జాతీయాలు

9 Apr, 2016 22:00 IST|Sakshi

అనామకంగా!
‘నిన్నా మొన్నటి వరకు అనామకంగా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు ప్రముఖుడయ్యాడు’
 ‘పాపం... అతడి జీవితం అనామకంగా ముగిసింది’... ఇలాంటి మాటలను వింటుంటాం. అసలేమిటీ అనామకం?
 పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఎవరి దృష్టీ సోకని వ్యక్తులు, ప్రదేశాల విషయంలో ‘అనామకం’ మాటను వాడుతుంటారు. ఈ అనామకం వెనుక ఒక పురాణకథ ఉంది.  బ్రహ్మదేవుడికి ఒకప్పుడు అయిదు తలలు ఉండేవట. ఒకసారి ఆయనకి, శివుడికి మధ్య యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంలో శివుడు  తన ఉంగరపు వేలి గోరుతో శివుడి అయిదవ తలను సంహరించాడు. ఉంగరపు వేలును సంస్కృతంలో అనామిక అంటారు. ఏ వేలుతో అయితే శివుడు బ్రహ్మదేవుడి తలను సంహరించాడో,  ఆ వేలును వేదకర్మలలో ఉపయోగించకూడదని, ఉచ్చరించకూడదనే నియమం ఏర్పడింది. ఈ  అనామిక నుంచే అనామకం అనే జాతీయం పుట్టింది.
 
బాదరబందీ!
పూర్వపు రోజుల్లో రాజుల దగ్గర పని చేసే ఉన్నతోద్యోగులు పొడవాటి అంగరఖా ధరించేవారు. అంగరఖా కుడి, ఎడమ అంచులను చిన్న చిన్న  దారాలతో ముడివేసేవాళ్లు. అవి మొత్తం పన్నెండు ఉండేవి. రోజూ ఈ పన్నెండు ముళ్లనూ వేయడమనేది సహనానికి పరీక్షలా ఉండేది. అలా అని కుదరదు అనడానికి లేదు. చచ్చినట్లు వాటిని కట్టుకొని కొలువుకు వెళ్లాల్సిందే.
 
హిందీలో పన్నెండును బారా అంటారు. బారా, బాధ... ఈ రెండూ కలిసి ‘బాదర’గా రూపుదిద్దుకుంది. దీనికి చివర ‘బందీ’ కూడా చేరిపోయింది. చికాకు పుట్టించి, సమస్యగా తోచే వ్యవహారాలు, భారంగా తోచే అనివార్య బాధ్యతల విషయంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ‘అతడికి ఎలాంటి బాదరబందీ లేదు. హాయిగా కాలం గడుపుతున్నాడు’... ‘నీకేం ఎన్నయినా చెబుతావు. మాలా బాదరబందీ ఉంటే అర్థమవుతుంది’... ఇలా అన్నమాట!
 
కబంధ హస్తాలు!
ఎవరైనా చెడ్డవ్యక్తుల బారిన పడినప్పుడు- ‘ఆ కబంధహస్తాల  నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు’ అంటుంటారు. ఇంతకీ ఏమిటీ కబంధ?  అడవిలో సీతమ్మ కోసం రామలక్ష్మణులు వెదుకుతున్నప్పుడు వారి ముందుకు ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి కాళ్లు, తల, మెడ ఉండవు. కడుపు భాగంలో మాత్రం నోరు ఉంటుంది! చేతులైతే చాలా పొడవు. ఎవరైనా తన నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తే చేతుల్తో పట్టుకునేవాడు.

ఆ పట్టు చాలా గట్టిగా ఉండేదట. అందుకే కబంధ హస్తం అని పేరొచ్చింది. ఆ చేతుల్ని తర్వాత రామలక్షణులు నరికేస్తారు. నిజానికి కబంధుడు అందగాడు. కానీ అహంకారి. ఓసారి ఒక మునిని ఆట పట్టించడానికి వికృతరూపం ధరిస్తే.. ఆ మునికి కోపం వచ్చి- ‘‘ఈ రూపమే నీకు శాశ్వతంగా ఉంటుంది’’ అని శపిస్తాడు.
 
అలంకృత శిరచ్ఛేదం!

పూర్వపు రోజుల్లో నేరాలు ఘోరాలు చేసిన వారి తల నరికేసేవారు. అయితే నరకడానికి ముందు నేరస్తుడి కోరిక ఏదైనా ఉంటే తీర్చేవారు. అంతేకాదు... అతడి తలను అందంగా అలంకరించేవారు. ఆ తరువాతే ఆ తలను నరికేవారు. దాని ఆధారంగానే ఈ జాతీయం పుట్టింది.
 కొందరు తమ పని పూర్తయ్యేంత వరకు... చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే వారి పని పూర్తయిపోతుందో, అప్పటి నుంచి వారి స్వభావంలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. వారిలోని దుర్మార్గం బట్టబయలై భయపెడుతుంది. ఇలాంటి వారి విషయంలో ఉపయోగించే జాతీయం ఇది.

మరిన్ని వార్తలు