సిరా చుక్క.. నెత్తుటి మరక...

28 Jul, 2019 08:12 IST|Sakshi

ధ్రువతారలు

మార్చి 23, 1931...  భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను లాహోర్‌ జైలులో ఉరి తీశారు. ఉరి వార్తతో భారతదేశమంతా ఉలికిపడింది. ఆగ్రహించిన ప్రజానీకం పలుచోట్ల గట్టిగా నిరసనలు తెలిపింది. సరిగ్గా రెండు రోజులకి కాన్పూర్‌లో ఘోరమైన మత కల్లోలాలు జరిగాయి. ఆ ముగ్గురి ఉరితీతకు నిరసనగా మొదలైన నిరసన కార్యక్రమం మత కల్లోలంగా పరిణ మించడమే పెద్ద విషాదం. పది మందో పాతిక మందో కాదు.. నాలుగు వందల మంది వరకు చనిపోయారు. అలాంటి సమయంలో ఆ రక్తపాతం నుంచి, ఆ మౌఢ్యం నుంచి అటు హిందువులను, ఇటు ముస్లిం మతానికి చెందిన అమాయకులను రక్షించడానికి ఒక జాతీయ కాంగ్రెస్‌ నాయకుడు, గాంధీజీ అనుచరుడు నేరుగా రంగంలో దిగారు.

అదే అదనుగా ఒక మూక ఆయన మీద పడి, కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసింది. రెండురోజులకు గాని ఆయన మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. ఆయనే గణేశ్‌శంకర్‌ ‘విద్యార్థి’. ఆ మార్చి 9న జరిగిన గాంధీ–ఇర్విన్‌ ఒప్పందంలో భాగంగా గణేశ్‌శంకర్‌ను సీతాపురి జైలు నుంచి విడుదల చేశారు. వైస్రాయ్‌ ఇర్విన్‌తో గాంధీ జరిపిన ఆ చర్చలలోనే భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల ఉరిశిక్ష అమలు నిలిపివేత అంశాన్ని కూడా చేర్చాలని, అందుకు జవాహర్‌లాల్‌ నెహ్రూ సాయం తీసుకోవాలని విద్యార్థి సలహా కూడా ఇచ్చారు. ఆ ఫిబ్రవరి చివర విద్యార్థి నుంచి ఇలాంటి సలహా తీసుకున్న మహనీయుడే చంద్రశేఖర ఆజాద్‌.

కానీ, విద్యార్థి సలహా మేరకు అలహాబాద్‌ వెళ్లి నెహ్రూను కలుసుకున్న ఆజాద్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంకా విషాదం– అలహాబాద్‌లోనే ఆనందభవన్‌ నుంచి అల్ఫ్రెడ్‌ పార్కుకు రహస్యంగా చేరుకున్న ఆజాద్‌ ఆచూకీ పోలీసులకు తెలిసిపోయింది. చుట్టుముట్టి కాల్చి చంపేశారు. అంటే మొదట ఆజాద్, తరువాత భగత్‌సింగ్‌ విప్లవ త్రయం, చివరిగా విద్యార్థి చనిపోయారు. ఇదొక గొలుసుకట్టు కుట్ర అంటారు సమకాలీకులు, విద్యార్థి కుమార్తె విమల. గాంధీజీ చర్చించి బయటకు తెచ్చిన విద్యార్థినీ, చర్చించకుండా విడిచిపెట్టిన ఆ విప్లవ త్రయాన్నీ కూడా బ్రిటిష్‌ ప్రభుత్వమే మట్టుపెట్టింది. ఇదొక చారిత్రక వైచిత్రి.

గణేశ్‌శంకర్‌ ‘విద్యార్థి’ భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడా?  హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ ఆర్మీ పేరుతో విప్లవ కార్యకలాపాలు సాగించిన ఆజాద్, భగత్‌సింగ్‌ తదితరుల ఆలోచనల పట్ల సంఘీభావం ఉందా? ఆనాటి ఉద్యమ నేపథ్యాన్ని బట్టి ఈ రెండు అంశాలు భిన్నధ్రువాలే అయినా, ఆ రెండింటికీ ఒక్కటే జవాబు, అవుననే. విద్యార్థిలో జాతీయ కాంగ్రెస్‌ పట్ల భక్తి, తీవ్ర జాతీయవాదం పట్ల సంఘీభావం, కార్మిక–రైతు సమస్యల మీద పోరాటం త్రివేణీ సంగమంలా కనిపిస్తాయి. అందుకే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విద్యార్థి స్థానం విశిష్టంగా కనిపిస్తుంది.

