ఆ ప్రభావం బిడ్డ మీద ఉంటుందా?

19 Mar, 2017 01:39 IST|Sakshi
ఆ ప్రభావం బిడ్డ మీద ఉంటుందా?

మొదటి నుంచి నాలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంది. చిన్న అసౌకర్యానికైనా, ఎలర్జీకైనా సిక్‌ అవుతుంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు కూడా చీటికి మాటికి సిక్‌ అయితే, కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపుతుందా? ఈ సమయంలో రోగనిరోధక వ్యవస్థ బలపడడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
– డి.కమల, ఖమ్మం

నీ బరువు ఎంత ఉంది, రక్తహీనత ఏమైనా ఉందా వంటి విషయాల మీద కూడా నీ రోగనిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు సమయంలో కంటే కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల రోగనిరోధక శక్తి కొద్దిగా తగ్గుతుంది. దీనివల్ల గర్భిణిగా ఉన్నప్పుడు, చిన్న ఇన్‌ఫెక్షన్‌ కూడా తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది, ఇన్‌ఫెక్షన్‌ పెరిగి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే, దాని దుష్ప్రభావం బిడ్డపైన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ సమయంలో ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు, పప్పులు, పాలు, పెరుగు, మంచినీళ్లు కనీసం రెండు లీటర్లు, కొద్దికొద్దిగా డ్రై ఫ్రూట్స్, మాంసాహారులైతే గుడ్డు, చేపలు, కొద్దిగా మాంసం వంటివి తీసుకోవచ్చు.డాక్టర్‌ని సంప్రదించి రక్తహీనత ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, దానిని బట్టి అవసరమైన మందులు తీసుకోవచ్చు. గర్భిణీ సమయంలో బిడ్డ ఎదుగుదలకి కావలసిన ఐరన్, కాల్షియం, విటమిన్స్‌ అన్నీ తల్లి రక్తం నుంచే అందవలసి ఉంటుంది. కేవలం ఆహారంలో బిడ్డకి, తల్లికి ఇవన్నీ దొరకవు కాబట్టి... పౌష్టికాహారంతో పాటు గర్భిణీలు ఐరన్, కాల్షియం, విటమిన్‌ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవలసి ఉంటుంది.

మా చెల్లెలికి ఇంకో నెలరోజుల్లో డెలివరీ కానుంది. ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రెగ్నెన్సీ తరువాత కొద్దిమంది ‘ప్రెగ్నెన్సీ–రిలేటెడ్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌’తో బాధపడతారని చదివాను. మా చెల్లి సున్నిత మనస్కురాలు. ఆమెకు ఈ సమస్య వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ‘ప్రెగ్నెన్సీ–రిలేటెడ్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌’ అంటే ఏమిటి? ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు.
– ఆర్‌.డి, నరసారావుపేట

డెలివరీ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, మానసిక శారీరక సమస్యలు... ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్లడం, చికాకు, కోపం, టెన్షన్, బాధ, ఏడుపు రావడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, త్వరగా అలసిపోవడం, అయోమయం, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు... రకరకాల తీవ్రతలు ఏర్పడవచ్చు. కొంతమందిలో కాన్పు తర్వాత నుంచి రెండు మూడు వారాల వరకు ఉంటాయి. దీనినే పోస్ట్‌పార్టమ్‌ బేబీ బ్లూస్‌ అంటారు. కొందరిలో ఆరు నెలల వరకు లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనిని పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ అంటారు. ఈ లక్షణాలని అశ్రద్ధ చేస్తే, ఇంకా తీవ్రమై చాలాకాలం పాటు కొనసాగుతాయి. కొందరిలో ఆత్మహత్య చేసుకొనేంత వరకు పరిస్థితులు వెళ్లవచ్చు.

 కాన్పు తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు ఉన్నట్టుండి తగ్గిపోవడం వల్ల డిప్రెషన్‌ లక్షణాలు రావచ్చు. బిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ పనులు ఎక్కువ ఉండటం, ఇంట్లో పనులతో అలసిపోవడం, శరీరంలో వచ్చిన మార్పుల వల్ల భర్త తనని పట్టించుకోడేమోనన్న భావన వంటి ఎన్నో కారణాల వల్ల కూడా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. అధిక సమస్యలు, ఇంట్లో సపోర్ట్‌ కరువైనప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. ఈ లక్షణాలు రాకుండా, వచ్చినా తొందరగా బయటపడాలంటే భర్త, ఇతర కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం. భర్తతో పాటు ఇతర కుటుంబసభ్యులు తనతో ఆప్యాయంగా మాట్లాడుతూ, బిడ్డకు పాలుపట్టడం, ఇతర పనులలో చేదోడుగా ఉండటం, ఆమెకి మానసిక ఆనందాన్ని ఇవ్వడం వల్ల ఈ లక్షణాలు ఏర్పడకుండా చూసుకోవచ్చు. కాన్పు తర్వాత తనకి తగిన విశ్రాంతి, పౌష్టికాహారం అవసరం.ఈ సమయంలో ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు, పప్పులు, పాలు, పెరుగు, మంచినీళ్లు కనీసం రెండు లీటర్లు, కొద్దికొద్దిగా డ్రై ఫ్రూట్స్, మాంసాహారులైతే గుడ్డు, చేపలు, కొద్దిగా మాంసం వంటివి తీసుకోవచ్చు.

ఈ సమయంలో ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు, పప్పులు, పాలు, పెరుగు, మంచినీళ్లు కనీసం రెండు లీటర్లు, కొద్దికొద్దిగా డ్రై ఫ్రూట్స్, మాంసాహారులైతే గుడ్డు, చేపలు, కొద్దిగా మాంసం వంటివి తీసుకోవచ్చు.

మరిన్ని వార్తలు