మారుతి

24 Feb, 2019 00:21 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘పిల్లలంతా వెళ్లిపోయాక ఇల్లెంత బోసిపోయిందో చూడండీ..’’ అంట్ల గిన్నెలు సింక్‌లో వేస్తూ అవంతి నిట్టూర్పు.‘‘వాళ్ల ఉద్యోగాలు.. వాళ్ల జీవితాలు..తప్పదు’’ చిలికిన మజ్జిగను రెండు గ్లాసుల్లో పోస్తూ అన్నాడు ప్రసాద్‌.‘‘అందుకే  చిన్న ఇల్లు తీసుకుందాం అంటే విన్నారా?’’ అంది పెరుగ్గిన్నెను ఫ్రిజ్‌లో పెడుతూ.‘‘ఇది మనకోసం కాదుగా అవంతీ..’’ అన్నాడు  రెండు మజ్జిగ గ్లాసులను తీసుకుని డైనింగ్‌ హాల్లోకి వెళుతూ, ‘‘మరే..’’బొడ్లో దోపుకున్న చీర కొంగును తీసి చేతులు తుడుచుకుంటూ భర్తను అనుసరించింది. రాత్రి తొమ్మిదైంది...  ఎక్కడి నుంచో కుక్క అరుపు.  ‘‘హూ.. మొదలైంది’’ డైనింగ్‌ టేబుల్‌ కుర్చీ ఇవతలకు లాక్కుంటూ అవంతి. మౌనంగా ఒక  మజ్జిగ గ్లాస్‌ భార్యకు ఇచ్చాడు ప్రసాద్‌.  తన గ్లాస్‌లోని మజ్జిగను సిప్‌ చేస్తూ  హాల్లో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్లాడు. బయటకు చూశాడు. తెల్లటి ప్రహరీకి నల్లని గేట్‌. స్ట్రీట్‌ లైట్‌ వెలుతురు ఏటవాలుగా పడి మెరుస్తోంది. గేట్‌ లోపల.. బయట ఏమీ లేదు. కుక్క కూడా! మజ్జిగ సిప్‌ చేస్తూనే కిటికీ తలుపులు మూసి బోల్ట్‌ పెట్టి కర్టెన్‌ లాగాడు. ఇంకో సిప్‌ చేస్తూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చాడు.

అప్పటికే మజ్జిగ తాగేసింది అవంతి. భర్తనే చూస్తోంది... పది రోజులే అవుతోంది ఆ గృహ ప్రవేశం చేసి. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. నలుగురూ ఉద్యోగస్తులే. ప్రవేశం అయిన అయిదు రోజులకే  వెళ్లిపోయారు.  వేసవి సెలవులు కదా మనవలు, మనవరాళ్లను ఉంచమన్నా వినలేదు ‘‘మిమ్మల్ని విసిగిస్తారు’’ అంటూ.  ఇప్పుడు  ఆ కుక్క అరుపులు తప్ప ఆ ఇంట్లో ఏ  అలికిడీ లేదు. ఆ కుక్కా  కనిపించదు. వినిపిస్తూ ఉంటుంది. అంతే! ఏంటో ఈ రెండు రోజులుగా దాని అరుపు వింటుంటే భయమేస్తోంది అవంతికి. ఇప్పుడు భర్త మొహంలోనూ అది కనపడుతోంది ఆమెకు. మజ్జిగ తాగడం పూర్తి అయినా ఇద్దరూ అలాగే కూర్చున్నారు  చాలా సేపు!∙∙ బోఓ... బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ.. బో.. బో.. బోఓ..చటుక్కున నిద్రలోంచి లేచింది అవంతి. కుక్క ఏడుపు.. అదే పనిగా!మంచం కింద నుంచి వస్తోంది. వంగి చూసింది. కుక్క లేదు. ఈసారి ఆ ఏడుపు లివింగ్‌ ఏరియా దూరానికి వెళ్లింది. గబగబా అక్కడికి పరిగెత్తింది అవంతి.  బయట గేట్‌ దగ్గరకు షిఫ్ట్‌ అయింది ఏడుపు.

మెయిన్‌ డోర్‌ తెరిచి చూసింది ఆమె. ఏమీ కనిపించలేదు. మళ్లీ ఇంట్లోకి మళ్లింది  ఏడుపు. అవంతీ లోపలకు వెళ్లింది. ఈ సారి హృదయ విదారకంగా.. పైన బెడ్‌ రూమ్‌ లోంచి. ఆ వైపుగా  కదిలింది ఆమె. అరే..  వంటింట్లోంచి.. కిందకు దిగింది ఆమె. టెర్రస్‌ మీద నుంచి వినపడింది.. టెర్రస్‌ చేరుకుంది అవంతి.  లేదు.. కుక్క లేదు.. కాని ఏడుపు తడవ తడవకు ఒక్కో చోటికి మారుతూనే ఉంది. పిచ్చిపట్టినదానిలా అవంతి  ఎటుపడితే అటు పరుగులు తీస్తూనే ఉంది. కాసేపటికి నిద్రలేచిన ప్రసాద్‌కి పక్కన భార్య కనిపించలేదు. హాల్లోకి వచ్చి చూశాడు. ఆయాస పడుతూ.. నీరసంగా ఈడుస్తూ .. చెమటలు పట్టి భార్య.  ‘‘అవంతీ....!’’ విస్మయంగా పిలిచాడు ప్రసాద్‌. చటుక్కున చూసింది భర్తను. ‘‘ఏమండీ.. అదెక్కడుందో కనపడట్లేదు.. పాపం ఒకటే ఏడుపు.. ఇందాకటి నుంచి..’’ జాలేసింది ప్రసాద్‌కి.. ‘‘అవంతీ..?’’ ‘‘కుక్కండీ.. పాపం.. ఎందుకు ఏడుస్తోందో?’’  ‘‘కుక్క లేదు.. ఏం లేదు..  పదా.. పడుకుందువు గానీ’’ అంటూ ఆమె భుజమ్మీద చేయి వేసి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు.

అయినా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది అవంతి.. ‘‘అదిగో అక్కడ నుంచి వినపడుతోంది’’ అంటూ గుమ్మం బయటవైపుకి చూపిస్తూ వెళ్లబోయింది. ‘‘నేను చూస్తాలే. నువ్‌ పడుకో’’ అంటూ  బలవంతంగా మంచమ్మీద కూర్చోబెట్టాడు భార్యను. పక్కనే స్టడీ టేబుల్‌ మీదున్న నీళ్ల గ్లాస్‌ ఇచ్చాడు. దాహంగా ఉందేమో గటగటా తాగేసింది అవంతి. ఖాళీ గ్లాస్‌ భర్త చేతికిచ్చి.. మంచం మీద వాలిపోయింది. గ్లాస్‌ టేబుల్‌ మీద పెట్టి ఇటు తిరిగేసరికే నిద్రలోకి జారుకుని కనిపించింది భార్య. పక్కనే కూర్చున్నాడు అవంతి తల నిమురుతూ. కుక్క ఏడుపు భార్య భ్రమ కాదు. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే! పిల్లలు వెళ్లినప్పటి నుంచీ ఇది జరుగుతున్న తతంగమే. తను నమ్మడానికి కారణం.. రాత్రిళ్లు దాని అరుపులు తనకూ వినిపించడమే! ఇద్దరికీ ఒకే రకమైన భ్రమ, భ్రాంతి ఉంటాయా?  చిత్రమేంటంటే.. తెల్లవారే సరికి ఇదంతా మరిచిపోతోంది అవంతి. అడిగితే అమాయకంగా మొహం పెడుతుంది.. ప్రతి రోజూ! కలతతోనే నడుం వాల్చాడు ప్రసాద్‌.∙∙ వేసవి కదా..  ఉదయం ఆరింటికే హాజరు వేసేసుకున్నాడు సూర్యుడు.

రాత్రి నిద్రలేమి ప్రసాద్‌ను వెంటాడుతోంది. మార్నింగ్‌ వాక్‌లో అన్యమనస్కంగానే అడుగులు వేస్తున్నాడు. పార్క్‌లో ఎదురుపడ్డ వాళ్లంతా విష్‌ చేస్తుంటే.. చిరునవ్వుతో బదులిస్తున్నాడు.  కాస్త నడకకే అలసినట్టనిపించింది.  చెట్టు నీడలో ఉన్న íసిమెంట్‌ బెంచీ చూసుకుని కూలబడ్డాడు. జబ్బకున్న సంచీ  పక్కన పెట్టి దాంట్లోంచి నీళ్ల సీసా తీసి గొంతు తడుపుకున్నాడు.  సీసాకు మూత పెడుతూ తల  తిప్పాడు యథాలాపంగా. ప్రసాద్‌ కంటే రెండుమూడేళ్లు పెద్దవాడై ఉంటాడు.. ఒక వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. పక్కనే గోధుమ వర్ణంలో మెరిసిపోతున్న సింహంలాంటి కుక్క. దానికి ఏదో చెప్తున్నాడు అతను. అది  శ్రద్ధగా వింటోంది అతని మాటలను. సిమెంట్‌ బెంచీ కనపడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆగింది తన యజమానిని కూర్చోమన్నట్టుగా. వెనకాలే అతనూ వచ్చి బెంచి మీద సేద తీరాడు. ప్రసాద్‌ పక్కనే. ఆసక్తిగా గమనిస్తున్నాడు ప్రసాద్‌. అపరిచితుడు కూర్చోగానే నవ్వుతూ విష్‌ చేశాడు ప్రసాద్‌ని. బదులుగా తనూ నవ్వాడు. ప్రసాద్‌  కళ్లన్నీ ఆ కుక్క మీదనే. ఎక్కడో చూసినట్టు.. చాలా పరిచయం ఉన్నట్టు.

గమనించిన ఆ అపరిచితుడు.. ‘‘వీడి పేరు మారుతి. నా బంటు. నా పిల్లల కన్నా’’ చెప్తున్నప్పుడు అతని కళ్లల్లో నీటి పొర. యజమానిని చూస్తూ కుక్క ఏడ్చింది.. అరిచింది.. అచ్చం.. రాత్రిళ్లు తమకు వినిపిస్తున్నట్టుగానే!ప్రసాద్‌ భృకుటి ముడి పడింది. అదీ గమనించాడు అపరిచితుడు. ‘‘భయపడకండి.. మారుతి మిమ్మల్నేం చేయడు. వాడు ఆ ఇంటిని వదిలిపోలేడు. ఎందుకంటే అది నా యిల్లు. ఆస్తి కోసం నా కొడుకులు నన్ను చంపేశారు.  నా మీద బెంగతో చిక్కి శల్యమై మారుతీ నా దగ్గరకు వచ్చేశాడు.  తర్వాత ఆ ఇంటిని నా పిల్లలు మీకు అమ్మేశారు.  నా మీద.. నేను కట్టిన ఆ ఇంటి మీద ప్రేమ చావక  వీడు .. రోజూ మిమ్మల్ని ఇబ్బంది పెడ్తున్నాడు. క్షమించండి..’’ స్థిరమైన గొంతుతో.. విషాదమైన చూపులతో ఇంకేదో చెప్పుకు పోతూనే ఉన్నాడు ఆ అపరిచితుడు. అతని ఒళ్లో తల పెట్టి బాధగా మూలుగుతున్నాడు మారుతి. వెన్నులోంచి చలి ప్రసాద్‌కి.. ‘‘ప్రసాద్‌ గారూ.. ప్రసాద్‌ గారూ.. ’’భుజం తట్టినట్టనిపించి మెడ తిప్పాడు..  పక్కింటి ఆయన.. వెంటనే.. బెంచి చివర చూశాడు.. ఖాళీగా ఉంది ఆ జాగా!
సరస్వతి రమ 

మరిన్ని వార్తలు