ఏం కావాలోయి?  ఉందిగా ద్వారకామాయి!!

30 Sep, 2018 01:24 IST|Sakshi

సాయిపథం – అంతర్వేదం 20

ఎంతో వేగంగా ప్రవహించి ప్రవహించి బలంగానూ, ముందూ వెనుకలకి కదులుతూనూ ఉన్న నీరంతా ఒక్కసారి ఆనకట్ట దగ్గర ఆగిపోయిందంటే, దాన్ని అలా ఆపగలిగిన ఆనకట్ట గట్టిదనాన్ని, అలా ఆపగలిగేలా కట్టిన ఆ మహానుభావుల గొప్పదనాన్నీ తెలుసుకోవలసిందే వాళ్లని స్మరిస్తూ ఉండాల్సిందే! అదే తీరుగా ఓ పండితుడు తగిన ప్రమాణాలని చూపుతూ మాత్రమే పదిమందిలో గుర్తింపు పొందగలిగాడంటే... ఆయనకి చదువు చెప్పిన ఆ గురువుల్నీ, ఆ గురువుల నేతృత్వంలో ఈయన చదువుని ఒంటబట్టించుకున్న తీరునీ ప్రశంసించవలసిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే.. ఫలాని కష్టం వచ్చిపడిందని అనుకుంటూ ద్వారకామాయిని దర్శిస్తే సాయి నామస్మరణని అక్కడే కూచుని చేస్తే ఆ ఇబ్బంది నుండి బయటపడగలుగుతున్నారంటే.. ఆ ద్వారకామాయికున్న గొప్పదనాన్ని, ఆ ద్వారకామాయి నిర్మాణంలో దాగిన విశేషాలనీ తెలుసుకుని తీరాల్సిందే! ఓ పాత్రలో ఉన్న రుచికరమైన పానీయాన్ని ఒకరివెంట ఒకరుగా తాగుతూ వెళుతూ ఉంటే.. ఎలా పాత్ర ఖాళీ అయిపోతుందో, అలా కాకుండా ఎందరు ఎందరెందరు ఈ కాలం ఆ కాలం అనకుండా సర్వకాలం ద్వారకామాయిని సేవిస్తూ ఉన్నా ఆ కష్టాలని దాటింపజేసే శక్తి ఆ స్థలానికి ఉంటూనే ఉంటోందంటే నిజంగా మనం ఆ గొప్పదనాన్ని అర్థం చేసుకోవలసిందే!

సాయి విడిది!
తన గుర్రాన్ని సొంత కుటుంబసభ్యునిలా చూసుకుంటున్న ‘చాంద్‌పాటిల్‌’ ఓ మంచి వేసవివేళ దిక్కు తోచక తిరుగుతుంటే సాయి అతడ్ని పిలిచి, కారణమడిగి, సరిగా వెతకలేదని అతనికి చెప్పి.. ‘ఫలాని చోట ఉంది తెచ్చుకో!’ అనడమూ ‘చాంద్‌పాటిల్‌’కి గుర్రం సరిగ్గా అక్కడే దొరికి ఉండటం..’ అనే ఆ చరిత్రని లోగడ అనుకున్నాం. సాయిని చాంద్‌పాటిల్‌ తనతో తన ఇంట్లోనే ఉంచుకుని, తన కుటుంబం మొత్తం షిర్డీకి ఓ పెళ్లికి వెళ్తూ ఉంటే.. తనతో సాయిని తీసుకెళ్లి ఉండటం కూడా మనకి గుర్తుంది కదా! ఆ షిర్డీకి పెళ్లివారితో సహా సాయి రాగానే పెళ్లివాళ్లంతా రెండెడ్లబళ్లు దిగగానే సాయిని చూస్తూనే ఆహ్వానించిన వ్యక్తి ‘ఖండోబా’ అనే గ్రామదేవతా ఆలయంలో అర్చకుడైన ‘మహల్సాపతి’ మాత్రమే! ఇంతవరకూ మనకి తెలుసు!సాయి వేషాన్ని చూశారు షిర్డీలోని అక్కడి వారంతా. పెద్ద బురఖా (కుఫ్ని)ని ధరించి, తలకి ఓ టోపీలాంటి గుడ్డని చుట్టి, గడ్డంతో కన్పిస్తూ ఎవ్వరు అలా చూసినా స్పష్టంగా మహమ్మదీయుడే అనేలా తనని గురించి చెప్పక చెప్తూన్న సాయిని ఏ ఒక్కరూ కూడా ఖండోబా దేవాలయంలోనికి అడుగు పెట్టనీయకూడదని అనుకున్నారు. ఎందరో ఆ అభిప్రాయాన్ని తమలో తాము అనుకుంటున్నట్లుగా, కొద్దిగా బిగ్గరగా అనుకున్నారు కానీ ఒకరిద్దరు ఆ మాటని పైకి అననే అన్నారు కూడా.

‘లా సాయీ!’ (దయచేసి ఓ అతిపవిత్రుడా! లోనికి రా!) అని ఖండోబా దేవాలయ అర్చకుడు మహల్సాపతి ఆ సాయి రూపాన్నీ ఆయన లో–దాగిన గొప్పదనాన్ని గుర్తించి పైకి అలా ఆహ్వానించగలిగాడు. గానీ, తానొక అర్చకరూపంలో ఉద్యోగిగా ఉన్న కారణంగా అక్కడ సాయికి నివాసాన్ని ఇప్పించగల శక్తి లేనివాడయ్యాడు. మనసుంటే మార్గముంటుందన్నట్లు మహల్సాపతే స్వయంగా అక్కడి పెద్దలతో మాట్లాడి అక్కడికి పెద్ద దూరం కాని ఓ మసీదులో సాయిని ఉంచే ఏర్పాటుని మాత్రం చేయగలిగాడు. సాయిని తానే తీసుకువెళ్లాడు ఆ మసీదుకి. ఆ మసీదులో సాయిని దిగబెట్టి ‘సాయీ! ఇదే నీ విడిది!’ అని నమస్కరించి వెనుదిరిగాడు. 

ఎలా ఉంది ఆ మసీదు? 
మసీదుకి ముందు ఏ ఆవరణా(ఓ కప్పు ఉన్న ప్రదేశం) లేదు. గోడలన్నీ బాగా పాతబడిపోయి ఉండడమే కాక ఆ మసీదుకున్న ఓ పిట్టగోడ (ప్రహరీగా ఉన్న ఎత్తు తక్కువ గోడల్లో ఒకటి) దాదాపు కూలిపోయిన స్థితిలో ఉంది. మసీదు నిండుగా బూజులు వేలాడుతూ కన్పిస్తున్నాయి. ఏదైనా ఓ అవసరం వచ్చి పిలిస్తే పలికేందుకు ఏ ఒక్కరూ అక్కడ లేరు. అస్తమానం మసీదులోనే కూర్చుని కూర్చుని విసుగొచ్చి ఓ క్షణం ఎక్కడైనా కూచుందామంటే ఒకే ఒక్క దిక్కు ఆ మసీదుకు ఎదురుగా ఉన్న వేపచెట్టు మాత్రమే. సాయికి ఆనందమే అన్పించింది. ఒంటరిగా ఉన్న వేపచెట్టుకి తానొక జంటగా ఉండేందుకు వచ్చాను గదా! అని.

ఇంతకాలం ఎవరింట తాను అతిప్రీతిపాత్రంగా గౌరవింపబడ్డాడో ఆ చాంద్‌పాటిల్‌ కనపడలేదు. తనతో రాలేదు. అలాగని తనని వదిలించుకుందామనేది అతని అభిప్రాయం కాదు. పెళ్లి పనుల్లో ఉన్నాడతను. అదీ కాక తాను అతనికి చెప్పి ఇక్కడికి రాలేదు కూడా. ఇక కొంతకాలం తాను షిర్డీలో ఉన్నప్పటికీ మరో చోటికి వెతుక్కుందామనే దృష్టీ తనకి లేదు.మసీదంతా తిరిగి చూస్తే ఓ చిన్నకుండ కన్పించింది. ‘హమ్మయ్య! నీటి అవసరాన్ని తీర్చడానికి చాలు’ అనుకున్నాడు సాయి. పాతకాలపు పెద్ద తిరుగలి ఆ ఆవరణలోనే కన్పించింది. ‘అబ్బో! గోధుమల్ని విసురుకుని తినడానికి, రొట్టె చేసుకునేందుకు ఇది కూడా ఉందిలే’ అనుకున్నాడు. ఇక పొయ్యిని ఏర్పాటు చేసుకోవడం, ఎండిన కట్టెలూ, పడుకునే చోటూ.. అనే వాటినన్నింటినీ ప్రకృతే ఇస్తుంది తనకి.మంచి వసతి, నీరు, భోజనం అనేవి దొరికాక తనకి లోటేముంది? అనుకున్నాడు. మరో ఆనందకరమైన అంశమేమంటే తనని ఎవరూ కూడా వచ్చి పలకరించేందుకు వీలు లేకుండా మసీదు ఆవరణలో కాలు పెట్టే సౌకర్యంగానీ, స్థలంగానీ ఏ మాత్రపు వీలుగానూ లేకపోవడమే. గోతులతో ఎగుడు దిగుడులతో – సన్నతోవతో – ఇరుకు సందుతో – మసీదు వరకూ రావలసిన తీరుకి ఎవ్వరూ కూడా రారు. ఏదైనా పొరపాటున వచ్చిన వీళ్లే చాలు మరొకరు రాకుండా ఉండేలా చేయడానికి ఇలా ఉన్న ఆ వసతిలో సాయి చక్కని అంగరంగవైభవంగా ఉన్న భవనంలోనికి ప్రవేశించినట్లుగా భావిస్తూ, ఏ మాత్రపు అసంతృప్తీ లేకుండా ఆ మసీదులోనే ఉండదలిచాడు. భగవద్గీతలో కృష్ణుడన్నాడు. యదృచ్ఛా లాభ సంతుష్టః– ‘ఏది తన అదృష్టానికి దొరికినా దాంతోనే పరమసంతోషపడేవాడే నిజమైన గొప్పవాడని.’ సరిగ్గా అలాంటి లక్షణమే సాయిది!

