అపానాన్ని క్షయం చేసిన సాయి

9 Dec, 2018 01:48 IST|Sakshi

సాయిపథం – అంతర్వేదం 29

ఎంతో ఎత్తుకి ఎక్కిన వ్యక్తికి ఎలా ఇదీ అదీ అనే భేదం లేకుండా అన్ని వస్తువులూ ప్రకృతిలో కనిపిస్తాయో, అలాగే తనదైన తపస్సు శక్తిలో ఎంత ఎత్తు సాధించాలో అంత ఎత్తుకీ ఎదిగిన సాయినాథునికి సర్వసిద్ధులూ లభించాయి. ఆ కారణం చేతనే పంచభూతాలు తనకి వశమయ్యాయి. తనకి వశమయ్యాయి కదా! అని శ్రీమద్రామాయాణంలో రావణునిలాగా ఆ పంచభూతాలకీ వ్యతిరేకదిశలో కాకుండా అనుకూల దిశలోనే సానుకూలంగా సాయి ప్రవర్తించాడు కాబట్టే, ధర్మబద్ధమైన ఆయన ప్రవర్తనకి అనుగుణంగా పంచభూతాలు ఆయనకి లోబడిపోయాయి. ఆ నేపథ్యంలో క్రమంగా పృథ్వి అప్‌ తేజస్సు అనేవి ఎలా లోబడ్డాయో ఉదాహరణపూర్వకంగా తెలుసుకున్నాక వాయువులోని ప్రాణవాయువు వశమైన తీరుని కూడా సోదాహరణంగా అర్థం చేసుకున్నాక అపానమనే వాయువు ఆయనకి ఎలా వశమయ్యిందీ తెలుసుకుందాం!

ఈ వాయువు గొప్పదనం
హృది ప్రాణో గుద్వేపానః
సమానో నాభిసంస్థితః
ఉదానః కంఠదేశస్థః
వ్యాస స్పర్వశరీరగః అని శ్లోకం.

హృదయంలో ఉండేది ప్రాణవాయువు. గుదంలో ఉండేది అపానవాయువు. కంఠంలో నిలిచి ఉండేది ఉదానవాయువు. నాభి(బొడ్డు)లో ఉండేది సమాన వాయువు. ఎక్కడ ఏ వాయుశాతం తగ్గిందో గమనించుకుంటూ ఆ వాయువు ఎంత పరిమాణంలో తగ్గిందో అంతనీ పూరించి – ఏ ప్రదేశంలో ఎంత వాయువుండాలో అంత స్థాయిలోనూ, అంత పరిమాణంలోనూ, ఆయా వాయువు ఉండేలా చేసే లక్షణమున్నదీ ప్రాణవాయువులాగా కంఠంలో మాత్రమే, సమానవాయువులాగా నాభిలోనే కాకుండా, శరీరం నిండుగా సంచరిస్తూనే ఉండేది వ్యానవాయువు అని ఈ శ్లోకానికర్థం. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా శ్మశానానికి దగ్గరగా, పెద్ద భవంతిలో ఉంటే అతడ్ని ఎలా తక్కువగా అనుకుంటారో ఆయన చిరునామా చెప్పబోయినా శ్మశానం దగ్గర.. అని ఎలా చెప్తారో అలాగే అపానమనే వాయువు ఎంతో గొప్పదే అయినా అది ఉండే ప్రదేశం గుదం అయిన కారణంగా దాన్ని తక్కువగా లెక్కిస్తారు. హేయంగా పరిగణిస్తారు.

మరి నిజంగా ఇది నీచమూ, హేయమూ అయిన వాయువే అయిన పక్షంలో సర్వులూ ఆరాధించే పరమాత్మకి మహా నైవేద్యాన్ని పెట్టే సందర్భంలో కూడా ‘ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా...’ అంటూ ఈ వాయువుని ఎందుకు చెప్తారు? ఈ తీరుగా ఆలోచించినప్పుడు మాత్రమే ఏది అపార్థమో మనకి అర్థమయ్యే అవకాశముంటుంది. అందుకే కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘పురాణవైర గ్రంథమాల’ అనే ఒక గ్రంథాన్ని రచించి పురాణాన్ని ఎలా వంకరదృష్టితో అనుమానిస్తూ దాని ‘లో విశేషాన్ని’ అర్థం చేసుకోవాలో తెలిపారు. సరే! ఆ విషయాన్ని అలా ఉంచి అపానమనే వాయువు గొప్పదనాన్ని తెలుసుకుని, దాన్ని ఎలా సాయినాథుడు అదుపు చేసి ఎవర్ని ఎలా రక్షించాడో చూద్దాం!

మనకి శరీరంలో నవ రంధ్రాలున్నాయి. మొదటిది త్వక్‌– అంటే చర్మం. చర్మానికుండే ప్రతి వెంట్రుక కిందా ఒక చిల్లుంటుంది. దాన్నే రోమరంధ్రం అంటారు. ఈ కోట్లసంఖ్యలో ఉండే చిల్లుల్లో నుండి అపానమనే వాయువు, శరీరంలో దాక్కుని, వ్యాధిని కల్గించడానికి సిద్ధంగా ఉంటూ ఏ మాత్రమూ కనిపించకుండా దాగిన క్రిముల్నీ కీటకాలనీ స్వేదం(చెమట) రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటుంది. అందుకే చెమట పట్టేలా శ్రమచేయాలంటారు వైద్యులు.రెండువది చక్షువు– అంటే కన్ను. పగలంతా దుమ్ములో ధూళిలో ఉంటాం కాబట్టి వాటి వల్ల నేత్రాలకి వ్యాధి రాకుండా ఉండేలా చేస్తుంది అపానమనే వాయువు తెల్లని ఓ పదార్థాన్ని (ఉదయానే లేచి శుభ్రం చేసుకుంటాం. ‘పుసి’ అంటారు దాన్నే) బయటికి పంపించేస్తూ.మూడవది శ్రోత్రం– అంటే చెవి. గులిమి అనే పేరుతో అశుభ్ర పదార్థాన్ని బయటికి పంపించేది ఈ వాయువే. వ్యాధి వచ్చిన సందర్భంలో చీముని పంపించేది కూడా ఇదే. అలాగే (జిహ్వ) నాలుక ఉపరితలం మీద ‘పాచి’ అనే అశుభ్రపదార్థాన్నీ (ఘ్రాణ) ముక్కు నుంచి జలుబు చేసినప్పుడు నీటినీ, అలాగే అశుభ్రపదార్థాన్నీ(చీమిడి) వీటితో పాటు రెండు విసర్జకావయవాల నుండీ వేగాలనీ (మలమూత్రాలనీ) స్త్రీలకైతే నెలసరి రజస్సునీ బయటికి పంపించేది ఈ వాయువే.తినరాని పదార్థాన్ని తానులోపల ఉన్న వ్యక్తి నోటి నుంచి వమన (డోకు–వాంతి) రూపంగా నెట్టేసేదీ, వాయునాళంలోనికి పొరపాటున ఆహారపు మెతుకు వెళ్లినట్లయితే పెద్దతుమ్ము రూపంలో (నలభై కిలోమీటర్ల వేగం ఎంతగా ఉంటుందో) పెద్ద వేగంతో ఆ పదార్థాన్ని బయటికి నెట్టేసేదీ ఇదే వాయువు.మన ఇళ్లలో కుళాయిలన్నింటిలోనూ నీరు నిలువ ఉన్నప్పటికీ ఎలా గాలి వెళ్లడం కోసం ఒక గొట్టాన్ని మేడ మీద ఉండే నీటి తొట్టికి అమర్చి ఆ గాలితోపుడు కారణంగా కుళాయి తిప్పగానే నీటిని కిందికి వచ్చేలా అమరికని చేసామో, అలాగే శరీరం నిండుగా పుట్టుకతో లభించిన రక్తాన్ని మొత్తం అన్ని అవయవాలకీ ప్రసరణం జరిగేలా చేసి వ్యక్తిని రక్షిస్తున్నది కూడా ఈ వాయువే. ఇలా ఈ వాయువు గురించిన గొప్పదనాన్ని ఎంతైనా వ్రాయవలసింది ఉంది ఉంటుంది. ఇంత గొప్పది ఈ వాయువైన కారణంగానే భగవద్గీతలో కృష్ణుడు కూడా ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌ – ప్రాణ అపానాలనే వాయువుల కారణంగానే ప్రతి జీవీ తింటున్న ఆయా ఆహారపదార్థాలని వండటం నాకు సాధ్యమౌతోందని తెలియజేశాడు. అంతటి అపానమనే వాయువు సాయినాథునికి ఎలా అదుపులో ఉంచ వీలయిందో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం!
