సంభాషణం: అప్పుడే నటనకు గుడ్‌బై చెబుదామనుకున్నా!

23 Mar, 2014 02:00 IST|Sakshi

అక్క, అమ్మ, వదిన... ఏ పాత్ర చేసినా ఒదిగిపోతారు ‘సన’. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా వెండితెర మీద విజయవంతంగా వెలుగుతున్నారు. మూడొందల సీరియళ్లు, ఐదు వందలకు పైగా సినిమాలు చేసినా... ఇప్పటికీ తన నటదాహం తీరలేదనే సన... ఇన్నేళ్ల తన సినీప్రస్థానం గురించి చెబుతోన్న ముచ్చట్లు...
 
మా వారు సయ్యద్ సాదత్ వ్యాపారి. మా అబ్బాయి సయ్యద్ అన్వర్ తెలుగు, తమిళ సీరియల్స్ నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే కొన్ని తమిళ సీరియల్స్‌లో నటించాడు కూడా. తెలుగులో ఓ మంచి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. మా పాప తబస్సుమ్  ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. కొన్ని అంతర్జాతీయ డాక్యుమెంటరీలలో నటించింది. వాళ్లు ఏం చేయాలన్నది వాళ్లే నిర్ణయించుకున్నారు. వాళ్లేం చేస్తానన్నా నాకు అంగీకారమే, ఆనందమే!
 
 *    మీ పేరు చూస్తే... మీరు తెలుగువారు కాదనిపిస్తుంది...?
 నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయినే కానీ తెలుగమ్మాయిని కాదు. హైదరాబాదీ ముస్లిమ్‌ని. నటనలోకి వచ్చాక తెలుగు మాట్లాడ్డం నేర్చుకున్నాను. కానీ ఇప్పటికీ చదవడం, రాయడం రాదు.
 *    ముస్లిం అయివుండి ఆ రోజుల్లోనే ఈ రంగంలోకి రావడమంటే...?
 మామూలు విషయం కాదు. కానీ మా అత్తామామల వల్ల ఇది సాధ్యమైంది. నాకు పద్నాలుగేళ్లకే పెళ్లి చేశారు. మావా రిది జాయింట్ ఫ్యామిలీ. అన్ని సంప్రదాయాలూ పాటించేవారు. అయితే ఎస్సై అయిన మా మావయ్యగారు ఆధునిక భావాలు కలవారు. ఆయనే నన్ను చది వించి, ఓ స్కూల్ పెట్టిద్దామనుకున్నారు.
 *    మరి ఇటెందుకొచ్చారు?
 ఓ ఆదివారం పేపర్లో మోడల్స్ కావాలని యాడ్ చూశాను. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసిన అనుభవం ఉండటంతో ఆసక్తి కలిగింది. ఆ విషయం చెప్పగానే అందరూ కంగారుపడ్డారు. కానీ మావయ్యగారు నాకు నచ్చిందే చేయమన్నారు. మా అత్తగారిని తోడిచ్చి ఆడిషన్‌కి పంపారు. సెలెక్టయ్యి బిజీ అయి పోయాను. చానాళ్లపాటు మా కమ్యూనిటీ లో చాలా రకాలుగా మాట్లాడేవారు. మీ కోడలు మోడల్ అంటకదా, సినిమాల్లో చేస్తోందట కదా అని అదో రకంగా అనేవారు. కానీ అత్తయ్య, మావయ్య... ‘తనకి నచ్చింది చేస్తోంది, తన సంతోషమే మా సంతోషం’ అనేవారు. వాళ్లిద్దరూ లేకపోతే నేనీరోజు ఇలా ఉండేదాన్ని కాదు.
 *    ఇప్పటికెన్నేళ్లయ్యింది ఇండస్ట్రీకొచ్చి?
 పద్దెనిమిదేళ్లు. యాడ్‌‌స, సీరియల్స్, సినిమాలు... ఇన్నేళ్లు ఎలా గడిచాయో తెలియనే లేదు.
 *    అప్పటికీ ఇప్పటికీ పరిశ్రమలో ఎలాంటి మార్పులొచ్చాయి?
 టెక్నికల్ విలువలు బాగా పెరిగాయి. ఒకప్పుడు ఎక్కడ ఏ తప్పు జరుగుద్దో అని భయపడేవాళ్లం. ఎందుకంటే... షూట్ చేశాక రీలును స్టూడియోకి తీసుకెళ్లి, చూసి, తప్పులుంటే మళ్లీ రీ షూట్ ప్లాన్ చేసి తీసేవాళ్లు. దానికి చాలా టైమ్ పట్టేది. టైమ్ వేస్టు, రీల్ వేస్టు. ఇప్పుడా సమస్య లేదు. తీసింది వెంటనే చూసేసుకోవచ్చు. తేడాలుంటే అప్పటికప్పుడే సరి చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల కాస్త సీరియస్‌నెస్ తగ్గిందేమోనని కూడా అనిపిస్తూ ఉంటుంది. సరి చేసుకోవడం ఈజీ అని తెలిశాక తప్పుల పట్ల భయం తగ్గుతుంది కదా!
 *    క్యారెక్టర్ ఆర్టిస్టులు పెరుగుతున్నారు. పోటీ ఉంటోందా?
 ఎందుకుండదు! పోటీ అనేది ప్రతి చోటా ఉంటుంది. మాకూ ఉంది. కాకపోతే ఆ పోటీవల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. నా అవకాశాలు నాకున్నాయి.
 *    మనసుకు నచ్చిన, నచ్చని పాత్రలు?
 ఏదైనా మనసుకు నచ్చితేనే చేస్తాం. కానీ కొన్నిసార్లు ఒప్పుకున్నప్పుడు నచ్చుతుంది, చేసిన తర్వాత నచ్చదు. ఎందుకంటే చెప్పేటప్పుడు ఓ రేంజ్‌లో చెప్తారు. తీరా చూస్తే అంత ఉండదక్కడ. ఒక్కోసారి డిజప్పాయింట్ అవుతాను కానీ... ఏదైనా పనే కదా అని తర్వాత లైట్ తీసుకుంటా.
 *    చాలా రకాల పాత్రలు చేశారు. ఇంకా ఫలానా పాత్ర చేయాలనేమైనా ఉందా?
 అమ్మ, అక్క, అత్త, వదిన అన్ని రకాల పాత్రలూ చేశాను. అమ్మవారి పాత్రలు, నెగిటివ్ రోల్స్ కూడా చేశాను. కానీ తృప్తి మాత్రం లేదు. ఇది అని చెప్పలేను కానీ... ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. సినిమా, సీరియల్ ఏదైనా సరే... మంచి పాత్రలు వస్తే వదిలే ప్రసక్తే లేదు.
 *    ఇన్నేళ్లుగా నటిస్తున్నారుగా... ఎప్పుడైనా ఇక ఆపేద్దాం అనిపించిందా?
 2000వ సంవత్సరంలో అనుకున్నాను. కానీ సరిగ్గా అప్పుడే ‘కలిసుందాం రా’ రిలీజై హిట్టవడంతో మళ్లీ ఆలోచనలో పడ్డాను. మంచి మంచి అవకాశాలొస్తుంటే ఎలా కాదనగలను! అందుకే ఊపిరున్నంత వరకూ నటిస్తూనే ఉండాలి అని డిసైడ్ చేసేసుకున్నాను.
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు