దాదాపు 9 నెలల తరువాత తెలిసింది పోలీసులకు. గుర్‌గావ్ నుంచి రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రీతి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలుసన్నాడు. అతడిచ్చిన వివరాలను బట్టి, ప్రీతి పక్కింటి అబ్బాయి అంకుర్ పన్వర్ (21)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రీతిని అంకుర్ ప్రేమించాడేమో అన్న ఆలోచనతో ఉన్న పోలీసులకు అతగాడు చెప్పిన కారణం విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.అంకుర్ ప్రీతిని ప్రేమించలేదు. అతడికసలు ఆ ఆలోచన కూడా లేదు. అయినా కూడా ప్రీతిని చంపేయాలనుకున్నాడు. అందుకు కారణం... అసూయ. అంకుర్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు. కానీ దాని మీద శ్రద్ధ లేదు.
 
ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో తిరుగుతాడు. పార్టీలంటూ టైమ్ వేస్ట్ చేస్తాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కోప్పడుతూ ఉండేవారు. ‘ప్రీతిని చూసి నేర్చుకో, ఎంత చక్కగా చదువుతుందో’ అంటూ క్లాస్ పీకేవారు. వాళ్లు అలా అన్న ప్రతిసారీ ప్రీతి మీద కోపం ముంచుకొచ్చేది. అది కాస్తా ఆమెకు ఉద్యోగం వచ్చేసరికి హద్దులు దాటింది. ‘ప్రీతి అనుకున్నది సాధించింది, నీకు సెటిల్మెంట్ గురించి టెన్షనే లేదు’ అని ఇంట్లోవాళ్లు అనగానే రక్తం మరిగిపోయింది. ఆ ఆవేశంలోనే ప్రీతిని చంపేందుకు స్కెచ్ వేశాడు. ఆమెతోపాటు ముంబై బయలుదేరాడు. రైల్లోనే యాసిడ్ పోయాలనుకున్నాడు కానీ అందరూ ఉండటంతో కుదరలేదు. రైలు దిగాక తాను అనుకున్నది చేశాడు. తన పైశాచికత్వానికి ఆ బంగారు తల్లిని బలి తీసుకున్నాడు.
 
 ప్రీతి ఏ పాపం చేయలేదు. అంకుర్ అసూయ జ్వాలలకు ఆహుతైపోయింది... అంతే. కేవలం ద్వేషంతో అంకుర్ చేసిన పని... ఆమె కలల్ని మొదలంట నరికేసింది. ఆమె జీవితాన్నే అంతం చేసింది. ఆమెని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టింది.
 
ఓ క్షణం ఆలోచిస్తే... ఆవేశం చల్లారిపోతుంది. వాస్తవం స్ఫురిస్తుంది. కర్తవ్యం బోధపడుతుంది. మంచీ చెడుల విచక్షణ తెలుస్తుంది. ఆ ఒక్క క్షణం.. చాలా విలువైనది. అది... కొన్ని జీవితాలను నిలబెడుతుంది. కొన్ని జీవితాలను కూలదోస్తుంది. అందుకే ఏదైనా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు మరో అంకుర్ తయారవ్వడు. మరో ప్రీతి బలవ్వదు. మరే తల్లీ కడుపుకోతతో విలవిల్లాడదు!
- సమీర నేలపూడి

మరిన్ని వార్తలు