సమీక్షణం :శ్రావ్య కవితాగానం

2 Mar, 2014 00:56 IST|Sakshi
సమీక్షణం :శ్రావ్య కవితాగానం

శ్రావ్య కవితాగానం
 పుస్తకం    :    గానగాత్రం (కవిత్వం)
 రచన    :    పెద్దిరెడ్డి గణేష్
 విషయం    :    ‘శబ్దాల నుంచి సుస్వరాలను జల్లెడ పట్టే చిత్రవిద్య’ తెలిసిన కవి పెద్దిరెడ్డి గణేష్. సంగీత సాహిత్యాల సమ్మేళనమే ఈ సంపుటిలోని 53 కవితల సారాంశం. ‘గానగాత్రం’ లో తానే ఒక పాటై, తన సర్వస్వం పాటగా మారిపోయి, పల్లవినీ చరణాలనూ కవిత్వంగా మలుస్తారు. ‘పుట్టడమే పాటగా పుట్టాను/ ఇక ఉలకడం పలకడం పాటలాగే కదా’ అంటారు. ‘సజీవ సౌందర్య కళ’లో ‘నిన్న సాయంత్రం విరమించిన యుద్ధాన్నే/ ఈరోజు ఉదయాన్నే మళ్లీ మొదలెట్టాలి’ అంటారు. తాను పుట్టిన ‘సూర్యాపేట’ను కూడా అద్భుతమైన పదబంధాలతో గళచాలనం చేస్తారు. జ్వరం వస్తే బాగుండునని ఎప్పుడో ఒకసారి మనం అనుకుంటాం. కానీ దాన్నే కవిత్వంగా మార్చారు గణేష్. ‘ఆకాశం’ అనే కవితలో ‘ఆలోచనలకూ అమావాస్య వస్తుంది’ అంటూ లోతైన భావాన్ని పలికిస్తారు. తనవాళ్లనూ, తన చుట్టూ ఉన్నవాళ్లనూ, బంధువులనూ, స్నేహితులనూ తన కవిత్వంలో కౌగిలించుకుంటారు. ప్రతి కవిత వెనకా సన్నివేశ రూపకల్పనకు అవసరమైన కవితా సామగ్రిని సాధన చేసి సంపాదించుకున్న అనుభవం కనిపిస్తుంది.
 - ఎమ్వీ రామిరెడ్డి
 
 పేజీలు: 164; వెల: 150
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు; 9848181117
 
 
 వెలుగు దివ్వెలు

 పుస్తకం    :    లుమినరీస్
 రచన        :    పి.వి.బ్రహ్మం
 విషయం    :    ఈ ఇంగ్లిష్ పుస్తకంలో చరిత్ర నుంచి సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగం వరకు రచయిత పి.వి.బ్రహ్మం 142 మంది ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని, వారి జీవిత విశేషాల్ని ఆసక్తికరంగా ఇచ్చారు. ‘సహకార సారథి’ పత్రిక సంపాదకునిగా గడించిన విశేష అనుభవంతో ఈ తరం యువజనులకు మహామహుల్ని పరిచయం చేయాలన్న సంకల్పంతో శ్రద్ధగా సులభ శైలి ఇంగ్లిషులో దీన్ని తెచ్చారు. ఇందులో మనం చూసే ప్రముఖుల జీవిత విశేషాలు తెలిసినట్టే ఉంటాయి గాని, దీన్ని చదివితే మరిన్ని గుర్తుంచుకోదగిన కొత్త సంగతులు తెలుస్తాయి.
 - రమణరావు
 
 పేజీలు: 384; వెల: 300; ప్రతులకు: రచయిత, హుడా కాంప్లెక్స్, ప్లాట్ నం.43, ఫ్లాట్ నం.308, సరూర్ నగర్, హైదరాబాద్-500 035; ఫోన్: 040-24048906
 
 కొత్త కథాసంకలనం
 
 పుస్తకం    :    మా కథలు 2012
 సంకలన కన్వీనర్ : సీహెచ్ శివరామ ప్రసాద్
 విషయం    :    2012లో వివిధ పత్రికల్లో ప్రచురితమైన తమ కథల్లోంచి, తమకు నచ్చిన కథను కథకులే ఎంపిక చేసుకుని, ‘తెలుగు కథ’ అన్న వేదికనొకటి ఏర్పాటు చేసుకుని, ఈ సంకలనాన్ని వెలువరించారు. ఇందులో ముప్ఫై కథలున్నాయి.  ప్రచురించబడిన కొన్ని కథలు ఆయా పత్రికలు నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ పురస్కారాలు అందుకున్నాయి.
 
 ఈ కథల్ని గమనిస్తే, ఒక ట్రెండ్ స్పష్టమవుతుంది. పల్లెటూళ్లు, బీదరికం, ఆకలి చావులు లాంటి వాటి స్థానంలో ఎన్నారైలు వాళ్ల జీవితాలు, వైద్య శాస్త్రంలోని మార్పులు, పరిశ్రమలు, కాలనీ జీవితాలు, అవయవ దానాలు, కృత్రిమ గర్భధారణ వంటి విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం.
 - కూర చిదంబరం
 
 పేజీలు: 258; వెల: 99; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
 
 
 గ్రామీణ స్మృతులు
 పుస్తకం    :    తియ్యని వేప - రావికంటి కథలు
 రచన        :    వేముల ప్రభాకర్
 విషయం    :    ఆర్.కె.నారాయణ్ ‘మాల్గుడి డేస్’ స్ఫూర్తితో, మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రేరణతో యాభై ఏళ్ల నాటి జ్ఞాపకాల దొంతరల నుండి తవ్విపోసిన ఇరవై స్మృతుల గాథలు తియ్యని వేప కథలు.
 
 రాయికల్ గ్రామం మధ్యలో బొడ్రాయి లాంటి పెద్ద వేపచెట్టు. అది వ్యాపార కూడలిగా, చల్లటి నీడనిచ్చే విశ్రాంతి కేంద్రంగా ఉండేది. గ్రామ కుటిల రాజకీయాల మూలంగా వేపచెట్టును తగలబెట్టి కొట్టేశారు. పర్యావరణ స్పృహ ఉన్న రచయిత, ఆయన మిత్రులంతా విలపించారు. ఈ సంపుటిలో బాల్యంలో చేసే ఆసక్తికరమైన సాహస గాథలున్నాయి (చెప్పరాని భయం, వంపున చెరువు - మిట్టన గుళ్లు). కుక్కను పెంచుకోవాలన్న కుతూహల చిత్రీకరణ ఉంది (కుక్క బతుకు). పెళ్లిలో తాగి చియ్యకూర కోసం గొడవపడి పెళ్లి పెటాకులు చేసేందుకు సిద్ధపడ్డ పిల్లతండ్రి, పిల్లాడి తండ్రికి బుద్ధి చెప్పిన పెళ్లికూతురి కథ ఉంది (చియ్యకూర కయ్యం). ‘తెర వెనుక’ కథలో నాటక ప్రదర్శన పట్ల గ్రామస్థుల ఉత్సుకత, ఉపాధ్యాయుల బలాలు, బలహీనతల చిత్రీకరణ ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక, చారిత్రక స్థితిగతులను ఈ కథల్లో సహజసిద్ధంగా రచయిత వర్ణించారు.
 - డా॥పి.వి.సుబ్బారావు
 
 వెల: 100; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ పుస్తక కేంద్రాలు
 

 కొత్త పుస్తకాలు
 బి.టి.విత్తనాలు: పదేళ్ల ప్రహసనం
 రచన: ప్రొ.ఎన్.వేణుగోపాలరావు, ప్రొ.కె.సత్యప్రసాద్
 పేజీలు: 182; వెల: 70
 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 27608107
 
 1.సాఫ్ట్ స్కిల్స్; పేజీలు: 152; వెల: 60
 2.కాలేజీ క్యాంపస్; పే: 136; వెల: 60
 రచన: డా. బి.వి.పట్టాభిరామ్
 ప్రతులకు: సాహితీ ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2. ఫోన్: 0866-2436643
 
 రిజర్వేషన్లు సామాజిక న్యాయం
 రచన: ఎం.శ్రీనివాస్
 పేజీలు: 96; వెల: 50
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటుగా స్పృహ సాహితీ సంస్థ, 1-8-702/33/20ఎ, పద్మకాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44
 
 1969 తెలంగాణ ఉద్యమం- ప్రజాకవి కాళోజీ కవిత్వం
 రచన: డా. బన్న అయిలయ్య
 పేజీలు: 70; వెల: 100
 ప్రతులకు: కె.విజయ, 2-7-1261/1, రాజగృహ, విజయపాల్ కాలనీ, హన్మకొండ-506370. ఫోన్: 0870-2456001
 
 విద్య-ప్రపంచీకరణ-అసమానతలు
 పేజీలు: 280; వెల: 175
 రచన: ఎం.శ్రీనివాస్
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతో పాటుగా అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36
 
 వృక్ష విలాపము
 రచన: దగ్గుపాటి పార్థసారథి నాయుడు
 పేజీలు: 256; వెల: 150
 ప్రతులకు: రచయిత, 4-1997/4ఎ, శ్రీబాలమురుగన్ వీధి, దుర్గానగర్ కాలనీ, చిత్తూరు-517002.
 ఫోన్: 9440995046

మరిన్ని వార్తలు