జాతీయాలు

28 Feb, 2016 01:48 IST|Sakshi

పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం!
అన్ని సందర్భాలకూ ఒకే రకమైన పరిష్కారాన్ని ఆలోచించే వ్యక్తుల విషయంలో ఉపయోగించే మాట ఇది. మంత్రం అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్థం. అంత మాత్రాన ఒకే మంత్రం అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు. అన్ని సందర్భాలకూ సరిపోదు. ఉదాహరణకు పెళ్లి విషయాన్నే తీసుకుందాం. జీలకర్ర బెల్లం పెట్టే  సమయంలో చదివే మంత్రం వేరు, మాంగల్య ధారణ సమయంలో చదివే మంత్రం వేరు. రెండు సందర్భాల్లోనూ ఒకే మంత్రం ఎలా చదువుతారు!

అలాగే అధిదైవికం... వరదలు, భూకంపాలు, పిడుగులు మొదలైన ప్రమాదాలు జరిగినప్పుడు మూడుసార్లు శాంతి అని పలుకుతారు. పిడుగు పడినప్పుడు ‘అర్జునా... ఫల్గుణా...’ మంత్రం జపించడం కూడా చూస్తుంటాం. పురోహితులు బియ్యం వంటివి దానం తీసుకునేటప్పుడు స్వస్తి మంత్రం చదువుతూ ఆశీస్సులు పలుకుతారు. అయితే పిడుగు పడినప్పుడూ బియ్యం తీసుకున్నప్పుడూ ఒకే మంత్రం జపిస్తే ఎలా ఉంటుంది? చాలా అసంబద్దంగా ఉంటుంది కదా! అదే విధంగా సమస్య ఏదైనా ఒకలాగే పరిష్కరిద్దామని చూడకూడదు అని చెప్పడమే ఈ జాతీయం ఉద్దేశం.
 
తానా అంటే తందానా!
సంగీతం, నృత్యం, నాటకం...ఈ మూడింటి మేలు కలయిక బుర్రకథ. ఇందులో ముగ్గురు ప్రదర్శకులు ఉంటారు. ప్రధాన కథకుడు కథ చెబుతుంటే కుడి, ఎడమ వైపు ఉన్నవారు ‘తందాన తాన’ అని వంత పాడతారు. అందుకే దీన్ని తందాన కథ అని కూడా అంటారు. నిజానికి అతను చెప్పే కథ వాళ్లు వింటారో లేదో కూడా తెలీదు. అతని మాట పూర్తవగానే తందాన తాన అనేస్తారు. సమాజంలో కూడా కొందరు ఎదుటివాళ్లు చెప్పేదాన్ని గుడ్డిగా సమర్థించేస్తారు. ఇలా సొంత అభిప్రాయమనేది లేకుండా పక్షపాతంతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విషయంలో ఈ మాటను వాడుతుంటారు.
 
హంసగానం!
హంసల అందచందాల గురించి పురాణాల్లో గొప్పగా వర్ణించారు. ఇవి   ఆకాశగంగలో బంగారు తామరలు తింటూ విహరిస్తాయట. నల దమయంతుల వివాహానికి హంస చేసిన రాయబారం గురించి కూడా కవులు అందంగా వర్ణించారు. అందచందాలు, ప్రతిభ ఉన్నప్పటికీ  హంస ఎప్పుడూ పాడదట. ఒకవేళ పాడితే... అది చని పోయే ముందేనట! దీంతో ‘చావు’ అనేదానికి ‘హంసగానం’ అనేది ప్రత్యామ్నాయం అయింది.
 
చనిపోయిన తరువాత ‘ఆత్మ’ అనేది... హంస పాడే పాట రూపంలో పరమాత్మలో ఐక్యమై పోతుందనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక విశ్వాసం. అందుకే చనిపోయారు అని చెప్పడానికి ‘హంస లేచింది’ ‘హంసగానం’ అనే మాటలను వాడుతుంటారు.
 
కెరటాల కరణం!
లంచాలు తీసుకోవడంలో ఆరి తేరిన అధికారుల విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘ఆ ఆఫీసర్ అచ్చంగా కెరటాల కరణం’’ అంటుంటారు.  ఈ జాతీయం వెనుక ఒక కథ ఉంది: బ్రిటిష్ రాజ్యంలో ఒక కరణం లంచాల కోసం ప్రజలను తెగ పీడించేవాడట. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చి శిక్షగా ‘ఈ కరణాన్ని ఏదైనా ద్వీపంలో పడేయండి’ అని ఆదేశించింది. అలా అండమాన్ చేరుకున్న కరణంగారు బాధపడుతూనో, పశ్చాత్తాప పడుతూనో  కాలం వెళ్లబుచ్చలేదు.

సముద్రం ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని తెల్లకాగితాల్లో లెక్కలు రాసేవాడట. ‘ఈ రోజు వచ్చిన  అలల సంఖ్య... పెద్ద అలల సంఖ్య... చిన్న అలల సంఖ్య... ఒడ్డు వరకూ చేరని అలల సంఖ్య’... ఇలా లెక్కలు రాస్తూ కూర్చునేవాడట. ఒక రోజు ఒక పెద్ద ఓడ ఈయనకు సమీపంలోనే లంగరు వేసింది. కరణం ఆ ఓడ కెప్టెన్‌ను పిలిచి ‘‘ఈ సముద్రం నీ బాబుగాడిది అనుకున్నావా?

ఎవరి అనుమతి తీసుకొని ప్రయాణిస్తున్నావు? ఈ విషయం విక్టోరియా రాణిగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నీ  ఓడ వల్ల ఎన్ని అలలు వచ్చాయో లెక్క కూడా వేశాను’’... ఇలా ఉపన్యాసం దంచి జరిమానా కింద ఆ ఓడ కెప్టెన్ నుంచి డబ్బులు రాబట్టాడట. విషయం ప్రభుత్వానికి తెలిసి ‘ ద్వీపాం తరవాసంలోనూ వీడి బుద్ది మార లేదన్నమాట’ అని తలపట్టుకుందట!

మరిన్ని వార్తలు