జాతీయాలు

4 Sep, 2016 00:34 IST|Sakshi

ఘట్టకుటీ ప్రభాతం
తప్పించుకోవాలని ప్రయత్నించినా ఏదో విధంగా దొరికిపోయే  సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇది.
 ‘నా నుంచి తప్పించుకోవాలని నానా రకాలుగా ప్రయత్నించాడు. కానీ ఏంలాభం? చివరికి ఘట్టకుటీ ప్రభాతం అయింది’ అంటుంటారు.
 ఘట్టం అంటే పన్నులు వసూలు చేసే స్థలం.
 కుటీ అంటే గుడిసె.
 ప్రభాతం అంటే తెల్లవారడం.
 పూర్వం రాజుల కోటల్లో సింహద్వారం ఉండేది.
 ప్రజల రాకపోకలన్నీ ఈ సింహద్వారం నుంచే కొనసాగేవి.  పన్నులు వసూలు చేసే అధికారులు ఇక్కడ ఒక గుడిసెలో ఉండేవారు.

రాకపోకలన్నీ  సింహద్వారం నుంచే కాబట్టి పన్నులు ఎగ్గొట్టాలనుకునే వారి పప్పులు ఉడికేవి కావు. చచ్చినట్లు పన్ను కట్టాల్సి వచ్చేది.
 వెనకటికి ఒక వ్యాపారి పన్ను  ఎగ్గొట్టడానికి ప్రయత్నించాడు.  పన్నులు వసూలు చేసే అధికారులు మాంచి నిద్రలో ఉండగా వారి కనుగప్పి తప్పించుకుపోదామనుకున్నాడు. అయితే ఊరంతా తిరిగి ఆ  పన్నులు వసూలు చేసే  గుడిసె దగ్గరికి వచ్చే సమయానికి ప్రభాతమైంది...అంటే తెల్లవారిందన్నమాట. దీనితో ఆ వ్యాపారి పన్ను కట్టక తప్పలేదు! ఈ కథలో నుంచి పుట్టిన జాతీయమే ‘ఘట్టకుటీ ప్రభాతం’.
 
ఘుణాక్షరం
ఏదైనా రాయడానికి   కాగితం మీద పెన్నుతో రాస్తున్నాం లేదా టైప్ చేస్తున్నాం.
 పూర్వం మాత్రం  తాటాకులు తప్ప వేరే మార్గం లేదు.
 తాటాకులపై గంటంతో రాసేవారు.
 అయితే బాగా పాతబడిన తాటాకులకు పురుగులు పట్టేవి. ఆ క్రమంలో కొత్త కొత్త ఆకారాలు తాటాకుల మీద ఏర్పడేవి. కొన్ని అయితే అచ్చం అక్షరాల్లా ఉండేవి. వీటిని ఘుణాక్షరాలు అనేవాళ్లు.
 ఏ ఉద్దేశం లేకుండా ఒక పని చేయడాన్ని ‘ఘుణాక్షరం’తో పోల్చుతారు.
 ‘అది ఉద్దేశపూర్వకంగా  చేసిన పని కాదు... ఘుణాక్షరం’ అంటుంటారు.
 
చవితి చంద్రుడు!
‘తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేశాను. ఈ మాత్రం దానికే నన్ను చవితి చంద్రుడిని చేశారు’
 ‘నన్ను చూడడానికి కూడా భయపడుతున్నావు. నేనేమైనా చవితి చంద్రుడినా ఏమిటి?’....ఇలా రకరకాల సందర్భాలలో ‘చవితి చంద్రుడు’ అనే మాటను ఉపయోగించడం చూస్తూనే ఉంటాం.
 చవితి రోజు భూలోకంలో నైవేద్యం ఆరగించిన వినాయకుడు కైలాసం చేరుకొని తల్లిదండ్రులకు నమస్కరించడానికి ప్రయత్నించాడుగానీ భుక్తాయాసం వల్ల అది సాధ్యం కావడం లేదు.
 వినాయకుడు పడే ఇబ్బందిని చూసి శివుడి తలలోని చంద్రుడు నవ్వాడు.
 తన కుమారుడిని చూసి నవ్వినందుకు...
 ‘‘నిన్ను చూసిన వారంతా నీలాపనింద లతో బాధపడుగాక’’ అని శపించింది పార్వతిదేవి.
 ఆ తరువాత మాత్రం  ఈ శాపం శుద్ధ చవితికి మాత్రమే పరిమితమైంది.
 
యక్షప్రశ్నలు
పాండవులు వనవాసంలో  ఉన్నప్పుడు... దర్మరాజుని పరీక్షించడానికి యక్షుని రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలే యక్షప్రశ్నలు. సూర్యుడిని ఉదయింపచేయువారు ఎవరు? సూర్యుడిని ఆస్తమింపచేయునది ఏది? జీవన్మృతుడెవరు? భూమి కంటే భారమైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? జన్మించి కూడా ప్రాణం లేనిది ఏది? రూపం ఉన్నా హృదయం లేనిది ఏది? మనిషికి ఆత్మ ఎవరు....ఇలా యక్షుని రూపంలో యమధర్మరాజు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు తగిన విధంగా సమాధానం ఇస్తాడు.
 ఇక వ్యవహారంలోకి వస్తే....
 ఎవరైనా చిక్కుప్రశ్నలు, కఠిన ప్రశ్నలు వేసే సందర్భంలో ఉపయోగించే మాట...యక్ష ప్రశ్నలు!

మరిన్ని వార్తలు