భయం

19 Nov, 2017 01:47 IST|Sakshi

పిల్లల కథ

చెన్నకేశవులు మాచర్ల నుంచి శ్రీశైలం బయల్దేరాడు. యర్రగొండపాలెంలో వున్న చెల్లెలు యశోదను చూడాలనిపించి అక్కడ దిగాడు.ఇంటికి వెళ్లేసరికి మేనల్లుడు విజయ్‌ గాబు దగ్గర స్నానం చేస్తూ కనిపించాడు.‘‘ఏంట్రా విజయ్‌! బాత్‌రూమ్‌లో స్నానం చెయ్యకుండా గాబు పక్కన ఆరు బైట స్నానం చేస్తున్నావ్‌?’’ అని మేనల్లుడిని ప్రశ్నించాడు చెన్నకేశవులు.‘‘అన్నయ్యా! వీడు పెరిగేకొద్దీ భయపడడం ఎక్కువైంది. బాత్‌రూమ్‌లో బల్లి కనిపించేసరికి భయపడి ఆరుబైట స్నానం చేస్తున్నాడు.’’ అన్నది యశోద, ఇంట్లో నుంచి బైటకు వస్తూ.‘‘బల్లికి భయపడుతున్నాడా? ఏం మగాడివిరా నువ్వు? పల్నాడులో పుట్టినోళ్లు భయపడతారా?’’ అని ఎగతాళి చేశాడు చెన్నకేశవులు.విజయ్‌ సిగ్గుపడుతూ టవల్‌ ఒంటికి చుట్టుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. డ్రెస్‌ చేసుకుని, టిఫిన్‌ తిని లంచ్‌ బాక్స్‌ తీసుకుని, స్కూల్‌ బ్యాగ్‌ తగిలించుకుని బయల్దేరాడు.‘‘అరేయ్‌ విజయ్‌! స్కూల్‌ నుంచి తొందరగా వచ్చెయ్‌. ఆటలాడుకుంటూ చీకటిపడేవరకు ఉండకు. మనం ఫస్ట్‌ షో సినిమాకు వెళ్దాం.’’ అన్నాడు చెన్నకేశవులు.‘‘సరే! మావయ్యా!!’’ అంటూ హుషారుగా బయల్దేరాడు విజయ్‌.తర్వాత యశోద కొడుకు భయం గురించి చెప్పుకొచ్చింది.‘‘అన్నయ్యా.. వీడికి పదేళ్లునిండినయ్‌. ఎందుకో వాడికి భయం ఎక్కువైంది. బొద్దింకల్ని, బల్లుల్ని చూసి భయపడతాడు. వీధిలో కుక్కల్ని, పిల్లుల్ని చూసినా భయమే. పావురాళ్లు ఇంట్లోకి వస్తే గూడా పరిగెత్తుతాడు. వీడికింత భయం ఎందుకో అర్థం కావడంలేదు.’’‘‘నువ్వేం వర్రీపడకు. నేను వాడి భయం పోగొడతాను చూస్తుండు’’ అన్నాడు.

సాయంకాలం మేనల్లుడిని తీసుకుని సినిమాకు బయల్దేరాడు చెన్నకేశవులు.‘‘అరేయ్‌ విజయ్‌! నీకు రోజురోజుకీ భయం ఎక్కువైపోతున్నదని మీ అమ్మ చెప్పింది. నిజమేనా? అసలు భయం ఎందుకు?’’ అని అడిగాడు చెన్నకేశవులు.‘‘ఒకరోజు స్నానం చేస్తుంటే బాత్‌రూమ్‌లో బల్లి ఒంటిమీద పడింది. భయం వేసింది’’ అన్నాడు విజయ్‌.బల్లి మీద పడితే ఏదో కారణం ఉండి ఉంటుందని చెప్తారు పెద్దలు. బల్లి శాస్త్రం అనే పుస్తకం వుంది తెలుసా నీకు? భుజం మీద పడితే.. వీపుమీద పడితే.. తల మీద పడితే ఏం జరగబోతుందో ఆ శాస్త్రంలో వుంటుంది. అంతేగాని భయపడకూడదు. ఈ సారి నేను వచ్చినప్పుడు బల్లి శాస్త్రం పుస్తకం తెచ్చిస్తాను. చదువుకో. అదీగాక బల్లి మనకు స్నేహితుడు. గోడల మీద వాలిన ఈగల్ని, జబ్బులు తెచ్చే దోమల్ని,పురుగుల్ని తింటూ మనకు మేలు చేస్తుంది.’’ అన్నాడు చెన్నకేశవులు.విజయ్‌ అదంతా ఆశ్చర్యంగా విన్నాడు.అట్లాగే పిల్లులు ఎలుకల్ని పట్టి తింటాయి. కుక్కలు దొంగలు రాకుండా కాపలా కాస్తూ మనకి మేలు చేస్తున్న మచ్చికైన జంతువులనీ, వాటికి భయపడగూడదనీ, ఆహారం పెడుతూ అలవాటు చేసుకుంటే స్నేహంగా మెలగుతాయని మేనల్లుడికి వివరంగా చెప్పాడు చెన్నకేశవులు.‘‘నీ పూర్తి పేరు ఏంట్రా?’’ అని రాత్రి పడుకోబోయే ముందు అడిగాడు మేనల్లుడ్ని.యశోద నవ్వుతూ.. ‘‘అదేంటి అన్నయ్యా! వాడికి విజయసింహ అని పేరు పెట్టిందే నువ్వుకదా? అన్నది.‘‘ఔన్లే..! కానీ నీ కొడుక్కి తన పూర్తి పేరు గుర్తుండడంలేదు. అందరూ విజయ్‌ అని పిలుస్తున్నారు. అది సరేగానీ విజయ్‌ నీకు ‘విజయసింహ’ అని పేరు ఎందుకు పెట్టానో తెలుసా?’’ అన్నాడు.

‘‘లేదు మావయ్యా!’’ అని తల అడ్డంగా ఊపాడు విజయ్‌.‘‘మీ అమ్మకు నెలలు నిండినప్పుడు యర్రగొండపాలెం నుంచి మాచర్లకు అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నాం. పదేళ్ల క్రితం నల్లమల అడవి దట్టంగా చెట్లతో ఉండేదిలే. అంబులెన్స్‌లో పోతుండగా రోడ్డుకి అడ్డంగా సింహం, సివంగి, దాని పిల్లలు మూడు పడుకుని వున్నాయి. డ్రైవర్‌ అంబులెన్స్‌ ఆపేశాడు. అప్పుడప్పుడు హెడ్‌లైట్లు వెలిగిస్తూ, ఆర్పుతూ, హారన్‌ కొడుతున్నాడు. అయినా అవి గంటసేపు కదలలేదు. అప్పుడప్పుడూ సింహం గర్జిస్తూవుంది. గంట తర్వాత అవన్నీ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయాయి. ఐతే ఈ లోపలే అంబులెన్స్‌లో వున్న మీ అమ్మకు ప్రసవమైంది. నువ్వు పుట్టావు..’’ అన్నాడు చెన్నకేశవులు.విజయ్‌ నోరు తెరిచి ఆశ్చర్యంగా విన్నాడు మేనమామ చెప్పింది.‘‘సింహాల వలన నువ్వు అడవి మధ్యలో అంబులెన్స్‌లో పుట్టావు. అందువలన నువ్వు సింహంలా ధైర్యంగా జీవించాలని విజయసింహ అని పేరు పెట్టాను. కాబట్టి నువ్వు సింహంలా ధైర్యంగా వుండాలి. ఎప్పుడూ దేనికీ భయ పడగూడదు. అర్థమైందా? అన్నాడు చెన్నకేశవులు.
విజయ్‌ తల వూపాడు.‘‘నువ్వు తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. తప్పు చేయనప్పుడు ఎవరికీ, దేనికీ భయపడగూడదు. భయం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.’’ చెప్పాడు చెన్నకేశవులు.విజయ్‌ మేనమామ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు.‘‘అన్నయ్యా.. నువ్వు మేనల్లుడికి భలే కథ అల్లి చెప్పావే. నల్లమల అడవిలో సింహాలున్నాయని నువ్వు చెప్తుంటేనే విన్నాను.’’ అన్నది యశోద నవ్వుతూ.‘‘వాడికి భయం పోగొట్టడానికి కథ అల్లి చెప్పడం మంచిదే. పిల్లల మనోవికాశానికి కథలు చెప్పడం మన సంప్రదాయం. ఐతే ఇప్పుడు అది మర్చి పోతున్నారు ఎందుకో!’’ అన్నాడు చెన్నకేశవులు.
 

మరిన్ని వార్తలు