రాజుగారి గది

16 Oct, 2016 01:20 IST|Sakshi
రాజుగారి గది

సూర్యనారాయణరాజు చనిపోయి సరిగ్గా రెండు సంవత్సరాలవుతుంది.కానీ ఆ చిన్న ఊళ్లో ఆయన్ను ఎవరూ మరిచిపోలేదు. మంచికి, చెడుకి ఆయన పేరు ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంది. సూర్యనారాయణరాజు నాన్న పెద్ద జమీందారు. ఆయన ముగ్గురు కొడుకుల్లో సూర్యనారాయణరాజు చిన్నవాడు.అందరూ ‘చిన్నరాజుగారు’ అని పిలిచేవారు. అన్నలిద్దరిలో ఉండే లక్షణాలు చిన్నరాజుగారిలో బొత్తిగా ఉండేవి కాదు. వాళ్లేమో...
 
 ‘మామూలు మనుషులు వేరు. మనం వేరు’ అన్నట్లుగా ఉండేవాళ్లు. తమకు తామే ప్రత్యేకత ఆపాదించుకునేవారు. కానీ... చిన్నరాజుగారు అలా కాదు.పేదా, గొప్ప అనే తేడా లేకుండా... అందరితో కలిసిపోయేవారు. ఎక్కువ సమయం కోటలోని తన గదిలో పుస్తకాలు చదువుతూ గడిపేవారు.
   
 జమీందారు, ఆయన భార్య కాలం చేశారు.
 ఆయన కొడుకుల్లో ఒకరు అమెరికా, మరొకరు ఇంగ్లండ్‌లో సెటిలయ్యారు.
 రాజుగారు మాత్రం ఆ పెద్ద కోటలో చిన్న గదిలో ఒంటరిగా సంగీతం వినడం, పుస్తక పఠనంతో గడిపేవారు.
 
 ఎందుకనో ఏమో... ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.కొన్ని సంవత్సరాల తరువాత... చిన్న రాజుగారు మానసికంగా దెబ్బతిన్నారు. మతి చలించింది.ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు.
 
 కనిపించిన వారినల్లా ఎప్పుడూ... ఏవో ప్రశ్నలు అడిగి... వాటికి సమాధానం ఇవ్వమని అడిగేవారు. రాజుగారి ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో... ఒకరోజు ఆయన చనిపోయారు.
 ఇద్దరు అన్నలు విదేశాల్లో ఉండడంతో... ఊరి వాళ్లే రాజుగారి అంత్యక్రియలు చేశారు.
 రాజుగారు చనిపోయిన తరువాత... కోట బీడు పడింది. ఎవరూ లేని ఎడారిగా మారింది.
   
 రాజుగారి గది గురించి రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. రాజుగారు దెయ్యమై తిరుగుతున్నారని, కోటలోని ఆయన గది నుంచి అర్ధరాత్రి నవ్వులు వినిపిస్తున్నాయని కూడా అనుకునేవారు. ఆ గదిలో విలువైన అభరణాలేవో ఉన్నాయట. వీటిని కాజేయడానికి కొందరు దొంగలు ప్రయత్నించారట, వారికి నగలు దక్కకపోగా... సంవత్సరం తిరక్కుండానే... ఏవేవో కారణాలతో చనిపోయారట. కోటలో ఎక్కడికైనా వెళ్లొచ్చుగానీ... ఆ గదిలోకి వెళ్లలేమట!
 
 వెళితే ఏమవుతుంది?
 ‘హఠాత్తుగా... రాజుగారు ప్రత్యక్షమై వికటాట్టహాసం చేస్తారట. అంతే కాదు... కొన్ని ప్రశ్నలు అడుగుతారట. వాటికి సరిగ్గా జవాబు చెబితే సరి. నగలు కూడా ఇస్తారట.
 
 చెప్పలేకపోయామా హాని చేస్తారట.
 రాము, శ్రీను అనే ఇద్దరు కుర్రాళ్లు ఒక రాత్రి నగల కోసమని వెళ్లి ఆ గదిలో ఇరుక్కుపోయారట.
 ‘‘నేను అడిగే ప్రశ్నలకు మీ ఇద్దరిలో ఏ ఒక్కరు జవాబు చెప్పినా ఇద్దరినీ విడిచిపెడతాను’’ అని కొన్ని ప్రశ్నలు అడిగారట రాజుగారు. వాటికి రాము సరిగ్గా జవాబు చెప్పడంతో... పెద్ద ముప్పు తప్పిందట.
 
  ఆ ప్రశ్నలు కింద ఉన్నాయి. వాటికి రాము ఏ సమాధానం చెప్పి ఉంటాడో చెప్పగలరా?
   
 రాజుగారు అడిగిన ప్రశ్నలు:
 1. ముట్టుకోకుండానే గాయపడేవి, కలపకుండానే విషం వెదజల్లేవి, నోరు విప్పకుండానే నిజాలు, అబద్ధాలు చెప్పేవి ఏమిటి?
 2. దానికి  పేరు ఉంది... కాని అది దాని పేరు కాదు. వయసు ఉంది. కానీ అది కూడా తనది కాదు. చనిపోతే పుడుతుంది. అందరూ దీని చుట్టూ తిరుగుతారుగానీ... ఇది మాత్రం ఒక్క అంగుళం కూడా కదలదు. ఏమిటది?
 3. ఎనిమిది ఎనిమిదులను... వెయ్యిగా చేసి చూపండి.
 4. అది పక్షి నుంచే పుడుతుంది కానీ ఆకాశంలో ఉండదు. అది సముద్రంలో ఈదుతుంది. కానీ తడవదు. ఏమిటది?
 

మరిన్ని వార్తలు