దేవుడు కలిపిన బంధం!

12 Apr, 2014 21:27 IST|Sakshi
దేవుడు కలిపిన బంధం!

 అనంతరం

రక్త సంబంధాన్ని మించినదేదీ ఈ ప్రపంచంలో లేదని అంటారు. కానీ బంధం దృఢంగా ఉండాలంటే రక్తం పంచుకోనక్కర్లేదు, ప్రేమను పంచుకుంటే చాలు అంటుంది అర్పితాఖాన్. తోడబుట్టకపోయినా సొంత తోబుట్టువులా తనను కళ్లలో పెట్టుకుని చూసే అన్న సల్మాన్‌ఖాన్ అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. అందుకే... అతడు తనకు దేవుడిచ్చిన అన్నయ్య అంటుందామె!
 
 పేగు తెంచుకు పుట్టిన పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా ప్రేమగానే చూస్తారు. కానీ తమ కడుపున పుట్టకపోయినా, తమ రక్తాన్ని పంచుకోకపోయినా, తమ కంటిపాపలా పెంచారు నన్ను అమ్మానాన్నా (సలీంఖాన్, సల్మా). ముగ్గురన్నలు, ఒక అక్క ఉన్న ఇంట్లోకి నేను చిట్టి చెల్లెలిగా అడుగుపెట్టాను. వాళ్లందరి చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగాను. అన్నయ్యలందరిలోకీ సొహైల్‌తో నేను ఎక్కువ క్లోజ్. తనతోనే ఎక్కువ ఆడేదాన్ని. తనెక్కడికి వెళ్లినా వెంట తయారైపోయేదాన్ని. తన దగ్గరే ఎక్కువ గారాబం చేసేదాన్ని. అలాగని సల్మాన్ భాయ్‌కి క్లోజ్ కాదని కాదు. తన దగ్గర చనువు ఉన్నా ఏదో గౌరవం కాస్త దూరంగా ఉంచుతూ ఉంటుంది.
 ఇంటికి పెద్దవాడు అన్న భయం, పెద్ద సూపర్‌స్టార్ అన్న గౌరవం మనసు నిండా నిండిపోతాయి అన్నయ్యను చూస్తే. తను చాలా సీరియస్‌గా ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ చాలా ఎమోషనల్‌గా కూడా ఉంటాడని చాలామందికి తెలియదు. రిలేషన్‌షిప్స్‌కి చాలా విలువిస్తాడు. తన అనుకున్నవారిని కంటికి రెప్పలా కాపాడతాడు. ఏ లోటూ లేకుండా చూసుకోవాలని తపిస్తాడు. ఇక నన్నయితే చాలా ముద్దు చేస్తాడు.

 అన్నయ్యతో బయటకు వెళ్తే ఓ వింత ప్రపంచంలోకి వెళ్లినట్టుగా ఫీలయ్యేదాన్ని చిన్నప్పుడు. ఎందుకంటే... తన చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. లేదంటే తనని అడుగు కూడా కదపనివ్వరు ఫ్యాన్స్. చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అంతమందిలో నా చేయి పట్టుకుని తను నన్ను తీసుకెళ్తుంటే చాలా గర్వంగా అనిపించేది. షాపింగుకి తీసుకెళ్తాడు. కావలసినవన్నీ కొనిస్తాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లినప్పుడు కూడా నన్ను షాపింగుకి తీసుకెళ్లాడు. ఓ పక్క ఫ్లయిట్ టైమవుతున్నా... నన్ను ఓపిగ్గా తిప్పి, అడిగినవన్నీ కొనిచ్చాడు. ఇరవై మూడేళ్లు వచ్చినా, నన్నిప్పటికీ చిన్నపిల్లలాగే చూస్తుంటాడు. నన్ను ఎవరైనా ఏదైనా అంటే తనకి చాలా కోపమొచ్చేస్తుంది. వెంటనే సీరియస్ అయిపోతాడు. ఎంత బిజీగా ఉండే వ్యక్తి అయినా నా కోసం టైమ్ కేటాయిస్తుంటే చాలా సంతోషమేస్తుంది నాకు.

 అన్నయ్య గురించి ఎప్పుడూ ఏవో రూమర్లు రాస్తూనే ఉంటారు. చానెళ్లన్నీ పనిగట్టుకుని ఏవేవో కథనాలు ఇస్తూ ఉంటాయి. కానీ నాకు తెలిసి అన్నయ్యను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. తన కోపం గురించే అందరూ మాట్లాడతారు తప్ప, తన ప్రేమ గురించి ఎవరూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.  సమాజం దారుణంగా అపార్థం చేసుకున్న వ్యక్తులో మా అన్నయ్య ఒకడు. అందరూ అనుకుంటున్నట్టు తను కోపిష్టి కాదు. మంచి మనసున్నవాడు. ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ అబద్ధాలు చెప్పేవాళ్లని, మోసగాళ్లని దూరంగా ఉంచుతాడు. నచ్చని విషయాన్ని ముఖమ్మీదే చెప్పేస్తాడు. అందుకే అందరి దగ్గర చెడు అవుతుంటాడు. మా అన్నయ్య ఎంత మంచివాడో నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది!

 

మరిన్ని వార్తలు