చేసిన మార్పులు
ఏదైనా ఓ ప్రదేశానికి మనం వెళ్లాక, అక్కడే మనం ఉండాల్సి వస్తే కొన్ని మనకున్నంత పరిధిలో యధాశక్తి చేసుకుంటాం కదా! అలాగే సాయి ఆ మసీదులోకి ప్రవేశించాక చేసిన మొదటి పని చక్కని తులసి మొక్కని నాటడం. ‘ఇదేమిటి? మహమ్మదీయుడేమిటి? తులసి మొక్కని నాటడమేమిటి?’ అనుకున్నారు ఆ మసీదుపక్కగా పలచపలచగా వెళ్తూండే జనం. కొన్ని రోజులయ్యాక ఆ తులసి మొక్క దగ్గర వెలుగుతున్న దైవారాధనకి చిహ్నమైన దీపాన్ని ప్రతిరోజూ ఉండటాన్ని గమనించారు.మరి కొన్ని రోజులయ్యాక అక్కడికి కొద్ది పక్కగా రాత్రీపగలూ అనే భేదం లేకుండా అలా వెలుగుతూ– ఏనాడూ ఆరిపోవడమనేదే లేని అగ్నిహోత్రాన్ని గమనించసాగారు. దీంతో వచ్చేపోయే వాళ్లకి ఓ వింతగానూ ఆశ్చర్యపరిచేది గానూ అయింది ఆ మసీదూ, మసీదులోని సాయీను.లోనికి వెళ్లి పలకరించడమూ ఆయన చేస్తున్న ఈ విధానమూ గురించి అడిగి లో–రహస్యాన్ని తెలుసుకుందామనుకున్నా ఆ గోతుల్లో అడుగేస్తూ ఎగుడుదిగుడు నేలలో నడుస్తూ ఆ సన్నని తోవలో ఇరుకుగా ఉన్న రెండు పాడుబడ్డ గోడల మధ్యలో నుండి నడుస్తూ సాయిని చేరుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఆసక్తి ఉంది గానీ ఆ శక్తి లేదు. ఉత్సాహముందిగానీ ఆ ప్రోత్సాహం లేదు. ఒంటరిగానైనా వెళ్దామనే ఊహ ఉంది గానీ ఆ ధైర్యం చాలడం లేదు.

ఇలా రోజులు గడుస్తుంటే సాయి మెల్లగా మసీదులో కొంతసేపు ఆ ఎదురుగా ఉన్న వేపచెట్టు కింద ఎక్కువసేపూ ఉండటాన్ని గమనించి ఆనందపడ్డారు ఆ వస్తూ పోతూ ఉండే జనం.ఎవరు ఎలా ఉన్నా ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి మాత్రం సాయి ఆ మసీదులో ఉన్నకాలంలో కూడా నిత్యం రావడం, సాయికి అర్ఘ్యపాద్యాదులనిచ్చి నమస్కరించి వెళ్తూండటం మాత్రం చేస్తూనే ఉండేవాడు. ఈ విషయం జనంలోకి మరింతగా వెళ్లడంతో క్రమంగా సాయికి భక్తులు రావడం ప్రారంభించారు.మసీదేమిటి? తులసి మొక్కేమిటి? నిత్య దీపారాధన ఏమిటి? హిందువులంతా లక్ష్మీదేవిగా భావించే వేపచెట్టు మొదట్లో కూర్చుని కనిపిస్తూ ఉండటమేమిటి? పైగా హిందూధర్మాన్ని అనుసరిస్తూ ఉండే నిష్ఠాగరిష్ఠులు ప్రతి నిత్యం చేసే అగ్నిహోత్రంలా అక్కడ అగ్నిని వెలిగించి ఉంచడమేమిటి? మహమ్మదీయులే కాకుండా హిందువులూ పైగా జాతి, మత, వర్గ, కుల, స్త్రీ–పురుష, బాల, వితంతు భేదం లేకుండా క్రమక్రమంగా అందరూ రావడం ప్రారంభించాడు.

దీని పేరేమిటి?
ఇలా జరుగుతుంటే ఓసారి అడిగారు భక్తజనం. చూడ్డానికి మసీదే.. మసీదులా ఉండటం కాదు. కనిపిస్తున్నది పవిత్ర దైవదీపారాధనమే... దీపంలా ప్రకాశంకోసం పెట్టబడింది కాదు. లోపల ఉన్నది తులసి మొక్కే. అదేదో యధాలాపంగా మొలిచింది కానే కాదు. కావాలని నాటబడిందే..! వస్తున్నది గ్రామ దేవాలయ అర్చకుడు మహల్సాపతే. ఏదో మారు వేషంలో వస్తుండటం కాదు. ఇందరొస్తూ ఉన్న ఒక్క చిల్లుకానిని(రూపాయిలో 64వ వంతు) అడిగిన జాడ లేనే లేదు. ఇదంతా ఏమిటి? ఈ ప్రదేశం పేరేమిటి? ఈ విధానం పేరేమిటి?’ అని. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘ఈ స్థలం పేరు ద్వారకామాయి. ఆ వెలుగుతున్న అగ్నిపేరు ‘ధుని’ అన్నాడు.

పూర్తిగా అర్థంకాని అందరూ మరికొద్ది వివరణనీయవలసిందిగా అడిగితే సాయి చెప్పాడు.‘చతుర్ణా మపి వర్ణానాం యత్ర ద్వారాణి సర్వతఃఅతో ద్వారవతీత్యుక్తా విద్వద్భి స్తత్వవేదిభిః’అనే శ్లోకానికి అర్థాన్ని.లోకంలో నాల్గువిధాల వృత్తుల్ని చేస్తూ అలాంటి ప్రవర్తనతో ఉండే ‘బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర’ అనే వారున్నారు గదా! ఆ అందరికీ కూడా ‘ధర్మం అర్థం కామం మోక్షం’ అనే నాలుగూ పొందగలిగేలా చేసే శక్తి ఉన్న క్షేత్రం పేరు ‘ద్వారవతి’ దాన్నే ‘ద్వారక’ అంటారు హిందూసంప్రదాయంలో. అదుగో అలాంటి ద్వారకే ఇది. ఆ ద్వారకకి ప్రతిబింబం లాంటి ఈ ప్రదేశానికి నేను ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టుకున్నానన్నాడు. ఎంత లోతైన అర్థమున్నపేరు!

అది నీ పని కాదు!
సహజంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే.. ఎవరు దేన్ని విరాళంగా ఇచ్చినా ఆ స్థలానికో లేక తనకో అలాంటి వాడు కానేకాదని భక్తులకి నిత్యానుభవంలో అర్థమైంది. ఇలా వస్తూండే రాకపోకల భక్తుల్లో మరింత విశ్వాసం పెరిగిన గోపాలరావు గుండ్‌’ అనే అతను ఈ మసీదు స్థితిని గమనించి దీన్ని బాగుచేయదలిచి బాగుజేతకి కావలసిన రాతినీ సున్నాన్నీ ఇతర వస్తువుల్నీ పరికరాలనీ సమకూర్చి పనిని ప్రారంభించబోతే సాయి అతడ్ని పిలిచి ‘ఇది నీ వంతు కాదు. మానెయ్‌’ అన్నాడు. నానా (నానా సాహెబ్‌ ఛందోర్కర్‌)చేస్తాడులే! కంగారు పడకు అన్నాడు. నిజానికి నానా అప్పటికింకా ఆ పనికి సంబంధించిన ఆలోచనకి రానే లేదు.అలాగే ‘చెప్పలేనంత దుమ్ము ధూళి బూజులు బల్లులూ, ఎలుకలు ఇతర క్రిమికీటకాలు, పాములు తిరుగాడే ఆ ప్రదేశాన్ని బాగు చేసి ఎల్తైన గోడల్నీ లోపల ఎవరైనా వస్తే కూర్చుండే విధంగా సౌకర్యవంతమైన అరుగుల్ని కట్టించదలిచా’ అని అనగానే అది నీ పని కాదు. కాకా(కాకా సాహెబ్‌ దీక్షిత్‌) ఆ బాధ్యతని తీసుకోబోతున్నాడన్నాడు సాయి.తీవ్రమైన నిరుత్సాహం ఒక పక్కా, ఏదో చేసి సాయికి చక్కని సౌకర్యాలని కల్పించాలనే తపన ఒక పక్కా ఎవరెవరికో వచ్చిన ఆ అవకాశం తనకెలా వస్తుందా? అనే ఆత్రుత ఒక పక్కా ఉన్న సమయంలో మహల్సాపతి అక్కడి కొచ్చి పరిస్థితిని గమనించి ‘సాయిదేవా! అనుగ్రహించు!! ఆ భక్తుని కోరికని ఆదరించు’ అన్నాడు భక్తిగా ప్రణామం చేస్తూ.

సాయి వెంటనే ‘ఈ ఆడంబరం దేనికి నాకు? నేను ఏదైనా అసౌకర్యం ఉందని అన్నానా? ఎప్పటి నుండోలేని ఈ సౌకర్యాలు ఇప్పుడెందుకు?’ అన్నాడు. అయినా పట్టుబట్టి మహల్సాపతి ప్రాధేయపడి ఒప్పించాడు సాయిని.అంతే! మసీదు మొత్తం దులపబడింది. నేల ఎత్తు చేయబడింది. గోడలన్నీ పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. నేల గోతులు, ఎగుడుదిగుడులూ సరిచేయబడ్డాయి. ఎల్తైన ప్రదేశం మీద ధుని ఏర్పాటయింది. ఒక అంగవస్త్రం (తుండు/తువ్వాలు/పై వస్త్రం) వేసుకుని దానిమీద కూచునే సాయి చోటులో చక్కని ఎల్తైన వేదిక వచ్చింది. ఇక ఆ ఎదురుగా ఆవరణా సభామండపంలా అనిపించే తీరులో ఇనుప స్తంభాలు వాటి మీద ఓ కప్పు దాదాపుగా అయిపోతున్న దశలో ‘చావడి’ నుంచి ద్వారకామాయి కి వచ్చాడు సాయి. కోపంతో ఊగిపోతూ స్తంభాలన్నింటినీ దూరదూరంగా వెళ్లిపోయేలా తన్నేసాడు.కప్పుకోసం తెచ్చిన వస్తువుల్ని విసిరేసాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు.కాసేపు మౌనధ్యానంలో ఉండిపోయాడు. మరికొంత సేపు ఏదో నామజపాన్ని చేసుకున్నాడు. పెద్ద వర్షం వచ్చి ఆగిపోయాక ఉండే పరిస్థితిలా ప్రశాంతంగా కళ్లు తెరిచి ఇనుపస్తంభాలని పాతబోయిన గుంటల్లో రూపాయి నాణాలని వేశాడు. మట్టి తానే వేసాడు స్వయంగా. ఈ ద్వారకామాయి రూపురేఖలని మార్చిన ఇద్దరు భక్తులకీ (కాకా తాత్యా) నూతన వస్త్రాన్ని తెప్పించి తలపాగలని తానే కట్టాడు.ఇలా ఆగ్రహించడానికి కారణం – ఏది సరైన ముహూర్తమో అడగకుండా తెలుసుకోకుండా ఉత్సాహం కారణంగా కట్టదలిచి పనిని ప్రారంభించేయడమే! మరి తులసి మొక్క దీపారాధనం వేపచెట్టు నీడ విశ్రమించడం ద్వారకామాయి అని పేరు పెట్టడం.. వంటి పనుల్ని చేసిన సాయి హిందువు కాడా? హిందూ ధర్మాన్ని పాటించాలని ఉపదేశించిన వాడు కాడా?అంతా అయ్యాక కొత్త ద్వారకామాయిలో అడుగిడిన సాయి అన్నాడు– ‘ఇక్కడ కోరితే కానిపని ఉండదు. ఇబ్బంది అనేది తొలగిపోతుంది’ అని. దానికి కారణం సాయి చేసే మంత్రజపశక్తి మాత్రమే! బాబా చిత్రప్రవర్తనలూ – అంతరార్థాలూ చూద్దాం! 
– సశేషం
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’