రౌడీ ఆట

13 Sep, 2015 01:01 IST|Sakshi
రౌడీ ఆట

ఆదర్శం
ప్రఖ్యాత అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ విన్సెంట్ లాంబార్డీ ఫుట్‌బాల్ ఆటను జీవితంతో పోలుస్తాడు. ‘ఫుట్‌బాల్ ఆట  జీవితంలాంటిది. దానికి జీవితంలాగే... పట్టుదల, త్యాగం, అంకితభావం కావాలి’ అంటాడు. అవన్నీ అఖిలేష్‌లో ఉన్నాయి. అందుకే అతని జీవితం చీకటి నుంచి వెలుగు దారి వైపు మళ్లింది. చిన్నప్పుడు బడికి వెళ్లి చదువుకోవడం కంటే నాగపూర్ వీధుల్లో జులాయిగా తిరగడం ఇష్టం అఖిలేష్‌కు.

తాను ఉండే అజాని మురికివాడలో కొందరు పిల్లలు సిగరెట్లు తాగడం, జూదం ఆడడం లాంటివి చేసేవారు. వారిని అబ్బురంగా చూసేవాడు అఖిలేష్. వారితో స్నేహం చేసి అన్ని దురలవాట్లనూ నేర్చుకున్నాడు. దాంతో ఆరవ తరగతిలోనే చదువు అటకెక్కింది. అఖిలేష్ తండ్రి నాగపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్యూన్‌గా పని చేసేవాడు. కొడుకుని గొప్పవాణ్ని చేయాలని ఎంతో ఆరాటపడేవాడు.

కానీ ఎన్ని మంచి మాటలు చెప్పినా అఖిలేష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆశ వదులుకున్నాడు. ఆయన ఫీలింగ్‌‌సని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు అఖిలేష్. రౌడీ షీటర్లతో కలిసి తిరిగి తానూ రౌడీషీటర్ అయ్యాడు. పోలీసుల హిట్ లిస్ట్‌లో తన పేరు చేరేంతగా నేరాలు చేశాడు. ఒకటీ రెండూ కాదు... నలభైకి పైగా కేసుల్లో అతడు నిందితుడు!
 ఆ నేరాల పరంపర అలానే కొనసాగి ఉంటే, అఖిలేష్ ఈపాటికి ఏ జైలులోనో ఉండేవాడు.

కానీ అలా జరగలేదు. ఎందుకంటే అతని జీవితంలోకి విజయ్ బోర్సే వచ్చాడు.
 విజయ్ ఫుట్‌బాల్ ఆటగాడు. మాంచి ఒడ్డూ పొడవుతో హీరోలా ఉండేవాడు. దాంతో అజాని మురికివాడ యువత అతణ్ని ఆరాధించేవారు. హుందాగా, ఓ పోలిస్ ఆఫీసర్‌లా కనిపించే అతనంటే భయంలాంటి భక్తిని కనబర్చేవారు. ఒకరోజు విజయ్ అఖిలేష్‌ను, అతని స్నేహితులను పిలిచి... ‘‘రోజూ నాతో పాటు ఫుట్‌బాల్ ఆడండి.

రోజుకు అయిదు రూపాయలిస్తాను. మీకు నచ్చదని తెలుసు. వారం రోజులు ఆడి చూడండి. తరువాత మీ ఇష్టం’’ అన్నాడు. ‘‘భయ్యా, అయిదు రూపాయలు కాదు, ఒక్క రూపాయి ఇచ్చినా ఆడతాం’’ అన్నాడు అఖిలేష్. కుర్రాళ్లంతా కూడా అదే అన్నారు. వాళ్లు అలా అంటారని విజయ్‌కి తెలుసు. అందుకే ఆ ప్రపోజల్ పెట్టాడు. అతని ప్లాన్ ఫలించింది. రెండు వారాల్లో కుర్రాళ్లంతా ఫుట్‌బాల్ ఆటకు అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే అడిక్ట్ అయిపోయారు. ఏ రోజైనా విజయ్ నేను ఆట ఆడలేను అంటే వాళ్లు ఒప్పుకునేవారు కాదు. అతన్ని బతిమాలి ఒక్క మ్యాచ్ అయినా ఆడేవారు.
 
రోజులు గడిచాయి. అందరూ ఫుట్ బాల్‌లో మునిగి తేలుతున్నారు. ఎవ్వరికీ తాగుడు, జూదం, చిల్లర వేషాలు, కొట్లాటలు... ఏవీ గుర్తుకు రావడం లేదు. అఖిలేష్‌కి అయితే ఫుట్‌బాలే ప్రపంచమై పోయింది. అది అతణ్ని నేరాల నుంచి పూర్తిగా దూరం చేసింది. కానీ అతడి గతం మాత్రం అంత త్వరగా వదల్లేదు. ఒకరోజు ఏదో పాత కేసులో అతన్ని అరెస్ట్ చేయడా నికి పోలీసులు వచ్చారు. పారిపోయి శ్మశానంలో తల దాచుకున్నాడు అఖిలేష్.

అప్పుడే అతనిలో ఆలోచన మొదలైంది. ‘‘ఎందుకిలా భయపడి పారిపోవడం, వల్లకాట్లో ఎన్నాళ్లని దాక్కోవడం, ఇక ఇలాంటి జీవితం వద్దు’’ అనకున్నాడు. వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తాను మారానని, ఇక ఏ నేరం చేయనని జడ్జి ముందు ప్రమాణం చేశాడు. షరతులతో బెయిల్ వచ్చింది. అంతే... నాటి నుంచీ అఖిలేష్ ప్రవర్తన మారిపోయింది. విజయ్ ఆర్గనైజేషన్ అయిన ‘స్లమ్ సాకర్’లో చేరి, విరివిగా ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభిం చాడు. జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగాడు. చివరికి 2009లో అతడికి అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడే అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోనే లేదు.
 
అయితే తన గతాన్ని మర్చిపోలేదు అఖిలేష్. విజయ్ తన జీవితాన్ని బాగు చేసినట్టు, తాను కూడా కొందరి జీవితాలను తీర్చిదిద్దాలని నిర్ణయించు కున్నాడు. ‘లివింగ్ హోప్’ అనే సంస్థను స్థాపించాడు. మురికివాడల్లో ఉండే ఆణిముత్యాలను వెలికి తీస్తున్నాడు. అలాగే రెడ్‌లైట్ ఏరియాల్లో మగ్గే పిల్లలను సైతం అక్కడ్నుంచి తప్పిస్తున్నాడు. వాళ్లందరికీ ఉచితంగా ఫుల్‌బాల్ నేర్పిస్తూ, వారికి అందమైన భవితను అందించాలని తపిస్తున్నాడు. ‘‘ఆ పిల్లల్లో ఏ ఒక్కరు అంతర్జాతీయ స్థాయికి చేరినా నా జీవితం ధన్యమైనట్టే’’ అని సత్యమేవ జయతే షోలో ఎమోషనల్‌గా చెప్పాడు అఖిలేష్. అలాంటి ఆదర్శనీయమైన గురువు ఉంటే... అది సాధ్యం కాకుండా ఉంటుందా!

మరిన్ని వార్తలు