ఎవరైనా నన్ను మోసం చేస్తారేమో?

19 Apr, 2020 09:32 IST|Sakshi

కథా ప్రపంచం 

మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన అంత ప్రత్యేకమైనది కాదు. బెంగళూరులో అనేక సంవత్సరాలుగా నివాసమున్న అందరికీ ఇలాంటి అనుభవం వేరువేరు రూపంలో కలిగివుంటుంది. అయితే ఆ సంఘటన నా మీద ప్రత్యేక ప్రభావం కలిగించటమే కాకుండా దాన్ని గురించి ఆలోచించేలా చేసింది. వేరు వేరు సందర్భాలలో,  కాలాలలో అది విభిన్నమైన సత్యాన్ని నా ముందు తెరిచిపెట్టింది. నన్ను అర్థం చేసుకోవడానికి, ఇతరుల గురించి విభిన్నంగా ఆలోచించడానికి ప్రేరణ ఇచ్చింది. అందువల్ల దాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతాను.
అది తొంబైయవ దశకంలోని ద్వితీయార్ధం. నా తల్లితండ్రులిద్దరూ పల్లెలోని ఇంటిని వదిలి నాతోపాటు బెంగళూరులో నివాసముంటున్నారు. బీటియం కాలనీలో అద్దె ఇంట్లో ఉన్నాం. అప్పుడే నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరి మూడునాలుగు సంవత్సరాలు గడిచాయి. నెమ్మదిగా జీతమూ పెరుగుతున్నప్పటికీ, అంత పెద్ద మొత్తమేమీ వస్తుండలేదు. ఇలాంటి  సమయంలో ఇల్లు కట్టుకోవటానికి ఒక స్థలం తీసుకోవాలనే నాకు కోరిక కలిగింది. అయితే అమ్మకు అది అంతగా నచ్చలేదు.
 ‘‘ఊళ్ళో దెయ్యంలాంటి ఇల్లుంది. ఇక్కడ మరో ఇల్లు కట్టుకుని ఏం చేస్తావు? చివరికీ నువ్వు మన ఊరికి తిరిగొచ్చి సెటిల్‌ అయ్యేవాడివి. ఈ ఊరు మనదికాదు’’ అని అమ్మ బళ్ళారి జిల్లాలోని మా ఇంటిని తలుచుకుని చెప్పేది.

 ‘‘అక్కడున్నది మన ఇల్లు. ఇక్కడ ఉండటం ఊరికే’’ అని ఆమె బలమైన నమ్మకం. 
అయితే అలాంటి అమ్మకు పక్కింటామె ‘సైట్‌’ పైత్యాన్ని నెత్తికెక్కించి పంపించింది.
 ‘‘కొడుకును ఒక సైట్‌ తీసుకోమని చెప్పండి. ఇల్లు కట్టాలనే లేదు. ఓ అయిదేళ్ళు వదిలేస్తే పదిరేట్లు డబ్బు వస్తాయి. బ్యాంక్‌లో ఫిక్సెడ్‌ పెట్టడం కన్నా ఇదే ఉత్తమం’’ అని బుద్ధిమాటలు చెప్పి పంపింది. లాభం అనే మాట మనస్సును తాకిన తరువాత అమ్మ కాస్త మెత్తబడింది.

 ‘‘ఆలోచించి చూడు’’ అని నాకు అనుమతి ఇచ్చింది. నాన్న మాత్రం ఇలాంటి వ్యవహారంలో ఎక్కువ తలదూర్చేవాడు కాదు. మౌనంగా నా నిర్ణయాలన్నీ అంగీకరించేవాడు. తనకన్నా ఎక్కువగా చదువుకున్న, ఎక్కువ జీతాన్ని సంపాదిస్తు్తన్న కొడుకు అభిప్రాయానికి వ్యతిరేకంగా చెప్పే ధైర్యాన్ని అతను పోగొట్టుకున్నాడు.
గతంలో కొన్న పదార్థాన్ని మరొకసారి కొనే క్రియ అంత ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగించదు. అయితే అది పెద్ద మొత్తపు విషయమైనపుడు విచిత్రమైన భయం కలుగుతుంది. దాని సరైన వెల ఏమిటి? ఎవరైనా నన్ను మోసం చేస్తారేమో? ఇంత పెద్దమొత్తంతో ఖరీదు చేసే ఈ వస్తువు నిజంగా నాకు అవసరమైనదా? తీసుకుంటున్న స్థలానికి ఏవైనా అడ్డంకులు ఉంటే నా గతి ఏమిటి? ఇలాంటి అనేక లేనిపోని ఆలోచనలు మనస్సును కమ్ముకుంటాయి. ఒంట్లో చీమను వదిలినట్లు గిలగిలా తన్నుకుంటాను.

నేను ప్రస్తుతం ఉన్న కాలనీ మా కళ్ళకు నివసించడానికి యోగ్యమైన స్థలంగా అనిపించడం మొదలౌతుంది. పరిచితమైన ప్రపంచాన్ని వదిలి కొత్త లోకానికి తెరుచుకోవటానికి వెనుకాడే మనిషి స్వభావానికి ఇది చక్కటి ఉదాహరణ. నా ఆలోచనలు మరోలా ఉండటానికి ఎలా సాధ్యం? అదే బీటిఎం. కాలనీలో సైట్‌ వెతకటం మొదలుపెట్టాను. అప్పట్లో బీటిఎం కాలనీ అనాథలా ఉండేది. రాత్రి ఎనిమిది గంటకంతా రోడ్లు బిక్కుబిక్కుమంటుంటే, అలాంటి సమయంలో బయటికి వెళ్ళడానికి భయం వేసేది. 
‘‘ఎవరైనా తల పగులగొడితే, ఉదయం వరకు శవం ఎవరి కంటా పడదు’’ అని మా అమ్మ తన అచ్చమైన బళ్లారి భాషలో వివరించేది. బెంగళూరులోనే పుట్టిపెరిగిన నా స్నేహితులెందరో జయనగర, మల్లేశ్వరం, బసవనగుడి...మొదలైన ఊరి మధ్యని స్థలాల్లో నివసిస్తున్నారు.
 ‘‘బీటిఎం అంటే చాలా దూరం...ఇక్కడే ఎక్కడైనా సైట్‌ తీసుకుంటే మంచిది’’ అని బుద్ధిమాటలు చెప్పేవారు. అయితే అక్కడ ఖాళీ సైట్లు దొరికేవికావు. పైగా ఒకటి రెండు సైట్లు విపరీతమైన దుబారాగా ఉండేవి. ఒక్కొక్కసారి స్థలహక్కుల వివాదాల వల్ల కటకటాల్లో నిలబడాల్సి వచ్చేది.
నేను చాలామంది మధ్యవర్తులను సంప్రదించాను.

 ‘‘వాస్తు చూస్తారా సార్‌?’’ అని వాళ్ళు మొదటి ప్రశ్న వేశారు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. మా ఊరిలో ఈ విషయంగా ఎవరూ మాట్లాడినట్టు గుర్తుకు రాలేదు. నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను. అమ్మకు వాస్తు విషయం వినికిడిగా తెలుసు. 
‘‘మనం బళ్ళారిలోని సందుగొందుల్లో ఇల్లు కట్టుకుని బతికిన వాళ్ళం. పెద్దల నుంచి భాగంగా వచ్చిన ముక్క స్థలంలో, రైల్వేబోగిలాంటి ఇల్లు కట్టుకుని జీవితం గడిపినవాళ్ళం. మా ఇళ్ళకి సరిగ్గా గాలి, వెలుతురు కూడా ఉండేది కాదు. అయినా సంతోషంగానే జీవించాం. మాకంతా ఈ వాస్తు–గీస్తూ ఏమీ లేదు. అదంతా ఏమన్నా శ్రీమంతుల సోకు’’ అని పుల్ల విరిచినట్టు చెప్పి పంపేసింది.
 నేను ఉద్యోగంలో చేరి సంపాదిస్తున్నప్పటికీ అమ్మానాన్నలు తమను తాము పేదవాళ్ళగానే భావించుకునేవాళ్ళు.
మధ్యవర్తిని కలిసి మాకు వాస్తు ముఖ్యంకాదని చెప్పేశాను. సంతోషంతో అతడి ముఖం వికసించింది. ‘‘వంద సైట్లు చూపిస్తాను రండి’’ అని ఉత్సాహం చూపారు. ప్రతిరోజు సాయంత్రం, వారాంతంలోనూ అనేక ఖాళీ సైట్లను చూపించేవారు.
 

‘‘ఎలా ఉంది సార్‌?’’ అని అడిగేవారు. నాకు ఎలా స్పందించాలో అర్థమయ్యేదికాదు. సైట్‌ బాగుండాంటే ఏమేమి కొలమానాలు ఉండాలో ఇంకా తెలియదు. మొత్తానికి చివరికి ఒక మూలస్థలం నాకు నచ్చింది.  రోడ్డు రద్దీ, కోలాహం లేనటువంటి, సుమారు అరవై, నలభై అడుగుల పొడవు వెడల్పుగల సమతలమైన  స్థలమది.  దాని యజమాని దగ్గరికి పిల్చుకునిపోయి వ్యవహారాన్ని కుదిర్చాడు. అతడికి డబ్బు అవసరం ఉంది. ఎనిమిది లక్షలకు వ్యాపారం కుదిరింది. అమ్మా, నాన్నలను పిల్చుకునిపోయి చూపించాను. వారికి నచ్చింది. అందువల్ల్ల బయానా సోమ్మును యజమానికి ఇచ్చి స్థలాన్ని రిజర్వ్‌ చేసుకున్నాను.

అయితే నాకు మాత్రమే తెలిసిన ఒక విషయముంది. నా దగ్గర అప్పుడు నాలుగు లక్షలకు మించి  సేవింగ్స్‌ లేదు. నా జీతం అంత ఎక్కువ కాదు. అయితే మిగిలిన డబ్బుకు ఒక బ్యాంక్‌ లోన్‌ ఇస్తుందని ఒక మిత్రుడు చెప్పాడు. అప్పట్లో చాలావరకూ అన్నీ బ్యాంకులవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇచ్చేవాళ్ళు. సైట్‌ కొనడానికి ఇచ్చేవికావు. ప్రైవేట్‌ బ్యాంక్‌ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించినపుడు, నా నెలసరి జీతం చూసి, కచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చారు. అన్ని విధాలుగా స్థలం కొనటానికి నేను సిద్ధం చేసుకున్నాను. అయితే లోన్‌ తీసుకునే విషయం ఇంట్లో చెప్పలేదు.
ఇక ఒక వారంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి అన్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం భోజనానికి కూర్చున్న సమయంలో నేను బ్యాంక్‌ నుంచి అప్పు తీసుకునే విషయాన్ని సహజంగానే చెప్పాను. ఆ మాటను వినగానే అమ్మ కలవరపడింది. 

‘‘అప్పు చేస్తావా?’’ అని నమ్మలేనిదానిలా అడిగింది. నేను అవునన్నట్టు తలూపాను. భోజనానికి కూర్చున్న కంచం ముందే కన్నీరు పెడుతూ, ‘‘నా కొడుకు అప్పులపాలు కావటం నేను బతికి వున్నంత వరకూ వదలను’’ అని ఆవేశంతో చెప్పేసింది. నేను ఏమేమో వివరించటానికి పోయినా ఆమె దాన్ని స్వీకరించే స్థితిలో ఉండలేదు. నాన్నకు ఈ విషయంలో ఏమీ తెలియకపోవటం వల్ల అతడికి ఎవరి పరంగా వహించాలో తెలియలేదు. ప్రస్తుత పరిస్థితిని అదుపులో తీసుకుంటే, ముందరి రోజుల్లో ఆమెకు అర్థమయ్యేలా చెప్పవచ్చనుకున్నాను.
అయితే ఏ మాత్రం మారలేదు. మగవాడు అప్పులపాలు కావటం ఆమెకు ఊహించడానికి సాధ్యం కాలేదు. అమ్మది మొదటి నుంచీ మొండిస్వభావం. అన్నం, నీళ్ళు మాని తనకు సరి అనిపించింది సాధించే వ్యక్తి. అందువల్ల ఆమె మనస్సును మార్చాలనే నిర్ణయాన్ని నేను వదిలేశాను. ఇప్పటికే కొంత బయానా సోమ్ము ఇచ్చి ఉండటంవల్ల దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా అది అంతగా బాధించలేదు. అయితే ఆ యజమాని సూటిగా ‘‘తీసుకునే శక్తి లేకపోతే ఊరకే ఎందుకు ముందుకుసాగారు?’’ అని వ్యంగ్యంగా అన్నప్పుడు చాలా బాధ కలిగింది. తమకు రావలసిన కమిషన్‌ ఆగిపోవటం వల్ల మధ్యవర్తులకు చాలా కోపం వచ్చింది.
 

‘‘పాతకాలం పల్లెటూరి జనం మాటలు వింటూ ఈ పెద్ద ఊళ్ళో ఎలా నిభాయిస్తారు సార్‌?’’ అని తిట్టిపోయారు. నేను మౌనం వహించాను. పూర్తిగా ఎనిమిది లక్షల రూపాయలను నేను సేవింగ్‌ చేసేటంత వరకు సైట్‌ కొనకూడని నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఏ మధ్యవర్తిని కలిసే పొరబాటు చేయలేదు.
నేను ఎనిమిది లక్షలు సేవ్‌ చేసేటంతలో బీటిఎం కాలనీలోని సైటులు పద్దెనిమిది లక్షలకు దాటాయి. అమ్మ తెలివితక్కువతనం, నా మూర్ఖత్వమూ రెండూ నాకు ఇప్పుడు అవగాహనకు వచ్చాయి. లోలోప కోపం గూడుకట్టుకోంటోంది. ఆమె మీద ఎన్నడు లేనట్టు ఎగిరేవాడిని. ఆమె ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో తలదూర్చుతుంటే ‘‘నువ్వుఊరుకో’’ అని మొరటుగా చెప్పేవాడిని. ఆకస్మాత్తుగా మేము కొనలేకపోయిన ఆ సైటు ముందు ముగ్గురమూ వెళ్ళవసిన సందర్భం వస్తే, అక్కడ ఇప్పటికే కట్టివున్న పెద్ద బంగ్లాను చూపించి, ‘‘చూడు, ఆ ఇల్లు ఈ రోజు మనదై ఉండేది. నువ్వు అడ్డొచ్చావు’’ అని వ్యంగ్యంగా అనేవాడిని. ఆమె  భరించేంత వరకు నా వ్యంగ్యాన్ని భరించి, ఒక రోజు ‘‘తప్పయింది మహానుభావా... నాకు ఆ రోజు అర్థంకాలేదు’’ అని రెండు చేతులెత్తి నమస్కరించింది. అప్పుడు నా దుష్టతనపు తీవ్రత అర్థమై, మళ్ళీ ఎన్నడూ ఆ విషయాన్ని ఆమె ముందు ఎత్తలేదు.

వాళ్లు బతికి ఉన్నంతవరకు ఎందుకో సైట్‌ తీసుకోవడానికి అవకాశమే నాకు దొరకలేదు. అమ్మా, నాన్నలిద్దరూ ఒకే సంవత్సరం అంతరంలో చనిపోయారు. తరువాత నేను ఇంకేదో అపార్ట్‌మెంట్‌లో ఒక ఇల్లు కొనుక్కుని, అక్కడ నివాసం ఉండసాగాను. ఇప్పుడైతే ఈ నేల, భూమి, ఇల్లు–డబ్బు సంపాదించే  భౌతిక విషయాల పట్ల నాకు ఆసక్తి లేదు. సైటు ముందు అప్పుడప్పుడు తిరిగేటప్పుడు అనేక జ్ఞాపకాలు తోసుకుంటూ వస్తాయే తప్ప, ఎలాంటి దుఃఖం లేదా బాధ భావన కలగదు.
నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఈ సంఘటన అనేక ఆలోచనలను నాలో ఏర్పరిచింది. అమ్మ గురించి అప్పుడు అనవసరంగా కోప్పడేవాణ్ణికదా అని దుఃఖం కలుగుతుంది. ఆమె తనదే అయిన అనుభవంతో వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంది.

‘‘అప్పు తీసుకోవటం అవమానకరం’’ అని ఆమె జీవితంలో నేర్చుకున్నది. అందువల్ల తన కొడుకు అప్పుచేయడం ఆమెకు తప్పుగా కనిపించి వ్యతిరేకించింది. దాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు అప్పుడు లేదు. అప్పు తీసుకోకుండా అభివృద్ధి కావటం అసాధ్యమనే కాలంలో జీవిస్తున్న నాకు ఆమె అర్థం కావటం కష్టమైంది.
బాల్యంలోని ఒక సంఘటన నాకు గుర్తుకొస్తోంది. అమ్మకు ఒక్కడే తమ్ముడు. అతడు మంచి స్థితిలో ఉండేవాడు. అప్పుడప్పుడు అతడి దగ్గర చేబదులుగా తీసుకుని తరువాత తిరిగివ్వడం అమ్మానాన్నకు అలవాటైంది. అతడికి అమ్మ మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మా ఇంటికి ఎంతో సహాయం చేసేవాడు. అయితే ఒక సమయంలో అతన్ని శని పీడించసాగాడు. డబ్బు అవసరం తీవ్రమై మా నాన్నను కాస్త అప్పు ఇవ్వమని అడిగాడు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటేకదా?
 

నెల చివరి వారంలో రెండు పూటలు భోజనం సమకూర్చటమే పెద్ద సాహసంగా ఉండేది. అయితే మా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన మేనమామకు ఇప్పుడు లేదని చెప్పే దిట్టతనం ఇద్దరికీ ఉండలేదు. చివరికొక ఉపాయం చేశారు. అమ్మ తన ఒంటి మీదున్న కాస్త బంగారాన్ని బ్యాంకులో పెట్టి అతనికి డబ్బు పంపమని చెప్పింది.
‘‘అయినంత తొందరగా డబ్బును వెనుతిరిగివ్వాలి’’ అని చిన్న ఉత్తరాన్నీ రాశారు. అతడు ధన్యవాదాలు అర్పించాడు.
ఆ బంగారం ఇంటికి తిరిగొచ్చే వరకు అమ్మానాన్నలు నరకాన్ని అనుభవించారు. వడ్డి సొమ్ము ప్రతినెలా ఎనభై రూపాయలు బ్యాంక్‌కు కట్టాల్సి వచ్చేది.  అమ్మానాన్నలకు ఇది పెద్ద భారమైంది. అందువల్ల నెలచివరి రోజులు ఇబ్బందికరంగా మారాయి. ఉగాది పండుగ వచ్చినా మాకు బట్టలు ఇప్పించలేదు. ఇంట్లో ఆ రోజుల్లో తీపి పదార్థాలను చేయలేదు. దేవుడి దీపం దినమంతా వెలుగుతుండలేదు. రాత్రి పూట నిద్రలేకుండా దొర్లుతుండేవారు. ఇప్పుడు దీన్ని గుర్తు చేసుకుంటే నాకు ఆశ్చర్యంగానూ, తమాషాగానూ కనిపిస్తుంది. అయితే ఆనాటి వారి అవస్థ మాత్రం పిల్లలమైన మా కళ్ళల్లోనూ విచారాన్ని కలిగించింది. ఆ రోజుల్లో రాజ్‌కుమార్‌ సినిమా ఊరికి వచ్చినా, డబ్బు ఇవ్వమని పిల్లలమైన మేము పీడించలేదు. ఆశను కోరికను దిగమింగుకోవటం మాకు మేమే నేర్చుకున్నాం. 

పెద్దపదవిలో ఉన్న మేనమామ ఈ డబ్బును తిరిగివ్వడానికి ఎక్కువ రోజులు తీసుకోలేదు. మూడు నెలల్లో సంపూర్ణంగా పంపించేశాడు. అదే రోజు నాన్న బ్యాంకుకు వెళ్ళి ఆ చిన్నాచితకా బంగారాన్ని విడిపించుకుని వచ్చాడు. దాన్ని అమ్మకు చూపించేటప్పుడు ఇద్దరూ ఏడ్చారు. దగ్గర్లోనే ఉన్న మేము పిల్లలమూ కంటతడి పెట్టాం. ఆ బంగారాన్ని దేవుడి ముందు పెట్టి, నేతి దీపం వెలిగించి, మేమంతా భగవంతునికి నమస్కరించాం. నాన్న తన చేతులారా అమ్మకు ఆ గాజులు తొడగించి, గొలుసును వేశాడు. అటు తరువాత మరెన్నడూ వాళ్ళు జీవితంలో అప్పు చేయలేదు.
ఇలాంటి నేపథ్యం కలిగిన అమ్మ ఇంకే విధంగా ప్రవర్తించడం సాధ్యం? నేను సైటును తీసుకోవటం తప్పించటం ఆమెకు నా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమవల్లనే  తప్ప నాకు నష్టం కావాలని కాదుకదా? ఈ సూక్ష్మమైన విషయం అర్థమయ్యే అవగాహన కూడా అప్పుడు నాకుండలేదు. సానుభూతి అనే సుగుణమూ ఆరోగ్యం చిమ్మే యవ్వనంలో దక్కదు. అప్పు వద్దు అని చెప్పిన అమ్మ, వాస్తు విషయంలో ఎంత తెలివిగా ప్రవర్తించింది కదా అని ఒక్కొక్కసారి ఆశ్చర్యమేస్తుంది. 

స్పష్టంగా వాస్తుశాస్త్రం ‘శ్రీమంతుల షోకు’ అనే మాటలు చెప్పడానికి ధైర్యం కావాలికదా? ఎలాంటిదో చెడ్డ వాస్తువల్ల కొడుకుకు ఏదో చెడు జరగవచ్చనే మూర్ఖత్వమే ఉండలేదు. అమ్మ సైట్‌ తీసుకోవటానికి అడ్డమొచ్చిందనే ఆలోచన నన్ను గెలికి కష్టపెట్టినంతగా ఆమెకు వాస్తు పిచ్చి ఉండలేదన్నది గర్వపడే విషయమనిపించి రొమ్ము విరుచుకోలేదెందుకు?
‘జీవితపు మౌల్యాలు’ అనే  బరువైన మాటను అప్పుడప్పుడు మనం వింటుంటాం. చప్పున ఎవరైనా ‘అలా అంటే ఏమిటి?’ అని అడిగితే జవాబు చెప్పడానికి నివ్వెరపోతాం. నేను అప్పుడప్పుడు నా జీవితపు ఈ సంఘటనను జీవితపు మౌల్యాల వ్యాఖ్యానానికి వాడుకుంటుంటాను. తన అవివేకం వల్ల అమ్మ నాకు నష్టం కలిగించిందన్నది ఒక మౌల్యం. నా మీది ప్రేమ వల్ల అప్పు చేయడం తప్పించిందని భావించటం ఇంకొక మౌల్యం. నా నుదుట స్థలం యజమాని కావటం రాసివుండలేదను సంతృప్తి చెందటం మరొక మౌల్యం. మనం ఏ నిర్ణయానికి వస్తామన్నది మన మన వ్యక్తిత్వానికి చెందింది. అయితే ఒకటి మాత్రం నిజం. జరిగిన సంఘటనలో ప్రేమ అంశాన్ని చూడక శుష్క తర్కానికి  పూనుకుంటే మన మౌల్యాలు కచ్చితంగా కుప్పకూలుతాయి. మన అందరి ఆలోచనల్లోనూ సానుభూతి యొక్క అవసరం ఉంది. 
సానుభూతి అంటే మరొకరి పరిస్థితిని అర్థం చేసుకుని, వారిలాగే ఆలోచించే క్రమం. అది సులభసాధ్యం కాదు. కష్టపడి సాధించుకోవాలి. సానుభూతి గుణం దక్కిన తరువాత మనం మరొకరి సుఖదుఃఖాలు, నిర్ణయాలు, కారణాలను చక్కగా అర్థం చేసుకోగం. మరొకరి సుఖదుఃఖాలను కళ్ళలోనే అర్థం చేసుకున్న మనిషి ఎన్నడూ క్రౌర్యానికి దిగడు. హత్యగావింపబడుతున్న, అత్యాచారానికి గురవుతున్న వ్యక్తి బాధను మనమే అనుభవించే శక్తి పొందితే క్రౌర్యానికి ఎవరూ చేయివేయలేరు. మొత్తం ప్రపంచ శాంతికి కావలసింది మరేమీ కాదు. సానుభూతి. అయితే సానుభూతిని మరొకరు నేర్పించడం కష్టం. దాన్ని స్వయంగా నేర్చుకోవలసిందే. ఒక్కసారి మీ స్వభావంలో సానుభూతి కలిసిపోతే, మొత్తం జగత్తు సుందరంగా కనిపించటం మొదలవుతుంది.

ఈ మధ్యన కీర్తిశేషులు త.రా.సు గారి సుప్రసిద్ద నవల ‘హంసగీతె’ను మరొకసారి చదివాను. ఆయన సానుభూతి అంటే ఏమిటన్నదానికి ఇచ్చిన ఉదాహరణ నాకు చాలా నచ్చింది. దాన్ని మీతో పంచుకుంటున్నాను. అంతగా గాలి ఆర్భాటం లేని ఒక గదిలో రెండు శృతి  చేసిన తంబూరను పెట్టి, ఒకదాన్ని మీటితే చాలు, ఆ నాద కంపనానికి మరొక తంబూర కూడా తనంతట తానే స్పందించి మోగుతుందట. ఈ జగత్తులో మనమందరం తంబూరలే కదా? ఒకరు వాయించడం మొదలుపెడితే, ఆ కంపనానికి మరొకరు స్పందించడం మానవ ధర్మం. అయితే ఈ కోలాహలపు జగత్తులో అది అంత సులభమా? ఊహూ. అందువల్లనే మనలోనే ద్వేషం, కోపం, గర్వం–అన్నీ!
కన్నడ మూలం: వసుధేంద్ర
- అనువాదం: రంగనాథ రామచంద్రరావు    

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా