వ్యక్తిగతం: అలా పెరిగితే గైనకోమాజియా

22 Feb, 2014 23:10 IST|Sakshi
వ్యక్తిగతం: అలా పెరిగితే గైనకోమాజియా

 డాక్టర్! నేను ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఏడాదిగా జిమ్‌కు వెళ్తున్నాను. రెండు వైపులా ఛాతీ పెరిగినట్లుగా అనిపిస్తోంది. జిమ్ చేయడం వల్ల ఛాతీ పెరిగిందో, రొమ్ములు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. చనుమొనల చుట్టూ కండ పెరిగింది. జిమ్‌లో చొక్కా విప్పడానికి సిగ్గుగా ఉంది. సలహా ఇవ్వగలరు.
 - ఇ.ఎస్.ఆర్., నెల్లూరు
 
 ఇలాంటి సమస్యలు సాధారణంగా యౌవనంలో ఉన్నవారిలో చూస్తూవుంటాం. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతిని, మగవారిలో ఇలా ఛాతీ పెరగడాన్ని గైనకోమాజియా అంటారు. ఇలాంటి కేసుల్లో 50 శాతం మందిలో కారణాలు ఏమీ ఉండవు. చాలా అరుదుగా ప్రోలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా జరగడం వల్ల ఇలా కావచ్చు. ఇలాంటివారిలో తలనొప్పి, కంటిచూపు వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. రక్తపరీక్షలో ప్రొలాక్టిన్ పాళ్లు ఎక్కువగా ఉంటే గనక అవసరాన్ని బట్టి ఎమ్మారై స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఇలాంటి అవసరం రాదు. ఒకవేళ ప్రొలాక్టిన్ సాధారణంగానే ఉంటే గనక, మీరు లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ లేకుండానే అదనపు కొవ్వును తీయించుకోవచ్చు.
 
 
 నేను వివాహితుణ్ని. కుడిపక్కన వరిబీజం అయ్యింది. డాక్టర్‌ను కలిస్తే, ఆపరేషన్ సూచించారు. కానీ ఆపరేషన్ అయితే, లైంగిక సామర్థ్యం తగ్గుతుందేమో, పిల్లలు పుట్టరేమో అని భయంగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు.
 - టి.ఎస్., కర్నూలు
 
 హైడ్రోసీల్, హెర్నియా సమస్యలు వచ్చినప్పుడు చేసే ఆపరేషన్లకూ అంగస్తంభనకూ ఎలాంటి సంబంధమూ లేదు. అంగం స్తంభించడానికి ఉపయోగపడే నరాలు అంగంలో చాలా లోపలికి ఉంటాయి. మీకు ఆపరేషన్ వృషణాల దగ్గర చేస్తారు. కాబట్టి, దీని వల్ల లైంగిక కార్యానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలు పుట్టకపోవడం కూడా జరగదు. మీది అకారణ భయమే! నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి.
 
 నేను ఉద్యోగం నుంచి రిటైర్ కావాల్సిన వయసులో ఉన్నాను. అయితే, లైంగిక కోరికలు బాగానే ఉన్నాయి. కానీ శృంగారం తర్వాత వీర్యం చాలా తక్కువగా పడుతోంది. నాలో పటుత్వం తగ్గడం వల్లే ఇలా జరుగుతోందా? మరేదైనా కారణమా?
 - కె.వై., హైదరాబాద్
 
 దాదాపుగా మీరు అరవైలోకి వచ్చారు. ఈ వయసు వారిలో వీర్యం తక్కువగా రావడం అన్నది సాధారణ విషయమే. దీన్నో సమస్యగా భావించనక్కర్లేదు. వీర్యం ప్రధానంగా సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. లైంగిక సంతృప్తికీ, వీర్యం పరిమాణానికీ సంబంధం లేదు. అలాగే లైంగిక పటుత్వానికీ, వీర్య పరిమాణానికి కూడా సంబంధం లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల స్రావం తగ్గడం వల్ల మీలో ఇలా జరుగుతోంది. కాబట్టి దీని గురించి చింతించనవసరం లేదు. వీర్యం పెరిగేందుకు ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరమూ లేదు. మీరు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, మీ సాధారణ ఆరోగ్యం బాగుండేలా చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ శృంగార జీవితం కూడా బాగుంటుంది.
 
 నా వయుసు 30 ఏళ్లు. పెళ్లికాలేదు. వృషణాల్లో నొప్పిగా ఉంటోంది. లాగుతున్నట్టుగా కూడా ఉంది. దీనివల్ల అవి చిన్నవిగా మారినట్టుగా అనిపిస్తోంది...
 - వి.సీహెచ్., హైదరాబాద్
 
 మిగతావారితో పోల్చితే తవు వృషణాలు చిన్నగా ఉన్నాయేమోననే అపోహ చాలామందిలో ఉంటుంది. ఇది మినహా మరే సమస్యా లేకపోతే గనక మీరు భయపడాల్సింది ఏమీలేదు. అరుుతే అంతకుముందు నిజంగానే పెద్దవిగా ఉండి, ఇప్పుడు తగ్గిపోయినట్టనిపిస్తే, అందులో నొప్పి కూడా ఉంటే దానికి కారణం వేరికోసిల్ అయివుండవచ్చు. ఇది కేవలం అనుమానమే! ఎందుకైనా మంచిది మీరోసారి యుూరాలజిస్టును కలవండి. డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, ఏదైనా సమస్య ఉందో లేదో నిర్ధారిస్తారు. దానికనుగుణంగానే చికిత్స!
 
 - డా. వి.చంద్రమోహన్,
 యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్,
 కెపిహెచ్‌బి, హైదరాబాద్
 మీ సందేహాలను పంపవలసిన చిరునామా: వ్యక్తిగతం, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. vyaktigatam.sakshi@gmail.com
 

మరిన్ని వార్తలు