ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుందా?

12 Dec, 2016 14:27 IST|Sakshi
ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుందా?

నా వయసు 29 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది. డాక్టర్ల సలహాపై చాలాకాలం మందులు, ఇన్‌హేలర్ వాడాను. ఇప్పుడు నేను గర్భిణిని. నాలుగో నెల. ఇదివరకు నేను వాడిన మందుల ప్రభావం నాకు పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందా?
 - సౌజన్య, ఇల్లెందు
 
 ఉబ్బసం వ్యాధి అంటే ఆస్తమా. కొన్ని రకాల అలర్జీల వల్ల లేదా శ్వాస నాళాలలో లేదా ఊపిరితిత్తులలో సమస్య వల్ల రావచ్చు. వీటికోసం దీర్ఘకాలం మందులు వాడవలసి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత, ఆ సమయంలో ఏర్పడే హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, ఉబ్బసం లక్షణాల తీవ్రత ఉంటుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది. వాడకపోతే తల్లికి ఇబ్బందితో పాటు కడుపులో బిడ్డకు కూడా శ్వాస తగ్గడం, ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాల వల్ల, కొన్ని సార్లు బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు మందులు వాడవలసినప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో బిడ్డపై ప్రభావం పడని మోతాదులో మందులు వాడవచ్చు. నువ్వు మందులు గర్భం దాల్చిన తర్వాత వాడలేదు కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడినా, మందులను డాక్టర్‌కు చూపిస్తే ఆ మందులలో మోతాదు ఎంత ఉంది, వాటివల్ల బిడ్డపై ప్రభావం ఎంత వరకు ఉండవచ్చు అనేది అంచనా వేసి చెప్తారు. ఒకసారి 5వ నెల చివరిలో టిఫా స్కానింగ్ చేయించుకుంటే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది 90 శాతం వరకు గుర్తించవచ్చు.
 
  నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 62 కిలోలు. ప్రస్తుతం నేను ఐదో నెల గర్భిణిని. చిన్న వయసులోనే జుట్టు నెరవడంతో నాలుగేళ్లుగా జుట్టుకు రంగు వేసుకుంటూ వస్తున్నాను. గర్భంతో ఉండగా జట్టుకు రంగు వేసుకుంటే లోపల ఉన్న పిండానికి ప్రమాదం అని కొందరు చెబుతున్నారు. నిజమేనా?
 - శ్రావ్య, ఖమ్మం
 
 జుట్టుకు వేసుకుని రంగు కేవలం తలమాడుకి, వెంట్రుకలకే వేయడం జరుగుతుంది. మళ్ళీ అది అరగంట, గంటలోపే కడిగేయడం జరుగుతుంది కాబట్టి అది రక్తంలోకి కలసి, పిండానికి చేరి ప్రమాదం కలిగించడం జరగదు. కాకపోతే మొదటి మూడు నెలల్లో పిండంలో అవయవాలు ఏర్పడుతాయి. కాబట్టి, రిస్క్ తీసుకోకుండా ఉండటం కోసం ఈ సమయంలో వీలైనంత వరకు హెయిర్ డై నివారించడం మంచిది. ఒకవేళ వేసుకున్నా మాడుపై జుట్టుని పైకి లాగి, మాడుకి ఎక్కువగా తగలకుండా రంగు వేసుకుని, వీలైనంత త్వరగా కడిగి వేయడం మంచిది.
 
మా అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. మెచ్యూర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. ఏ విధమైన ఆహారాన్ని ఇవ్వాలో, ఎన్ని రోజుల తర్వాత స్కూలుకు పంపాలో తెలియజేయండి.
 - స్వర్ణ కుమారి, కాకినాడ
 

 ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, అమ్మాయిలు 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల ఎప్పుడైనా మెచ్యూర్ అవ్వవచ్చు. ప్రతి తల్లి కూతురికి 10 సంవత్సరాల ముందు నుంచి శరీరంలో వచ్చే మార్పుల గురించి వివరించడం మంచిది. దీనివల్ల పిల్లలు తమ శరీరంలో జరిగే మార్పులకు ఆందోళన చెందకుండా వాటిని స్వీకరించడానికి సన్నద్ధం అవుతారు. మెచ్యూర్ అవ్వడానికి 2 సంవత్సరాల ముందు నుంచే వక్షోజాలు బుడిపెలాగా మొదలయ్యి, కొద్దికొద్దిగా పెరగడం జరుగుతుంది. అలాగే చంకలో, గజ్జలో సన్న సన్న వెంట్రుకలు పెరగడం, కొద్దికొద్దిగా వైట్ డిశ్చార్జ్ వంటి మార్పులు ఎన్నో మొదలవుతాయి. ఒకవేళ స్కూల్‌లో ఉన్నప్పుడు పీరియడ్స్ మొదలయినా, వారు కంగారుపడకుండా, వారి స్కూల్ బ్యాగ్‌లో న్యాప్‌కిన్, ప్యాంటీ వంటివి ఉండేటట్లు చూడడం మంచిది. అలాగే వారికి పెరిగే వయసు బట్టి పౌష్టికాహార విలువలు, శారీరక శుభ్రత వంటి అంశాల మీద అవగాహన పెంచటం మంచిది. మెచ్యూర్ అయ్యారని ఆహారంలో నియమాలు స్పెషల్‌గా ఏమీ ఉండవు. అందరి పిల్లల లాగానే పప్పులు, పండ్లు, పాలు, పెరుగు వంటి పౌష్టికాహారం ఇవ్వవచ్చు. దీనికోసం స్కూలుకి పంపివ్వకుండా ఇంట్లో ఉంచుకోవలసిన అవసరం లేదు. పాపకి ఎక్కువ బ్లీడింగ్; కడుపులో నొప్పి వంటివి అసౌకర్యంగా ఉంటే మూడు, నాలుగు రోజులు పంపించకండి. అన్నింటి కంటే మొదటగా, ఆ సమయంలో మీ పాపకి మానసికంగా తోడుండటం ఎంతో అవసరం.
 

మరిన్ని వార్తలు