జాతీయాలు

11 Jun, 2016 23:09 IST|Sakshi

నక్షత్రకుడు!
‘నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’
 ‘అబ్బో... అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు.
 నక్షత్రకుడు విశ్వామిత్రుడి శిష్యుడు. విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు ఇవ్వవలసిన డబ్బును రాబట్టడానికి... హరిశ్చంద్రుడితో పాటు నీడలా వెళతాడు. హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలతో నడుస్తుంటే ‘నేను నడవలేను’ అని కూర్చునేవాడు. సరే అని కూర్చుంటే నిలబడేవాడు.

‘‘నేను నడవలేక పోతున్నాను నన్ను ఎత్తుకో’’ అనేవాడు. నీళ్లు దొరకని చోటు చూసి నీళ్లు కావాలి అని అడిగేవాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు.
 రకరకాల సమస్యలతో బాధ పడే వారికి ఎవరైనా సరికొత్త సమస్యగా తయారైతే అలాంటి వ్యక్తిని నక్షత్రకుడితో పోల్చుతారు.
 
గజ్జెలు కట్టిన కోడి!
తమ సహజ అవలక్షణాలను మార్చుకోని వారి విషయంలో వాడే మాట ‘గజ్జెలు కట్టిన కోడి’.
 ‘కోడికి గజ్జెలు కడితే కుప్ప కుళ్లగించకుండా ఉంటుందా?’ అని అంటుంటారు. వెనకటికి ఒకాయన దగ్గర ఒక కోడి ఉండేది. ఆ కోడి  తన సహజశైలిలో పెంటకుప్పల వెంట తిరిగేది.
 
తన ముద్దుల కోడి ఇలా అసహ్యంగా పెంటకుప్పల మీద తిరగడం ఆ ఆసామికి నచ్చలేదు. దీంతో ఆ కోడిని బాగా అలంకరించి కాలికి గజ్జె కట్టాడు. ఈ అలంకారాలతో కోడి ప్రవర్తనలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్మాడు. ఎంతగా అలంకరించినా కోడి మాత్రం తన సహజశైలిలో చెత్తకుప్పలు కుళ్లగించడం మానలేదు!
 
శశ విషాణం
అసాధ్యమైన పనులు లేదా వృథాప్రయత్నాల విషయంలో వాడే జాతీయం ‘శశ విషాణం’.
 ‘నువ్వు చెబుతున్న పని శశ విషాణం సాధించడంలాంటిది’.
 ‘శశ విషాణం కోసం ప్రయత్నించి విలువైన సమయాన్ని వృథా చేయకు’  ఇలాంటి మాటలు వినబడుతూ ఉంటాయి.
 
శశం అంటే కుందేలు.
 విషాణం అంటే కొమ్ము.
 కుందేలుకు పెద్ద చెవులే గానీ కొమ్ములు ఉండవు కదా! ఇలా లేని దాని కోసం ప్రయత్నించడం, అసాధ్యమైన వాటి గురించి ఆలోచించే విషయంలో ఉపయోగించే ప్రయోగమే శశ విషాణం.
 
 చగరుడాయ లెస్సా అంటే...
శేషాయ లెస్సా అన్నట్లు!

 ఇద్దరూ సమ ఉజ్జీలైనప్పుడు పలకరింపుల్లో గానీ, పట్టుదల విషయంలో గానీ ఎవరికి వారు ‘నేనే గొప్ప’ అనుకుంటారు. ఈ ఇద్దరిలో ఒకరు చొరవ తీసుకొని మొదట పలకరిస్తే... రెండో వ్యక్తి అతిగా స్పందించడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు.
 ‘బాగున్నారా?’ అని మొదటి వ్యక్తి పలకరిస్తే-
 ‘బాగున్నాను. మీరు బాగున్నారా?’... అని రెండో వ్యక్తి సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతాడు. ఇంతకు మించి సంభాషణ ముందుకు సాగదు.
 గరుడుడు, శేషుడు... వీరిలో గొప్ప ఎవరు అంటే ఏమి చెప్పగలం?
ఎవరికి వారే గొప్ప!
‘ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, పలకరించుకోవాలి కాబట్టి పలకరించుకున్నారు...’ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ‘‘వారి మాటల్లో పెద్ద విశేషాలేమీ లేవు. ఏదో... గరుడాయ లెస్సా అంటే శేషాయ లెస్సా అన్నట్లు పలకరించుకున్నారు’’ అంటుంటారు.

మరిన్ని వార్తలు