ప్రహ్లాదుడి సచ్ఛీలత

7 May, 2016 22:56 IST|Sakshi
ప్రహ్లాదుడి సచ్ఛీలత

నరసింహావతారం దాల్చిన శ్రీహరి హిరణ్యకశిపుడిని వధించాక, ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం లభించింది. శ్రీహరికి పరమభక్తుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన ప్రహ్లాదుడి పరిపాలనలో ముల్లోకాలూ అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో తులతూగుతూ ఉండేవి. దేవ దానవ మానవులందరూ ప్రహ్లాదుడి సుగుణాలను వేనోళ్ల కీర్తించసాగారు. ప్రహ్లాదుడి ప్రాభవం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుండటంతో స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన దేవేంద్రుడికి బెంగ పట్టుకుంది. ఇక తనకు ఎన్నటికీ స్వర్గాధిపత్యం తిరిగి దక్కదేమోనన్నదే అతడి బెంగ.
 
 ఇదివరకు అతడు కొన్నిసార్లు రాక్షసుల చేతిలో దెబ్బతిని, స్వర్గాధిపత్యాన్ని వదులుకోవాల్సి వచ్చినా, హరిహరులలో ఎవరో ఒకరు అతడి రక్షణకు వచ్చి, దుష్టులైన ఆ రాక్షసులను సంహరించడంతో తిరిగి స్వర్గాధిపత్యం పొందగలిగాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే అయినా, అతడు దుష్టుడు కాడు. సకల సద్గుణ సంపన్నుడు, పరమ భాగవతోత్తముడు. అతడికి అండగా సాక్షాత్తు శ్రీహరి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కేదెలా? దీనికి తరుణోపాయం చెప్పాలంటూ ఇంద్రుడు దేవగురువు బృహస్పతి వద్దకు వెళ్లాడు.
 
‘ప్రహ్లాదుడికి త్రిలోకాధిపత్యం ఎలా లభించింది? అతడి నుంచి నాకు తిరిగి స్వర్గాధిపత్యం దక్కుతుందా? ముల్లోకాలూ అతడినే పొగుడుతున్నాయి? కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.‘నాయనా! ఇంద్రా! ప్రహ్లాదుడు ఉత్తములలోకెల్లా ఉత్తముడు. ఉత్తమోత్తమ జ్ఞాన సంపన్నుడు. ఉత్తమోత్తమ జ్ఞానసంపద కారణంగానే అతడికి త్రిలోకాధిపత్యం లభించింది.’ అని బృహస్పతి బదులిచ్చాడు.    ‘ఉత్తమోత్తమ జ్ఞానం ఏమిటి? దయచేసి నాకు బోధించండి’ అని అర్థించాడు ఇంద్రుడు.

  ‘మోక్ష సాధనకు పనికి వచ్చేదే ఉత్తమోత్తమ జ్ఞానం. అసుర గురువు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లు. అతడే నీకు ఆ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని బోధించగలడు’ అని సూచించాడు బృహస్పతి.బృహస్పతి సలహాపై ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. మోక్షాన్ని పొందగల ఉత్తమోత్తమ జ్ఞానాన్ని తనకు ప్రసాదించమని వేడుకున్నాడు. సరేనని బోధించాడు శుక్రాచార్యుడు.
 
అప్పటికీ సంతృప్తి చెందని ఇంద్రుడు ‘ఆచార్యా! ఇంతకు మించినదేదైనా ఉందా? ఉంటే ఎక్కడ దొరుకుతుంది?’ అని అడిగాడు. ‘ముల్లోకాలలోనూ ఉత్తమోత్తమ జ్ఞానాన్ని మించినది కూడా ఉంది. అదే సచ్ఛీలత. సచ్ఛీలత కావాలంటే ప్రహ్లాదుడి వద్దకు వెళ్లు.’ అని సూచించాడు శుక్రాచార్యుడు.బ్రాహ్మణ వేషం ధరించి, ప్రహ్లాదుడి వద్దకు చేరుకున్నాడు ఇంద్రుడు. తనకు జ్ఞానబోధ చేయమని అర్థించాడు.

  ‘నిత్యం రాజ్య వ్యవహారాలతో తలమునకలై ఉంటాను. నీకు జ్ఞానబోధ ఎప్పుడు చేయగలను? ఎవరైనా మంచి ఆచార్యుడిని చూసుకో’ అని సలహా ఇచ్చాడు ప్రహ్లాదుడు. అయినా పట్టు వీడలేదు ఇంద్రుడు. వీలున్నప్పుడే బోధించమన్నాడు. అంతవరకు శుశ్రూష చేసుకుంటూ ఉంటానన్నాడు. సరేనన్నాడు ప్రహ్లాదుడు. వీలు చిక్కినప్పుడల్లా ఇంద్రుడికి జ్ఞానబోధ చేయసాగాడు. ఇంద్రుడు కూడా వినయ విధేయతలతో ప్రహ్లాదుడికి శుశ్రూష చేయసాగాడు. ఇంద్రుడి శుశ్రూషకు ప్రసన్నుడైన ప్రహ్లాదుడు ‘ఏమి కావాలో కోరుకో’ అన్నాడు.
 
 రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు? ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు ఇలా బదులిచ్చాడు. ‘ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను. నా గురువులను ఇప్పటికీ సేవించుకుంటాను. ముల్లోకాలనూ ఏలుతున్నా ఇదంతా నా ఘనత అని భావించను. నా సచ్ఛీలతే నాకు శ్రీరామరక్షగా ఉంటోంది’ అని బదులిచ్చాడు.
 
 ‘అయితే, నీ సచ్ఛీలతను నాకు దానమివ్వు’ అని కోరాడు ఇంద్రుడు. అప్పుడు గ్రహించాడు ప్రహ్లాదుడు... తన ఎదుట ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడేనని. అయినా ఏమాత్రం సంకోచించలేదు. తన సచ్ఛీలతను అతడికి దానమిచ్చేశాడు. ప్రహ్లాదుడి నుంచి ఒక తేజస్సు వెలువడింది. ‘నేను నీ సచ్ఛీలతను. నీవు నన్ను దానం ఇచ్చేశావు. అందుకే నిన్ను వీడి వెళుతున్నా’  అంటూ ఇంద్రుడిలోకి ప్రవేశించింది.
 
 ఆ వెంటనే అష్టలక్ష్ములు కూడా... సచ్ఛీలత లేనందున ఇకపై నీతో ఉండలేమంటూ ఇంద్రుడి శరీరంలోకి ప్రవేశించారు. సచ్ఛీలతతో పాటు తన ఐశ్వర్యం, రాజ్యసంపద సమస్తం తనను వీడిపోయినా ప్రహ్లాదుడు దిగులు చెందలేదు. ప్రశాంత చిత్తంతో నారాయణ మంత్రం జపిస్తూ తపస్సు ప్రారంభించాడు. చివరకు శ్రీహరి అనుగ్రహంతో మోక్షాన్ని పొందాడు.
 
 ‘రాజా! నీకు త్రిలోకాధిపత్యం ఎలా దక్కింది? ముల్లోకాలలో జనులు నిన్నే పొగుడుతున్నారు. ఇందులో రహస్యమేమిటి?’ అని ప్రశ్నించాడు. తన ఎదుట ఉన్నది ఇంద్రుడని గ్రహించలేని ప్రహ్లాదుడు బదులిచ్చాడు.
 
 
 

మరిన్ని వార్తలు