 
అనన్యచింత
పూనా జిల్లాలో జున్నార్‌ తాలూకాలో నారాయణ అనే గ్రామంలో భీమాజీ పాటిల్‌ అనే ధార్మికుడు ఉండేవాడు. ఎప్పుడూ వ్రశాంత చిత్తంతో చిరునవ్వు ముఖంతో ఉంటూ ఉండేవాడు. తనకి ఎంతో ధనం ఉన్నా అహంకారం లేకుండా ప్రవర్తించేవాడు. అతిథి సత్కారాలు చేసేవాడు. బంధువుల్ని ఆదరించేవాడు. ఎవరైనా సాయమడిగితే కాదు, లేదు, కూడదనకుండా పాత్రత ఎరిగి దానం చేస్తూ ఉండేవాడు. అన్నసంతర్పణలు చేస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఇంతటి ఉత్తముడు చిరకాలం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఉండేవారు.రోజులన్నీ ఒకేలా గడిస్తే భగవంతుడెక్కడున్నాడంటూనూ, అంతా తన ప్రతిభే అనుకుంటూనూ, పూర్వజన్మలూ, పాపాలూ ఈ జన్మలో అనుభవించడాలూ.. ఇదంతా ఓ కట్టుకథే అనుకుంటూనూ ఉంటారుగా లోకజనం. అందుకేనేమో 1909లో పాటిల్‌కి అకస్మాత్తుగా దగ్గు ప్రారంభమైంది. ఏవో మందులూ మాకులూ వాడారు. ప్రయోజనం లేకపోయింది సరికదా దీపాన్ని అలా వత్తిని పెంచి ప్రకాశాన్ని మరింత చేసినట్లుగా రోజురోజుకీ వ్యాధి తీవ్రమై అది క్షయవ్యాధిగా నిర్ధారింపబడింది. దగ్గుధ్వనిని కుటుంబసభ్యులు కూడా తట్టుకోలేకపోతుండేవారు. కఫం, రక్తం కూడా నోటి నుంచి పడుతూ ఉంటే భరించలేకపోయేవారు. నోటి నుంచి ఉమ్మి నురుగలు నురుగలుగా పడుతూంటే, అది కూడా దుర్వాసనతో పడుతూ ఉంటే కుటుంబసభ్యుల అసహనాన్ని గమనిస్తూ పాటిల్‌ మెల్లగా మంచానికే అతుక్కుని ఉండాలని భావించి అలాగే మంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే ఒక మట్టికుండని పెట్టుకుని ఈ వాంతి రక్తం ఉమ్మినంతా దాంట్లో పడేలా జాగ్రత్త పడేవాడు.కుటుంబసభ్యులు వైద్యుల్ని సంప్రదించారు. ఆంగ్ల, హోమియో, యునానీ, గిరిజన, ఆయుర్వేద... ఇలా అన్ని రకాల వైద్యాలూ పూర్తయ్యాయి కానీ ఏ ఒక్కటీ గుణాన్ని ఇయ్యలేదు. ఇది ఏ మాత్రమూ తగ్గే వ్యాధి కాదని వైద్యులయితే చెప్పలేదు గానీ, పాటిల్‌కి తన అనుభవం మీద అర్థమవుతూ వచ్చింది.జ్యోతిష్కులెందరో వచ్చి ఆ గ్రహప్రభావం, ఈ గ్రహ నీచ దృష్టీ అంటూ ఈ హోమాలూ, ఆ యాగాలు, మరో యజ్ఞాలు, దానాలూ, జపాలూ, శాంతులూ... ఇలా చేయించి చేయించి తొందరలో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ఎవరేమి చెప్పినా పాటిల్‌కి అర్థమైంది తనకొచ్చిన వ్యాధి లొంగేది కానే కాదని.ఇక సోది చెప్పించడాలు.. దృష్టి(దిష్టి) తీయడాలూ.. భూతవైద్యచికిత్సలు... వంటి తాంత్రిక వైద్యాలు కూడా చేయించారు కుటుంబ సభ్యులు. అయినా ఏ ఫలితమూ లేదు.‘పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధితే’ పూర్వజన్మలో జన్మల్లో చేసిన పాపమే ఈ జన్మలో వ్యాధిగా పరిణమించి అనుభవించేలా చేస్తుందని పెద్దలు చెప్పిన మాటలు చెవిలో గింగిర్లాడసాగాయి పాంటిల్‌కి.పాటిల్‌ గొప్పదనమేమంటే.. వైద్యులంతా మా శక్తిమేరకి వైద్యం చేసాం! అని వెళ్లిపోతుంటే.. మీలో దోషం లేదు. అనుభవించాల్సిన యోగం నాకుంది’ అని పలికేవాడే తప్ప ధనం ఖర్చుపెట్టించారనీ, అసమర్ధులనీ వాళ్లని గురించి ఒక్కమాటని వాళ్ల సముఖంలోగానీ పరోక్షంగా గానీ అనకపోవడమే. అలాగే జ్యోతిషులతో కూడా మీరు చేయగలిగిందంతా ఆ భగవంతుడ్ని మెప్పించడానికే చేశారు. ఆ భగవంతుడు నా పట్ల కరుణ చూపకపోతే మీ దోషమేముంది? అని అన్నాడే తప్ప ఒక్కమాటని చులకన చేస్తూ అననేలేదు పాటిల్‌.

ఇక తాంత్రిక వైద్యులతోనూ ఆ ప్రక్రియలని పాటించినవారితోనూ కూడా ఒక్కమాటని వ్యతిరేకిస్తూ పలకలేదు సరికదా నా విషయంలో ఫలించలేదనే భావంతో ఇతరులకి ఈ చికిత్సని చేయడం మానకండి. ఏ పుట్టలో ఏ పాముందో? ఎవరికి తగ్గుతుందో? తప్పక కొనసాగించండి మీ వైద్యవిధానాన్ని! అనే అన్నాడు.అందుకే పాటిల్‌ని ఎరిగున్నవారూ, చికిత్సలు చేసినవారూ, జ్యోతిష్యులూ, బంధుమిత్రులూ, ఆప్తులూ, శ్రేయోభిలాషులూ ఇలా అందరూ కూడా పాటిల్‌కి ఈ తీరు వ్యాధిని రప్పించిన భగవంతుడెంత నిర్దయుడంటూ భగవంతుడి గురించే మనసులో మరోలా ఆలోచించుకున్నారు–అనుకున్నారు.వ్యాధివచ్చాక దాదాపుగా ప్రతిరోజూ ఓ రెండుగంటలపాటే నిద్రపోయే పాటిల్‌కి ఓ రోజు రాత్రి మొత్తం నిద్రపట్టలేదు. అప్పటివరకూ ఏదో ఒక రోజున వ్యాధి నుంచి బయటపడగలననే నమ్మకం ఉండేది గానీ ఆ రాత్రి తనకి ఓ దృఢనిశ్చయం కలిగింది. తప్పక తొందర్లో అంటే రోజుల్లోనే మరణిస్తానని. అందుకే తనకెవరూ దిక్కులేరనే భావంతో (అనన్య చింత అంటే ఇదే) భగవంతుడ్నే ధ్యానించసాగాడు మౌనంగా దుఃఖంతో, నిర్వేదంతో, అందరికీ మంచినే చేసే తనకీ కష్టం ఎందుకు కలిగిందా? అనే సమాధానం తెలియని ప్రశ్నతో.అంతే! ఆకాశంలో చిమ్మచీకటిలో ఒక్కసారిగా మెరుపు కనిపించి మొత్తం పరిసరాలని కళ్లకి కట్టినట్లు చూపించినట్లుగా ఓ ఆలోచన తట్టింది. తనకి బాగా మిత్రుడైన ‘నానా’ నిరంతరం సాయి సేవలో తరిస్తూ ఉండే నానా(నానా సాహెబ్‌/నారాయణ గోవింద ఛాందోర్కర్‌) మనసులో మెదిలాడు. తన బాధని ప్రతి అక్షరం వివరించే తీరులో ఉత్తరం రాసి నానాకి పంపించాడు చిట్టచివరి ఉపాయంగా.నానాకి పాటిల్‌ రాసిన ఉత్తరంలోని ప్రత్యక్షరమూ పాటిలే దుఃఖంతో పూడిపోయిన కంఠస్వరంతో మాట్లాడుతూ చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఆ మనోబాధకి తట్టుకోలేకపోయాడు నానా. దానికి కారణం పాటిల్‌ అజాతశత్రుత్వం, దయాదాన ధర్మగుణం, సంపూర్ణ సజ్జన లక్షణం, సంస్కార సంప్రదాయధోరణీ.. ఇలాఒకటేమిటి? అన్నీ అతనిలో ఉండటమే.పరిష్కారం!నానా వెంటనే ఉత్తరాన్ని రాసాడు పాటిల్‌! నీకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అనుభవపూర్వకంగానూ వాస్తవజ్ఞానంతోనూ అనేక సాక్ష్యాధారాలతోనూ రాస్తున్నాను నీకు. మనకి ఒకే ఒక పరిష్కారం సాయినాథుడ్ని ఆశ్రయించడమే. రుణాన్ని తీర్చలేకపోతే ఒక భయం, పిల్లలు ఆరోగ్యవంతులూ లేదా విద్యావంతులూ కాకపోతే ఒక భయం, భార్య అనుకూలవతి కాకపోతే ఒక భయం ఇలా అనేక తీరుల భయాలు ఉంటాయి వ్యక్తులకి. అందరికీ అన్నీ ఉండవుగానీ పైవాటిలో ఏదో ఒకటో రెండో ఉండి తీరుతాయి.

అయితే ఈ పై చెప్పుకున్న భయాలన్నీ ఇప్పుడో మరొకప్పుడో తీరే భయాలే అయినా అన్నింటికీ మించినదీ ఎప్పటికీ తీరనిదో మృత్యుభయం ఒక్కటే. నీ ఉత్తరం ఆసాంతం చదివాక నీ ప్రత్యక్షరంలోనూ నీకున్న ఆ భయమే గోచరించింది నాకు. సాయిలోని గొప్పదనమేమంటే ఆయన ఆ భయాన్ని పూర్తిగా తొలగించగల సమర్ధ వైద్యుడు. ఒక్కసారి ఇక్కడికొచ్చి ఆయన పాదాలని గట్టిగా పట్టుకుని ‘అన్య«థా శరణం నాస్తి..’ అని నీకు నువ్వుగా హృదయపూర్వకంగా ప్రార్థించు. నేను నీకు ఆ సర్వసమర్థ సాయినాథ దర్శనం వెంటనే లభించేలా చేయగలను. మానవమాత్రుడు కాని ఆయన దర్శనానికి వెంటనే రా!’ అని.
పెద్దవరదలో కొట్టుకుపోతున్నవానికి బలమైన చెట్టుకొమ్మ లభించినట్టుగా, చెప్పలేనంత వేసవి వేడిమికి గురౌతున్న వ్యక్తికి ఎదురుగా ఒక పాకా అక్కడే ఓ చెరువూ కనిపించినట్టుగా ఒంటరిగా భయం భయంతో ప్రయాణిస్తున్న బాటసారికి తీర్థయాత్రకి వెళ్తున్న భక్తజనసమూహం తోడైనట్లుగా అనిపించి తాను జీవించగలననే ధైర్యం వచ్చేసింది నానాకి.అప్పటివరకూ ఏనాడూ సాయినాథుని గురించిన ఊహే లేని పాటిల్‌కి ఎప్పుడెప్పుడు సాయిని దర్శించి ఆయన పాదాల మీద పడి వేడుకోవాలా? అనే ఆత్రుత పెరిగిపోసాగింది. ధనవంతుడు తలుచుకుంటే అసాధ్యమేముంది సుఖప్రయాణానికి వెతుక్కోవాల్సినదేముంటుంది ప్రయాణానికి?అనుకున్నట్లుగానే షిర్డీ చేరుకున్నాడు పాటిల్‌. అతడ్ని తెచ్చిన బండి షిర్డీలోని మసీదు వాకిలి దగ్గర నిలబడింది. ఏ మాత్రమూ నడవలేని స్థితిలో ఉన్న పాటిల్‌ని కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న పాటిల్‌ని నలుగురు మనుషులు మంచం మీద పడుకోబెట్టి సాయినాథుని దర్శనం కోసం మెట్లెక్కి తెచ్చారు. బాబా సమక్షంలో ఉంచారు. నానా ఈ పాటిల్‌ని సాయికిపరిచయం చేయబోతుంటే శ్యామా పాటిల్‌ గురించి చెప్ప ప్రారంభించాడు.సాయి పాటిల్‌ని చూస్తూనే ‘శ్యామా! ఇదేమైనా నీకు బాగుందా చెప్పు? ఇలాంటి దొంగల్ని నా దగ్గరికెందుకు పట్టుకోచ్చావ్‌? నా కెందుకు ఇలాంటివి అంటగడతావు? అంటూ వెళ్లిపోబోతుంటే పాటిల్‌ నేలబారుగా ఉన్న మంచం నుంచి ముందుకి జరిగి తన తలని సాయి పాదాలకి ఆనేలా ఉంచి... ‘సాయినాథా! ఈ దీనుడ్ని రక్షించు! నువ్వే నాకు రక్ష–రక్షణ! నిస్సహాయుడ్ని! ఈ జీవిని కాపాడు!’ అని పరమదీన ఆర్ద్రకంఠంతో వేడుకున్నాడు. సాయి అతడ్ని పూర్తిగా చూసాడు పరిశీలనగా.ఒక్క క్షణం ఆగి ‘బేటా! ఈ ఫకీరు దయలేనివాడు కాడు. ఈ ద్వారకామాయిదర్శనం సర్వదుఃఖాలనీ పొగొట్టే దివ్యశాంతినికేతనం. వ్యథ పడకు. నువ్విక్కడే షిర్డీలో భీమా బాయి ఇంట్లో ఉండు! భయాన్ని విడిచెయ్‌! రెండు మూడు రోజుల్లో నీకు ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది. ఎంతటి లోతైన కష్టసముద్రంలో పడిపోయినా, దుఃఖాల బురదలో తలతో సహా కూరుకుపోయి చూచేవారికి ఏమీ కనిపించకపోయినా ఈ ద్వారకామాయి ఆ వ్యక్తిని ఉద్ధరించి తీరుతుంది! వెళ్లు!’ అన్నాడు.

మన మాటల్లో ఆ జరిగిన వృత్తాంతాన్ని చెప్పుకోడానికి రెండు నిమిషాల సమయం పట్టింది గానీ, పాటిల్‌పైని రాయడం శ్యామా పరిచయం చేయబోవడం సాయి తిరస్కరించడం... ఈ సంఘటన మొత్తం జరగడానికి గంటకిపైగా సమయం పట్టింది. పాటిల్‌కి తాను జీవించగలననే సంపూర్ణ ధైర్యం– సాయినాథుణ్ణి చూడటం, ఆయన తనని దీవిస్తూ పలకడం వంటి వాటి కారణంగా వచ్చింది.మరో కారణం కూడా ఉంది పాటిల్‌కి ధైర్యం కలగడానికి. పాటిల్‌కి ప్రతి ఐదునిమిషాలకే వాంతిరావటం దాంట్లో రక్తం పడుతూ ఉండటం ఆ దృశ్యాన్ని చూస్తూ అతను జీవితధైర్యాన్ని కోల్పోతూ ఉండటం జరుగుతూ ఉండేది. అయితే సాయి దర్శనానికొచ్చాక ఈ గంటపైన గడిచిన సమయంలో ఒక్క వాంతి రానూ లేదు. వాంతి వచ్చే సూచన కూడా అతనిలో కలగలేదు. దాంతో పాటిల్‌ మంచి ధైర్యం ఆశాకలిగాయి జీవితంపట్ల.సాయి చెప్పినట్లు భీమాబాయి ఇంట్లోనే ఉన్నాడు పాటిల్‌. సాయి అన్నట్లే పాటిల్‌ అనారోగ్యం మూడురోజుల్లో పూర్తిగా తొలగిపోయింది.ఎలా నయమైంది?అపానమనే వాయువుకున్న లక్షణం శరీరంలో అనవసరంగా ఉన్న పదార్థాన్ని బయటికి నెట్టివేయడం అని అనుకున్నాం కదా! బయటికి నెట్టివేయగల శక్తి ఉన్న అపానమనే వాయువుకి ఆ వాయువుని నెట్టివేయకుండా తనలో దాచుకునే శక్తి కూడా ఉంటుంది గదా!ఆ కారణంగా ఎప్పుడు అపానమనే వాయువు ద్వారా రక్తంతో కూడిన వాంతి బయటికి వెళ్లిపోవలసిన పరిస్థితి కల్గినా సాయి కృపాకటాక్షం ద్వారా ఆ రక్తంతో కూడినవాంతి బయటికి వచ్చేదే కాదు. కనీసం బయటికి వచ్చే సూచన కూడా కనపడలేదు. వాంతి అవుతుందేమో అనే మనోభయం కూడా పాటిల్‌కి కలగలేదు.అంటే సాయి ఏం చేసాడన్నమాట? తన కున్న అపానమనే వాయువు మీద ఉండే అధికారంతో ఆ వాయువుని అదుపు చేసి లోనున్న వాంతిని బయటికి రాకుండా చేయడమే కాక, మిగిలిన రంధ్రాల నుండికూడా ఆ వాంతి రాకుండా ఉండేలా  అదుపుచేసాడు సాయి. ఇదీ అపానమనే వాయువుమీద సాయికున్న అధికారమంటే! అలాగని ప్రతిసారీ అలా వాయువులని నిరోధించలేదు సాయి. అంటే ఆ అవకాశాన్నిదుర్వినియోగపరచలేదనేది దీనినుంచి గ్రహించాల్సిన విషయమన్నమాట! ఇలాంటి అధికారాన్ని వినియోగించిన మరి రెండు చోటులని కూడా తెలుసుకుని అంతరార్థాన్ని తెలుసుకుందాం!
– సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు 

>
మరిన్ని వార్తలు