పుష్కరాలు... ఆరోగ్య జాగ్రత్తలు

7 Aug, 2016 13:34 IST|Sakshi
పుష్కరాలు... ఆరోగ్య జాగ్రత్తలు

ఎక్కువ సంఖ్యలో గుమిగూడటం (క్రౌడింగ్)
పుష్కర సమయంలో కొద్దిపాటి స్థలంలోనే జనం గుంపులుగా చేరతారు. దాంతో తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే కిందపడినవాళ్లు గాయపడే అవకాశమూ ఉంది. జనసమ్మర్దం కిక్కిరిసిన చోట భారీ స్థాయిలో తొక్కిసలాటలు జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలా జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
నీరు కలుషితం కావడం
ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడే చోట్లలో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఇది జరిగితే ఆ కలుషితమైన నీళ్లను తాగిన వారికి నీళ్ల విరేచనాలు, వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తాగే నీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
 
ఆహారం కలుషితం కావడం
పెద్ద సంఖ్యలో జనం చేరిన చోట అందరికీ ఆహారం సమకూర్చడం కష్టమవుతుంది. అయితే ఆహారాన్ని అందించే హోటళ్ల వంటి చోట్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా ఉంటుంది కాబట్టి శుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు హోటళ్లు, క్యాంటిన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
పారిశుద్ధ్యం
ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు పారిశుద్ధ్యం (శానిటేషన్) వసతులు కష్టం. అలాంటి పరిస్థితుల్లో పుష్కరాలకు వచ్చే జనం ఆరుబయట మలమూత్ర విసర్జనల వంటి చర్యలకు పాల్పడితే పరిసరాలు మరింత దుర్గంధమయంగా మారి కలుషితమవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి.
 
దోమల నుంచి రక్షణ
ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేరే చోట్లలో నీరు మురికిగా మారి దోమల పెరుగుదలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల తగిన పారిశుద్ధ్య చర్యలు చేపడితే దోమలను, వాటి వల్ల ప్రబలే చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు.
 
వ్యక్తిగత పరిశుభ్రత
ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి అవకాశం ఎక్కువ. కానీ చాలా పెద్దసంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఒకింత కష్టమే. అయినప్పటికీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.
 
డయాబెటిక్ రోగులు
జనాలు కిక్కిరిసి ఉండే పరిస్థితుల్లో అంటు వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ. పైగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవారిలో రోగినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్లకు వచ్చే వారిలో వృద్ధులు, పిల్లలు, డయాబెటిస్ రోగులు జాగ్రత్తగా ఉండాలి.
 
 టీకాలు
ఇలాంటి చోట్ల ప్రబలే వ్యాధులను గుర్తించి ముందుగానే అవసరమైన టీకాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయవచ్చు.
గుండెజబ్బులు ఉన్నవారు గుండెజబ్బులు ఉన్నవారు పుష్కరాలకు వెళ్లదలిస్తే, ముందుగా డాక్టర్లను సంప్రదించి, వారు సూచించిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీలో ఊపిరాడక గుండెజబ్బులు ఉన్నవారు స్పృహ తప్పినప్పుడు కార్డియో పల్మునరీ రీససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియను చేపట్టాలి.
 
గర్భిణులకు / మహిళలకు
ఇలాంటి ప్రదేశాల్లో గర్భిణులు గుంపులో చిక్కుబడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
చేతులు శుభ్రంగా కడుక్కోవడం
 ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకు తగినన్ని సబ్బులను అందరికీ అందుబాటులో ఉంచాలి.
 
చల్లారిన ఆహారం తీసుకోవద్దు
చల్లగా ఉండే పాలు తాగకూడదు. వేడిగా ఉన్న పాలనే తాగాలి. అలాగే చల్లారిపోయిన, నిల్వ ఉన్న ఆహారాన్ని పరిహరించాలి.
 
అందుబాటులో అంబులెన్స్‌లు
గాయపడ్డవారిని, స్పృహతప్పిన వారిని సత్వరమే ఆసుపత్రికి చేర్చడం కోసం అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలి.
 
వారిని ఇలా పట్టుకోవాలి
స్పృహతప్పిన వారిని ఆసుపత్రికి చేరవేసేందుకు ఎత్తినప్పుడు, మిగతా శరీర భాగాలకంటే తల కాస్త కిందికి ఉండేలా ఎత్తుకొని తీసుకురావాలి. దీనివల్ల రక్తపోటు పడిపోయిన వారికి, భూమ్యాకర్షణ వల్ల మెదడుకు తగినంత రక్తసరఫరా జరుగుతుంది. ఫలితంగా వారు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.
 
అంబూబ్యాగ్‌లు అవసరం
ఊపిరి అందక స్పృహ తప్పినప్పుడు వారికి తక్షణం ఊపిరి అందేలా చేయడానికి ‘అంబూ బ్యాగ్’ అనే ఉపకరణంతో శ్వాస అందించేందుకు ప్రయత్నం చేస్తారు. జనం పెద్ద ఎత్తున చేరే చోట్లలో తగినన్ని అంబూబ్యాగ్స్‌ను ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి.
 
జన్మస్థానమైన మహాబలేశ్వరం వద్ద కృష్ణానదిని ‘కృష్టాబాయి’ అని పిలుస్తారు. కృష్ణా నది పుట్టుక, మహిమల గురించిన ప్రస్తావన భాగవత, మార్కండేయ, వామన, నారద, వరాహ, బ్రహ్మాండపురాణాలతో పాటు మహాభారతంలో కూడా కనిపిస్తుంది.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు