జైత్రయాత్రలో జగద్గురువు

25 Feb, 2018 00:37 IST|Sakshi

ఆచార్య మాడభూషి శ్రీధర్‌

 సహస్రాబ్ది ధారావాహిక – 19

ప్రపంచమంతా ఇన్నాళ్లూ అసమగ్రమైన విజ్ఞానకాంతులను మాత్రమే దర్శించింది. ఎన్నో తెగలు, శాఖలు భిన్న అన్వయాలను ప్రచారం చేశాయి. పగిలిన అద్దపుముక్కల వలె పరిమితంగా ఆ విజ్ఞాన జ్యోత్స్నను పరావర్తనం చేశాయే కాని ఆ దివ్యజ్యోతి నిజకాంతులను చూపలేకపోయారెవరూ. మాయాసిద్ధాంత ప్రవక్తలు దివ్యమంత్రాల ధ్యానం ద్వారా తప్పనిసరిగా ముక్తి పొందవచ్చునని అంటారు. కాని ధ్యానం తపస్సు జ్ఞానంతోపాటు కర్మాచరణ సమాంతరంగా లేకపోతే మోక్షసాధన కష్టమని తదితర సైద్ధాంతికులు అంటారు. జ్ఞానంలో కర్మాచరణ అవిభాజ్యమైన భాగమని, తెలుసుకునే కృషి, తపస్సు, తెలిసినదాన్ని అనుభవంలో రుజువు చేసుకోకపోతే లాభం లేదు. జ్ఞానం భక్తితో పరిశుద్ధమై, ఉపాసనతో ప్రగాఢమైతేనే మోక్షమార్గంలోకి మళ్లుతారనేది సత్యం. నేను ఈ మార్గాన్ని నా శక్తినంతా కూడదీసుకుని సిద్ధాంతీకరిస్తాను. సాక్షాత్తూ నారాయణుడే వేదవ్యాసుడై రచించిన బ్రహ్మసూత్రాలలో సనాతనంగా ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ సిద్ధాంతాన్ని పునరుజ్జీవింపజేస్తాను. యామునాచార్యుని పాదపద్మాలకు ఆ భాష్యాన్ని సమర్పిస్తాను. ఆనాడు వేదవ్యాసుడి నోట పలికిన భారతాన్ని వినాయకుడు వ్రాసినట్టే కురేశుడు ఈ భాష్యాన్ని లిఖించాలి. ‘‘అయితే అర్థం చేసుకొని వ్రాయాలి. నాతో విభేదిస్తే లిఖించవద్దు’’ అని కూడా చెప్పారు. మీ ఆజ్ఞ అన్నాడు కురేశుడు. రామానుజుని నోట సరస్వతి పలుకుతున్నది. కురేశుడు వెంట వెంటనే లిఖిస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి నెమ్మదిస్తున్నాడు. అర్థం అవుతూనే లేఖనం పూర్తవుతున్నది.

ఒకరోజు మరొక శ్రుతి వాక్యానికి సంబంధించిన వ్యాఖ్యానం ప్రస్తావనకు వచ్చింది. జీవ స్వరూప నిర్ణయ అంశాన్ని వివరించినపుడు ‘జీవుడు సర్వజ్ఞుడనీ స్వతంత్రుడనీ, భగవంతుడిపైన ఆధారపడబోడనే అర్థం వచ్చే విధంగా చెప్పారు. కురేశుడు ఆగిపోయాడు. అంటే విభేదించాడు. ఇదేమిటి జీవుడు అన్నీ తెలిసిన వాడా అనుకుంటూ ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు. ‘‘ఏమిటి కురేశా ఘంటం ఆగిపోయింది, ఊ, కానీ,... వ్రాయి..’’ అన్నా ఘంటం కదలడం లేదు. కోపించారు. ఉహూ.. అయినా లాభం లేదు. ‘‘ఇలా అయితే ఇక శ్రీభాష్యరచన సాగేదేవిధంగా, నీవే వ్రాసుకో?’’ అని తీవ్రంగా ఆగ్రహించారు. విసురుగా కాలితోతన్ని ‘వెళ్లిపో’ అన్నారు. కురేశుడు పడిపోయి అలాగే ఉన్నాడు. శిష్యులు వచ్చి దీని అర్థం ఏమిటి అని అడిగారు. ‘‘ఏముంది. ఆయన నా యజమాని. కొడితే పడతాను. కాలితో తంతే పడిపోతాను. అంతే!’’ అన్నాడు.  రామానుజునికి ప్రశ్నార్థకంగా ఉన్న కురేశుని ముఖమే పదే పదే కనిపించింది. తన వ్యాఖ్యానంలో లోపాలేమిటి అని ఆలోచించారు. విశ్లేషించుకున్నారు. ‘‘జీవుడు భగవంతుడి అంశే గాని భగవంతుడు కాదు కదా. భగవంతుడు సర్వజ్ఞుడు, కాని ప్రతిజీవి జీవాత్మ సర్వజ్ఞుడు అయ్యే అవకాశం లేదు కదా. భగవంతుడిపైన పూర్తిగా ఆధారపడి, దాసుడై, భగవంతుడిని అర్చించి భగవంతుడికి ఉపయోగపడటం కదా జీవుడు, జీవాత్మ చేయవలసింది. అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ రెండుకావని అర్థం. అట్లా అయితే ప్రతి జీవాత్మ పరమాత్ముడేనా. అయితే అతడు సర్వజ్ఞుడు కావలసిందే. ఈ భేదాన్ని గమనించకపోవడమే ఈ పండితులంతా చేస్తున్న పొరబాటు. ప్రతి జీవాత్మలో పరమాత్మ అంశ ఉంటుంది, అది భక్తితో శరణాగతితో పరమాత్మ సాన్నిధ్యం పొంది మోక్షం సాధించి పరమాత్మలో కలిసి పోతే అసలు అద్వైతం అవుతుంది. కురేశుడి సందేహం సరైనదే’’ అనుకున్నారు. అదే మరింత వివరణతో శ్రీభాష్యమై ప్రవహించింది. కురేశుడి లేఖనం సాగింది. అద్వైతానికి రామానుజుడు అద్దిన విశిష్టత అదే, కనుక అదే విశిష్టాద్వైతం.  తన గురువు తప్పులు ఎత్తిచూపిన రామానుజుడు తన తప్పుల గురించి మౌనంగా చెప్పిన శిష్యుడిని సమాదరించినాడు. ‘‘నన్ను క్షమిస్తావా కురేశా? నీ మౌనాన్ని అర్థం చేసుకునే సహనం లేకుండా పోయినందుకు సిగ్గుపడుతున్నాను’’ అన్నాడు.

‘‘ఆచార్యా ఇంత మాటా.. నేను మీ పాదరేణువును, దీనికన్న నన్ను ఇంకోసారి కొట్టినా బాగుండేది’’ అని కురేశుడు కన్నీళ్లతో అన్నాడు. పాదాలపై పడబోయిన కురేశుని లేవనెత్తి దగ్గరకు తీసుకుని కన్నీళ్లతో కౌగిలించుకుని ‘‘కురేశా భగవంతుని శ్రీచరణాల ముందు ఎవరూ గొప్ప కాదు ఎవరూ తక్కువ కాదు. ఈసారి స్పష్టంగా జీవుడు జీవాత్మ పరమాత్మ అనుగ్రహం పైన పూర్తిగా ఆధార పడవలసిందే అని సిద్ధాంతీకరించారు రామానుజుడు. కురేశుడు విలేఖకుడే కాదు, విమర్శకుడు, విశ్లేషకుడు కూడా. రామానుజులు తనకన్నా ముందు బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం రచించిన విశిష్టాద్వైత సిద్ధాంత ఆచార్యులైన 
1. బోధాయనుడు: బోధాయన వృత్తి, లక్ష శ్లోకాలు  2. ద్రావిడాచార్య: ద్రావిడభాష్యం. దానిపైన టీకా, 3. టంక (బ్రహ్మానంది, వాక్యకార) వార్తిక. 
4. గుహదేవాచార్య, 5. ఆచార్య భరూచి: 
6. భాగవత శ్రీవత్సాంక మిశ్ర, అత్యంత సనాతన భాష్యరచయిత. 7. నాథముని: న్యాయతత్వ: విశిష్టాద్వైత సిద్ధాంతం, యోగరహస్య (యోగ విధాన రహస్య సిద్ధాంతాలు) మీద విజ్ఞాన సర్వస్వం. 8. యామునాచార్య: సంవిత్‌ సిద్ధి, స్వర సిద్ధి, ఆత్మసిద్ధి, ఆగమ ప్రామాణ్య రచయిత (11వ శతాబ్ది) మొదలైన గ్రంథాలను అధ్యయనం చేసిన తరువాత శ్రీభాష్యం రచించారు. రామానుజుని శ్రీభాష్యం ఈనాటికీ అత్యుత్తమ ప్రామాణిక గ్రంథంగా భాసిల్లుతున్నది. 

బ్రహ్మసూత్రాలు      
భారతీయ సనాతన ధర్మానికి కీలకమైనవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. వీటిని ప్రస్థాన త్రయం అంటారు. సంక్లిష్టమైన ఈ అంశాలను వివరించడానికి మొదటి వ్యాఖ్యానం రచించినవారు ఆదిశంకరాచార్యులు. బాదరాయణుడు సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ; బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మ మీమాంస లేదా బ్రహ్మ సూత్రాలనీ ఈ సూత్రాలను పిలుస్తారు. ఈ సూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు విశిష్టాద్వైత పరంగా సరికొత్త అన్వయంతో ప్రస్థాన త్రయం రచించారు రామానుజులు.     శ్రీభాష్యం రచనతో రామానుజుని కీర్తి భరత ఖండమంతా వ్యాపించింది. పండిత సభల్లో గోష్ఠులలో, మత వివాదాలలో, ధార్మిక విమర్శా సభల్లో చర్చనీయాంశంగా మారింది. మౌలిక సిద్ధాంత నిర్ధారణ జరిగిన తరువాత ఈ శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ప్రచారానికి సరయిన సమయం ఆసన్నమైంది. వేదాంత సారము, వేదార్థ సంగ్రహము, వేదాంత దీపము మొదలైన అనుబంధ రచనలు, భగవద్గీతపైన రామానుజ భాష్యం కూడా అందుబాటులోకి రావడంతో రామానుజుడు మరో జైత్రయాత్రకు సంసిద్ధమైనాడు. పైబడుతున్న శతాధిక వయోభారాన్ని లెక్క చేయకుండా రామానుజుడు ఆర్తి ఉన్న ప్రతి వాడికీ భక్తివేదాంత దర్శనాన్ని చేయించడం లక్ష్యంగా బయలుదేరాడు. వెళ్లినచోటల్లా మత సిద్ధాంత చర్చలలో రామానుజుడు వెలిగిపోతున్నాడు. పుణ్యక్షేత్ర సందర్శన, శ్రీవైష్ణవ సిద్ధాంత చర్చ, వాదోపవాదాలు, ప్రతివాదాలు, ప్రతిచోటా జయాలు. ఓడిన వారు వైష్ణవం స్వీకరిస్తున్నారు, శిష్యగణం పెరిగిపోతున్నది. రామానుజ మఠాలు విస్తరిస్తున్నాయి. కుంభకోణం పట్టణంలో అన్యమతాచార్యులు వాదంలో ఓడి ‘‘అడియేన్‌ (పాదాలు) రామానుజ దాసోహం’’ అన్నారు. చోళ మండలంలో పలువురు వైష్ణవ దీక్ష పొందారు. ఆళ్వార్‌ తిరునగరికి చేరుకున్నారు.  
     
అది తిరుమంగై ఆళ్వార్‌ అవతరించి స్వాధ్యాయ ప్రవచనాలు సాగించిన చోటు. పుష్కరిణిలో స్నానం చేసి, మడి కట్టుకుని, తిరుమణి కాపుచేసుకుని, అనుష్ఠానం ముగించి, త్రిదండాన్ని చేబూని శిష్యబృందంతో ఆలయంలో ప్రదక్షిణ చేస్తుండగా ఒక స్త్రీ ఎదురుపడింది. ఆమె శుచీశుభ్రతలు పాటించడం లేదని ఎవరో చండాలాంగన అన్నారనీ శిష్యులు ఆమెను పక్కకు తప్పుకోమన్నారు. రామానుజుడు ముందుకు వస్తూనే ఉన్నారు. ‘‘ఎక్కడికి తప్పుకోమంటారు ఏ పక్కకు వెళ్లమంటారు స్వామీ. పవిత్రమూర్తి మీరు ఎదురుగా ఉన్నారు. ఒక్క అడుగు వేసినా మీకు అడ్డు అవుతాను. వెనుకకు మరలిపోదామంటే అతిపవిత్రమైన తిరుక్కణ్ణాపురం ఉంది. ఆ పుణ్యక్షేత్రాన్ని తగలవలసి వస్తుంది. పోనీ కుడివైపు వెళదామా అంటే అక్కడ మన తిరుమంగై ఆళ్వార్‌ నిలిచిన కోవెల తిరుమణన్‌ కొళ్లై, దాన్ని ఆనుకుని తిరువారేశు మందిరం ఉన్నవి. వాటిని దాటేదెట్లా స్వామీ? ఎడమవైపు వెళదామంటే అక్కడ అసామాన్యమైన తిరువాళి మానవాళన్‌ స్వామి ఆలయం ఉంది. ఇన్ని దివ్యదేశాల మధ్య ఏది మలినమో నాకు తెలియదు. నాకు చుట్టూ అన్నీ పుణ్యపవిత్ర క్షేత్రాలే కనిపిస్తున్నాయి. పరమ అజ్ఞానిని నేనెటు వెళ్లగలను? ఎక్కడికి తప్పుకోను మీరే దయచూపి దారిచూపండి స్వామీ.’’ అని వినయంగా అడిగిందామె.  ఆమె సామాన్యురాలు కాదనీ, తన శిష్యులు తప్పు చేశారనీ అర్థమైపోయింది రామానుజులకు. చేతులు జోడించి నమస్కరించి ‘‘అమ్మా! నన్ను క్షమించు. ఈ దివ్యక్షేత్రాల పవిత్రత తెలిసిన జ్ఞానివమ్మా నీవు. నీవే నాకన్న శుచిమంతురాలివి, పవిత్రురాలివి. నీకు మాలిన్యం ఏమిటి తల్లీ. మీరూ నేనూ అంతా కలిసి ఆ శ్రీహరిని ధ్యానిద్దాం. అనుష్టానం చేసుకుందాం రా.. నీకూ మంత్రోపదేశం చేస్తాను వస్తావా’’ అనగానే ఆమె పాదాభివందనం చేసింది. ఆమెకు పంచసంస్కారాలు చేశారు. నిత్యానుష్టానంతో, ధ్యానంతో భజన కీర్తనలతో ఆమె ఆ తిరువాలి తిరునగరిలో ఉత్తమభక్తురాలిగా కీర్తిపొందింది.

 ఆంతరంగిక శుద్ధి అన్నింటికన్నా ముఖ్యం. బహిరంగంగా పరిశుభ్రంగా ఉండడం అవసరమే కాని లేకపోవడం అయోగ్యత కాదు. ఆర్తిని మించిన యోగ్యత మరేదీ లేదనేదే రామానుజుని ఆదర్శ సిద్ధాంతం. శ్రీవైష్ణవాన్ని కులాతీత సర్వజనాదరణ పాత్రం చేసిన సంస్కారం అదే. తరువాత మధురైకి పదికిలోమీటర్ల సమీపంలో ఉన్న తిరుమాళికచోలై ప్రాంతానికి వెళ్లారు. దర్భశయనం దివ్యదేశాన్ని సందర్శించారు. సేతువును చూసారు. చోళదేశంలో శ్రీవైష్ణవ స్థాపన తరువాత రామానుజుడు పాండ్య పాలిత ప్రాంతంలోని శ్రీమన్నారాయణ క్షేత్రాలను సందర్శించారు. పండిత సభలలో పాల్గొన్నారు. తర్కాన్ని, శాస్త్రాన్ని, వ్యాకరణాన్ని మధించిన రామానుజుడి విజ్ఞాన వివేకం ముందు వాదనాశక్తి ముందు మరెవ్వరూ నిలబడడం లేదు. అందరూ శిష్యులైపోతున్నారు.
 

శ్రీభాష్యం ఏం చెబుతుంది?
పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి అనే మూడు తత్వాల గురించి సూత్రాలు ఏం చెప్పాయో శ్రీభాష్యం వివరిస్తుంది. సూత్రాలలో వివరణ ఉండదు. అర్థం చేసుకునే విధానం కూడా కనిపించదు. ఉపోద్ఘాతమూ ఉండదు. ఇందులో మోక్షసాధనకు భక్తియే సాధనమని రామానుజాచార్యుడు ప్రతిపాదించాడు. దీనికి ముందు బ్రహ్మసూత్రాలపైన బోధాయనుడు చేసిన వ్యాఖ్యానాన్ని గురించి ప్రస్తావిస్తారు. తొలిభాగంలో బోధాయనుడిని ఉటంకించి తాను ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టు వివరించారు రామానుజాచార్యుడు. కొన్నాళ్లకు సమగ్రమైన శ్రీభాష్య రచన పూర్తయింది. అప్పుడు రామానుజుని వయసు నూరు సంవత్సరాలు. శ్రీభాష్య అధ్యయనం సులభతరం చేయడం కోసం వేదాంత దీపము, వేదాంత సారము, వేదార్థ సంగ్రహం అనే పుస్తకాలను, గీతా భాష్యమును కూడా రామానుజుడు రచించారు.  

విజ్ఞాన భాండాగారం
వేదాలను విభజించి అనేక పురాణాలు, ఇతిహాసాలు రచించి, సిద్ధాంతాలను సూత్రీకరించిన వ్యాసుడు స్వయంగా విష్ణురూపుడే. లేకపోతే ఇన్ని రచనలు సాధ్యమా? వ్యాసులు చాలామంది ఉండి ఉంటారంటారు. బ్రహ్మసూత్రాలు రాసిన బాదరాయణుడు (లేదా బోధాయనుడు), వ్యాసుడు ఒకరే అని కొందరు, కాదు, వ్యాసుని శిష్యుడని మరికొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరూ వేరనిగానీ వేరు కాదని గానీ అనడానికి ఆధారాలు లేవు. బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ఒక్కో అధ్యాయంలో నాలుగు పాదాలు, అన్ని పాదాలలో మొత్తం 192 అధికరణాలు, ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి.  వేదసారమైన మహాభారతాన్ని పంచమ వేదమని, అందులో ఉన్న భగవద్గీతను ఉపనిషత్సారమనీ వర్ణిస్తారు. వేదాంత సత్యాలను, బ్రహ్మసూత్ర విశేషాలను, ఉపనిషత్‌ విజ్ఞాన వివేకాలను, అంతరార్థ వివరాలను వేదవ్యాసుడే భగవద్గీత ద్వారా సులభ గ్రాహ్యం చేశారు. కాని భగవద్గీతకూ వివరణ అవసరం అయింది. గద్యంలో సామాన్య వివరణ, మార్గదర్శన కోసం రామానుజుడు విశిష్టాద్వైతపరమైన వ్యాఖ్యానం చేయాలని, తద్వారా ఈ విజ్ఞాన భాండాగారం సామాన్యులకు అందాలని  యామునాచార్యులు సంకల్పించారు.    

మరిన్ని వార్తలు