ఎలాంటి పండ్లు మంచివి?

2 Apr, 2017 00:50 IST|Sakshi
ఎలాంటి పండ్లు మంచివి?

మా అమ్మాయి ప్రెగ్నెంట్‌. మా ఇంట్లో అందరూ నాన్‌వెజ్‌ తింటారు. ఈ అమ్మాయి మాత్రం తినదు. బలం కోసం ఈ సమయంలో శాకాహారంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదో తెలియజే యగలరు. మా అమ్మాయి టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంది. ఇవి మానేసి పాలు మాత్రం తాగితే సరిపోతుందా? పండ్ల విషయానికి వస్తే... ఈ సీజన్‌లో దొరికే ఎలాంటి పండ్లను తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు.
– యస్‌.కె, మదనపల్లి

ప్రెగ్నెన్సీ సమయంలో మాంసాహారం తిననివాళ్లు ఆహారంలో ఎక్కువగా, అన్ని రకాల పండ్లు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, కొద్దిగా డ్రైఫ్రూట్స్‌ అన్ని రకాలు తీసుకోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కాఫీ, టీలు తీసుకోకపోవటం మంచిది. కాల్షియం పెరగటం శిశువుకి, తల్లికి ఎంతో అవసరం  కాబట్టి, పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, రాగి జావ, సంగటి వంటివి తీసుకోవడం ఉత్తమం. పాలు రోజుకి కనీసం పావులీటరు నుంచి లీటరు వరకు రెండు మూడు సార్లుగా తాగవచ్చు.

ఇక పండ్ల విషయానికొస్తే, ఈ సీజన్‌లో దొరికే ఆపిల్, దానిమ్మ, కివి, ద్రాక్ష (పచ్చవి, నల్లవి) బాగా పండిన బొప్పాయి పండు, కమలాపండ్లు తీసుకోవచ్చు. అలాగే ఎండాకాలం కాబట్టి కర్బూజ, పుచ్చకాయ, వాటి జ్యూస్‌లు తీసుకోవచ్చు.మీ అమ్మాయి బరువు తక్కువగా ఉంటే అరటిపండ్లు తీసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉంటే అరటిపండ్లు తక్కువగా తీసుకోవటం మంచిది. ఈ సీజన్లో దొరికే మామిడిపండ్లు కూడా మొత్తం పండుగా కాకుండా కొన్ని ముక్కలు మాత్రమే తీసుకోవచ్చు.

చిన్న వయసులోనే రజస్వల అయిన అమ్మాయిలు, పెళ్లి తరువాత గర్భం దాల్చినప్పుడు మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయని ఇటీవల ఎక్కడో చదివాను. ఇది ఎంత వరకు నిజం? మా అమ్మాయి చిన్న వయసులోనే రజస్వల అయింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదా?
– జి.ఆర్, మంచిర్యాల

కేవలం చిన్న వయసులో రజస్వల అవ్వడం వల్ల, గర్భం దాల్చినప్పుడు మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఏమీలేవు. చిన్న వయసు నుంచే అధిక బరువు ఉండటం, కుటుంబంలో వారికి మధుమేహ వ్యాధి ఉండటం, జన్యుపరమైన కారణాలు వంటి ఇతర కారణాల వల్ల గర్భిణి సమయంలో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే, మీ అమ్మాయి బరువు ఎక్కువగా ఉంటే, ఇప్పటినుంచే క్రమంగా నడక, వ్యాయామాలు, సైక్లింగ్, స్కిప్పింగ్‌ వంటివి అలవరచడం మంచిది.

గర్భిణుల్లో టీఎస్‌హెచ్‌ 3 లోపే ఉండాలని వైద్యులు చెబుతుంటారు. గర్భధారణ సమయంలో శారీరక మార్పులు టీఎస్‌హెచ్‌పై ప్రభావం చూపుతాయని కూడా చెబుతుంటారు. టీఎస్‌హెచ్‌ 3లోపే ఉండడానికి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా?
– కె.కె, పొద్దుటూరు

టీఎస్‌హెచ్‌ అంటే థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌. మెదడు నుంచి విడుదలయ్యి, థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించి, టి3, టి4 థైరాయిడ్‌ హార్మోన్‌ను తయారుచేసేటట్లు చేస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి నుంచి టి3, టి4 థైరాయిడ్‌ హార్మోన్‌ తక్కువగా విడుదల అవుతుంటే, మెదడులోని పిట్యూటరీ గ్రంథి ప్రేరేపితమై టీఎస్‌హెచ్‌ను అధికంగా విడుదల చేస్తుంది. దీనిని హైపోథైరాయిడిజమ్‌ అంటారు. సాధారణంగా టీఎస్‌హెచ్‌ 5.5ఎం లోపల ఉండటం మంచిది. కాని గర్భిణీలలో టీఎస్‌హెచ్‌ 3 కంటే తక్కువ ఉండటం మంచిది. దీనివల్ల టి3, టి4 హార్మోన్‌లు సరైన మోతాదులో విడుదల అవుతాయి. లేదా థైరాయిడ్‌ హార్మోన్‌ను మాత్ర రూపంలో తీసుకోవలసి ఉంటుంది. టి3, టి4 హార్మోన్‌లు సరిగా ఉంటేనే బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల సరిగా ఉంటుంది.

గర్భిణీ సమయంలో థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరం తల్లికి, గర్భంలోని శిశువుకి చాలా ముఖ్యం. మొదటి మూడు నెలలు శిశువు మెదడు, శారీరక ఎదుగుదలకు కావలసిన థైరాయిడ్‌ హార్మోన్‌ తల్లి ద్వారానే బిడ్డకు అందవలసి ఉంటుంది. మూడు నెలల తర్వాత బిడ్డలో కూడా థైరాయిడ్‌ హార్మోన్‌ కొద్దిగా తయారు అవ్వడం జరుగుతుంది. అందువల్ల గర్భిణీలలో టీఎస్‌హెచ్‌ పెరిగి, టి3, టి4 తగ్గే అవకాశాలు ఉంటాయి. టీఎస్‌హెచ్‌ పెరిగి టి3, టి4 సాధారణ స్థాయిలో ఉండి వేరే లక్షణాలు లేకుండా ఉండటాన్ని సబ్‌ క్లీనికల్‌ హైపో థైరాయిడిజమ్‌ అంటారు.

టీఎస్‌హెచ్‌ 3లోపే ఉంచడానికి మనం చెయ్యవలసిన జాగ్రత్తలు ఏమీలేవు. ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసే ముందు థైరాయిడ్‌ ప్రొఫైల్‌ చెయ్యించుకుని అందులో టీఎస్‌హెచ్‌ 3 కంటే ఎక్కువగా ఉంటే డాక్టరు సూచన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు