జాతీయాలు

23 Jul, 2016 21:47 IST|Sakshi

కాటి కాపరి ఏడుపు
కాటి కాపరి రోజూ... చావులను చూస్తూనే ఉంటాడు. కాబట్టి అతడు చలించడంగానీ, బిగ్గరగా దుఃఖించడంగానీ ఉండదని ఒక అభిప్రాయం ఉంది. జనన మరణాలకు అతీతంగా ఏ భావానికీ చలించకుండా అతని మనసు స్థిరంగా ఉంటుంది. మరి అలాంటి ఒక కాటికాపరి ఒక రోజూ ఏడుస్తూ కనిపించాడట. విషయం ఏమిటని ఆరా తీస్తే... ‘‘ఈరోజు ఒక్క శవమూ రాలేదు’’ అన్నాడట. శవం రాకపోతే సంతోషించాలిగానీ, ఏడ్వడం ఎందుకు? అనే సందేహం వస్తుంది. అయితే మరో కోణంలో చూస్తే మాత్రం... శవసంస్కారంతోనే కాటికాపరి ఉపాధి ముడిపడి ఉంది.

శవం రాకపోతే... ఆరోజు అతడు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎవరి బాధ వారిది. దీన్ని దృష్టిలో పెట్టుకునే...ఎవరైనా లోకనీతి గురించి ఆలోచించకుండా తన స్వప్రయోజనాల కోసం బాధపడితే... అలాంటి వారిని ఉద్దేశించి ‘కాటి కాపరి ఏడుపు ఏడుస్తున్నాడు’ అని అంటారు.
 
గౌతముడి గోవు
‘ఆయన జోలికి వెళ్లకు. గౌతముడి గోవులాంటోడు... ఇబ్బందుల్లో పడతావు’ అంటుంటారు. కొందరు చాలా సున్నిత మనస్కులు ఉంటారు. వారితో వ్యవహరించడంలో ఏ మాత్రం తేడా వచ్చినా... అవతలి వ్యక్తి ఇబ్బందుల్లో పడతాడు. విషయం ఎక్కడికో వెళ్లిపోతుంది. పురాణాల్లో గౌతముడు అనే మహర్షికి సంబంధించిన కథ ఇది. పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఒక మాయధేనువు వచ్చింది. గోవు పవిత్రమైనది కాబట్టి దానికి ఏ ఇబ్బందీ కలగకుండా గడ్డిపరకతో సున్నితంగా అదిలించాడు గౌతముడు. ఈమాత్రం దానికే ఆ గోవు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంది. ఈ పురాణ కథ నుంచే ‘గౌతముడి గోవు’ అనే మాట పుట్టింది, అకారణంగా, ఉత్తపుణ్యానికి ఇబ్బందుల్లో పడినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
 
గువ్వకుత్తుక!
కొందరు చూడడానికి చాలా ధైర్యవంతుల మాదిరిగా కనిపిస్తారు. తీరా ఏదైనా కష్టం వస్తే మాత్రం... గొంతు స్వభావమే మారిపోతుంది... బలహీనమై వినిపిస్తుంది’’ ‘‘నిన్నటి వరకు పులిలా ఉన్నాడు. ఈరోజు కష్టం రాగానే గువ్వకుత్తుక అయ్యాడు’’ అంటారు. గువ్వ అనేది అడవి పావురం. ఇది చూడడానికి బలంగా ఉంటుంది. కానీ దాని గొంతు మాత్రం బలహీనంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారు అరిచినట్లుగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పుట్టిన జాతీయమే గువ్వ కుత్తుక.
 
బాదరాయణ సంబంధం
కొందరు బీరకాయపీచు బంధుత్వాలతో చుట్టాలుగా చలామణీ అవుతారు. కొందరికి ఆ ‘బీరకాయపీచు బంధుత్వం’ కూడా అక్కర్లేదు. మాటలతోనే చుట్టాలవుతారు. వెనకటికి ఒక వ్యక్తి ఒక ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఒక ఊళ్లో ఒక ఇంటి ముందు ఆగాడట. ఆ ఇంటాయనను పిలిచి ‘అంతా కులాసేనా? పిల్లలందరూ బాగున్నారా?’ అని అడిగాడట. బండిలో వచ్చిన వ్యక్తి చుట్టం కాబోలు అనుకొని ఇంటాయన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేశాడట.

బండి వ్యక్తి వెళ్లిపోయే ముందు... ఇంటాయన ఆతృత ఆపుకోలేక ఇలా అడిగాడట... ‘అయ్యా... నేను ఎంత ప్రయత్నించినా నాకు మీరు ఏ వైపు చుట్టమో గుర్తు రావడం లేదు’. దీనికి బండిలో వచ్చిన వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇది... ‘మీ ఇంటి ముందు బదరీ చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు కూడా బదరీ చెక్కతో తయారు చేసినవే. ఇదే బాదరాయణ సంబంధం’.

మరిన్ని వార్తలు