పుల్ త్రూ బ్రెయిడ్ షినాన్

25 Jun, 2016 23:10 IST|Sakshi
పుల్ త్రూ బ్రెయిడ్ షినాన్

సిగ సింగారం
ఈ హెయిర్ స్టయిల్‌ను ‘పుల్ త్రూ బ్రెయిడ్ షినాన్’ అంటారు. ఇది ఎలాంటి డ్రెస్సుల మీదికైనా నప్పుతుంది. అంతేకాదు ఎలాంటి పార్టీలకైనా వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టయిల్‌ను వేసుకోవడానికి జుత్తు ఓ మోస్తరు పొడవున్నా సరిపోతుంది. కాబట్టి అందరూ దీన్ని హాయిగా ఈజీగా వేసుకోవచ్చు. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే ట్రై చేయండి మరి.

 
ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఎడమ చెవి వైపు రెండు చిన్న పోనీలు వేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టేయాలి.
 
తర్వాత మొదటి పోనీని రెండు పాయలుగా పట్టుకొని.. మూడో పాయగా రెండో పోనీని తీసుకోవాలి.
 
ఇప్పుడు ఆ మూడు పాయలతో ఒకటి లేదా రెండు అల్లికలు అల్లాలి.
 
ఆ మూడు పాయల్ని రెండుగా చేసి, పక్క నుంచి మరి కొంత జుత్తును తీసుకొని అల్లుకోవాలి.
 
పైనున్న మూడుపాయల్ని రెండుగా చేసి.. రెండో దానికి బ్యాండు పెట్టాలి.
 
ఫొటోలో కనిపిస్తున్న రెండు పాయలకు.. పక్క నుంచి మరో పాయను తీసి కొద్దిగా అల్లాలి. ముందులాగే మూడు పాయల్ని రెండుగా చేసి, ఒకదానికి బ్యాండు పెట్టాలి. తర్వాత అలా మిగిలిన జుత్తును కూడా సన్నని పాయలుగా తీసుకొని అల్లికలో కలుపుకుంటూ పోవాలి.
 
ఇప్పుడు మీ జుత్తు ఫొటోలో కనిపిస్తున్న విధంగా మారుతుంది. చివర మిగిలిన పోనీని మళ్లీ చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.
 
పైన అల్లుకున్న అల్లికలు మరీ టైట్‌గా లేకుండా.. ఒక్కో పాయను కదిలిస్తూ వదులు చేసుకోవాలి.
 
మిగిలిన పోనీని మూడు పాయలుగా చేసుకొని పూర్తిగా అల్లుకోవాలి.
 
చివరగా ఆ అల్లిన జుత్తును ఎడమవైపుకు తీసుకెళ్లి, మడిచి స్లైడ్స్ పెట్టేయాలి. కొప్పు వదులు కాకుండా కావలసిన చోట స్లైడ్స్ పెట్టాలి. కొప్పు వద్దనుకుంటే.. ఎనిమిదో స్టెప్‌తో ఆపేసి, కలర్‌ఫుల్ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే సరి.

మరిన్ని వార్తలు