రెండు గంటల్లో పెరుగు రెడీ!

7 Dec, 2014 01:43 IST|Sakshi
రెండు గంటల్లో పెరుగు రెడీ!

వాయనం
పెరుగు లేకపోతే భోజనం పూర్తి కాదు మనకి. మాంచి కూరతో ఫుల్లుగా లాగించినా, చివర్లో రెండు ముద్దలు పెరుగన్నం తినకపోతే తృప్తి ఉండదు. ఆరోగ్యానికి కూడా పెరుగు ఎంతో మంచిది కావడంతో, దాన్ని తప్పక తింటారు అందరూ. అయితే పెరుగు అంత తేలికగా తయారవదు. పాలలో కాసింత పెరుగు వేసి తోడుపెడితే... కొన్ని గంటల తర్వాత పెరుగు రెడీ అవుతుంది. ఎంత అర్జంట్ అయినా చేసేదేమీ ఉండదు. దాంతో చుట్టాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లప్పుడూ ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. ఆ సమస్యను తీర్చడానికే ఈ యంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని ఇన్‌స్టంట్ కర్డ్ మేకర్స్ లేక ఇన్‌స్టంట్ యోగర్ట్ మేకర్స్ అంటారు.

ఐదు వందల నుంచి పది వేల వరకూ రకరకాల ఖరీదుల్లో లభిస్తున్నాయి. కరెంటుతో పని చేసే మెషీన్‌లో పాలు పోసి, రెండు చెంచాల పెరుగు వేసి మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే చాలు... పెరుగు తయారైపోతుంది. పాలు ఎంత పరిమాణంలో ఉన్నా తోడు కోవడానికి పట్టే సమయం రెండే రెండు గంటలు.
 
కొన్ని మేకర్స్‌లో ఒకే గిన్నె కాకుండా చిన్న చిన్న డబ్బాల మాదిరిగా ఉంటాయి. తోడుకున్న తర్వాత వాటినలాగే ఫ్రిజ్‌లో పెట్టేసుకోవడానికి అనువుగా ఉండేందుకే ఇలా తయారు చేశారు. సాధారణంగా చలికాలంలో పాలు త్వరగా తోడుకోవు కదా! కానీ ఈ మెషీన్లు చలికాలంలో కూడా రెండు గంటల సమయంలోనే పాలను తోడు పెట్టేస్తాయి.

మరిన్ని వార్తలు