ఈనాటి బంధం ఏనాటిదో!

11 Oct, 2014 23:34 IST|Sakshi
ఈనాటి బంధం ఏనాటిదో!

హృదయం: ఆ పెద్దావిడ కథ విని జాలిపడి, ఏదో డబ్బులిచ్చి పంపేయాలని చూడలేదు రజియా. ఆమెను తీసుకుని ఇంటికి బయల్దేరింది. అయితే కుటుంబసభ్యులు ఆమె భారం మనకెందుకన్నట్లు చూశారు.రోడ్డుమీద దీనస్థితిలో ఓ ముసలావిడ కనిపిస్తుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. జాలిపడి పది రూపాయలు ఇస్తాం. ఒక్క నిమిషం బాధపడి, కాస్త ముందుకు కదలగానే ఆ ముసలావిడ ఆలోచనల్ని పక్కన పెట్టేసి మన ప్రపంచంలోకి మనం వచ్చేస్తాం. కానీ ఆ ముసలావిడను ఇంటికి తీసుకెళ్లాలని, తిండి పెట్టాలని, ఆమెకో ఇల్లు కట్టించాలని, కుటుంబంతో, సమాజంతో పోరాడి, ఆమెకో బతుకునివ్వాలని ఎంతమందికి అనిపిస్తుంది? అయితే కేరళకు చెందిన రజియా బీవికి అలా అనిపించింది. మృత్యువు అంచుల్లో ఉన్న చెల్లమ్మను ఆమె ఇలాగే కాపాడింది. ఓ దర్శకుడు సినిమా తీసి, జాతీయ అవార్డు గెలిచే స్థాయిలో ప్రేరణ కలిగించిన ఈ ఇద్దరు మిత్రుల కథేంటో తెలుసుకుందాం రండి.
 
15 ఏళ్ల కిందటి సంగతి. కేరళలోని అంబలపుజ అనే గ్రామంలో పంచాయితీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న 34 ఏళ్ల రజియా బీవి. ఓ రోజు రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురుచూస్తుండగా, ఓ ముసలావిడ ప్లాట్‌ఫామ్ అంచుల వద్ద నిలబడి ఉండడం కనిపించింది. తూలి ట్రాక్‌మీద పడిపోతుందేమో అని రజియా ఆమెను వెనక్కి లాగడానికి వెళ్లగానే, ‘నువ్వు నన్ను చావనిచ్చేలా లేవే’ అంటూ కసురుకుంది ఆ ముసలావిడ.

అప్పుడర్థమైంది, రైలుబండి రాగానే దూకేయడానికి ఆ ముసలావిడ సిద్ధంగా ఉందని! నెమ్మదిగా ఆమెను మాటల్లో పెట్టింది రజియా. పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె కథేంటో తెలుసుకుంది. ఆమె పేరు చెల్లమ్మ. వయసు 76 ఏళ్లు. పెళ్లయిన ఐదేళ్లకే భర్త చనిపోతే, అక్కడా ఇక్కడా పనిమనిషిగా చేసి, బతుకుబండి లాగింది. ఇక కష్టం చేయలేని స్థితిలో తన తమ్ముడి ఇంటికి వస్తే, వాళ్లు కొన్నాళ్లు ఉంచుకుని ఆమెను బయటికి తరిమేశారు. దీంతో తనకు చావే పరిష్కారమనుకుని రకరకాలుగా ప్రయత్నించి, చివరికి రైలు కింద పడి చావడానికి సిద్ధమైంది చెల్లమ్మ.
 
ఆ పెద్దావిడ కథ విని జాలిపడి, ఏదో డబ్బులిచ్చి పంపేయాలని చూడలేదు రజియా. ఆమెను తీసుకుని ఇంటికి బయల్దేరింది. అయితే కుటుంబసభ్యులు ఆమె భారం మనకెందుకన్నట్లు చూశారు. పైగా వీళ్లది ముస్లిం కుటుంబం. చుట్టూ ఉన్నవాళ్లంతా ముస్లింలే. కానీ చెల్లమ్మ బ్రాహ్మణురాలు. ఆమెకు మాంసాహారం వాసన కూడా పడదు. దీంతో ఆమె అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అయినప్పటికీ, ఉన్నన్ని రోజులు తనింట్లోనే ఆమె పూజలు, పునస్కారాలు చేసుకునే ఏర్పాటు చేసింది. రజియా దీనిపై చుట్టుపక్కల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
 
దీంతో ఆమెను ఓ హిందూ ఆశ్రమంలో చేర్పించింది రజియా. ఆ ఆశ్రమానికి తనే డబ్బులు కట్టింది. తరచుగా ఆశ్రమానికి వెళ్లి చెల్లమ్మను చూసి వస్తుండేది. అయితే ఆమెను పూర్తిగా ఆశ్రమానికి పరిమితం చేయకూడదని భావించి, ఓ హౌసింగ్ స్కీమ్ కింద, సొంత డబ్బులు కొంత జమచేసి, రెండు గదులున్న ఓ ఇంటిని చెల్లమ్మకోసం కట్టించింది రజియా. అయితే రజియాకు చెల్లమ్మ బినామీ అని, పంచాయితీ డబ్బుల్ని ఆమె వృథా చేస్తోందని కొందరు ఆరోపణలు చేశారు. దీంతో ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తమ బంధం గురించి, చెల్లమ్మ దీనస్థితి గురించి వివరించింది రజియా.
 
ఇద్దరూ ప్రెస్‌మీట్‌లో కన్నీటిపర్యంతమయ్యారు. అప్పటికి గానీ రజియా, చెల్లమ్మలది ఎంత గొప్ప బంధమో తెలియలేదు. దీంతో అందరి నోళ్లూ మూతపడ్డాయి. చెల్లమ్మను కొత్త ఇంట్లోకి పంపాక కూడా ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది రజియా. ఆమె సొంతంగా వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో తనే ఇష్టమైన వంటకాలు వండి, రోజూ తనకు తీసుకెళ్లేది. రాత్రి తనతోనే పడుకుని ఇంటికి వచ్చేది. చుట్టూ ఉన్న ముస్లిం కుటుంబాలు చెల్లమ్మను ముస్లింగా మార్చి, తనింట్లోనే తీసుకురావచ్చని సలహా ఇచ్చాయి. కానీ రజియా ఒప్పుకోలేదు. చెల్లమ్మకు తమ దేవుళ్ల పట్ల, పూజా పునస్కారాల పట్ల ఉన్న భక్తి శ్రద్ధలెలాంటివో తెలుసు కాబట్టి ఆమెను అలాగే కొనసాగనివ్వాలంది.
 
చెల్లమ్మతో కలిసి రజియా పెట్టిన ప్రెస్‌మీట్ మలయాళ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించారు. వీళ్లిద్దరి గురించి చదివిన బాబు తిరువల్ల అనే దర్శకుడు, ఈ కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. రజియాను కలిసి పూర్తి వివరాలు తెలుసుకుని, సినిమాకు తగ్గట్లు కథ సిద్ధం చేశాడు. 2011లో సినిమా మొదలుపెట్టాడు. తర్వాతి ఏడాది ‘తనిచల్లా ఎంజామ్ (నేను ఒంటరిని కాను)’ అనే పేరుతో విడుదలైందా సినిమా. ప్రేక్షకుల గుండెల్ని తట్టిన ఈ ‘తనిచల్లా ఎంజామ్’కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు కూడా లభించింది. తమ కథతో తీసిన సినిమాను తెరమీద చూసుకుని రజియా, చెల్లమ్మ సంబరపడిపోయారు. ‘‘మా ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోయే వరకు ఇలాగే కలిసుంటాం’’ అన్నది రజియా మాట.

మరిన్ని వార్తలు