గణేశ్‌శంకర్‌ విద్యార్థి (అక్టోబర్‌ 26,1890–మార్చి 25, 1931) ఒక పేద కుటుంబంలో పుట్టారు. అలహాబాద్‌ సమీపంలోన అట్టార్‌సుయి ఆయన జన్మస్థలం. తల్లి గోమతీదేవి. తండ్రి జయనారాయణ్, ఉపాధ్యాయుడు. ఆయన మంగౌలి (నేటి మధ్యప్రదేశ్, అశోక్‌నగర్‌ జిల్లా)లో, విదిశలలో పనిచేశారు. విద్యార్థి తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసినా, పేదరికం వల్ల ఉన్నత పాఠశాల పరీక్షను 1907లో ప్రైవేటుగా రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత కాయస్థ ఉన్నత పాఠశాలలో చేరినా అక్కడ కూడా పేదరికంతోనే కొనసాగలేకపోయారు. మొదట టంకసాలలో గుమాస్తాగా చేరారు. ఆపై కాన్పూర్‌ వచ్చి ఉపాధ్యాయునిగా కొంతకాలం పనిచేశారు. కానీ ఆయన ఆ ఉద్యోగాలలో ఇమడలేకపోయారు.

ఆయన అభిరుచి అంతా పత్రికా రచనే. 16వ ఏటనే ‘హమారీ ఆత్మోగసర్గర్‌’ అనే పుస్తకం రాశారాయన. ప్రపంచ ప్రఖ్యాత రచయిత విక్టర్‌ హ్యూగో ‘93’ నవలను అనువదించారు. ఆ రోజులలో పత్రికా రచన, జాతీయోద్యమం వేరు చేసి చూడలేనివిగా ఉండేవి. ఆ సమన్వయమే విద్యార్థిలో కూడా కనిపిస్తుంది. మొదట ఆయన ‘కర్మయోగి’ (గదర్‌వీరుడు పండిట్‌ సుందర్‌లాల్‌ స్థాపించారు), ‘స్వరాజ్య’ పత్రికలకు పంపిణీదారుగా పనిచేశారు. ఆ పని చేస్తూనే రచనలు పంపించడం కూడా ఆరంభించారు. ఆ రచనల కోసం ఆయన పెట్టుకున్న పేరు ‘విద్యార్థి’. విద్యార్థి అని తన పేరు చివర ఎందుకు తగలించుకున్నారో కూడా వివరించారు. జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష.

అలాంటి సమయంలోనే పండిట్‌ మహావీర్‌ ప్రసాద్‌ ద్వివేది దృష్టిలో పడ్డారు విద్యార్థి. ఆధునిక హిందీ పత్రికా రచనకు ఆద్యునిగా ద్వివేదీని గౌరవిస్తారు. ఆయనే విద్యార్థిని పిలిచి తన సాహిత్య పత్రిక ‘సరస్వతి’లో ఉప సంపాదకునిగా(1911) నియమించారు. విద్యార్థికి హిందీభాషా సాహిత్యాలంటే ఎనలేని ఇష్టమే ఉన్నా, భారతీయులు జరుపుతున్న రాజకీయ, సామాజికోద్యమాలను వ్యాఖ్యానించడమంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారు. ఇదే ఆయనను ఆనాడు పేర్గాంచిన రాజకీయ పత్రిక ‘అభ్యుదయ’లో చేరేటట్టు చేసింది. చివరికి 1913లో కాన్పూర్‌ వచ్చి ‘ప్రతాప్‌’ వారపత్రిక ఆరంభించారు.  అరకొర ఆదాయంతోనే అయినా చివరికంటా ఆ పత్రిక సంపాదకునిగానే పనిచేశారు.

‘అణచివేత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిని నేను. ఉద్యోగులు, జమీందార్లు, పెట్టుబడిదారులు, కులీనులు ఎవరు ఈ పనికి పాల్పడినా నేను వారిపై పోరాడతాను. అమానవీయతకు వ్యతిరేకంగా నా ప్రాణమొడ్డి పోరాడతాను. అందుకు భగవంతుడు నాకు శక్తిని ఇస్తాడని కాంక్షిస్తున్నాను’ అని ఒక సందర్భంలో విద్యార్థి చెప్పారు. ఆయన పత్రిక విధానం దాదాపు ఇదే. రాయబరేలీ రైతాంగ సమస్యల మీద, కాన్పూరులోని మిల్లు కార్మికుల వెతల గురించి ప్రతాప్‌ వారపత్రిక  పోరాడింది. విద్యార్థి కార్యక్ష్రేతం కాన్పూరే. హిందుస్తానీ బిరాదారి అనే సంఘం పేరుతో మత సామరస్యం కోసం ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించారాయన. కాన్పూర్‌ మజ్దూర్‌ సభ ఆయన నాయకత్వంలోనే నడిచింది.

గాంధీజీ 1916లో లక్నోలో పర్యటించారు. అప్పటి నుంచి విద్యార్థికి గాంధీజీ అంటే భక్తి ఏర్పడింది. 1919లో గానీ జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వం గాంధీజీ చేతికి రాలేదు. కాంగ్రెస్‌ అంటే కేవలం విద్యావంతుల సంస్థ కాదనీ, సాధారణ ప్రజలకు కూడా ఇందులో స్థానం ఉండాలనీ గాంధీజీ ఆశించి, అమలు చేశారు. కానీ జనవరి 11, 1915లో విద్యార్థి చెప్పిన ఈ మాటలు పరిశీలిస్తే విస్తుపోతాం. ‘మన రాజకీయ సిద్ధాంతం, మన ఉద్యమం ఇంగ్లిష్‌ చదువుకున్న ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదన్న వాస్తవం గుర్తించవలసిన సమయం ఆసన్నమైంది. ఇవి సామాన్య ప్రజల చెంతకు చేరాలి. ఎవరో కొందరి వ్యక్తిగత అభిప్రాయాలే మొత్తం భారతీయలందరి అభిప్రాయంగా పరిగణించలేం. ప్రజాభిప్రాయం ఏదో అదే ప్రజాస్వామ్య నిబంధన అవుతుంది’ అన్నారు విద్యార్థి.

అలాగే రైతుల ప్రాధాన్యం గురించి విద్యార్థికి సమున్నత అభిప్రాయం ఉండేది. హోమ్‌రూల్‌ సభ్యునిగా 1917–18 మధ్య ఆయన మొదటిసారి కాన్పూర్‌లో జౌళి కార్మికుల చేత సమ్మె చేయించారు. 1920లో ప్రతాప్‌ను దినపత్రికను చేసి, రాయ్‌బరేలీ రైతాంగ ఉద్యమాన్ని సమర్థించినందుకు జైలుకు వెళ్లవలసి వచ్చింది. జీవితంలో ఐదుసార్లు ఆయన కఠిన కారాగారం అనుభవించారు. చట్టసభలకు పోటీ చేయాలని  1925లో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం మేరకు విద్యార్థి మధ్య పరిగణాల కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. మార్చి 9, 1931న విడుదలైన విద్యార్థి కరాచీలో జరుగుతున్న కాంగ్రెస్‌ సమావేశాలకు బయలుదేరే సన్నాహంలో ఉన్నారు. ఇంతలోనే భగత్‌సింగ్‌ త్రయాన్ని ఉరి తీయడం, అందుకు నిరసన పేరుతో  కాన్పూర్‌లో అల్లర్లు చెలరేగడం జరిగిపోయాయి.

భగత్‌సింగ్‌ విప్లవ త్రయాన్ని ఉరి తీసిన తరువాత దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కానీ కాన్పూర్‌లో పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. అందుకు కాన్పూర్‌లోని చైతన్యం, అక్కడి కార్మికోద్యమం, కాంగ్రెస్‌ ఉద్యమం, విప్లవకారుల కదలికలు కారణం. వీటన్నిటిని అనుసంధానం చేసిన వారు విద్యార్థి. 1924లో మౌలానా హస్రత్‌ మొహానీ అనే వ్యక్తి ద్వారా విద్యార్థి భగత్‌సింగ్‌ను కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయులయ్యారు. భగత్‌సింగ్‌కు కొన్ని మాసాల పాటు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, తన పత్రికలో కాలమ్‌ కూడా ఇచ్చారు విద్యార్థి. తరువాత చంద్రశేఖర ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. కాంగ్రెస్‌లో తనకున్న పరిచయాలను బట్టి నెహ్రూతో ఆజాద్‌ సమావేశం కావడానికి అవకాశం కల్పించారు. ఇర్విన్‌తో చర్చల సమయంలో భగత్‌సింగ్‌ అంశం కూడా గాంధీ లేవనెత్తేటట్టు నెహ్రూ ద్వారా ఒప్పించాలన్నదే ఆజాద్, విద్యార్థిల ఆశయం. కానీ అది సాధ్యం కాలేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఉపన్యాసం ఇచ్చి జైలు శిక్ష అనుభవిస్తున్న విద్యార్థిని విడుదల చేశారు. భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఆదరాబాదరాగా ఉరి తీశారు (నిజానికి తీర్పు ప్రకారం మార్చి 24న భగత్‌సింగ్, మిగిలిన ఇద్దరినీ ఉరి తీయాలి. కానీ దానిని 11 గంటలు ముందుకు జరిపారు). కాన్పూర్‌ గొడవలు మొదలయ్యాయి. ఇది ఒక సీఐడీ కుట్ర అని విద్యార్థి కుమార్తె విమలా విద్యార్థి వెల్లడించారు (విద్యార్థి భార్య చంద్రప్రకాశవతి). విద్యార్థి రచనల ప్రచురణకు సంపాదకత్వం వహించిన  సురేశ్‌ సలిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కాన్పూర్‌ సింహం ఇవాళ చస్తుంది’ అంటూ ఒక సంకేతం ఆ రోజు అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న కొందరి నోటి నుంచి వినిపించినట్టు, అప్పుడే కొన్ని ఆయుధాలు సరఫరా అయినట్టు తనకు విశ్వసనీయంగా తెలిసిందని విమల తెలియచేశారు.

‘రామకథను మసీదు ముందున్న ఖాళీ మైదానాలలో ప్రదర్శించే సంప్రదాయం ఉండేది. కానీ ఆంగ్లేయులు వచ్చి హిందువులు, ముస్లింల మధ్య చీలిక తెచ్చారు’ అని విద్యార్థి నమ్మారు, అదే రాశారు. కానీ మత సామరస్యం కోసం తామంతా చేసిన కృషి అలా తన కళ్లెదుటే నిర్వీర్యం కావడం ఆయనను బాధించి ఉండాలి. ‘గుళ్లూ మసీదులు తగలబడుతుంటే పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. దుకాణాలను దోచుకుంటున్నారు’ అని ఆ సమయంలో ఒక మిత్రునికి రాసిన లేఖలో విద్యార్థి వాపోయారని కాన్పూర్‌ అలజళ్ల మీద నియమించిన కమిషన్‌ తెలియచేసింది. ఇదంతా కాన్పూర్‌లో బలపడుతున్న బ్రిటిష్‌ వ్యతిరేకతకు లభించిన క్రూరమైన జవాబు. విద్యార్థి మరణించేనాటికి ఆయన వయసు 40 ఏళ్లు.

భారత జాతీయ కాంగ్రెస్‌లో పని చేస్తున్నా, గణేశ్‌శంకర్‌ విద్యార్థికి పరిచయం ఉన్నంతమంది విప్లవకారులు మరొక నేత ఎవరికీ లేరని ఆనాడు ఒక మాట ఉండేది. కానీ చరిత్రలో ఆయన స్థానం చూస్తే ఒక ప్రశ్న వేసుకోకతప్పదు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో స్థానం కావాలంటే జాతీయ కాంగ్రెస్‌లో పనిచేయడంతోనే సరిపోదు, జాతీయ కాంగ్రెస్‌కు బయట ఉండి పోరాడినవారిని, త్యాగాలు చేసిన వారిని కూడా దూరంగా ఉంచాలా?
- డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు