ప్రపంచానికంతటికీ పచ్చరంగు పూయగలవా?

25 Aug, 2019 10:14 IST|Sakshi

పిల్లల కథ

అది రంగాపురం. ఆ ఊళ్ళో రంగారావు అని ఓ కోటీశ్వరుడున్నాడు. అతను కొంతకాలంగా తీవ్రమైన తలపోటుతో తెగ బాధ పడుతున్నాడు. చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా వైద్యులను పిలిపించాడు. వచ్చిన వైద్యులందరూ ఏవేవో మందులిచ్చారు. కానీ అవేవీ అతని తలనొప్పిని తగ్గించలేదు.
ఓ రోజు ఆ ఊరుకి ఓ సాధువు వచ్చాడు.
అతను కూడా ఈ కోటీశ్వరుడి విషయం తెలిసి అతనింటికి వచ్చాడు. కోటీశ్వరుడిని పరీక్షించాడు. అంతా అయిన తర్వాత అతని కంటికి వచ్చిన జబ్బే తలపోటుకు కారణమని చెప్పాడు సాధువు. ఆ కంటిని బాగు చేయడానికి ఉన్నదొక్కటే మార్గం. ఆ ధనవంతుడిని పచ్చరంగు తప్ప మరేదీ చూడకూడదని చెప్పి వెళ్ళిపోయాడు సాధువు.
సాధువు మాటను అక్షరాలా పాటించడం కోసం ముందుగా ఇంట్లో ఉన్నవన్నీ పచ్చరంగులోకి మార్చాడు సాధువు.
నిజమే, అతనికొచ్చిన తలపోటు తగ్గిపోయింది. సాధువును పదే పదే తలచుకున్నాడు. తలనొప్పి తగ్గిన మరుసటి రోజు నుంచే అతను నాలుగు చోట్లకూ వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ ప్రకృతిలో రకరకాల వర్ణాలు అతని కళ్లకు కనిపించాయి. ఆ రంగులన్నీ చూసేందుకు బాగానే ఉన్నాయి. కానీ ఏం లాభం...
అతను వాటిని చూడడానికి వీల్లేదుగా...
తన వెంట కొందరిని తీసుకుపోయాడు. వారందరి చేతిలోనూ పచ్చ రంగులున్న డబ్బాలు, కుంచెలూ ఇచ్చాడు.
అతను వెళ్లే దారిలో కనిపించే మేకలు, ఆవులు, మనుషులు, గుడిసెలు, వాహనాలు ఇలా ప్రతి వాటికీ పచ్చ రంగు కొట్టడం వారి పని.
తమ యజమాని చెప్పినట్లే వారు అన్నింటికీ పచ్చరంగు పూస్తూ వచ్చారు.
ఇలా కొన్ని నెలలు గడిచాయి.
సాధువు మళ్లీ ఆ ఊరికి వచ్చాడు.
ధనవంతుడి అనుయాయులు ఆ సాధువును చూసీ చూడటంతోనే ఆయనకు పచ్చరంగు పూయడానికి ప్రయత్నించారు. 
సాధువు వారు చేయబోయే పనిని గ్రహించి ఆశ్చర్యపోయి, కారణం అడిగాడు.
ఇది తమ యజమాని ఆజ్ఞ అని చెప్పారు వాళ్లు. 
సాధువు వారితో తనను తమ యజమాని వద్దకు తీసుకుపొమ్మని చెప్పారు.
తన జబ్బును నయం చేసిన సాధువు తన వద్దకు రావడంతోనే ధనికుడు ఆనందం పట్టలేకపోయాడు.
సాధువును సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేశాడు.
ఆయన ఏమీ వద్దంటున్నా పట్టించుకోకుండా సాధువుకు ఏ అసౌకర్యం కలగని విధంగా సకల ఏర్పాట్లు చేయించాడు.
అనంతరం వారిద్దరూ తోటలో విహరించసాగారు. అప్పుడు సాధువు అడిగాడు... ఎందుకు అన్నింటికీ పచ్చరంగు పూయిస్తున్నారు అని.
‘‘గురువుగారూ! మీరు చెప్పినట్లే చేస్తున్నానండి’’ అన్నాడు ధనికుడు.
‘‘నేనేం చెప్పాను’’ అన్నాడు సాధువు.
‘‘పచ్చ రంగుని తప్ప మరేదీ చూడకూడదని మీరేగా చెప్పారు స్వామీ’’ అన్నాడు ధనికుడు.
‘‘పుత్రా! నేనన్నానని నువ్విలా అన్నింటికీ పచ్చరంగు పూయించడం, అందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం సరికాదు. ఓ వందో రెండు వందల రూపాయలో ఖర్చు పెడితే ఓ పచ్చరంగు కళ్లజోడు దొరుకుతుంది... అది కళ్లకు పెట్టుకుంటే మీ చుట్టూ ఉన్నవన్నీ పచ్చగా కనిపిస్తాయిగా... పైగా ప్రకృతి అందాలను వర్ణాలను నువ్వు ఏకైక పచ్చరంగులోకి మార్చడం ఏ మాత్రం సబబు కాదు... అంతేతప్ప ఇలా రూపాయలన్నీ ఖర్చు చేయడం అర్థరహితం’’ అన్నాడు సాధువు.
‘‘అయినా నువ్వు ఈ ప్రపంచానికంతటికీ పచ్చరంగు పూయించగలవా... అది అసాధ్యం... నీ వల్ల జరగని పని’’ అని కూడా అన్నాడు సాధువు.
అప్పటికి గానీ ఆ ధనికుడు కళ్లు తెరవలేదు.
మనలోని పలువురు ఈ కథలోని ధనవంతుడిలాంటి వాళ్లమే. మనల్ని తీర్చిదిద్దుకోవడంమాని ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నిస్తాం. అది ఏ మాత్రం సముచితం కాదు. పైగా అసాధ్యం కూడా. 
ఎంతో విలువైన కాలాన్ని శ్రమనూ కృషినీ వృథా చేసి అంతా అయిపోయిన తర్వాత మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం మూర్ఖత్వం.
- యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు