ఆ కొండలు చూసిన కొత్త సూర్యోదయం

11 Aug, 2019 11:41 IST|Sakshi

ధ్రువతారలు

అరెస్టు చేసిన ఆ ఆదివాసీ ఉద్యమకారుడిని నాలుగు గుర్రాలకు కట్టి లాక్కుని వచ్చారు. దేహమంతా మాంసపు ముద్దలా మారినా అతడిలోని ఉద్యమ స్ఫూర్తి చావలేదు. ప్రాణం పోలేదు. అందుకే భాగల్పూర్‌ దగ్గర ఒక మహా మర్రి చెట్టుకు ఉరి వేశారు. ఈస్టిండియా కంపెనీ చేతిలో ఇంత ఘోరంగా మరణించిన ఆ ఆదివాసీ ఉద్యమకారుడు తిల్కా మాంఝీ. 

తిల్కా ఫిబ్రవరి 11, 1750న బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌ ప్రాంతంలో పుట్టాడు. ఇతడు పుట్టిన కుగ్రామం పేరు తిల్కాపూర్‌. తిల్కా తండ్రి సుందర ముర్ము. ముర్ము అంటే వారి గోత్రం. జాబ్రా పహాడియా అన్న పేరు కూడా ఇతడికి ఉంది. అందుకే ఇతడు పహాడియా గిరిజన తెగకు చెందినవాడని కొందరి అభిప్రాయం. కానీ ఇతడు సంతాలీ ఆదివాసీ తెగవాడే. తిల్కాకు పసితనం నుంచే ప్రకృతినే ఆరా«ధించే లక్షణం ఉంది.  అడవే ప్రాణం. వనమంతా కలియ తిరగడం,  జంతువులతో మాలిమి, పెద్ద పెద్ద చెట్లెక్కడం అతడికి నిత్యకృత్యంగా ఉండేది. అలాగే నదులన్నా, జలపాతాలన్నా ఎంతో ఇష్టం. కానీ అడవిలో అడవిబిడ్డల జీవనం అడవి అంత అందంగా లేదు. అడవంత సంపన్నంగా అసలే లేదు. కారణం– ఈస్టిండియా కంపెనీ చొరబాటు. ఒక ప్రాంతం మీద పన్ను వసూలు అధికారం మాటున అటవీ భూములు బయటి వ్యక్తులకు అప్పగించేవారు.

అటవీ సంపద అనుభవిస్తే ఆదివాసీల మీద అసాధారణంగా పన్నులు విధించేవారు. బయట నుంచి వచ్చి ఆదివాసీల మీద ఆధిపత్యం సంపాదించినవారిలో ముఖ్యులు వడ్డీవ్యాపారులు.  రాను రాను ఈ వ్యాపారుల ఆగడాలు మితిమీరాయి.  చిన్న చిన్న మొత్తాలు ఇచ్చి అటవీ సంపదను అదివాసీల చేత దోపిడీ చేయించేవారు. వారు సాగు చేసే భూములన్నీ కట్టలేకపోయిన వడ్డీకి బదులు అన్నట్టు వ్యాపారుల పరమయ్యేవి. ఈ వ్యాపారులకు కంపెనీ పోలీసులు రక్షణ కల్పించేవారు. ఇది ఆదివాసీలకు భరించరానిదిగా ఉండేది. కాబట్టే ప్రతి గిరిజనోద్యమానికి చోదకశక్తి భూమి మీద హక్కు అయి ఉంటుంది. అడవి మీద అధికారం ఎవరిదన్న ప్రశ్నే అయి ఉంటుంది. ఒక నిస్సహాయత నిరసనగా పరిణమించడం కూడా కనిపిస్తుంది. కంపెనీ వైఖరికి నిరసనగా ఉద్యమం మొదలైన తరువాత తిల్కా, బాబా తిల్కా మాంఝీగా పేరు తెచ్చుకున్నాడు. 

