ఆవిష్కరణం: శక్తిని అర్థం చేసుకుంటే కుక్కర్ వచ్చింది!

8 Sep, 2013 02:22 IST|Sakshi
ఆవిష్కరణం: శక్తిని అర్థం చేసుకుంటే కుక్కర్ వచ్చింది!

ప్రకృతిలో జరిగే ప్రతి చర్య మనకు కొన్ని విషయాలు నేర్పుతుంది. వాటిని అర్థం చేసుకోవడమే ఇన్వెన్షన్. యాపిల్ కిందపడటం అనేది ఒక్క న్యూటన్ మాత్రమే చూశారా.... లేదు. చాలామంది చూశారు. న్యూటన్ మాత్రమే దాన్ని అర్థం చేసుకున్నారు. ప్రకృతిలో సైన్స్ ఇమిడి ఉంది. ప్రెషర్ కుక్కర్ ఇన్వెన్షన్ కూడా అలాగే జరిగింది. ఆవిరితో ఏకంగా ఇంజిన్ నడిచింది. అది ఆలస్యంగా కనుక్కున్నారు గాని... స్టీమ్‌కు చాలా శక్తి ఉందని అంతకుముందు ఎప్పుడో తేలిపోయింది. డెనిస్ పాపిన్ ఆవిరి శక్తిని అర్థం చేసుకోవడం వల్లే ప్రెషర్ కుక్కర్ కనుక్కోగలిగారు. నీరు వంద డిగ్రీల సెంటీగ్రేడు వద్దకు రాగానే ఆవిరిగా మారి గాల్లో కలిసిపోతుంది. గాల్లో కలిసిపోతే దాని శక్తి వృథా అవుతుంది. కాబట్టి దాన్ని బంధించగలిగితే ఉపయోగం ఉంటుందని భావించారు డెనిస్. ఆయనకు ఆ ఆలోచన రావడమే కుక్కర్ అంకురార్పణ. ఒక పాత్రలో నీరు పోసి దానికి ఒక మూతపెట్టి లాక్ చేశారు.
 
  ఆవిరి బయటకు పోయే అవకాశం లేకుండా చర్య తీసుకున్నారు. దీంతో ఆ పాత్రలోని ఉష్ణోగ్రత వందకంటే ఎక్కువ నమోదైంది. అయితే, అత్యధిక ఒత్తిడివల్ల పాత్ర పేలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో అతను ఒత్తిడిని ఓ పరిమితిలో ఉంచడానికి ఓ వాల్వును తయారుచేశాడు. దీంతో ప్రెజర్‌కుక్కర్‌కు సంబంధించి 1679లోనే ఆవిష్కరణ జరిగినట్లయింది. ఫ్రాన్స్‌కు చెందిన పాపిన్ ఇంగ్లండ్‌లో ఈ పరిశోధనలు చేశారు. ఈ ఆవిరిని బంధించి మరింత వేడిని సృష్టించవచ్చని కనుగొన్న ఆయనకు లండన్ రాయల్ సొసైటీలో సభ్యత్వం వచ్చింది. కింగ్ చార్లెస్-2కు ఆయన 1682 ఏప్రిల్ 12న సాధారణ సమయం కంటే తక్కువ సమయంలో ‘డెయో’గా పదార్థాలను ఉడికించి చూపించారు.  అలా మొదటి కుక్కర్ వంట అధికారికంగా రాజు గారు ఆరగించారు.

మరిన్ని వార్తలు