పులిరాజా వారి సత్యశోధన

15 Oct, 2017 00:46 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

ఒక పులి ముసలితనంలో తొందరపడి సన్యాసం తీసుకుంది. బొమికలు కొరకాల్సిన చేతుల్తో రుద్రాక్షమాల గిరగిరా తిప్పడం మొదలెట్టింది. కమండలాన్ని ఊతకర్రగా పెట్టుకొని, గతంలో తాను వేటాడి చంపిన జింక చర్మంపై కూచుని తాపీగా ధర్మబోధలు ప్రారంభించింది. జంతువులు ఎందుకైనా మంచిదని దూరంగా ఉండి ప్రవచనాలు వినసాగాయి. దగ్గరికెళితే మోక్షం లభించినా లభించవచ్చని వాటి నమ్మకం.ఇంటర్వ్యూలకి మనుషులెవరూ మిగలకపోయేసరికి టీవీ చానళ్ల వాళ్లు అడవి మీద పడి ఎలాగో సన్యాస పులిని వాసన పట్టారు. ఆ సమయానికి చెట్టుమీద పులి నిద్రపోతూ ఉంది. నిచ్చెనలేసుకుని మరీ దాన్ని గోకారు. పులి భయంతో కిందపడి గాండ్రుమంది. ఒకరిద్దరు విలేకరులు జడుసుకున్నప్పటికీ న్యూస్‌ మిస్సయితే గర్జించే బాస్‌ మొహం గుర్తొచ్చి తమాయించుకున్నారు.స్పిరిట్‌కైనా, స్పిరిచ్యువాలిటీకైనా ఈ రోజుల్లో పబ్లిసిటీ అవసరం. కెమెరాలు చూడగానే పులి మీసాలు దువ్వుకుంది. ఒకరిద్దరు వచ్చి దాని మొహానికి పౌడర్‌ అద్ది, మైక్‌ని పంజాకి తగిలించి వెళ్లారు. ఇంటర్వ్యూ ప్రారంభమైంది.

‘‘చెప్పండి పులిరాజా, మీరు సన్యాసం ఎందుకు స్వీకరించారు?’’ ‘‘పులికి, పులిస్తారకుకి తేడా తెలియని లోకమిది. టైని మెడకి కట్టుకున్న ప్రతివాణ్నీ టైగర్‌ అనుకునే కాలమిది. సత్యానికి, అసత్యానికి సరిహద్దురేఖ చెరిగి పోయినపుడు సన్యాసమే పరమధర్మమని గ్రహించాను’’‘‘మీరు సన్యాసం స్వీకరించాక సన్యాసిగా మారారా? సన్యాసి అని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాత సన్యాసం స్వీకరించారా?’’ఈ ప్రశ్నకి పులి పులిగోరుతో బుర్రని గోక్కుంది.‘‘వేటాడే శక్తి లేనివాళ్లని మా పులి కమ్యూనిటీలో సన్యాసి అని అంటారు. అనివార్యత సంభవించినపుడు సన్యాసాన్ని యోగం అనుకోవాలి’’ అని చెప్పింది పులి.‘‘అంటే మీరిప్పుడు కందమూలాల్ని తింటారా?’’‘‘కందమూలాల్ని తినడం మా పులి మూలాల్లోనే లేదు. సన్యాసానికి ముందు జంతువుల్ని నమిలి తినేదాన్ని. ఇప్పుడు పళ్లు లేవు కాబట్టి నమలకుండా తింటున్నాను.’’‘‘అది హింస కాదా?’’‘‘తెలిసి చేస్తే హింస, ఆకలేసి చేస్తే అహింస’’‘‘ఏంటో తేడా?’’‘‘నేను జంతువుల్ని వేటాడితే హింస, నా దగ్గరకొచ్చిన జంతువుల్ని తింటే అహింస. అహింసా పద్ధతుల్లో వేటాడ్డం సన్యాసుల లక్షణం’’ఈసారి విలేకరులు బుర్రగోక్కుని టాపిక్‌ను డైవర్ట్‌ చేయాలనుకుని‘‘ఈ సమాజంపై మీ అభిప్రాయం?’’ అని అడిగారు.‘‘పులి వేషగాళ్లని పులులనుకుంటుంది. పులిని చూసి పులేషమనుకుంటుంది’’ ‘‘జంతు స్వామ్యం గురించి చెప్పండి’’ ‘‘జంతువులకి కూడా హక్కులుంటాయని జంతువులు నమ్మడం జంతుస్వామ్యం. పులికి అంతకుమించి హక్కులుంటాయని పులి నమ్మడం పులిస్వామ్యం. రాజ్యమెప్పుడూ పులిస్వామ్యం పక్షానే ఉంటుంది. హక్కులు పుస్తకాల్లో ఉంటాయి. కోరలు పులికి ఉంటాయి. పులిపేరుతో నువ్వు పులిహోరను తినగలవు. పేరులో పులి ఉందని పులి ఎప్పుడూ పులిహోర తినదు.’’

‘‘పాలిటిక్స్‌ ఎందుగ్గానీ సినిమాలు చూస్తారా?’’ ‘‘పులి క్షణాల్లో చంపితే, సినిమా రెండున్నర గంటలు చంపుతుంది’’ ‘‘అడవిలో ఎందుకు ఉండడం? జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చుగా..’’‘‘పిచ్చోడా, పులులు మనుషులుగా మారి చాలా కాలమైంది. జాగ్రత్తగా గమనించి చూడు.. మీ పక్కింట్లో, ఎదురింట్లో కూడా పులులుంటాయి. ప్లాస్టిక్‌ సర్జరీతో చారలను మాయం చేసుకుని ఉంటాయి’’‘‘మీ సందేశమేమిటి?’’ ‘‘ఈ ప్రపంచమొక అడవి. నువ్వు పులివో, జింకవో నిర్ధారించుకో. పులివైతే జింకను వేటాడు. జింకవైతే పులినుంచి పారిపో. పారిపోవడం కూడా యుద్ధం లాంటిదే. ఆయుధం లేకుండా యుద్ధం చేయడమే జీవితం.’’ ఒక విలేకరిని అందుకొని నమలబోతే మింగుడుపడలేదు. ‘‘విలేకరులంటే కొరకని కొయ్యలు పులిరాజా!’’ అంటూ కెమెరాలు సర్దుకొని వెళ్లిపోయారు.
– జి.ఆర్‌.మహర్షి

మరిన్ని వార్తలు