తిల్కా ఉద్యమం కూడా అలాంటి హక్కు కోసమే ఆరంభమైంది. అంతిమంగా భాగల్పూర్, సుల్తాన్‌గంజ్‌ ప్రాంత ఆదివాసీలంతా తిల్కా నాయకత్వంలో ఉద్యమం సాగించారు. ఇతడి ఉద్యమం 1771లో మొదలయింది. 1778లో కంపెనీ చేత చావుదెబ్బ తినిపించాడు. ఆ సంవత్సరం పహాడియా సర్దార్లతో కలసి కంపెనీకి చెందిన రామ్‌గఢ్‌ శిబిరాన్ని ఆక్రమించాడు.   తిల్కా ఉద్యమం సాగించిన ప్రాంతాలకి అప్పుడు అగస్టస్‌ క్లీవ్‌ల్యాండ్, సర్‌ ఐర్‌ అధికారులుగా ఉండేవారు. క్లీవ్‌ల్యాండ్‌ రాజమహల్‌ మేజిస్ట్రేట్‌. తిల్కా కొండదళంతో ఈ ఇద్దరి నాయకత్వంలోనే కంపెనీ యుద్ధం చేసింది. తిల్కా నడిపినది కూడా గెరిల్లా యుద్దమే. చివరికి ఈ ఉద్యమం కీలక మలుపునకు లేదా అసలు తుది మలుపునకు తిరిగే సమయం జనవరి 13, 1784న జరిగింది. ఆ రోజు తిల్కా ఒక తాడిచెట్టు ఎక్కి విల్లంబులతో కాపు వేశాడు. క్లీవ్‌ల్యాండ్‌ వచ్చి తన గుర్రం అధిరోహించాడు. సరిగ్గా అదను చూసి బాణాలు సంధించాడు తిల్కా. గులేల్‌ అనే ఒక ఆయుధం ప్రయోగించి మొత్తానికి క్లీవ్‌ల్యాండ్‌ను మట్టి కరిపించాడు. 

క్లీవ్‌ల్యాండ్‌ మరణంతో కంపెనీ అధికారులలో భయం మొదలయింది. కానీ ఒక అధికారి మరణంతోనో. కొందరు గిరిజనుల ఆగ్రహానికో భయపడి వెనక్కి తగ్గే లక్షణం తెల్లవాళ్లలో కనిపించదు. ఈ దేశ సంపద మీద వాళ్లకి అంత ఆశ. అందుకే అలాంటి మరణం సంభవించినప్పుడు మరింత పట్టుదలతో, ఇంకా పెద్ద వ్యూహంతో, తమ జాతి మొత్తానికి జరిగిన అవమానంగా భావించి మరీ ముందుకు వెళ్లేవారు. ఫలితంగా రక్తపాతం మరింత ఎక్కువగా జరిగేది. ఆదివాసీలు గెరిల్లా పోరాటం చేస్తారని, చాటు నుంచి వేటు వేస్తారని అంటారు. కానీ అంత ఆధునిక ఆయుధ సంపత్తి, యుద్ధ నైపుణ్యం ఉన్న ఆంగ్లేయులు అడవులలో చేసింది కూడా అదే. చాటు నుంచి దెబ్బ తీయడమే. 

సంతాలీలు ఏదో పండుగ చేసుకుంటున్నారు. వాళ్ల ఆచారం ప్రకారం పాటలు పాడుకుంటూ చిందేస్తూ ఆనందంగా ఉన్నారు. ఈ ఉత్సవంలో తిల్కా కూడా ఉన్నాడు. అప్పుడే జౌ«ద్‌ అనే ఒక కిరాయి యుద్ధ నిపుణుడు తిల్కా సేన మీద దాడికి దిగాడు. కొంతమంది అనుచరులతో కలసి తిల్కా తప్పించుకున్నా చాలా మంది ఉద్యమకారులు చనిపోయారు, లేదా పట్టుబడిపోయారు. పట్టుబడిన వారిని వెంటనే జైళ్లల్లో కుక్కారు. తప్పించుకున్న తిల్కా సుల్తాన్‌గంజ్‌ కొండలలోకి పారిపోయాడు. అతడి ఆచూకీ కనుగొన్న కంపెనీ బలగాలు ఉచ్చు పన్ని ఉంచాయి. ఆ కొండలలో తిల్కా, అతడి అనుచరులకి జీవితం దుర్భరంగా మారింది. కంపెనీ సేనలకీ, తిల్కా సేనకీ మధ్య కొన్ని దాడులు జరిగాయి. ఈ వ్యూహమంతా అయార్‌కట్‌ అనే అధికారి నాయకత్వంలో జరిగింది. చివరికి కంపెనీ బలగాలకు తిల్కా దొరికిపోయాడు. అంటే 1771 నుంచి 1784 తిల్కా ఉద్యమం సాగింది.

