శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఫలితాలు...

3 Apr, 2016 00:34 IST|Sakshi

ఈ సంవత్సరం రాజు శుక్రుడు, మంత్రి, సేనాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి బుధుడు, సస్యాధిపతి, నీరసాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, రసాధిపతి చంద్రుడు. నవనాయకుల్లో ఏడుగురు శుభులు, మిగతా ఇద్దరు పాపులు. అలాగే, ఉపనాయకుల్లోని 21మందిలో 10మంది శుభులు, మిగతా వారు పాపులు.

 
రాజు శుక్రుడు కావడం, మంత్రి బుధుడు కావడం, ఇద్దరూ మిత్రులైనందున పాలనాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ప్రజలు ఆశించిన రీతిలో పాలన కొనసాగుతుంది. పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగి అన్యోన్యంగా జీవిస్తారు. పాల ఉత్పత్తి అధికమై దీనిపై ఆధారపడిన వారికి మంచిరోజులని చెప్పవచ్చు. అలాగే, మంత్రి బుధుడు కావడం వల్ల మేఘాలు, గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద పరిశీలించగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. వీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల తిరస్కారానికి గురికాగలవు. శాంతిభద్రతల లోపంతో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు, ఉద్యమాలు చెలరేగి ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య కూడా వివాదాలు నెలకొని పాలనపై ప్రభావం చూపవచ్చు. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో పాలకులు మారవచ్చు. ఇరుగుపొరుగు దేశాలతో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందుకోసం సైనికచర్యలు సైతం తప్పని పరిస్థితి నెలకొంటుంది.


శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత పుంజకుంటాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక వ్యవసాయరంగం కొద్దిపాటి  ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. సరైన గిట్టుబాటు ధరలు రైతులు నిరాశకు గురికాగలరు.  ఈ ఏడాది నల్లరేగడి  భూములలో పంటలు బాగా పండుతాయి. వాణిజ్యపంటలు ఎక్కువగా పండుతాయి. తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సుభిక్షం. ఇతర ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు కావడం వల్ల నువ్వులు, తెల్లధాన్యాల దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. తూర్పు, ఈశాన్యప్రాంతాల్లో అధికంగానూ, దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో సామాన్యంగా వర్షాలు కురుస్తాయి. బంగారం, వెండి, రాగి లోహాల ధరలు పెరిగే సూచనలు. శుక్రుడు రాజుకావడం వల్ల నాలుగు కుంచాల వర్షం కురుస్తుంది. ఇందులో 8భాగాలు సముద్రమందు, 9భాగాలు పర్వతాలపై, 3భాగాలు నేలపై కురుస్తాయి. ఈ ఏడాది వర్షలగ్నం కన్యరాశి అయినది. లగ్న, దశమాధిపతి బుధుడు లాభాధిపతి చంద్రునితో కలిసి అష్టమస్థితి, ద్వితీయ, భాగ్యాధిపతి శుక్రుడు సప్తమమైన మీనంలో ఉచ్ఛస్థితి కలిగి వ్యయాధిపతి రవితో కలయిక.  తృతీయ మందు తృతీయ, అష్టమాధిపతి కుజుడు, పంచమ, షష్టమాధిపతి అయిన శనితో చేరియుండుట, చతుర్ధ, సప్తమాధిపతి గురుడు రాహువుతో చేరి వ్యయస్థానం, కేతువు షష్ఠమస్థానంలోనూ సంచారం.

 ఇక జగర్లగ్నం వృశ్చికమైనది. లగ్నంలో కుజ, శనుల కలయిక శుభంకాదు. రవి, శుక్రులకు ఉచ్ఛస్థితి. అష్టమంలో చంద్రుడు, గురు, రాహువులు రాజ్యస్థానంలో కలయిక. వీటిరీత్యా చూస్తే పాలకులలో పారదర్శకత లోపిస్తుంది. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన  ఆరోపణలు ఎదుర్కొంటారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఈ ఏడాది శుభదాయకంగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులకు కూడా అనుకూలమైనదే. రాజు శుక్రుడు కావడం వల్ల చిత్రపరిశ్రమ పుంజుకుంటుంది. కళాకారులకు గతం కంటే ప్రోత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్యరాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతాయి. అలాగే, వరదలు సంభవించి ఆస్తినష్టం కలిగే అవకాశం. దేశంలోని మధ్యప్రాంతంలో భూకంపాది ప్రకృతి వైపరీత్యాల వల్ల జన, ఆస్తినష్టాలు. కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గాలలో మార్పులు జరుగుతాయి. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. మహిళల శ్రేయస్సుకు ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రారంభిస్తాయి. అత్యున్నతస్థాయి పదవులకు మహిళలు ఎంపిక కావచ్చు. ఈ ఏడాది పేరుప్రఖ్యాతులు, విశేష ఆదరణ పొందిన నేతకు గడ్డుకాలమనే చెప్పాలి. విమాన, రైలు, బస్సు ప్రమాదాల కారణంగా జననష్టం. పశుపోషణ, మత్స్య, ఇతర వ్యవసాయానుబంధ రంగాలపై ఆధారపడిన వారికి మంచి రోజులు.


మొత్తం మీద కొన్ని ఒడిడుదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే  అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే సూచనలు. షేర్ మార్కెట్ తరచూ పతనావస్థకు చేరి ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా రాజు, మంత్రి శుక్రుడు, బుధుడు కావడం వల్ల  మన దేశ ఖ్యాతి నలుదిశలా విస్తరించే అవకాశం ఉంది. క్రీడారంగం కొత ్తపుంతలు తొక్కుతుంది. క్రీడాకారులకు విశేష గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఈ ఏడాది వైశాఖం చివరి నుంచి చిరుజల్లులు, అక్కడక్కడా వడగళ్లు పడవచ్చు. శ్రావణం, భాద్రపద మాసాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఉద్యమాలు పుట్టి పాలకులకు సవాలుగా మారతాయి. అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం మధ్యలో కాలసర్పదోషం కారణంగా విచిత్ర వ్యాధులు, చోరీలు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. దుర్ముఖినామ సంవత్సరంలో ప్రజల్లో పాపభీతి తగ్గి, నేరాలు పెరుగుతాయి. ఉన్మాద, తీవ్రవాద చర్యలతో సమస్యలు ఎదురుకావచ్చు. 

 జ్యేష్ఠ బ.విదియ, బుధవారం అనగా జూన్ 22వ తేదీ  ఉదయం 6.39గంటలకు పూర్వాషాఢ నక్షత్రం, బ్రహ్మయోగం, గరజి కరణం, మిథున లగ్నమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే  ఉదయం పూట రవి ఆరుద్రనక్షత్ర ప్రవేశం, బ్రహ్మయోగం వల్ల పంటలకు నష్టం, ప్రజలకు కష్టాలు. బుధవారం, విదియ తిథి, గరజి కరణమైనందున సుభిక్షం, సకాలంలో వర్షాలు కురుస్తాయి.

ఈ ఏడాది పశుపాలకుడు శ్రీకృష్ణుడు,  గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త బలభద్రుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఉగాది నుంచి 2017 జనవరి 26 వరకు అఢకం(కుంచం) వృద్ధగోపకుని చేతిలో ఉండడం శుభం. పంటలు బాగా పండుతాయి. తదుపరి  సంవత్సరాంతం వరకూ బ్రాహ్మణ బాలుని చేతిలో ఉండడం వల్ల కొంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి.

 (వచ్చే ఏడాది శ్రీహేవిళంబినామ సంవత్సరం.)

 

 

నవనాయకుల ఫలాలు...
రాజు- శుక్రుడు... మంచి వర్షాలు కురిసి పంటల ఉత్పత్తులు అధికమవుతాయి. మహిళలకు ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. కళాకారులకు గుర్తింపు, సన్మానాలు అందుతాయి. బంగారం, వెండి, సుగంధ ద్రవ్యాలు, రాగి, తెల్లని ధాన్యాలు, వేరుశెనగ వంటి నూనె గింజలు, మిర్చి, పసుపు ధరలు పెరుగుతాయి. మంత్రి- బుధుడు... ఏడాదంతా మధ్యమ ఫలితాలు ఉంటాయి. నూనెగింజల ధరలు అధికమవుతాయి. చక్కటి సలహాలతో పాలకులు పాలన చేస్తారు. అకాల మబ్బులు, వాయువులతో ఆకాశం నిండి ఉంటుంది.

 
సేనాధిపతి -బుధుడు... రాజకీయ నాయకులకు తరచూ ఇక్కట్లు ఎదురవుతాయి. నాయకులు,  ప్రజలలో నిబద్ధత లోపిస్తుంది. వాయువులతో కూడిన వర్షాలు కురుస్తాయి.సస్యాధిపతి -శని... నువ్వులు, నల్లటి ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయి.నల్లరేగడి భూములలో పంటలు బాగా పండుతాయి. బెల్లం, చింతపండు, పొగాకు ఇనుము వంటి ధరలు పెరుగుతాయి. ధాన్యాధిపతి - శుక్రుడు... సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. అన్ని రకాల ధాన్యాలు బాగా పండుతాయి.  సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పెరుగుతుంది.

 
అర్ఘాధిపతి- బుధుడు... పంటలు, వర్షాలు, ధరలు అధికంగా ఉంటాయి. నెయ్యి, పాలు, బంగారం, వెండి, పసుపు, కలప, కాగితం ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి- బుధుడు... మధ్య ప్రాంతంలో పిడుగులు, వడగండ్లతో వర్షాలు కురుస్తాయి.  రసాధిపతి- చంద్రుడు... ప్రజలు ఆరోగ్యవంతులై సుఖఃశాంతులతో జీవిస్తారు. నూనెలు, బెల్లం, కొబ్బరి, తేనె, పాలు చక్కెర ధరలు పెరుగుతాయి.  నీరాసాధిపతి- శని... నల్లటి వస్త్రాలు, ఇనుము, ఇతర లోహాల ధరలు పెరుగుదల కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు