హృదయం: 60 ఏళ్ల తర్వాత కలిశారు!

25 May, 2014 00:06 IST|Sakshi
హృదయం: 60 ఏళ్ల తర్వాత కలిశారు!

అప్పటికి మూడు రోజులే అయింది అన్నా కొజ్లొవ్‌కు, బోరిస్ ఎడ్యూల పెళ్లయి. రెడ్ ఆర్మీ తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు బయల్దేరాడు బోరిస్. ఇంతలోనే ఎడబాటా అనుకుంది అన్నా. కానీ ఆ ఎడబాటు 60 ఏళ్లకు దాటిపోతుందని ఆమె ఆనాడు ఊహించలేదు. బోరిస్ వెంటనే తిరిగిరాలేదు. సోవియెట్ యూనియన్‌లో అలజడుల కారణంగా అన్నా కుటుంబంతో సహా ఆ దేశాన్ని విడిచి, సైబీరియాకు వెళ్లాల్సి వచ్చింది. ఏళ్లు గడిచాయి. బోరిస్‌కు, అన్నాకు సంబంధాలు తెగిపోయాయి. ఒకరి జాడ కోసం ఇంకొకరు ఎంతో ప్రయత్నించారు. అన్నా ఓ దశలో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.
 
 కానీ తల్లి ఆమెను కాపాడి, కొత్త జీవితం ఆరంభించమని చెప్పింది. అయిష్టంగానే సరేనంది అన్నా. మరోవైపు భార్య కోసం ఎదురు చూసీ చూసీ అలసిపోయిన బోరిస్ కూడా మరో పెళ్లి చేసుకున్నాడు. ఆరు దశాబ్దాలు గడిచాయి. ఈలోపు ఇద్దరూ తమ భాగస్వాముల్ని పోగొట్టుకున్నారు. అన్నా అనుకోకుండా రష్యాలోని తన సొంత నగరం బోరోవ్లియాంకాకు వెళ్లింది. ఆశ్చర్యం. అక్కడ బోరిస్ కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకున్నారు. ఒకరి కథలు ఒకరు పంచుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 60 ఏళ్ల సుదీర్ఘం విరామం తర్వాత మళ్లీ ఇటీవలే వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

మరిన్ని వార్తలు