నిజమే, తిల్కా ఉద్యమం, దాని గమనం చూస్తే భాగల్పూరు కొండలు కొత్త సూర్యోదయాన్ని చూశాయనే చెప్పాలి. ఏ గిరిజనోద్యమమైనా రోమాంచితం చేసే ఘట్టంగానే ఉంటుంది కూడా. కానీ ఆ గాథ బటయపడిన తరువాత మిగిలిన ఉద్యమాలకు కొత్త ముద్రలు వేయడం, చరిత్ర పురుషుల మధ్య పోటీ పెట్టడం సరికాదనిపిస్తుంది. తిల్కా ఉద్యమ ఘట్టాలు వెలుగు చూసిన తరువాత 1857 నాటి ప్రథమ స్వాతంత్య్రం సంగ్రామంలో పాల్గొన్న సిపాయీ మంగళ్‌ పాండేను కంపెనీ మీద తొలిసారి తిరగబడిన వీరుడని చెబుతారని, కానీ అది నిజం కాదు, తిల్కాయే తొలి నిరసన తెలిపిన వాడు అంటూ ఒక వాదన వినిపిస్తున్నారు. మంగళ్‌పాండే కంటే ముందు కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. కొందరు కంపెనీ అధికారులు చనిపోయారు. వాళ్లు ఎవరి చేతిలో మరణించారో తెలియదు. తెలిస్తే మళ్లీ చరిత్రలో కొత్త పేరు వస్తుంది. ప్రపంచంలో చాలా చోట్ల సాగిన ఈస్టిండియా కంపెనీ ఏలుబడిలో గాని, రాణి పాలనలో గాని ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. ఒకే జాతి నిరంకుశత్వం మీద, అరాచకం మీద, అణచివేత మీద నిరసనలే అవన్నీ. తిల్కాకు ముందు ఏం జరిగిందో (కొండకోనలలో) కొన్ని వివరాలు అందుబాటులో ఉన్నా, ఇంకా పరిశోధన జరగాలి. భారతదేశంలో శ్వేతజాతి మీద చాలా ప్రతిఘటనలు వచ్చాయి. ముందు వెనుకా మీమాంస వచ్చిన ఈ సందర్భంలో వాటిని గుర్తు చేసుకోవడం అప్రస్తుతం కాదు. 

బ్రిటిష్‌ పాలనలో జరిగిన తొలి గిరిజనోద్యమాలలో ఒకటి ‘చౌర్‌ బిద్రోహ్‌’ (1760–1799). కొండకోనల నుంచి తెల్లజాతికి ఎదురైన తొలి ప్రతిఘటన ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం.  ఇది ఈస్టిండియా కంపెనీ మీద బాగా వెనుకబడిన ప్రాంతాల పేదలు చేసిన తిరుగుబాటు. నాటి బెంగాల్‌ ప్రావిన్స్‌లోని నైరుతి ప్రాంతపు అటవీ ప్రాంతంలో (నేటి జార్ఖండ్‌ పరిసరాలు) ఈ తిరుగుబాటు జరిగింది. ఈ ఉద్యమానికి మూలకేంద్రం మేదీనీపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని (కోల్‌కతాకు 129 కి.మీ.) కర్ణాగఢ్‌. ఇక్కడి ఒక పురాతన దేవాలయమే ఉద్యమకారుల నిలయంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందులో కొలువై ఉన్న దేవత మహామాయ.

మేదినీపూర్‌లో రగిలిన చౌర్‌ బిద్రోహ్‌ జంగిల్‌ మహల్‌ను (కొన్ని అటవీ ప్రాంతాలు) చుట్టుముట్టి బంకూరా, పురూలియాల వరకు విస్తరించింది. అలాగే బిహార్‌లోని తూర్పు ప్రాంతం కూడా చౌర్స్‌ ఉద్యమంతో కదిలింది. ఇదంతా 1765 నాటి చరిత్ర అన్న సంగతి గుర్తించాలి. దీనినంతటినీ 1911 నాటి బెంగాల్‌ జిల్లా గజెట్‌లో బ్రిటిష్‌ జాతీయుడు ఎల్‌ఎస్‌ఎస్‌ ఒమెల్లి నమోదు చేశాడు. 1769 డిసెంబర్, మళ్లీ 1770లో చౌర్స్‌ (గిరిజనులనే తెల్లజాతీయులు ఈ పేరుతో పిలిచారు. అంటే మోసగాళ్లు అని) నివాసం ఉండే ఘటిశిల, బారభూమ్‌ కొండల మధ్య ఉద్యమం జరిగిందని ఒమెల్లి రాశాడు. ఇంతకీ వీళ్ల తిరుగుబాటు ఎందుకంటే ఈస్టిండియా కంపెనీ విధించిన అధిక పన్నులు, అణచివేతలను తట్టుకోలేకనే. చాలా సందర్భాలలో వలెనే ఈ గిరిజనులని అనాగరికులుగా, మోసగాళ్లుగా బ్రిటిష్‌ జాతీయులు ముద్ర వేయడం జరిగింది.
 

మైదాన ప్రాంతాలలోనే అయినా చౌర్స్‌ తరువాత బెంగాల్‌ ప్రాంతంలోనే జరిగిన రెండో ప్రముఖ నిరసన ఘట్టం– సన్యాసుల–ఫకీర్‌ల తిరుగుబాటు (1770–1820).  బెంగాల్‌లోనే ముర్షిదాబాద్, జాల్పాయ్‌గుడి, బైకుంఠపూర్‌ అడవులు కేంద్రంగా ఈ తిరుగుబాటు జరిగింది. బక్సర్‌ యుద్ధం (1764) తరువాత బెంగాల్‌లో పన్ను (దివానీ) వసూలు అధికారం ఈస్టిండియా కంపెనీకి వచ్చింది. జలగలకు పాఠం చెప్పగలవారన్నట్టు ఉండేది తెల్లజాతీయుల వైఖరి. రైతులు, వృత్తుల వారు చెల్లాచెదురైపోయారు. అప్పటి నుంచి ఇలాంటి తిరుగుబాట్లు మొదలయ్యాయని చెప్పవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే ఈస్టిండియా కంపెనీ భారత ఆర్థిక వ్యవస్థ మీద దోపిడీ మొదలు పెట్టినది అప్పుడే. ఓ మూడు ఘటనలను కలిపి సన్యాసుల తిరుగుబాటుగా చెబుతారు. ఉత్తరాది నుంచి వచ్చిన కొందరు సన్యాసులు ఏటా వసూలు చేసినట్టే జమీందార్లు, భూస్వాముల దగ్గర మత పన్నును వసూలు చేసే యత్నం చేశారు. అప్పటికే ఈస్టిండియా కంపెనీ జమిందార్లనీ, భూస్వాములనీ భారీ పన్నులతో పీల్చి పిప్పి చేసింది.

ఆ సమయంలోనే దారుణమైన కరువు (1770) వచ్చింది. దీనితో జమీందార్లు, భూస్వాములు సన్యాసులకు పన్ను కట్టలేకపోయారు. కంపెనీ కూడా సన్యాసులు పన్ను వసూలు చేయకుండా ఆంక్షలు విధించడమే కాకుండా, వారు గుళ్లూ గోపురాలకు వెళ్లడం కూడా నిషేధించింది. ఇదే తిరుగుబాటుకు బీజం వేసింది. తమ బృందంలోని 150 మందిని ఎలాంటి కారణం లేకుండానే కంపెనీ అధికారులు గత సంవత్సరం చంపేశారని 1772లో మజ్నున్‌ షా అనే ఫకీర్‌ ఆరోపించాడు. నాతోర్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) హింసాకాండకు కారణం ఇదేనని చెబుతారు. దశ్నమి నాగా సన్యాసులు కూడా ఇలాగే బెంగాల్‌లో పర్యటించేవారు. వీరి యాత్రను కూడా కంపెనీ నిషేధించడంతో వారు కూడా తిరుగుబాటులో చేరారు. సన్యాసుల తిరుగుబాటు ఘటనల ఆధారంగా రాసిన నవల ‘ఆనందమఠం’ (బంకించంద్ర చటర్జీ). 

చౌర్‌ తిరుగుబాటు వాస్తవంగా (1766–1772; 1795–1816) జరిగింది. ఛోటానాగ్‌పూర్‌ ప్రాంతపు  హొ, ముండా తెగల గిరిజనులు కూడా రెండుసార్లు ఈస్టండియా కంపెనీ ఆధిపత్యాన్ని సవాలు చేశారు. 1820–1822, 1831లలో అక్కడ తిరుగుబాట్లు జరిగాయి. 1837 వరకు కూడా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనలేదు. తరువాత కోల్‌ తిరుగుబాటు జరిగింది. రాంచీ, సింగ్భూమ్, హజారీబాగ్, పాలాము, మన్భూమ్‌ పశ్చిమ ప్రాంత గిరిజనులు 1831లో తిరగబడ్డారు. కోల్‌ గ్రామపెద్దలు లేదా ముండా తెగ గిరిజనుల భూములను బయట నుంచి వచ్చిన సిక్కులు, ముస్లిం రైతాంగానికి బదలీ చేయడంతో ఉద్యమం చెలరేగింది. బయటి నుంచి వచ్చిన దాదాపు వేయి మందిని కోల్‌ ఉద్యమంలో చంపారు. ఈ అలజడిని ఆపడానికి సైన్యాన్ని దింపవలసి వచ్చింది. ఖొందోలు పట్నా ప్రాంతంలో 1837–56లలో తిరుగుబాటు చేశారు.

రాజమహల్‌ కొండలలో సంతాలీలు 1854లో తిర గబడ్డారు. దీనికే సిడో, కన్హు నాయకులు. సిడో 1855లో చనిపోయాడు. కన్హును 1866లో అరెస్టు చేశారు. ఈ ఉద్యమానికే సంతాల్‌ హూల్‌ అని పేరు. ఈ తెగను సంతృప్తి పరచడానికే అప్పుడు సంతాల్‌ పరగణాను ఏర్పాటు చేశారు. ఖాసీ (1833), అహోమ్‌ (1828), పాగల్‌ పాంథిస్‌ (1830–1840), ఫరైజీ తెగ తిరుగుబాటు (1819–1860), ముండాల ఉల్‌ గులాన్‌ (1899–1900), భిల్లులు (1819), వాఘేరా (1818–1819), కోలీ (1829,1839, 1844, 1848),  రామోసి (1825–1829), విశాఖ మన్య విప్లవం (1922–1924) వంటి అలజడులు జరిగాయి. ఇంకా పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం అడవులు, కొండలు కూడా కంపెనీ, రాణి పాలనల మీద ప్రతిఘటనలతో ప్రతిధ్వనించాయి. ఎందరో చనిపోయారు. వీరిలో ఎవరి త్యాగమూ తక్కువది కాదు. ప్రతి యోధుడి గాథ చరిత్రలో నమోదు కావాలి. కొన్ని గాథలను బట్టి తిల్కాను నాలుగు గుర్రాలకు కట్టి ఈడ్చుకుని భాగల్పూరుకు తీసుకువెళ్లారు. కానీ అప్పటికి కూడా అతడి ప్రాణం పోలేదని గాథ. దీనితో ఒక పెద్ద మర్రి చెట్టుకు ఉరి వేశారు. జనవరి 13, 1785న ఈ ఘాతుకం జరిగింది. సరిగ్గా ఆప్రాంతంలోనే ఇప్పుడు తిల్కా విగ్రహం పెట్టారు. 

తిల్కా సంథాలీ తెగకు చెందినవాడు. అతడి నినాదం ఏడు దశాబ్దాల తరువాత కూడా అతడి తెగ వారు మరచిపోలేదు. జూన్‌ 30, 1855న సాహెబ్‌గంజ్‌ జిల్లాలో భూమి పన్ను కట్టేది లేదంటూ ముక్తకంఠంతో సంతాలీలు నినదించారు, నాలుగు వందల గ్రామాల సంథాలులు, దాదాపు 40,000 మంది. ఈ ఉద్యమ నేతలే సిడో, కన్హు, చంద్, భైరవ్, వీరి అక్కచెల్లెళ్లు ఫులో, ఝానో... తదితరులు. సిడో ఏమని పిలుపునిచ్చాడు? ఏమని నినదించాడు? ‘ఇది శ్వేతజాతిని తరిమివేయవలసిన సమయం’ అన్నాడు. ‘చంపండి లేదా చావండి’ అని పిలుపునిచ్చాడు. ఇంకా ‘తెల్లవాళ్లూ, మా భూములు వదలిపొండి!’ అని కూడా నినదించాడు. ఈ నినాదాలు, పిలుపుల వెనుక తిల్కా ప్రేరణ లేదని అనగలమా!      

డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా