రైట్ స్టెప్పా? రాంగ్ స్టెప్పా??

24 Apr, 2016 02:01 IST|Sakshi
రైట్ స్టెప్పా? రాంగ్ స్టెప్పా??

బంగారు పళ్లానికైనా గోడ చేర్పు కావాలంటారు. బంగారు భవిత పొందాలంటే కళాకారులకూ ఒక వేదిక కావాలి. ఒకప్పుడు తమలోని కౌశలాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి అవకాశమే ఉండేది కాదు. కాని రియాలిటీ షోల పుట్టుకతో అవకాశాలు నేరుగా వచ్చి అంగట్లో వాలుతున్నాయి. బాల కళాకారులకు సైతం మంచి వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా పిల్లల డ్యాన్‌‌స షోలు రాను రాను ఎక్కువవుతున్నాయి. వారిని చిన్ననాటే సెలెబ్రిటీలను చేస్తున్నాయి. కానీ కొందరు అంటున్నట్టు ఈ  షోలు శృతి మించుతున్నాయా? పిల్లల మనసులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయా? గెలుపోటముల మధ్య జరిగే ఈ సంగ్రామాలు పిల్లల పసి మనసులను గాయపరుస్తున్నాయా? గెలిచి తీరాలనే ఒత్తిడి వాళ్లను చిత్రవధకు గురిచేస్తోందా?
 
భారతీయ టెలివిజన్ వినోద కార్యక్రమాల చరిత్రలో మహత్తరమైన మనోరంజక కార్యక్రమాలుగా నిలిచి... బ్రహ్మాండమైన ప్రజాభిమానాన్ని, ఆర్థిక విజయాన్ని కైవసం చేసుకున్నవి డ్యాన్‌‌స షోలు. వీటిలో బాలల విభాగం మరింత ఊపును, హుషారును కలిగిస్తూ ఆబాల గోపాలాన్నీ అలరించాయి, అలరిస్తున్నాయి.
 
మన దేశంలో డ్యాన్స్ షోలు సోనీ టీవీలో భూగీ వూగీతో ప్రారంభమయ్యా యని చెప్పాలి. ప్రముఖ డ్యాన్సింగ్ స్టార్ జావెద్ జాఫ్రీ సోదరుడు నవీద్ జాఫ్రీ, రవీ బెహల్ సంయుక్తంగా  సుమారు ఎనిమిదేళ్ల పాటు ఈ షోను విజయవంతంగా నడి పారు. పిల్లల డ్యాన్స్ షోలను కూడా అదే సిరీస్‌లో వాళ్లే ప్రవేశపెట్టారు. అవి కనీ వినీ ఎరుగనంత ప్రేక్షకాదరణ పొందాయి. అదిరి పోయే టీఆర్పీలు నమోదయ్యాయి. దాంతో మరికొన్ని షోలు పుట్టుకొచ్చాయి. జీ టీవీలో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్‌‌స కూడా సూపర్‌హిట్ అయ్యింది. అత్యధిక ప్రేక్షకాదరణను చూరగొంది. తెలుగులో కూడా చాలాకాలం క్రితమే పిల్లల డ్యాన్‌‌స షోలు మొదలయ్యాయి. ఓంకార్ ‘ఆట’తో పాటు ‘ఢీ జూనియర్స్’ మొదలైన పిల్లల డ్యాన్స్ షోలు సందడి చేయడం మొదలుపెట్టాయి.
 
అంతవరకూ బాగుంది...
చెప్పాలంటే... రాత్రికి రాత్రే దేశ ప్రజలకు అభిమాన పాత్రులయ్యే అవ కాశాన్ని ఈ షోలు చిన్నారులకు కల్పిస్తు న్నాయి. ఒకప్పుడు పేరు, డబ్బు రావా లంటే ఓ వయసు వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఎన్నో తపస్సులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడంత శ్రమ లేకుండా చేస్తు న్నాయి టీవీ చానెళ్లు. అవకాశాలను తెచ్చి వాకిట్లో నిలబెడుతున్నాయి. తమ ప్రతిభకు పదును పెట్టుకునే మార్గాన్ని సులభతరం చేస్తున్నాయి. దానికితోడు ఎస్సెమ్మెస్ రిక్వెస్టుల ద్వారా ప్రజలు తమనెంత ఇష్టపడుతున్నారో తెలుసుకునే అవకాశాన్ని కూడా పిల్లలకు కలిగిస్తున్నాయి. పువ్వు పుట్టగానే పరిమళించిం దన్నట్టు... సరిగ్గా ప్రపంచాన్ని చూడక ముందే ప్రపంచానికి ఫేవరేట్స్‌గా మారిపోతోన్న తమ పిల్లలను చూసుకుని తల్లిదండ్రులు కూడా మురిసిపోతున్నారు.
 
అయితే గత కొంతకాలంగా ఈ షోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దానికి కారణాలు బోలెడు. పిల్లలను డ్యాన్స్ చేయ మంటున్నారు సరే. కానీ ఎలాంటి పాటలకి? ఐటెమ్ సాంగులకి, రొమాంటిక్ నంబర్స్‌కి. పైగా ఆ లిరిక్స్‌కి తగ్గట్టుగానే హావభావాలను పలికించమనడం, అసభ్యకరమైన అభ్యంతర కరమైన భంగిమల్లో నర్తింపజేయడం సమంజసమా? ఇది పిల్లల మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. నిజానికి ఈ విషయంలో జాతీయ చానెళ్లు జాగరూకతతో ఉన్నాయి. కథక్, భాంగ్రా వంటి సంప్రదాయ, జానపద నర్తన రీతులను మేళవించిన పాటలకు నర్తించే విధంగా పిల్లలను ప్రోత్సహిస్తున్నాయి. దాంతో ఆ షోలకు ప్రజాదరణ ఎక్కువ, విమర్శలు తక్కువగా ఉంటున్నాయి. మన దగ్గర అలా జరగకపోవడం బాధాకరం.
 
ఇక మరో సమస్య... గెలుపోట ములు. ఓటమి అందరికీ బాధా కరమే. పిల్లలకైతే మరీను. తాము ఓడిపోయామే అన్న బాధ వాళ్లను నలిపేస్తుంది. ఫలితాలను సున్నితంగా ప్రకటించడం ద్వారా వాళ్ల మనసులు గాయపడకుండా చూడొచ్చు. కానీ విపరీతమైన టెన్షన్ వాళ్లలో క్రియేట్ చేసి మరీ రిజల్ట్ చెప్తారు. దాంతో డిజప్పాయింట్ అయ్యి పిల్లలు విపరీతంగా ఏడ్చిన సందర్భాలున్నాయి. దానికి తోడు న్యాయనిర్ణేతల కామెంట్స్ కూడా పసి మనసుల్ని కలత చెందేలా చేస్తాయి. వారిపై ఒత్తిడిని పెంచుతాయి.

నిరుత్సాహానికి గురి చేస్తాయి. అసలు జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఓటమిని భరించే శక్తి పిల్లలకు నేర్పడానికి ఈ షోలు మంచి వేదిక. ఎందుకంటే షో సక్సెస్ కావాలంటే.... డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్స్ డిజైనర్లు, స్టేజి అలంకరణ చేసేవారు, సహాయకులు అంతా కలసి ఎన్నో రోజులు అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఇలా నలుగురితో కలిసి ఒకే లక్ష్యం కోసం పరిశ్రమించడం వల్ల బాలలకూ టీమ్ స్పిరిట్ అలవాటవుతుంది.

గెలుపోటములు కూడా సమాన స్థాయిలో స్వీకరించే క్రీడాస్ఫూర్తి వస్తుంది. కానీ గెలిచి తీరాలంటూ చేసే ఒత్తిడితో ఆ అవకాశం పిల్లలకు లేకుండా చేస్తున్నామా అన్నది ఓసారి చూసుకోవాలి. ఎంతసేపూ నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి అంటే వాళ్లు ఇతరుల గెలుపును ఎందుకు హర్షిస్తారు? తమ ఓటమిని ఎలా తట్టుకుం టారు? పైగా రోజుల తరబడి, రిహార్సల్స్ చేసి, ఒళ్లు హూనం చేసుకున్నాక కూడా ఓడిపోయామే అన్న బాధ ప్రశాంతంగా ఎలా ఉండనిస్తుంది?     

ఇవన్నీ సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయాలు. కిట్టిగాడు, అపరంజి, హైస్కూల్ తప్పితే తెలుగులో బాలల కథాంశాలతో సీరియళ్లు రాలేదు. దాంతో పిల్లల ఉత్పత్తుల ప్రకటనలకు అనువైన స్లాట్ ఈ షోలు అని అడ్వటైజర్లు భావిస్తున్నారు. వ్యాపారం కోసం పిల్లల్ని బలిపెట్టడం భావ్యం కాదు కదా! ఈ విషయంలో తల్లిదండ్రులకూ సమాన బాధ్యత ఉంది.  కాబట్టి నిర్వాహకులు పిల్లల బాల్యాన్ని తమ షోలు హరిస్తున్నాయా అన్నది ఓసారి ఆలోచించాలి.

అలాగే తల్లిదండ్రులు కూడా  పిల్లలను సెలెబ్రిటీలుగా చూడాలనుకునే క్రమంలో వాళ్ల భవిష్యత్తుని, మానసిక స్థితిని పాడుచేస్తున్నామా అన్నది పరిశీలించు కోవాలి. ఎందుకంటే, అతి చిన్న వయసులో సెలెబ్రిటీ స్టేటస్ పిల్లల ఫ్యూచర్‌కి మంచిది కాదంటున్నారు నిపుణులు. తాము అందరికీ తెలుసు అన్న ఫీలింగ్ కాస్తా తమకు అన్నీ తెలుసన్న ఫీలింగ్‌గా మారి చిన్న వయసులో సెలెబ్రిటీలైన వాళ్లెందరో తప్పటడుగులు వేయడం చూస్తూనే ఉన్నాం. మరి మీ పిల్లలను ఆ దిశగా దగ్గ రుండి నడిపించడం... మీరు వేస్తున్నది రైట్ స్టెప్పా... రాంగ్ స్టెప్పా... ఆలోచించండి!
 - పి.వి.రామమోహన్ నాయుడు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, టీవీ నిర్మాత
 
బాల్యాన్ని హరించడమే!
టీవీ రియాలిటీ షోస్.. ముఖ్యంగా పిల్లల డ్యాన్స్ షోస్‌లో పదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ వయసువాళ్లు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేరు.  చూస్తు న్నదే వాస్తవమనుకుంటారు. న్యాయనిర్ణేతలు పిల్లలు డ్యాన్స్ సరిగా చేయలేదని చెబుతుం టారు. దాంతో పిల్లల మనసు గాయపడు తుంది. అలాగే ప్రాక్టీస్ సమయాల్లో పిల్లలపై తల్లిదండ్రులు, ట్రైనర్ల ఒత్తిడి బాగా పడు తుంది. అది చైల్డ్ లేబర్ కంటే భయంకర మైనది. ఇదంతా బాల్యాన్ని హరించడం కిందికే వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలపై పిల్ వేశాం. కానీ అది పెండింగ్‌లోనే ఉంది.     
- దేవి, సామాజిక కార్యకర్త
 
ఒత్తిడి పెరిగితే ప్రమాదమే!
రబ్బర్‌బ్యాండ్‌ని తీసుకుందాం. దాన్ని లాగితేనే పని జరుగుతుంది. కానీ, ఎంత వరకు లాగాలో అంతే లాగాలి. ఎక్కువగా లాగితే తెగిపోతుంది. అలాగే పిల్లలపై ఒత్తి డికి కూడా హద్దు ఉండాలి.  బాగా చదవా లన్నా, డ్యాన్స్ చేయాలన్నా కొద్దిగా ఒత్తిడి అవసరమే. అది కూడా వయసును బట్టి మారుతూండాలి. అలా అయితేనే ఏ రంగం లోనైనా రాణించగలరు. కాబట్టి డ్యాన్స్ షోల్లో కామెంట్స్‌లో మార్పు రావాలి. సున్ని తంగా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉంటూ వారిని ప్రోత్సహించాలి.
 - డా॥శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, మానసిక నిపుణులు

మరిన్ని వార్తలు