రుక్మి ప్రగల్భాలు

27 Aug, 2017 01:04 IST|Sakshi
రుక్మి ప్రగల్భాలు

భీష్మక మహారాజు కుమారుడు రుక్మి మహా పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు.  రుక్మిణీదేవికి అన్న. గంధమాదన పర్వతం మీద వున్న ద్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల ‘విజయం’ అనే దివ్యధనుస్సును సంపాదించాడు. లోకంలో శ్రేష్ఠమైన దివ్య ధనుస్సులు మూడే ఉన్నాయి. వాటిలో ఒకటి విష్ణుమూర్తి సారంగం అనే ధనువు. శ్రీ కృష్ణుడు దానిని ధరించాడు. మరొకటి గాండీవం. ఖాండవ వన దహన సందర్భంలో అగ్నిదేవుడు అర్జునుడికీ ధనుస్సు ఇచ్చాడు.

 ఇక మూడోవది విజయం. ద్రుముణ్ణి ఆరాధించి రుక్మి విజయ నామక చాపాన్ని అతని నుండి సంపాదించాడు. రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడానికి శ్రీ కృష్ణుడు ఆమెను రథం మీద తీసుకుపోతుంటే రుక్మి బలగర్వితుడై డాంబికాలు పలుకుతూ కృష్ణుణ్ణి ఎదిరించి నిందారోపణలు చేశాడు. తీరా కృష్ణుడు రథం నిలిపి బలాబలాలు చూసుకుందాం రమ్మని పిలిస్తే ఎదుర్కోలేక అవమానాలపాలయ్యాడు.

కురుపాండవ సంగ్రామం జరగబోతోందని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల దగ్గరకు వెళ్ళాడు రుక్మి. పాండవులు అతన్ని సాదరంగా ఆహ్వానించి గౌరవించారు. అతిథి సత్కారాలు అందుకున్నాక రుక్మి అందరూ వింటూవుండగా పార్థుణ్ణి పిలిచి, ‘‘అర్జునా! రాబోయే సంగ్రామం గురించి బాధపడుతున్నావేమో! నేను నీకు అండగా ఉంటాను. నా అండదండల వల్ల నీకు విజయం తథ్యం. నన్ను మించిన పరాక్రమవంతుడు లేడు. పైగా నా దగ్గర తేజోమయమయిన ధనుస్సు ఉంది. దానితో ద్రోణ, భీష్మ, కృపాచార్యాది కౌరవులను క్షణాల్లో మట్టి కరిపిస్తాను. ఈ రాజ్యం నీ వశం చేస్తాను. సరేనా’’ అన్నాడు.

అర్జునుడు నవ్వుకున్నాడు.
‘‘మాకు సాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే కృష్ణుడు మాకు ఎల్లవేళలా సాయంగా ఉంటాడన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఆయన సాయం వుంటే ఇంకెవరి అండదండలూ అక్కర్లేదు మాకు. పైగా నా చేతిలో గాండీవం ఉంది. సాక్షాత్తూ ఇంద్రుడే వజ్రాయుధం ధరించి వచ్చినప్పటికీ నేను భయపడను‘ అన్నాడు అర్జునుడు రుక్మితో.ఆ మాటలు రుక్మికి కోపం తెప్పించాయి.

వెంటనే తన సైన్యాన్ని తీసుకుని సుయోధనుడి దగ్గరకు వెళ్ళాడు. ‘‘రాబోయే కురుపాండవ యుద్ధంలో నేను మీ పక్షం ఉంటాను, మీ విజయానికి తోడ్పడతాను. పాండవుల పొగరు అణుద్దాం. నా చాపంతో వాళ్ళందర్నీ యమపురికి చేరుస్తాను. నా ప్రతాపం చూపిస్తాను’’ అన్నాడు. అయితే సుయోధనుడు కూడా అభిమానం కలవాడు. అతను కూడా రుక్మి సహాయం అక్కర్లేదని చెప్పాడు. రుక్మి సిగ్గుపడ్డాడు. దుర్యోధనుడు కూడా తిరస్కరించాక వచ్చినదారినే తన నగరానికి తిరిగి వెళ్ళాడు. తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్నీ, శక్తినీ తక్కువగా అంచనా వేయడం ఎవరికీ మంచిది కాదు. రుక్మికి ఈ అలవాటు మొదటినుంచీ ఉంది. అందుకే అనేకసార్లు పరాభవాలు పొందాడు.

మరిన్ని వార్తలు